Jump to content

ఓ రఘువీరా యని నే పిలిచిన

వికీసోర్స్ నుండి


   మధ్యమావతి/దేశ్ రాగం    ఆది తాళం

ప: ఓ రఘువీరా యని నే పిలిచిన

ఓహో యనరాదా

అ ప: సారెకు మరి వేసారి యన్యము

చేరదు నామది యేరా ధీర || ఓ రఘువీరా ||


చ 1: నీటచిక్కి కరి మాటికి వేసరి

నాటక ధర నీ పాటలు బాపగ

మేటి మకరితల మీటికాచు దయ

యేటికి నాపై నేటికి రాదో || ఓ రఘువీరా ||


చ 2: మున్ను సభను నాపన్నత వేడుచు

నిన్ను కృష్ణయని ఎన్నగ ద్రౌపది

కెన్నో వలువలిడి మన్నన బ్రోచిన

వెన్నుడ నామొర వింటివొ లేదో || ఓ రఘువీరా ||


చ 3: బంటునై తినని యుంటె పరాకున

నుంటివి తెలిసి ముక్కంటి వినుత నా

జంట బాయక వెనువెంట రమ్మని వేడు

కొంటి భద్రగిరి రామదాస పోషక || ఓ రఘువీరా ||

This work was published before January 1, 1931, and is in the public domain worldwide because the author died at least 100 years ago.