కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/చొప్పదంటు శంకలు

వికీసోర్స్ నుండి



చొప్పదంటు శంకలు

వికట విమర్శనం అంటూ కొన్ని పనికిమాలిన శంకలు నేను చేయడమే అవకతవకగా వుంటే దాన్ని కొంత బలపఱుస్తూ యేవో కొన్ని మాటలు వ్రాసిన శ్రీయుతులు జటావల్లభులవారు మఱో శ్లోకాన్ని కూడా వుదాహరించడానికి నేను మఱీ విచారపడుతూ వున్నాను. కాళిదాసుగారికివుండే పాండిత్య కవిత్వాది ప్రజ్ఞల మాట ఆలా ఉంచుదాం.

లోకజ్ఞానంలో యెన్నో వంతున్నూ కూడా యే విమర్శకులకుఁగాని, ఏ కవులకుఁగాని వుండవంటే అంగీకరించనివారెవ్వరు? అట్టి సందర్భంలో ఆయన కవిత్వంలో చొప్పదంటు శంకలకు వుపక్రమించడంకన్న సాహసం వుంటుందా? ముఖ్యంగా భూమిని నాయికగా రూపించుకోవడంవల్ల వొక్కొక్క రాజు, అమ్మ మొగుడుగా, నాయనమ్మ మొగుడుగా కావలసివస్తుందనే భావాన్ని నేను తీసినమాట సత్యం. యీభావం ప్రతికవి కవిత్వంలోనున్నూ అంతో యింతోవస్తుంది. యీమాత్రం జ్ఞానంలేక ఆయా కవులు ఆరీతిగా చిత్రించలేదు. వారికి పూర్తిగా తెలుసును. కాని రూపకాలంకారరీత్యా (Metaphor) ఆరోపితమైన నాయికాత్వం విషయంలో యిట్టి అపార్థ కల్పన చేయడం లేశమున్నూ సమంజసం కాదని ఆయా కవులెఱుఁగుదురని వేఱే వ్రాయనక్కరలేదు. యిది చాలా కల్పించడమనేది మన అజ్ఞతను ప్రకటించుకోవడం తప్ప మఱొకటి కాదని తెల్పడానికే నేను భంగ్యంతరంగా ప్రవర్తించానని పూర్తిగా శ్రీజటావల్లభులు గ్రహించేవున్నారు. కనక విస్తరించేదిలేదు. యీ శంకలవంటివే నన్నయ్యగారి భారతంలో

“చెప్పుము నాకుఁ బయోరుహాననా!” అనేచోట గరుత్మంతుఁడు తల్లిని “పయోరుహాననా!” అంటూ సంబోధించడం బాగులేదనే ఆక్షేపణమున్నూ యముఁడు సావిత్రినిగూర్చి "తనులతాంగి! భవదుదారవాగ్భంగికి, మెచ్చువచ్చె" అనేచోట “తనులతాంగి!" అని సంబోధించరాదనే ఆక్షేపణమున్నూ, యీ రెండు స్థలాలలోనున్నూ అవయవార్థ వివక్ష చేసుకోరాదని గ్రంథకర్తల తాత్పర్యమని వేఱే వ్రాయనక్కఱలేదు. ఒకచోట "అమ్మా!" అనిన్నీ వేఱొకచోట, "అమ్మాయీ!" అనిన్నీ మాత్రము అర్థంగాని అన్యంకాదు. నన్నయ్యగారు ద్రౌపదీ వివాహఘట్టంలో అర్జునుఁడి చేత కర్ణుణ్ణి "కానీన" అని సంబోధింప చేయడంకూడా అవయవార్థం చెప్పుకోవలసిందనే తాత్పర్యంతోకాదు. "కానీన" అంటే? ఓ కర్ణా! అని మాత్రమే అర్థం చెప్పుకోవలసిందనియ్యేవే. అంతేకాని కన్యకావస్థలోవున్న  కుంతికి జన్మించినవాఁడా! అనే అర్థం లేశమున్నూ వివక్షింపవలసిందని కాదు. పద్యకవిత్వ మర్యాద యెఱిఁగినవా రందఱికి ఆ యీ స్వల్పాంశాలు హృత్కవిలే కనక విస్తరించవలసింది లేశమున్నూలేదు. కనక విస్తరించేదిలేదు. కవితాకన్యకను చాలామంది కవులు కూఁతురుగా రూపించుకొన్నారు. కొందఱో? భార్యగా రూపించు కొన్నారు. ఒకరిభావన వొకరికి బాధించదు సరికదా! వొక కవే వొకచోట వొకలాగున్నూ మఱోచోట మఱివకలాగునున్నూ భావించడంకలదు. ఆ భావనకూడా వకదాన్ని నొకటి బాధించదనియ్యేవే నా అభిప్రాయం. గద్వాల శతావధానంలో శ్రీరాజాగారు అడిగిన ప్రశ్నలో "స్త్రీలకు శృంగార రసోపయుక్తము లయిన అవయవాలన్నీ యెదటి భాగంలోనే వున్నాయిగదా! జడకూడా అట్టిఅవయవాలలోదే. యిది వెనకవుండడాని క్కారణమేమో చెప్పవలసిం"దని అడగఁబడింది. అప్పుడు ఈకిందిపద్యం చెఱివక చరణంగా చెప్పఁబడింది. దాన్ని వుదాహరించి కొన్ని మాటలు వ్రాస్తాను.

"సీ. పురుషాయిత మొనర్చుపూఁబోఁడి కటిమీఁద
                 నాట్యంబుసల్పు పుణ్యంబు కొఱకొ?
      ఘననితంబస్థలంబను పెన్నిధానంబు
                 బహుభద్రముగను గాపాడుకొఱకొ?
      తానాశ్రయించు కొంతకు వెన్కభాగమ్ము
                ననుగూడ సౌందర్య మనుచుకొఱకొ?
      పదిమంది దృష్టులు పడిన “కంటక" మంచు
                నూహించి కనుపడకుండుకొఱకొ?

తే.గీ. వేణి కాంతలవెన్నంటి వ్రేలుచుండె
      లేకయుండిన నిధువనలీల కుపచ
      రించు నంగమ్ము లెదుటనే సంచునించ
      దాని కట్లుండ నే యుపద్రవము వచ్చె?”

అని చెప్పేటప్పటికి శ్రీరాజావారన్నారుగదా! “యేదో వుపద్రవం వచ్చినట్టు చెప్పఁగలరా?" అన్నారు. దానిమీఁద యీపద్యాన్ని చెప్పాము.

“మ. ఎదుటన్ వర్తిలునట్టి యంగముల కెంతేని న్నఖాదిక్షతా
      పద పల్మాఱును గల్గు సంగతిని దాఁ బ్రత్యక్షముం జూచి నె
      మ్మదిలో భీతిలి చాటుచోటనుచు సంభావించి వెన్నంటుచున్
      బొదలంబోలును వేణి, లేకునికిఁ దా ముందుండ కట్లుండునే?"

యీ పద్యార్ధాన్ని విని శ్రీ రాజావారు “సరే దాక్కుందనుకోండి యిప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో జడను పట్టుకోవడం ఆయా సమయాల్లో తప్పిందా?” అని ప్రశ్నించారు. దానిమీఁద “అయ్యా! కవిత్వ మంటేనే అబద్ధం. దానిలోవున్న నిజం చాలాలోఁతులో వుంటుంది. ఆ నిజాన్ని గ్రహించేవారు క్వాచిత్కంగా వుంటారు. సెలవైతే యింకో అబద్ధం ఆడమంటే ఆడతాము" అన్నాము. రాజావారు రసికులు గనుక, “చాలును సంతోషించా" మన్నారు. అసలు యీ ప్రశ్న యిప్పటి నైజాంగారి తండ్రి మహబూబుపాదుషా (యీయనకవి) సంస్థాన కవులనేమో అడిగివున్నారఁట : వారు వురుదులో పూర్తిచేశారఁట! అదికూడా మా రచనతో సరిపోయి వుందఁట! ఆశువులో యిట్టిరసవిషయాన్ని చకఁగా సమర్ధించి నందుకు రాజావారు ఆనందించారు. ఇది విషయాంతరం. ఆయా సంస్థానాల్లోయేమి, అవధానాల్లోయేమి చెప్పిన మాపద్యాలనుగూర్చి యీలాటి పూర్వోత్తర సందర్భాలు యెన్నోవ్రాయవలసి వుంటుంది. యింతకూ తేలిందేమిటంటే? కవిత్వం అంటే ఆహ్లాదానికి పుట్టింది. ధర్మశ్త్రాన్ని పురస్కరించుకొని ప్రవర్తిస్తుందనుకో కూడదు. అలాగే అయితే శకుంతలా దుష్యంత సమాగమం మహాభారతంలో మాట అలా వుండనివ్వండి. అది యథార్థకథనం గనక తప్పులేదనుకుందాం. కాళిదాసు గారు ఆ అనౌచిత్యాన్ని సవరించాలంటే? సవరింపవచ్చునుగదా! యెందుకు సవరించలేదో? మిట్టమధ్యాహ్నమే సమాగమాన్ని చిత్రించడమేమో? ఆలోచించండి. ధర్మశాస్త్ర, వైద్య శాస్త్రాలకు విరుద్ధ మన్నమాట కాళిదాసెఱఁగఁడనుకోవడంకంటె పామరత్వం వుంటుందా? అక్కడ సమాధానం శృంగారరసానికిన్నీ ధర్మశాస్త్ర, వైద్యశాస్త్రవిరోధానికిన్నీ లేశమున్నూ సంబంధం లేదనియ్యేవే. యింకా యిలాటి వెన్నో వ్రాయవలసి వుంటాయి. మొత్తం కవిత్వంలో వుండే ఆరోపణలు పుచ్చుకొని వరుస వావులు నిర్ణయించడం పామరత్వంలోనే చేరుతుం దన్నది ముఖ్యాంశం. ఆ అభిప్రాయంతోనే నేను ఆ విషయం యెత్తుకున్నాను. శ్రీ పురుషోత్తంగారు నాకన్నా బలవత్తరమైన స్థలాన్ని యిచ్చివున్నారు. యింకా బలవత్తరమైనదాన్ని నేను వెదికి యివ్వడం యిక్కడ అవసరంకాదు. మొత్తం యిలాటిచోట కావ్యార్ధగ్రహణం చేయడం యిలా కాదని తెల్పడమే మావుభయుల తాత్పర్యమున్నూ ఆవలివారిజ్ఞానం యెంతో పరిశీలించి మఱీ పూర్వపక్షం యెత్తాలి. అందుకే నేను ఆ వ్యాసం వుపక్రమించాను. దాన్నే శ్రీయుతులు బలపఱిచారు. అంతే కావలసింది. దీన్నిబట్టి వెఱ్ఱి వెఱ్ఱిగా కావ్యార్ధాన్ని గ్రహించేవారు వారివారి అభిప్రాయాలు మార్చుకోవడమే మాయిద్దఱికిన్నీ కావలసింది.

“కోవేత్తి కవితాతత్త్వ మీశ్వరో వేత్తివానవా" అనే శ్లోకార్థం బాగా తెలుసుకొనిగాని, యేవిమర్శకులుగాని మహాకవుల కవిత్వాలజోలికి పోకూడదని నాతాత్పర్యం. మురారి మహాకవికి అర్థవిషయంలోకన్న శబ్ద విషయంలో చాలా పట్టుదల వుండడంచేత కాఁబోలు! భరతవాక్యంలో యితర నాటకకర్తలకన్న భిన్నంగా వకమాట వ్రాశాఁడు. దాన్ని వుదాహరించి దీన్ని ముగిస్తాను.

"నశబ్దబ్రహ్మోత్థం పరిమళ మనాఘ్రాయచజనః

కవీనాం గంభీరే వచసి గుణదోషా రచయతు”

ఆయీ మురారి కవివాక్యంకూడా “కోవేత్తి కవితాతత్త్వం” అనే సూత్రాన్ని పురస్కరించుకొన్న భాష్యప్రాయమే అని విజ్ఞులు గుఱుతింతురుగాక!

★ ★ ★