కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/కవుల కష్టసుఖములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to searchకవుల కష్టసుఖములు

నాయెఱిఁగిన కష్టసుఖాలనుగూర్చి శిష్యప్రశిష్యులకూ, ఏకలవ్యశిష్యులకూ కొంచెం వ్యాఖ్యానించడం చాలా ఆవశ్యకమంటూ ఆంధ్రపత్రికాధిపతి తఱచు హెచ్చరిస్తూ వుంటారు. ఆయన యీ విధంగా నన్ను ప్రోత్సహించడానికి కారణం నావార్ధక్యమే. అయితే యేకొంచెమో మిగిలి వున్నాయేమో కాని తక్కినవి అక్కడక్కడ చాలాభాగం వ్యాకరించే వున్నాను.

రచన అనేది సుబోధంగా వుండా లనునది ముందు జనించి పిమ్మట నా జననమని నన్ను మన్నించువారు సంభావింతురుగాక. యేమంటే కవిత్వమనేది తన మనస్సులో వుండే అభిప్రాయాన్ని యితరులకు తెలుపుడు చేయడానికి పుట్టింది కాబట్టిన్నీ ఆ యితరులలో భాషాపాండిత్యం యెక్కువగా వున్నవారే కాక, తక్కువగా వున్నవారూ వుంటారు కనుకనున్నూ యీ అభిప్రాయం పండితులలో చాలామందికి రుచించదు.

“ఉద్దామద్యుమణిద్యుతి వ్యతికర ప్రక్రీడదర్కోపల
 జ్వాలాజాలజటాల జాఙ్గలతటీ నిష్కూజకోయష్టయః"

యీశైలి వారి నోటికి రుచించినట్లు

“శైశవే౽భ్యస్తవిద్యానామ్"
“రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం
 అయోధ్యా మటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం."

ఆయీ శైలి రుచించదు. బాల్యంలో నేనుకూడా ఆ త్రోవలోనే సంచరించానుగాని యౌవన మంకురించు రోజులలోనే నా రచనకు వార్ధక్యం ప్రారంభమై దానికి సూచకంగా,

తే.గీ. తనకు నాల్గునిఘంటు పదములు వచ్చు
       ననుచుఁ బదిమందికిని దెలియంగ మాఱు
       మూలపదములు గుప్పిన ముచ్చటగునె?
       ప్రతిపదమ్మున రస ముట్టిపడినగాక."

ఆయీ పద్యాన్ని చెప్పించి యిట్టి రచనవలన పేరుప్రతిష్ఠలు గడించిన మహనీయుల నామములను,

సీ. నన్నయకవి పెట్టినాఁడుకదా? తిక్క
    నాది కవీంద్రుల కాదిభిక్ష.

గీ. వారలును వారిమార్గమ్ముగోరి యాంధ్ర
    కృతుల నొనరించి బహుబహూకృతుల నలరు
    వారలును మాకుఁ బూజ్యులు వారికన్న
    నితరకవిసత్తముల జోలియేలమాకు?"

అనేపద్యంలో మజ్ఞళార్థంగా యేకరు పెట్టించి, లోకంలో నూటికి తొంభైమంది మెచ్చుకునే రచన వసుచరిత్ర మనుచరిత్రకంటె కొంత లొచ్చు వాదంలోకి దింపింది. కాని ఈ వాదం యెంతేనా యుక్తం న్యాయం కాకపోదుగాని ఆత్మైకవేద్యంగావుండే యీ విషయం ప్రతివాదులు యెంతో సహృదయులుగా వుంటేనే తప్ప జయం దుర్లభం.

భట్టుమూర్తిరచనలో పెద్దన్నగారి రచనవంటి రచన క్వాచిత్కింగా
“మాయాశీలురు చంచలాత్ములు... మహీపాలు ర్మహావైభవ
శ్రీయోగాంధులు చెప్పనేల? మగవారి న్నమ్మఁగా వచ్చునే."
“పకపకనవ్వి యోవసు నృపాలక బాలికదూఱెదేల?

సుదతిన్ మనోజుబారికి నెఱజేసి లోఁ గనికరింపని వారివి గాక నేరముల్?
“ఆ పద్మోద్భవునోలగంబునకు... దాం రోఫోరొ!.
యే పద్మాసనఁ జూచినన్ జెలియ, నిన్నీక్షించినట్లుండ దే
లా? పల్మాటలు పూర్వజన్మకృతముల్ గాఁబోలు నీనెయ్యముల్

నెలతలలోఁ ద్రిలోకనుత నిర్మలకీ ర్తికలాప ధన్య యీ
కులగిరి రాజకన్య. వేడుకమీ కచిరంబ కల్గెడున్."

నానాగాయన గాయనీమణుల గానం బుర్వి నాలింపమో... వినమో? అందైన నెందైన నెందైన విందై నాదంబొనఁగూర్చునే..." i

ఆయీ పద్యాలే కాదు. మఱికొన్నికూడా అప్రయత్నసిద్ధమైన ధాటిలో భట్టుమూర్తివి పెద్దన్నగారి-

“ఈ పాండిత్యము నీకుఁదక్క మఱి యెందేఁగంటిమే. .
...పం క్తి కివెపో? మీ సంప్రదాయార్థముల్."

పద్యాలమాదిరివి వుంటాయి కాని యెక్కడో కొంచెం శబ్దాలంకారానికో, మఱో విశేషానికో యత్నించినట్లు గోచరిస్తుంది. పెద్దన్నగారో

“అబ్బురపాటుతోడ నయనాంబుజముల్... ... చూచె నలకూబరసన్నిభు. ..”

ఎన్నిభవమ్ములన్ గలుగు నిక్షుశ రాసనసాయక వ్యథా
భిన్నతవాడి వత్తలయి కేలఁగపోలములాని. పయిగాలి సోఁకినన్
వెన్నవలెన్ గరంగు నలివేణులఁ గౌఁగిటఁ జేర్చు, భాగ్యముల్."

ఈ చర్చలోకి దిగితే యెంతో సహృదయతవుండాలి. కనక యింతతో ఆపి నా విద్యావంశం వారికిచ్చే నా సలహా, లేదా సందేశం యేమిటంటే "కవియశః ప్రార్థులైన ధీమంతులారా! మీరు పెద్దన్నగారి రచన ఒజ్జబంతి (వరవడి) గాఁ బెట్టుకుంటే కొంత గాకపోతే కొంతేనా రసజ్ఞ లోకం యొక్క “రసనలె ఆకులయి" గా నుంటారేమోకాని వసుచరిత్రను వరవడిగా పెట్టుకుని రచన సాగించే పక్షంలో లాభం లేదనియ్యేవే. వసుచరిత్ర రచనలోని ప్రతి అక్షరాన్ని అనుకరించిన వారెవరో నేఁటివరకెవరు గాని పేరు ప్రతిష్ఠలు గడించినట్లులేదు. ఇది నా అనుభూతి; మీకు వివరిస్తూన్నాను.

ఉII మ్రొక్కిన నెవ్వ రేమనఁడు మోమటువెట్టుక చక్కఁ బోయె... వీఁడెక్కడి వైష్ణవుండు. మన మేటికి మ్రొక్కితి మమ్మ! అక్కటా... నిద్దరవోయినవాని కాళ్లకున్."

చ|| ప్రకటజితేంద్రియుల్. స్త్రీలకు వశు లంతకన్న.. మగకచ్చ బిగ్గకట్టుకొనఁగ నీతఁడెంత శుకుఁడో? హనుమంతుఁడొ? భీష్ముఁడో? వినాయకుఁడొ? తలంచుకో.”

"అకలంకస్థితి నాఁటనుండియును శూ
            ద్రాన్నంబు వర్ణించి మా
ధుకర ప్రక్రియ బ్రాహ్మణాన్న మె భుజిం
           తున్... స్వయంపాకంబు శ్రీరంగశా
యి కృపన్ వెళ్లెదినంబు లీక్రియను స్వా
          మీ? నేఁటిపర్యంతమున్."

శా. “ఆ విప్రోత్తము వజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స
     ద్భావంబు... పూవై తన్మకరందమైకరగెఁబోపో నీటికిన్ బల్బనై."

ఆయీ సారంగు తమ్మయ్య కవీంద్రుఁడు యెవరినీవరవడిగా పెట్టుకొన్నట్లు నాకు గోచరించదు. శ్రావ్యమైన ధోరణిలో యావత్తూ సాగించాఁడు. యితని కితఁడేసాటి. మనువస్వాది చరిత్రలున్నా యితని రచన పఠించేవారు చాలామంది వుంటారు.

“వలపించుటే కాని వలచి దక్కవుగదా
           కుసుమబాణునికైనఁ గోమలాంగి!
బయటిమాటలెకాని భావమీయవుగదా
           అల కళానిధికైన నలరుబోడి!...”
“కొడుకులు గల్లుదాఁక నొక కొన్ని దినమ్ములు చింత... ...
 ... ... ... ... ... ... తను నోలి భజించని చింత తండ్రి కె
 ప్పుడుగడుఁ జింత సేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే."

ఆయీ పద్యాలు కవిరాజమనోరంజనంలోనివి. కనుపర్తి అబ్బయామాత్యుని రచన. యితఁడు పేరుదగ్గిరనుంచినిన్నీ కవికర్ణరసాయనాన్ని (సంకుసాల కవికృతం) అనుసరించినట్లు స్థూలదృష్టికి గోచరించినా, అతని రచన కన్న యితని రచనే మృదువైనది. కొన్ని ఘట్టాలు చదివితీరాలి. యే కొన్ని పద్యాలలోనో, యితరుల పద్యాలపోలిక లుండిన నుండుఁగాక. అంతమాత్రం చేత కవిని సహృదయులు తోసిరా జనరు. అసలు గ్రంథకర్త స్వకపోల కల్పితం కూడా కొంత వున్నదా, లేదా అని పరిశీలించాలి. భవతు. వుపక్రమించినది కవుల కష్టసుఖాలు. వ్రాస్తూవున్నది మఱొకటీ కావడం లేదు గదా? లేదు. ఏ రచయితను గూర్చికాని మీరు (మిడిమిడి జ్ఞానంతో) ఆక్షేపించకండి. అందులోనూ తెలుగురచన విషయంలో మఱీ జాగ్రత్తగా వుండాలి సుమండీ!

“తెలుఁగు తెలుగఁని యద్దాన దిగుటెకాని
 సంస్కృతమ్మునకన్న కష్టమ్ము హెచ్చు"

యీ మాట నేను యెంతో అనుభవం మీఁద వ్రాసిందిగా తెలుసుకోండి.

“కేవలగ్రామ్యపదముల నేవగించి
 జనులు వాడెడి పదములు సమ్మతములు
 కలవు లేవని పెనగ శక్యంబె? భార
 తాదులను లేని పదములు నవనిగలవె.”
                                               (దేవీ భాగ. 1 స్కం, చూ.)

యీ చిన్న పద్యానికి వివరణం వ్రాయవలసివస్తే, గతం గతమైనా వున్న ఆయుర్దాయంచాలదు. సంస్కృతానికి ఘంటాపథా లెన్నో వున్నాయి. తెలుక్కి కేవలం దడియీతే తప్ప గతిలేదు. యెందఱో దీనిలో బొందబడ్డ వారున్నారు. దీనిబండారం యావత్తూ లక్ష్యజ్ఞానాన్ని పురస్కరించుకొని వుంటుంది. ఆ యీ జ్ఞానం నూట నాట యెవరికో గాని వుండదు. గొప్ప గొప్ప లక్షణజ్ఞులందఱూ తుదకి మహాభాష్యకారులు సహా లక్ష్యజ్ఞానానికే గౌరవాన్ని సూచించారు. యెంతసేపూ మీరు లక్ష్యజ్ఞానానికే ప్రయత్నించండి. లక్షణజ్ఞానం యెంత వున్నా చాలును.

"వైయాకరణాః పిశాచాః ప్రయోగమంత్రేణనివారణీయా"

యింకొకటి యెందఱినో తెలుగు కవులను పొరపెడుతూవున్న రహస్యం నేను మీకు సందేశిస్తున్నాను. యిది తెలుగు చెప్పేవారు సంస్కృతం చెప్పడం ఆరంభిస్తే తటస్థపడుతుంది. గణాలు వగైరా తెలుక్కీ గీర్వాణానికీ వొకటే రీతిని వుంటాయి. కాని, వొక్క విషయంలో మాత్రం చాలా భిన్నంగా వుంటుంది. తెలుగుకవి తత్సమ సమాసం నాలుగు చరణాలూ కలిపి రచించినా ఆక్షేపించేవారుండరు (అట జని కాంచె భూమి సురుండంబర... కలాపిజాలమున్. చూ.) గాని సంస్కృతరచనలో ఆ ధోరణి తగిలితే చాలా అపహాస్యాస్పద మవుతుంది. సమాసమే కాదు. సంధికూడా అంతే. సంధికి ఉదాహరణం:

"శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామామ్
 అరవిందసమాన సుందరాస్యా మరవిందాసన సుందరీ ముపాసే.”
 ఆయీ శ్లోకంలో ద్వితీయచరణాంత్యం "రామామ్” అన్న దానికిన్నీ

"అరవిందసమాన" అనే దానికిన్నీ సంధిచేయలేదు. చేస్తేనో శుద్ధతప్పు,

"అర్ధాంతవర్జ మఖిలేష్వపి వృత్తకేషు"

అని వుంది. దీని వత్తరార్ధం నా కిప్పటికిరాదు. నాకు చెప్పినవారికి వచ్చివుంటుంది.

నేను చదువుకోడానికి కాశీ వెళ్లివచ్చిన కొత్తఱికంలో (అహమేవ పండితః) వొక అష్టావధాన సభలో ప్రసక్తాను ప్రసక్తంగా అంతకు కొద్ది మాసాలనాఁడు పోటాపోటీగా గణేశ్వరునిమీఁద ఆరభటీవృత్తిలో రచించిన శార్దూలవిక్రీడితశ్లోకాలు నాల్గు చరణాలకూ సమాసం కల్పినవి చదివేటప్పటికి సంప్రదాయజ్ఞులైన వొకానొక వృద్దులు "నాయనా, ఆసమాసం సంప్రదాయం యెఱిఁగినవారు అంగీకరించరు" అన్నారు. నేను ఆయన్ని బుకాయించి “అయ్యా! యిది తెలుఁగనుకున్నారేమో? సంస్కృతం. మీకు విషయం కాదు." అనేటప్పటికి తెలుగులో తప్ప సంస్కృతంలో విశేషించి ప్రవేశంలేని ఆయన పాపం, (వీడితో టేమిటని) వూరుకున్నారు. సభలో మట్టుకు ఆయన్ని బుకాయించినా నాకు ఆయన ఆక్షేపణ సరియైనదే యేమో అనే శంక మాత్రం బాధిస్తూనే వుండడంచేత యెక్కడేనా నా శ్లోకంమాదిరి సమాసం కల్పినవి, లేదా, సంధి కల్పినవి మహాకవి ప్రయోగాలు దొరుకుతాయేమో అని యెంతో శ్రద్ధగా గాలించడమే కాదు, కొందఱు పండితులను ప్రశ్నించాను కూడా. కాని నా సందేహం తీరనేలేదు. తుదకు అప్పటి నివాసగ్రామం యింజరానికి సుమారు కోసుదూరంలో వున్న కోలంకగ్రామకాపరస్థులు, శ్రీగోవిందవఝ్ఝుల రాజన్న శాస్త్రుల్లుగారు నా సందేహాన్ని తీర్చారు. వారుదాహరించిన కారికను (అర్ధాంత వర్ణం)లోగడ వుదాహరించే వున్నానుగదా? తెలుగులో ధారాళంగా కవిత్వం చెప్పేశక్తి సామర్థ్యాలు కలవారు, అంతకన్నా కట్టుబాట్లు చాలా తక్కువగా (యతిప్రాసాదులలో) వుండే గీర్వాణకవిత్వం చెప్పక చెప్పక ఎప్పడేనా జన్మానికల్లా శివరాత్రిగా వొక శ్లోకం రచించడం సంభవిస్తే యీ విధమైన చిక్కుకు లోనుగావలసి వస్తుంది. ఉభయభాషలలో కవిత్వం చెప్పేవారున్నూ పూర్వాపరాలు స్మార్తంచేయించే పురోహితులున్నూ వొకటే మాదిరి వారు. ఆ పురోహితులు పెండ్లిసదస్యం చేయిస్తూ వున్నారనుకోండి. అందులో సభాస్తారులనుగూర్చి

“సర్వత్ర ఇమా న్యాసనాని సుఖాసనాని.
 ఓం తథా ప్రాప్నువంతు భవంతః"
 ........................................

ఆయీ అన్యోన్య వాక్ప్రసారంలో ఆబ్దిక మంత్రపు కవులలోకి దారి తీసి అశ్లీలాన్ని ఆపాదించడం కద్దు. అందుకే యెంతటి స్మర్తలూ ఆయీ వుభయానికి యాజకత్వాన్ని వహించరు. ప్రస్తుతం మనకు ఉభయ కవీత్వ రచన, ఆయీ రచన తెలుగులో రెండుమూడు చరణాలకు సంధి కల్పడం దోషంకాదు. కనుకనే పెద్దన్నగారు కాదు నన్నయ్యగారు,

“దేవసములైన యనుజుల-తో విప్రులతో రథాళితో వచ్చి, అర
 ణ్యావాసము చేసెదు ధర-ణీవల్లభ నీవు ధర్మనిశ్చితబుద్ధిన్

యిందులో రెండవ చరణం చివరకున్నూ, మూడవచరణం ఆదికిన్నీ (అరణ్యావాసము చూ.) సంధి కల్పబడింది. ఆంధ్ర రచన కనక యిది నిర్దుష్టమే. లోగడ,

"శరదిందు. లోచనాభిరామామ్,
 అరవింద. సుందరీ ముపాసే”

అనే దానిలో, “లోచనాభిరామా మరవింద” అజ్భిన్నం పరేణ సంయోజ్యం కల్పితేనో? చెప్పేదేమిటి కవి సంప్రదాయజ్ఞుడు కాడని-

“మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య"

అవుతుంది. సంస్కృత రచనలో యతి లేకపోలేదుగాని అక్కడికి పదం విరిగిపోవాలి. “కశ్చిత్కాంతా విరహగురుణా” యిందులో కాంతాశబ్దం 'తా'దగ్గర ఆపక, కాం, దగ్గర ఆపితే యతిభంగదోషం పడుతుంది. భర్తృహరి శ్లోకవ్యాఖ్యలో “సికతాసు తైలమసి" అని వుదాహరించాడు, వృత్త రత్నాకరంలో పృధ్వీ వృత్తంలో యిది కూడా అంగీకరించవచ్చు నన్నట్లు కనపడుతుంది. నేను బాల్యాదారభ్యాదీన్ని గూర్చి విచారిస్తూనే వున్నాను. వృత్తరత్నాకరంలో “యతిభంగో యథా” అనడానికిన్నీ దానికి శ్లోకాన్ని వుదాహరించడానికిన్నీ వుపపత్తి గోచరించనేలేదు. పృథ్విలో తప్ప యితర (శార్దూల విక్రీడితాదులలో) శ్లోకాలలో ఆయీ యతిభంగం కావలిస్తే జాతక గ్రంథాలలో తరచు (శనిరాహుభ్యాంతు కృష్ణాంగకః) దొరుకుతవి. ప్రకృతం ద్వితీయచరణాంత్య తృతీయచరణాదులకు సంధి కల్పవచ్చునా అనేది. అవాంతరంగా పదమధ్యేపాదావసానం వచ్చిచేరింది. ఇది సంస్కృత కవిత్వానికయితే చాలా ఆక్షేపణీయమేగాని తెలుక్కి చాలా సుగుణం అనిపించుకుంటుంది. కనకనే కవిబ్రహ్మగారు నీ కవిత్వంలో “మిన్నగా వుండే పద్యాన్ని" చదవవలసిందని యెవరో అడిగేటప్పటికి- -

"సింగమ్మాకటితో గుహాంతరమునంజేట్పాటుమైనుండి మా
 తంగ.. నో జంగాంతార.. వచ్చెంగుంతీసుత మధ్యముండు"

అనే పద్యాన్ని చదివినట్లు కవిపరంపర చెప్పుకుంటారు. ఈ పద్యంలో ఆదిచరణంలో సింగం అనేది తప్ప, తక్కినవన్నీ పదమధ్యే పాదావసానంగానే కుదరడం చాలా గౌరవనీయం. ఇట్టి కూర్పు తిక్కన వంటి కవికిగాని కుదరదని ఆంధ్రమహాకవులు యావన్మందీ యేకవాక్యంగా అంగీకరిస్తారు. సంస్కృత రచనలో రెండు మూడు చరణాలకు సంధి కల్పినవి యెక్కడా దొరకవని నా విద్యార్థి దశలో యెవరో నన్ను ఆక్షేపించడంవల్ల తెలుసుకున్నానుగాని, అలాగే కాకపోతే యీ రహస్యం తెలుసుకోకుండానే జీవ సమాప్తి పొందవలసిందే. విజయనగరం మహారాజులుంగారి దర్శనంనాటికే యీ రహస్యం తెలుసుకోవడం జరిగింది. అప్పటి నా వయస్సు 24 సంవత్సరాలు. ఆ మహారాజావారి మీదఁ జెప్పిన పద్యాలలో,

“ఒక్కొకచోట నొక్కొకనియొద్ద నొకొక్కొక మాట చొప్పునన్
 జక్కఁగ సంగ్రహించితిమి ... ... ... ... ... ... ... ...
 ఇక్కడఁదాపనేల వచియించితిమున్నది యున్న రీతిగన్"

అనే పద్యం కొంచెము మా పడిన పరిశ్రమను సూచిస్తుంది. యీ పద్యం మాత్రమే కాదు-

"చదువఁగావలె శబ్దశాస్త్రాతాదికమ్మును వీక్షింపఁగావలె విద్యలెల్ల,
 ..............................................................................
 కవులు కవులన్న మాత్రాన కవులుగారు
 ....................................................................
 శ్రీమదానందగజపతి క్షితితలేంద్ర!"

అనే, పద్యం కూడా మా కవితా సామగ్రిని తెలిపేదే. శ్రవణానందంలోని-

“కవితచెప్పఁగనేర్చుఁగఱవుదీఱఁగ వేయి గంటాలకైన నిష్కంటకముగ, ... ... ... అమ్మధుసూదనుండు."

అనే పద్యం కూడా మా దృష్టిలో కవిగా నెట్టి వ్యక్తి స్ఫురిస్తాడో తెలిపేదే. ప్రసక్తాను ప్రసక్తంగా చాలా దూరం వచ్చాం. సంస్కృతంలో (సాధువు కాకపోయినా) రెండు మూడు చరణాలకు సంబంధం కల్పినది ఆధునికులది చూపి యీ వ్యాసాన్ని ముగిస్తాను.

“అపరాధ సహస్ర సహస్రకరా,
 నపి భక్తవరాన్భవదంఫ్రిునతి
 ప్రవరా నవసీకృత మీశ్వరమాం.”

యీ శ్లోకంలో రెండవ చరణం భవదంఫ్రిునతి అనే పదంతో ముగిసింది. ఆ పదంతోటి-ప్రవరాన్ అనేపదం కలిపి సమాసం చెయ్యడం తెలుగు కవితాసంప్రదాయం. ఆయీ రహస్యం నేను పెద్దలవలన విని తెలుసుకున్నాను. మీకు తెల్పుతున్నాను. ప్రాచీనకవులలో నిట్టి రచన దొరకదు. నవీనులలో కూడ మృగ్యమే. సమాసమందు సంహిత నిత్యం. నిత్యా సమాసే' అని వుండడంచేత వివక్షాధీన మనడానికిన్నీ అవకాశం లేదు. నేను కష్టించి తెలిసికొన్న రహస్యం గదా! అని దీన్ని మీకు వ్యాఖ్యానించానుగాని యిప్పుడు-ఉభయ కవితా ప్రవీణులు లేనేలేరు. ఆంధ్రకవులు మాత్రమే వున్నారు. వారిలో కూడా పలువురు, ఛందోవ్యాకరణాది కట్టుబాట్లను ఉల్లంఘించడమందు కుతూహలం కలవారే, యితరుల దాఁకా యెందుకు నామట్టుకు నేను ఛందోవిషయంలో కొంతకున్నూ వ్యాకరణ విషయంలో కొంతకున్నూ సున్నచుట్టే కుతూహలం కలవాణ్ణే. చూడండీ యీ పద్యంలో యతి మ్రొక్కుబడి చెల్లించుకున్నట్టే వుందో మఱి యేలా వుందోను.

శా. "కేదారేశు భజించితిన్. పద్మాక్షు సేవించితిన్-యాదో నాథ సుతాకళత్రు బదరీనారాయణున్." యతి సజాతీయ వర్ణశ్రవణం యేదో విధంగా కావడమేకాదు. భవతు. దీన్ని గుఱించి మఱొకప్పుడు మాట్లాడుకుందాం.

ద్రుతప్రకృతి సంధికి యెన్ని చోట్లనో ఆసీమాంతం చెపితే యెంతో అనుకూలంగా వుంటుందనుకుంటాను. అపార్థాలు అళ్లీలాలు రావడానికి ఆయీ సంధి కారణం. విద్వాంసులు చదువుకునేకబ్బాలలోవుంటే వుంటుంది గాక, స్కూలు విద్యార్థులు ఫైనలు లోపున చదువుకునే పుస్తకాలలోనైనా తగ్గించి ముద్రిస్తే చాలా బాగు. ముద్రణంలో తగ్గించినా టీచర్లు ఆయీ చోట్ల ఫలానా సూత్రంవల్ల ఫలానా విధంగా మారవలసివస్తుంది. ఆ మార్పు శ్రవణసుఖంగా వుండదని చేయలేదని బోధించడం వల్ల కొంత వ్యాకరణ జ్ఞానం కూడా అలవడుతుంది,

“తొలఁగిచనియె నేమి చెప్పదున్ గురునాథా!” అన్నచోట వింటూ వున్నవాడు కురునాథుడే కనక సరళంగా కాక పరుషం (కురు)గా విఱుచుకోవడం సుగమమే అయినా కుమ్మరి గురునాథుణ్ణి స్ఫురింప జేసికొని కవి బ్రహ్మగారికి ఆయీచోట రచన సాగలేక పోవడం వగైరా వొక చిన్న యితిహాసం కల్పించి గురునాథునికి విద్వత్పరంపర యిచ్చే పాండిత్య గౌరవం నాకూ యిష్టమే కాని అంతటి మహాకవికి యీ స్వల్ప సందర్భం దగ్గిర ధార ఆగడమంటే యేదో మాదిరిగా వుంటుంది. ఈలాటి తపనాలు లేకుండా కురునాథా! అనే వ్రాస్తే, 'నచ శంకా నచోత్తరమ్‌' ... ... గదా! భవతు. యీలా వ్రాస్తూవుంటే పెరుగుతూనే వుంటుంది. గ్రంథం.

కవులు చాలావరకు స్కూలుబాలుర పాఠ్య పుస్తకాలలో స్పష్టప్రత్తిపత్తికొరకు కొన్ని సంధులు విడుచుట చూస్తున్నాము. అది చాలా అభినందనీయంగా వుంది. అంతమాత్రంచేత గ్రంథకర్తకు ద్రుతప్రకృతిక సంధి కూడా తెలియదని అనుకునే ప్రాజ్ఞులు వుండరు. విద్యార్థులకు దానివల్ల కలిగే వుపయోగాన్ని వ్రాసేవున్నాను. శ్రీ శంభుప్రసాదుగారు నన్ను నేటి రచయితల గూర్చి సందేశాన్ని యివ్వవలసిందని చాలాసార్లు కోరివున్నారు. నా సందేశం "ముది మది తప్పితే మూడు గుణాలు" అనే లోకోక్తికి స్ఫోరకంగా వుంటుంది. దీన్ని లోకం యెంతవరకు విశ్వసిస్తుందో నాకు తెలియదు. ఆయన మాట తీసివేయలేక యీ కాస్తావ్రాసాను. లోకం దీన్ని ఆదరిస్తే పిమ్మట యింకా వ్యాసాలు యీలాగే వ్రాస్తూవుంటే చూచుకుందాం.


★ ★ ★