కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/అతిక్షమ దైన్యాపాదకమా?
అతిక్షమ దైన్యాపాదకమా?
క. "క్షమ మేలగు నైన నతి
క్షమదైన్యము దెచ్చు నెదురు గర్వించినఁగ
య్యమువొడిచి గెలిచి యరిశే
షమునెడసదయక్షమావిశదుఁ డగుటొప్పున్"
అంటూ శ్రీమహాభారతములోవుంది. దీనితాత్పర్యం యెఱఁగనివారే వుండరు. యేముంది యిందులో? శాంతిగా వుండడమైతే చాలా మంచిదేకాని- "అతి సర్వత్ర వర్జయేత్" కనుక మిక్కిలీ శాంతిమాత్రం పనికిరాదు సుమా! అని ఫలితార్థం. యీసందర్భం మనఋషులందఱూ పాటించేవున్నారు. కాని యెప్పడో వకప్పుడు ప్రతిఋషిన్నీ వ్రతభంగంచేసుకున్నట్టుకూడా కనపడుతూనే వుంటుంది. అంతమాత్రంచేత వారు శాంతిధనులు కారనుకోవడానికి వల్లకాదు. ఆ మహర్షులకు యీశాంతి వక్కటి మాత్రమేకాదు; దీనితోపాటు ఇంకా మఱికొన్ని సుగుణాలు యెప్పడూ యెడఁబాయకుండా వున్నట్లు గ్రంథాలవల్ల గోచరిస్తుంది.
శా. “ఆలస్యంబొకయింతలేదు శుచి యాహారంబు నిత్యక్రియా
జాలంబేమఱ మర్చనీయు లతిథుల్ సత్యంబ పల్కంబడున్
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు మట్లౌటనె
క్కాలమ్ముం బటు మృత్యురోగ భయశంకల్ వొంద మే మిమ్ములన్."
ఈ పద్యంలో వున్న లక్షణాలన్నీ సత్త్వగుణానికి సంబంధించినవే. యిట్టి సాత్త్వికవృత్తి యిహపరలోకములు రెండిటికిన్నీ మెప్పు సంపాదించేదే. చతుస్సముద్ర ముద్రితమైన ధరామండలాన్ని లేదా స్వర్గమర్త్య పాతాళలోకాలు మూఁడింటినిన్నీ పరిపాలించడంకన్న యీశాంతి మహా సామ్రాజ్యాన్ని పరిపాలించడమే పరమోత్కృష్టమంటే విజ్ఞులెవరూ కాదనరు కాని త్రిలోకాధిపత్యాన్నేనా సంపాదింపవచ్చునేమోకాని దీన్ని సంపాదించడం కష్టసాధ్యమూ కాదు అంటే కేవలమూ అసాధ్యమే అనుకోవాలి. భారతపద్యంలో శాంతినయితే సామాన్యతః విధించడం జరిగిందిగాని వొక్కొకప్పుడు ఆశాంతిని వర్ణించడానికి కూడా అభ్యనుజ్ఞ యిచ్చినట్లు తేలుతూవుంది. ఆ పద్ధతిని లోకంలో అందఱూ శాంతులే అనిపించుకుంటారు. యెవరో తప్ప తగినంత అవసరం కలిగేదాఁకా సర్వులూ శాంతంగానే వుంటారు. భారవి మహాకవికూడా భారతా న్ననుసరించే యీ క్రిందివిధంగా శాంతినిగూర్చి వ్రాశాcడు -
శ్లో. “శుచి భూషయతి శ్రుతం వపుః ప్రశమస్తస్య భవత్యలంక్రియా,
ప్రశమాభరణం పరాక్రమస్స నయాపాదిత సిద్ధిభూషణః"
దీనిలో పరాక్రమాన్ని శాంతికి భూషణంగా భారవిగారు చిత్రించారు కానీ అది రాజనీతికి విరోధించకూడదని వకవిశేషణంద్వారా కనపఱిచారు. దీన్నిబట్టి యిది క్షత్రియ విషయమని స్పష్టమే. యేమైనా అవసరానవసరాలనుబట్టి శాంతి వహించనూవచ్చు, పరిత్యజించనూవచ్చు అని తేల్చినట్లయింది.
మొత్తం మనగ్రంథాలు యెన్ని పరిశీలించినప్పటికీ యీ శాంతి విషయము "ఉదితానుదిత హోమం" వలెనే పాక్షికంగా వుంటుంది కాని సార్వకాలికంగా కనపడదు. పోనీ ఆచరణలోనేనా నిత్యత్వం కనపడుతుందేమో అంటే? అదిన్నీ మృగ్యమే. చ్యవనుఁడంతటి బ్రాహ్మణుఁడు మహాతపస్వి మహావృదు, దేహాభిమానంకూడా వదులుకొన్నవాఁడు యెఱక్క సుకన్య చేసిన అపచారాన్ని సహించక సుకన్యనే కాకుండా ఆమె తల్లిదండ్రులనూ ఇంకా వుండే వారి పరివారాన్నీ కూడా మలమూత్రబద్ధంచేత బాధపడేటట్టు శపించాఁడు కదాఁ! వసిష్ట విశ్వామిత్రాదులనుగూర్చిన యితిహాసాలు కూడా యింతకన్నా అద్ద్వాన్నంగానే వుంటాయి. వాట్లని యిక్కడ వుదాహరించి కథ పెంచడం అనవసరం. వొక్క శమీకుఁడు కాఁబోలును! పరీక్షిత్తుచేసిన అపచారానికి లేశమున్నూ శాంతిని గోలుపోలేదు సరికదా! పైఁగా తన కొడుకు శైశవావస్థలో వుండి చేసిన కార్యానికికూడా చాలా విచారించి “తండ్రీ! యీ అకార్యాన్ని యెందుకు చేశా?” వంటూ చాలా పశ్చాత్తాప పడ్డట్టు భాగవతంవల్ల మనకు అవగత మవుతుంది. యింకా యీలాటి శాంతిపరు లెవరేనా వున్నారేమో? గ్రంథాలు వెదికి చూడాలి. పరీక్షిత్తు చేసిన పని చాలా నీచప్పని. మహారాజకుటుంబంలో, అందులో నున్నూ పరమ ధార్మికులనిపించుకొన్న పాండవుల వంశంలో పుట్టినవాఁడు చేయదగిందికాదు. యింతకూ ఆ ఋషి చేసిన అపచారం లేశమున్నూ కనపడదు. తపస్సమాధిలోవుండికదా తనకు ఆతిథ్యాన్ని యివ్వకపోవడం తటస్థించింది! అట్టి సందర్భంలో మృతసర్పాన్ని తెచ్చి ఆ తపోధనుని మెడకు తగల్చడం మిక్కిలీ కొంటెపని. ఇట్టి పనులు యెవ్వరి పరిపాలనలోనూకూడా జరిగి వుండవేమో? కొన్ని కథలు తులసిమొక్క మొదలైనవాట్లకు సంబంధించినవి మనవాళ్లు చెప్పకుంటూ వుంటారు. ఆ కథలు నిజమే అయితే ప్రస్తుతాన్ని అవి అనుకరిస్తాయి. ఆర్యక్షత్రియుఁడు చేయవలసిన పనికాదు కదా అది! అనార్యుఁడు చేయడానికిఁగాని చేసినవాణ్ణి క్షమించడానికిఁగాని వీలైనపనికూడా కాదది. అయినా ఆ పనిని ఆ పరీక్షిత్తు రాజుగా వుండి యేలాగో చేశాcడు. ఆశమీకుcడు యేలాగో క్షమించాcడు. అంతకు పూర్వకాలంలోగానీ, యిటీవలికాలంలోcగానీ ఆ శమీకుని వంటివాళ్లు లేనే లేరనుకుంటూ వుంటే లేకేం వున్నాఁడని చెప్పుకోవడానికి మహాత్మాగాంధీగారు అవతరించారు. ఈయన శాంతికిన్నీ మన భారతంలో వున్నదానికిన్నీ పోలిక లేనేలేదు. “అతిక్షమదైన్యం తెస్తుం"దని మన మహాభారతం చెపితే చెప్పిందిగాక యీ మహాత్ముని ప్రవృత్తి దాన్ని అన్యథాకరించి దైన్యం తేవడానికి బదులు దైన్యాన్ని పాఱఁదోలుతుందని వొప్పుకోక తప్పని విధి అవుతూ వుంది.
గాంధీగారి సిద్ధాంతాలన్నిటినీ ఆమ్నాయాలుగా శిరసావహించే వాళ్లు చాలామంది వున్నారు. యేకొందఱో వారి సిద్ధాంతాలంటే అంగీకరించనివాళ్లున్నూ వున్నారు. నే నీరెండో తెగలోవాణ్ణే. దేవాలయాలు పుట్టడానికి మూలం ఆగమాలు. ఆ ఆగమాలు వర్ణవ్యవస్థ వగైరాలకు కట్టుబడి “వారికి అంతవఱ"కనిన్నీ “వీరికింతవఱ"కనిన్నీ దేవతాసాన్నిధ్య గమనాన్ని గూర్చి వ్రాసివున్నాయి. ఆ వ్యవస్థను పూర్తిగా గాంధీగారు తొలగించివున్నారు. ప్రజాబాహుళ్యాభిప్రాయాన్ని తోసివేయలేక అర్చకులు ఆగమాలమాట తలపెట్టక జీవనోపాధి చెడుతుందని అన్నిటికీ సిద్ధపడవలసినవాళ్లయినారు. ఆయీ సందర్భాలుకూడా శాంతి పురస్సరంగానే త్రికరణశుద్ధిగా మహాత్ముఁడు నడిపినప్పటికీ బాగా ఆలోచించిచూస్తే యిందులో కొంత పశుబలంవుందిగాని లేకపోలేదు. "చండాలో౽స్తు సతుద్విజో౽స్తు గురుః" అనే శాంకరవచనం గృహస్థ విషయంకాదు. సర్వసంగ పరిత్యాగం చేసిన సన్న్యాసులవిషయం. గాంధీగారు నిజమైన సన్యాసు లనిపించుకునే యెవరికిఁగాని దీసిపోరు సరిగదా! పైపెచ్చు వారినందరినిన్నీ అతిక్రమిస్తారేమో! అని కూడా వారి ప్రవర్తనవల్ల గోచరిస్తుంది. అట్టివారికి దేవాలయాలు సర్వే సర్వత్ర అందఱికీ సమానమైన హక్కుకలవిగా కనపడ్డప్పటికీ గృహస్థులకు యితరభేదాలతో పాటు యిక్కడకూడా కొన్ని భేదాలు వుండకతప్పదు. దేవీ భాగవతంలో జనకుఁడు శుకుణ్ణిగూర్చి ఆయీ సందర్భాన్ని కొంత విశదంగా ముచ్చటించియున్నాఁడు. మొత్తం తేలే సారాంశం - గృహస్థులకు భార్యా పుత్రికాది భేదాలతోపాటు కులభేదాలున్నూ పరిత్యజించకుండా వుండవలసినట్టు కనబడుతుంది. అద్వైతంలో కూడా పరమార్ధావస్థలో అభేదం వుపాదేయంగా సిద్ధాంతిక మైనప్పటికి వ్యవహారావస్థలోభేదాన్ని అంగీకరించ వలసిందే అని స్పష్టంగా కనబడుతుంది. “ప్రతిమాస్వల్పబుద్దీనామ్" అనడంవల్ల సామాన్యులకుఁగా యేర్పడ్డ దేవాలయాలు భేదోపాధిని తోసివేయడానికి లేశమున్నూ అంగీకరించవని వ్రాయనక్కఱలేదు. యిది విషయాంతరం. మనకు ప్రస్తుత మేమిటంటే? భారతాదులలో చెప్పిన శాంతికంటె మించిన శాంతి వహించి దానివల్లవున్న ప్రయోజనాన్ని ఋజువుచేసిన - చేయుచున్న - చేయనున్న మహాపురుషుఁడు ఈ కాలంలో గాంధీగారనిన్నీ యీయనకు దీటగుశాంతి వక్క శమీకుని యందు గోచరిస్తుం దనిన్నీ యిట్టి మహాపురుషుఁడు మృగ్యుఁడనిన్నీ యీయన్ని పురస్కరించుకొని మనం “మాలోయిట్టి మహాపురుషుఁడున్నాఁ"డని గర్వించవలసిందే కాని సర్వవిధాలా ఆయన్ని అనుసరించడం బొత్తిగా సంభవించ దనిన్నీ ఆచరించేయోగ్యత వుంటే అతిక్షమకూడా దైన్యాపనోదనమే అనేది భారతానికి అతీతమైన సిద్ధాంతం అనిన్నీ తెలుసుకోవలసివుంటుంది. ప్రతీ సందర్భంలోనున్నూ యీలాటివిశేషాలు కొన్ని వుంటూనే వుంటాయి. వాట్లను వదిలిపెట్టి సామాన్య సందర్భాలే సర్వజనాచరణ యోగ్యాలుగా మనం చూచుకోవాలి. భారతంకూడా అదేతాత్పర్యంతో శాంతిని వప్పుకుంటూ కూడా అతి శాంతిని మాత్రం వప్పుకోలేదనుకోవాలి. దీన్నే మనవాళ్లు- “తొక్కినా కఱవకపోతే బురదతొస్సురా” అంటారని సామెతగా చెప్పకుంటూవుంటారు.
కొందఱుపైకయితే చాలా శాంతులుగానే కనపడతారు గాని వారి అంతస్సుమాత్రం చాలా అశాంతంగానే వుంటుంది. బహిశ్శాంతికంటె అంత శ్శాంతికే వేత్తలైనవారు యెక్కువ గౌరవాన్ని యిస్తారు. శాంతితగ్గిన మనస్సుతో యెవరుగాని యెవరితోఁగాని ప్రసంగించడం యుక్తంకాదు. వ్రాఁతకి దిగడంకూడా ఆలాగే. కోపంతో వకప్పడేదేనా వ్రాసినప్పటికీ తిరిగీ దాన్ని శాంతికలిగినపిమ్మట పరిశీలించి సవరించు కుంటే అంతచిక్కుండదు. పరిశీలించకుండానే ప్రకటించేయొడల దానివల్ల వచ్చేచిక్కుకు పరిమితంటూ వుండదు. దాన్ని సమర్థించుకోడానికి బ్రహ్మక్కూడా తరంకాదు. యీ విషయం వాదోపవాదాలలో ముఖ్యంగా గమనించడం ఆవశ్యకం. తాత్కాలికంగా పొంగినపొంగుతగ్గి మనస్సు శాంతించాక చెప్పేసమాధానం వఱదకాలం దాఁటిన తరువాత వుండే నదీజలంలాగ నిర్మలంగావుండి లోకులు ఆస్వాదించడానికి అర్హత కలిగివుంటుందని నేననుకుంటాను. కోపంవచ్చీ రావడంతోనే వ్రాఁతకు వుపక్రమిస్తేనో? అది తొలకరిలో చెత్తాచెదారం మట్టీమట్రాతోటీ వచ్చే వఱదలాగా ఏదో మాదిరిగా వుండవలసివస్తుంది.
ధర్మాలు వేఱు, ధర్మసూక్ష్మాలు వేఱు, అంతో యింతో ధర్మాలు తెలియనివా రంటూ వుండనే వుండరు. ధర్మసూక్ష్మాలు తెలిసినవారో యెక్కడోగాని వుండరు. ఉదాహరణకోసం కొందఱిని వుటంకించి కొంచెం మాట్లాడుకుందాం. రాముఁడు మహాపురుషుఁడు, సాక్షాత్తుగా భగవదవతారం - మహావీరుఁడు. అట్టివాఁడు భవిష్యత్కార్య గౌరవాన్ని పురస్కరించుకొని వాలివధలో కొంత అనుచితం చేయక తప్పిందికాదు. దాన్ని సవరించడానికి యెందఱో మహాకవులు యెన్నో తోవలు తొక్కివున్నారు. కాని అదిమాత్రం వజ్రలేపంగా నిలిచిపోయింది. యిఁక భీష్ముఁడు బ్రహ్మచారి, మహాజ్ఞాని, శాంతియుక్తమైన పౌరుషం కలవాఁడు. అయితే యేమి? తనయావద్ధనుర్విద్యకును మూలభూతుఁడైన పరశురామునితో యెదురుకొని యుద్ధంచేయక తప్పిందికాదు. శాస్త్రాలో! “ఏకాక్షర ప్రదాతారం" అని చెపుతూ వున్నాయి. అది స్వకులధర్మ మవడంచేత, సామాన్య ధర్మాన్ని ధర్మసూక్ష్మం అపవదించిందనుకోవలసి వచ్చింది. స్వకులధర్మమైన యుద్ధం హింసాత్మకమైనప్పటికీ యజ్ఞంలో జరిగే పశుహింసలాగే “ధర్మాదనపేత" మవడంవల్లనే భీష్ముఁడు యెందఱినో చంపిన్నీ నరకానికి వెళ్లినట్లు భారతంలో కనపడదు. గురువుగారితో చేసిన యుద్ధంకూడా దానికిందనే జమకట్టడంచేత కాఁబోలు భీష్మునకు అదిన్నీ నరకాన్ని కల్పించలేకపోయింది. అర్జునుఁడు “పితృసమోజ్యేష్ఠః" అనే శాస్త్రాన్ని ఉల్లంఘించి ధర్మరాజును చంపడానికి వుద్యమించడం, స్వప్రతిజ్ఞా భంగనిర్వహణాని కవడంవల్ల కాఁబోలు! సమర్థనీయమే అయింది. అంతో యింతో ప్రతిజ్ఞా నిర్వహణ ప్రసక్తి వున్నప్పటికీ కేవలం విరుద్ధంగా వున్న కారణంచేత కాఁబోలు ధృష్టద్యుమ్నుఁడు చేసిన ద్రోణవధ యెంత సమర్ధించినా సమర్ధింపఁబడడంలేదు. గురువు ఆయుధాన్ని ధరించి తనతో పోరాడుతూన్నప్పడే అయితే ధృష్టద్యుమ్నుఁడొనర్చినకృత్యం సమర్ధింపఁబడేది. పనిపడితే పరలోకంలో యమధర్మరాజుతో "నేను నిర్దోషినే" అని సమర్థించుకోవడానికి తగ్గదైర్యం యిచ్చివుండేది. కాని అది కేవలం కసాయి వాని కృత్యంగా వుంది. సత్యవతి, కుంతి, మొదలైనవాళ్ల చారిత్ర స్ఖాలిత్యాలుకూడా ధర్మసూక్ష్మా లెఱిఁగిన పెద్దలకు ధర్మాదనపేతాలుగానే కనపడతాయి. సామాన్యులదృష్టికి అన్యథాగా కనపడ్డప్పటికి అంతమాత్రంచేత అవినింద్యాలు కాఁజాలవు. ప్రతి శరీరానికిన్నీ వాతపిత్తాదులతోపాటు సత్త్వరజస్తమోగుణాలు జీవసంబంధం వున్నంత కాలమున్నూ వుండితీరుతాయి. వీట్లకూ వాట్లకూ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కదానికి వుద్రేకం కలగడం సహజం. దాన్ని ఔషధదులచేతా పరిశీలకత్వంచేతా వారించుకోవడమున్నూ వుంది. ఒక్కొక్కప్పుడు అవి ప్రతిక్రియకు లొంగక విజృంభించి హానికరాలు కావడమున్నూ సర్వానుభవ సిద్ధమే. సత్త్వగుణం యెంత విజృంభించినా కలిగే హానిలేదుగాని తక్కిన రెండున్నూ అలాంటివికావు. వాతాదులకు ఔషధప్రయోగంలాగే జ్ఞానంకూడా వ్యర్థం కావలసివస్తుంది. వొక్కప్పుడు ప్రస్తుత విషయంలో అలాటప్పుడే చెప్పఁదగ్గ జవాబు కనపడక దానికి కర్మని కారణంగా పెట్టుకొని గ్రంథకర్తలు- 'కర్మణో గహనాగతిః' అని వూరుకుంటూ వుంటారు. భవితవ్యం అనివార్యం అంటేనేకాని మనకి కుదురని సందర్భాలెన్నో కనపడతాయి. శ్రీరామునివంటి ధీరోదాత్తుఁడు, శూర్పణఖకు వైరూప్యాన్ని ఆపాదిస్తూవున్న లక్ష్మణుణ్ణి వారించకపోవడం భవితవ్యతామూలకం కాక యేమనుకోవాలి? ఆవైరూప్యా
\ పాదనమే సీతాపహరణాది చిక్కులకు కారణమయినట్టు కనపడుతుందిగదా! యేదో విధంగా భయపెట్టి పొమ్మంటే అంత చిక్కు రాకపోయేదేమో? త్రిలోకాధిపత్యాన్ని నిర్వహిస్తూవున్న రావణాసురుఁడి సోదరీమణి కదా ఆశూర్పణఖ. తుట్టతుదను మండోదరి సంధిమాటలు చెప్పినప్పుడు రావణుఁడు చెప్పినమాట చూడండి యేలా వుందోను :-
చ. "ఎఱిఁగి యెఱింగి మున్నతఁడె యెగ్గొనరించిన దానికైకదా!
చెఱఁగొని వచ్చితిన్ బిదప సీత, వృథా కథలింక నేల? పెం
పఱ బ్రదుకింతతీయనె? ఖరాదుల చావున కేమిగాని నీ
మఱఁదలి బన్న మేపగిది మానిని? యీఁగుదుసంధి చేసినన్"
యింతటి విపత్తు కలిగిస్తుంది. అని మొట్టమొదట లక్ష్మణుడికిగాని రాముడికిఁ గాని యేలేశమేనా గోచరించేయెడల శూర్పణఖను అంతగా అవమానించడం జరిగేది కాదేమో?"
ఆ యీ సందర్భాలు పరిశీలించిచూస్తే వొకcడు శాంతుcడుగా వుండడానికి కాని, మఱివొక్కఁడు అశాంతుఁడుగా వుండడానికిఁగాని కారణం వక్కభవితవ్యత తప్ప వేఱొకటి కనపడదు. అయినప్పటికీ సర్వ సామాన్యంగా ప్రతీవిషయానికిన్నీ దీనితో సంబంధం కలపడమనేది ఆచారంలోలేదు. పూర్వజన్మకృత పుణ్యపాపాలతో సంబంధం ప్రతీదానికీ వున్నప్పటికీ వాట్లకే ప్రాధాన్యం యిచ్చేయడల యెవఁడున్నూ దోషిగాఁగాని, నిర్దోషుఁడుగాc గాని యెక్కడా ప్రపంచంచేత వాడుకోఁ బడడానికి అవకాశమే వుండకపోవలసివస్తుంది. అప్పుడు కొన్ని వ్యవహారాలకుచాలా చిక్కువస్తుంది. అందుచేత ఆ తోవ వదలుకొని మంచిచెడ్డలకు కర్తృత్వం మనదే అనుకొని మాట్లాడుకొందాం. యీలామాట్లాడుకొనే పక్షంలో యొవcడికేనాసరే శాంతుఁడుగా వుండడంకన్న వుత్తమమార్గం కనపడదు. శాంతికన్న సౌఖ్యాన్ని యిచ్చేది వేఱిదిన్నీ వున్నట్టు తోఁచదు. శ్రీకృష్ణ భగవానులుకూడా,
“శ్లో యస్మాన్నోద్విజతేలోకో లోకా న్నోద్విజతే చయః
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః"
అని తెల్పివున్నారు. త్యాగరాయలవారు “శాంతము లేక సౌఖ్యము లేదు.” అంటూ పైసందర్భాన్నే గానంచేసి ఉన్నారు. అందుచేత సర్వవిధాలా శాంతిసంపాదనానికై శాయశక్తులా ప్రయత్నంచేయడం ప్రతిమనిషికిన్నీ ఆవశ్యకమైనపని. యెట్లో పెద్దల సేవవల్లనో గ్రంథావలోడనంవల్లనో అట్టిశాంతి సంప్రాప్తమయితే కావచ్చును గాని సంప్రాప్తమైన ఆ మహాధనాన్ని కాపాడుకోవడం చాలాకష్టసాధ్యం. యీ మహావస్తువును
%. అపహరించడానికి యెన్ని విధాల దొంగలో యేర్పడివున్నారు. "శ్లో. అర్థా నా మార్జనే దుఃఖమార్జితానాంచ రక్షణే" అన్న శ్లోకార్థం ప్రసిద్ధమే. యౌవనావస్థలో వుండే శాంతిధనాన్ని అపహరించే దొంగలు స్త్రీలు. వార్థకావస్థలో శాంతి కాపాడుకోవడం కొంతసులభమే అని చాలామంది అభిప్రాయపడతారు గాని యితర వయస్సులే అంతకన్న శాంతిని కాపాడుకోవడానికి యుక్తంగా వుంటాయని అనుభవజ్ఞులంటారు. యేమంటే? వార్ధక్యంలో కోపం సహజంగా ప్రతిమనిషికిన్నీ వుత్పన్నమవుతుంది. యేదో అవధానంలో చిరకాలంనాఁడు యెవరో అడిగితే చెప్పిన పద్యాన్ని యిక్కడ వుదాహరిస్తాను.
"చూపుతగ్గుట దేహదార్ఢ్యము సున్నయౌట మనమ్ములోఁ
గోప మబ్బుట చిన్నికుఱ్ఱలకున్ హితంబులు చెప్పుటల్
'శ్రీపతీ! సుగుణాకరా! ననుఁజేరి ప్రోవర!' యంచు న
య్యాపదుద్ధరు వేఁడి కొంటయు నబ్బు వృద్ధత గూరినన్."
వృద్ధత్వంలో యితరులు చేసే ప్రతీపని యందున్నూ తనకుయేదో విధమైన దోషమే పొడకడుతూ వుంటుంది. ఆకారణంచేత ఆయా పనులను నిషేధించబోతే ఆవలివాళ్లు వినరు పైఁగా తిరస్కరిస్తారు దానిమీద మఱీ కోపం హెచ్చుతుంది. దీన్ని గుఱించి వ్యాఖ్యానం చేయవలసివస్తే చాలా పెరుఁగుతుంది. మనకు ముఖ్యమైన అంశం యేవయస్సులోఁగాని శాంతిని కాపాడుకోవడం కష్టమే అనిన్నీ, అందులో వార్ధక్యంలో చెప్పనక్కఱే లేదనిన్నీ మాత్రమే, సమస్త విషయాలున్నూ పరిత్యజించిన సన్యాసులకుకూడా వొకప్పుడు కోపంవస్తుంది. ఆ సన్యాసిని యెవరేనా బ్రహ్మవిషయాన్ని గూర్చి ప్రశ్నించడం తటస్థిస్తే ఆయన చెప్పినమాటలన్నిటినీవిని తలవూఁపితేతప్ప - తెలియకే అనుకుందాం - అడ్డదిడ్డ ప్రశ్నలు వేయడానికి మొదలు పెడితే ఈ సంగతి స్పష్టపడుతుంది. యింక గృహ స్థాశ్రమంలోవున్న పండితులనుగాని, కవులనుగాని యెవరేనా ధిక్కరిస్తే చెప్పనే అక్కఱలేదు. పండితులకన్నా కవులసంగతి యీ విషయంలో మఱీ అగమ్యగోచరంగా వుంటుంది. కవికిస్వార్థంకంటే పరార్థం యొక్కువ. అందుచేత కవులకు లోకులతో యెక్కువ సంబంధం వుంటుందిగదా! అట్టి కవికి మనస్సులో తనరచన చూచి అందఱూ ఆనందించాలని వుంటుంది. కాని "లోకోభిన్నరుచిః" కనుక కొందఱు ఆనందించేవాళ్లున్నూ కొందఱు యీసడించేవాళ్లున్నూ వుండకతప్పనివిధి అవుతుంది. కొన్ని కవిత్వాలకో? నూటికి 99 గురు యీసడించేవాళ్లే వుంటారు. దానితో అట్టివాళ్లమీఁద గ్రంథకర్తకు కోపం రావడం జరుగుతుంది. కొంచెం గడుసుతనం వున్నవారి కోపమైతే లోలోపల యిమిడి వుంటుంది. అదిలేని కవికోపమో? చిమిడి పాకంతప్పి తనకెంత అపకారం చేయాలో అంతా చేసితీరుతుంది.
క. "కోపము చీకటికూపము
కోపము పాపముల కాదిగురువగు హింసా
ధూపము కోపముగావునఁ
గోపింపంగూడ దేరికొఱకయిన సఖా!”
అంటూ నారాయణముని నరమునిని మందలించినట్లు దేవీభాగవతంలో కనపడుతుంది. కోపం వచ్చినప్పుడు మన మేపనిచేసినా ఆ పని అద్ధ్వాన్నంగా పరిణమిస్తుంది. అందులో విద్యావిషయకమైన వాదోపవాదాలు మొదలు పెడతామనుకోండి. యెంతచండాలంగా వుండాలో అంతచండాలంగా నున్నూ వుండవలసి వస్తుంది. వాట్ల సవరణకొఱకు మనం యెన్ని అనుచితాలకో సిద్ధపడవలసివస్తుంది. కాని ఆ అనుచితాలేవిన్నీ కార్యకారులుకావు. "భక్షితే౽పి లశునే నరోగశాంతిః" అన్నట్లు పరిణమిస్తాయి. కోపం వక్క యుద్ధరంగంలో పనికి వస్తుంది కాని యితరత్రా యుద్ధవీరునికి కూడా అది పనికిరాదు. తీరా యెదటివానితో చేయీ చేయీ కలిపిన పిమ్మట తీవ్రమైన కోపమూ దానికితగ్గ ధైర్య స్థైర్యములూ, తగినంత వుపాయమూ వుండేటట్టయితే జయాన్ని కలిగించడం తటస్థిస్తుందేమో కాని వక్కకోపం మాత్రమే అయితే అప్పడున్నూ పనిచేయదు. బాగా ఆలోచించి చూస్తే రామాదిమహావీరులు క్వాచిత్కంగా తప్ప యుద్ధరంగంలోకూడా శాంతిప్రధానంగానే వర్తించినట్లు కనపడుతుంది. యెన్నివిధాలఁ జూచినా శాంతికి మించిన ఆత్మరక్షణోపాయం కనబడదు. యిదంతా మనస్సులో పెట్టుకొనే కాఁబోలును! భర్తృహరి
శ్లో. క్షాంతిశ్చే త్కవచేన కింకిమరిభిః క్రో ధోస్తి చేద్దేహినామ్"
అన్నాఁడు. అంటే అన్నాఁడు గాక దీన్ని పాటించే వ్యక్తులుమాత్రం మిక్కిలీ తక్కువ. అట్లని కష్టసుఖాలు యెఱిఁగినవాళ్లు "ఓం శాంతి శ్శాంతిః" అంటూ చెప్పడం మానతారా? మానరు.
సర్వథా శాంతి ఆవశ్యకమనిన్నీ అది యెవరి ప్రకృతికో కాని సహజంగా అలవడదనిన్నీ దాన్ని పెద్దల సేవవల్లా వారువారు వ్రాసిన గ్రంథాల వల్లా అభ్యసించేనా సంపాదించడం అత్యావశ్యక మనిన్నీ కనపడుతుంది. సహజంగాఁగాని, ప్రయత్న పూర్వకంగాఁ గాని సంఘటించిన శాంతిని కాపాడుకోవడం మాత్రం సుఖసుఖాల జరిగేదికాదనిన్నీ భారత పద్యతాత్పర్యం. వదల వలసిన సమయాలల్లో యెంతో యిక్కట్టుగా వుండేది ప్రతిదీ తప్పచేరదు. సత్యాన్ని అతిక్రమించడాన్ని గూర్చి – “ప్రాణవిత్తమాన భంగమందు" అనే వాక్యానికి విపరీతార్థ కల్పనచేసి ప్రతీక్షణమందున్నూ అబద్ధాలాడే వాళ్లలాగ దీనిక్కూడా o విపరీతార్థం చెప్పకోవడం సహృదయ సమ్మతంకాదు. అసలు గ్రంథకర్త తాత్పర్యాన్నిబట్టి వ్యాఖ్యానం చేసుకోవాలి గాని మనకు అనుకూలించేటట్టు చేసుకొని ధర్మప్రవృత్తిని అధర్మ ప్రవృత్తిగా మార్చుకొని చెడిపోయేవాళ్లనివద్దనేవాళ్లెవరు? అట్టివిపరీత ప్రవర్తనమే కావాలనుకొనే వాళ్లకుశాస్త్రంతో అవసరమే వుండదు కదా! అబద్ధం ఆడాలనుకొనే వాళ్లు ఆడవలసిందేకాని దానికోసం "నా౽నృతంవదేత్" అనేశ్రుతికి, నా = మనుష్యుఁడు అనృతం = అసత్యాన్ని వదేత్ = చెప్పవలసింది అంటూ అపార్థకల్పనకూడా చేసి మఱింత దోషం చేయడం యెందుకు? సర్వథా సత్యంవలెనే శాంతిన్నీ కళ్యాణదాయకమైనది. దాన్ని అవలంబించడం యిహపరసాధకం అని తెలుసుకుందాం. యెప్పడూ శాంతంగానే వుందాం. యెప్పడో అత్యవసరమైన విషయం యేదేనా తారసిస్తే తప్ప అశాంతికవచ ధారణాన్ని యేమఱకుండానే కాలక్షేపం చేద్దాం. భగవంతుణ్ణి సర్వదా శాంతినే ప్రసాదించవలసిందని ప్రార్థించుకుందాం. వుభయలోక సమ్మతంగా జీవించుదాం.
క. "ఈలోకమయగుఁగొందఱ
కాలోకమకొందఱకు నిహంబునుబరమున్
మేలగుఁగొందఱ కధిపా!
యేలోకములేదుసూవె! యిలఁగొందఱకున్”
★ ★ ★