Jump to content

ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 41

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 41

దక్షిణ భారత విహారయాత్ర

“ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడివి నువ్వే, డిక్. ఇదివరలో ఎంతో వుంది ప్రయత్నంచేసి విఫలులయ్యారు.”

నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తరవాత సంతోషంచాడు. అంతకు ముందే మేము, దక్షిణ భారతంలో మైసూరు నగరాన్ని పరివీక్షించే ఒక కొండమీద ఉన్న సుందరమయిన చాముండేశ్వరి ఆలయం లోంచి బయటికి వచ్చాం. అక్కడ మేము, మైసూరు రాజవంశం వారి కుల దేవత అయిన చాముండి స్వర్ణ, రజత పీఠాల ముందు మోకరిల్లాం.

శ్రీ రైట్, కొన్ని గులాబి రేకుల్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకుంటూ, “ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా, పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబిరేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను,” అన్నాడు.

నా సహచరుడూ నేనూ[1] మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబరు నెల గడుపుతున్న రోజులవి. మహారాజావారి వారసులు యువరాజ శ్రీ కంఠీరవ నరసింహరాజు ఒడయరుగారు, ఉత్తమ సంస్కారవంతమూ అభ్యుదయశీలమూ అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్నూ నా కార్యదర్శినీ కోరారు. గత పక్షంరోజుల్లో నేను, మైసూరు నగరంలోని పురమందిరంలోనూ మహారాజావారి కళాశాలలోనూ, విశ్వవిద్యాలయ వైద్యవిద్యాలయంలోనూ వేలాది పురజనుల్నీ విద్యార్థుల్ని ఉద్దేశించి ఉపన్యాసాలు చేశాను. అలాగే బెంగుళూరు నేషనల్ హైస్కూలులోనూ, ఇంటర్మీడియట్ కాలేజీలోనూ, మూడు వేల మంది సమావేశమయిన చెట్టి టౌన్ హాల్లోనూ మహాజనసభల్లో ప్రసంగించాను. అమెరికాను గురించి నేను చిత్రించిన రూపం శ్రోతల్ని ముగ్ధుల్ని చేసిందో ఏమోకానీ, ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల ఉత్తమ లక్షణాల్ని వినిమయం చేసుకోడంవల్ల కలిగే పరస్పర లాభాల్ని గురించి నేను చెప్పినప్పుడల్లా హర్షధ్వనులు మాత్రం బ్రహ్మాండంగా వినవచ్చాయి.

శ్రీ రైట్, నేనూ ఇప్పుడు ఉష్ణమండల ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటున్నాం. మైసూరుగురించి తనకు కలిగిన భావాల్ని అతను ప్రయాణం డైరీలో ఇలా రాసుకున్నాడు:

“ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ, ఆకాశంలో అడ్డంగా విస్తరించుకొని ఉండి, దేవుడి చిత్రరచనకు ఆధారమైన కేన్వాసు వేపు మైమరిచి చూస్తూ ఆనందోన్మత్తులమై అనేక క్షణాలు అలాగే ఉండిపోయాం. దానికి కారణం, ఆయన స్పర్శ ఒక్కటే జీవిత నవ్యతతో స్పందించే వన్నెల్ని సృష్టించగలగడం. మానవుడు కేవలం రంజక పదార్థాలతో ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ వన్నెల పరువం నశించిపోతుంది. ఎందుచేతంటే ఈశ్వరుడు, తైలవర్ణాల్ని కాని రంజకపదార్థాల్నికాని ఉపయోగించకుండా, వాటికన్న సులభంగానూ ప్రభావోత్పాదకంగానూ ఉండే, కేవలం కాంతికిరణాలనే సాధనాన్ని వాడడానికి పూనుకుంటాడు. ఇక్కడ ఒక్కసారి వెలుతురు చిమ్ముతాడు; అది ఎరుపును ప్రతిఫలిస్తుంది. మళ్ళీ కుంచె విదిలిస్తాడు; క్రమంగా నారింజ, బంగారువన్నెల కలగలుపులోకి దిగుతుంది. ఆ తరవాత ఆయన, నీటివంకాయవన్నె బరిసెతో మబ్బుల్ని తూట్లు పొడుస్తాడు; గాయం నుంచి ఓడే నెత్తురులా ఎర్రటి వలయం ఒకటి ఏర్పడుతుంది. ఈ విధంగా ఆయన, రాత్రి పొద్దునా ఒకే విధంగా క్రీడిస్తూ ఉంటాడు. ఎప్పటికీ మారిపోతూ ఎప్పటికీ కొత్తగా, ఎప్పటికీ తాజాగానే ఉంటాయవి; వాటికి నకళ్ళు లేవు, నమూనాలు లేవు, అచ్చంగా అవే వన్నెలు ఉండడం అంతకన్న లేదు. పగటినించి రాత్రికీ రాత్రినించి పగటికీ భారతదేశంలో జరిగే మార్పులోని అందానికి సాటి మరెక్కడా లేదు. ఒక్కొక్కప్పుడు ఆకాశంలో, భగవంతుడు తన రంగులపెట్టెలోని రంగులన్నిటినీ తీసుకొని ఆకాశంలోకి ఒక్కసారి విరజిమ్మి బ్రహ్మాండమైన బహువర్ణ దర్శినిని భాసింపజేస్తాడు.”

“ఒకనాడు మధ్యాహ్న సమయం దాటిన తరవాత యోగానందగారూ నేనూ, మైసూరు నగరానికి పన్నెండుమైళ్ళ దూరంలో ఉన్న కృష్ణరాజసాగర్ డామ్[2] చూడ్డానికి వెళ్ళాం. మేమొక చిన్న బస్సు ఎక్కాం. బ్యాటరీకి బదులుగా, క్రాంకు తిప్పడానికి ఒక చిన్న కుర్రవాడు ఉన్నాడందులో. అస్తమిస్తున్న సూర్యుడు క్షితిజంలో, నలిగి మిగలముగ్గిన టమాటా పండులా అవుపిస్తున్నాడు. నున్నటి మట్టిరోడ్డు మీద బయలు చేరింది మా బస్సు”

“పొడుగాటి కొబ్బరిచెట్ల మధ్యగా, హాయి కలిగించే మర్రితోపుల గుండా, ఎటు చూసినా ఎదురయే వరిమళ్ళను దాటిపోతూ ముందుకు సాగిపోయింది మా దారి; దాదాపు ప్రతిచోటా, అడవిలో అల్లుకుపోయినంత దట్టంగా ఉన్నాయి చెట్లూ చేమలూ. చివరికి, ఒక కొండ కొమ్ముకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును చూశాం. నక్షత్రాలూ కొబ్బరిచెట్లూ మొదలయినవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్టతోటలూ విద్యుద్దీపాల పంక్తులూ శోభాయమానంగా ఉన్నాయి.”

“ఆ ఆనకట్ట అంచుకు దిగువున, కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యం ఒకటి చూశాం: ఎగజిమ్మే నీటిబుగ్గల మీద వన్నె వన్నెల కాంతికిరణాలు ప్రసరిస్తూ ఉంటే, మిలమిలలాడే నీలివన్నె జలపాతాలు, కంటిని ఆకట్టుకునే ఎరుపు, ఆకుపచ్చ, పసుప్పచ్చ వన్నెల నీటి జల్లులూ, ముదురువన్నె సిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి; రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు, ఏకధారగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. (దీపాలు అమిర్చిన ఈ నీటి బుగ్గల్ని చూస్తున్నప్పుడు, షికాగోలో 1933 లో జరిగిన వరల్డ్ ఫెయిర్‌లో అమిర్చినవి గుర్తువచ్చాయి నాకు). వరిపొలాలతో నిండి, నిరాడంబరులయిన ప్రజలుగల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట, ఆధునికంగా విశిష్టత నందుకొన్నది. భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే, యోగానందగారిని తిరిగి అమెరికాకు తీసుకు వెళ్ళడానికి నా శక్తి చాలదేమో అన్నంత భయం వేసింది.”

“మరో అపురూపమైన సదవకాశం - నేను మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారి చేయడం. యువరాజావారు నిన్న, తమ ఏనుగుల్లో ఒకదాని మీద సవారిచేసి ఆనందించడానికి మమ్మల్ని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిమాణంగల ఏనుగుమీద పట్టుపరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమిర్చి ఉన్న హౌదా మీదికి నేను ఒక నిచ్చెన మీంచి ఎక్కాను. ఆ తరవాత ఊగులాటలూ, కుదుపులూ, నిట్టూర్పులూ, ఏదో లోయలోకి తోసేస్తున్నట్టుగా విసిరివేతలూ - గాభరా పడ్డానికి కాని సంభ్రమాశ్చర్యాలవంటివి ప్రకటించడానికి కాని అవకాశం లేనంతగా పులకించిపోయాను, అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోడానికి ఉగ్గబట్టుకొనే ఉన్నాను స్మీ!”

చారిత్రక , పురాతత్త్వ ప్రాముఖ్యమున్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం, నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన, హైదరాబాదు రాజ్యం ఉంది; బ్రహ్మాండమైన గోదావరీనది పారే అందమయిన పీఠభూమి ఇది. సువిశాలమై, సారవంతమై ఉన్న సమతల భూములూ, రమణీయమయిన నీలగిరులూ, సున్నపు రాతితోనో గ్రెనైట్ రాతిలోనో ఏర్పడ్డ నిర్జీవ పర్వతాల ఇతర ప్రదేశాలూ. హైదరాబాదు చరిత్ర సుదీర్ఘమైన ఉజ్జ్వల గాథ. అది మూడువేల ఏళ్ళ క్రిందట ఆంధ్ర రాజుల ఏలుబడితో మొదలయి, క్రీ. శ. 1294 లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయేవరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది.

భారతదేశమంతటిలోకీ అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాల్ని ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాదు రాజ్యంలో రాళ్ళను మలిచి నిర్మించిన ఎల్లోరా, అజంతాల ప్రాచీన గుహాలయాలు. ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథాలయంలో, ఏ మైఖేలేంజిలో లాంటివాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలూ, మనుషుల బొమ్మలూ జంతువుల బొమ్మలూ ఉన్నాయి. ఇరవై ఐదు సన్యాసి ముఠాలూ, ఐదు ఆలయాలూ గల ప్రదేశం అజంతా; రాతికొండను తొలిచి రూపొందించినవే ఇవన్నీ; వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు. చిత్రకారులూ శిల్పులూ వీటిమీద, తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపజేసుకున్నారు.

హైదరాబాదు నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బ్రహ్మాండ మైన మక్కామసీదు శోభ చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో తరచుగా పదేసి వేలమంది ప్రార్థనకోసం వచ్చి చేరుతూంటారు.

సముద్ర మట్టానికి మూడువేల అడుగుల ఎత్తున ఉన్న మైసూరు రాజ్యం, దట్టమైన ఉష్ణమండలారణ్యాలకూ పులులకూ పేరెన్నిక గన్నది. ఇందులో ముఖ్యనగరాలైన బెంగుళూరు మైసూరూ, ఎన్నో అందమైన పార్కులతోనూ సార్వజనిక విహార వనాలతోనూ పరిశుభ్రంగా, ఆకర్షకంగా ఉన్నాయి.

వాస్తుకళ, శిల్పకళ, మైసూరులో పదకొండో శతాబ్దినుంచి పదిహేనో శతాబ్ది వరకు పాలించిన హిందూరాజుల పోషణలో సర్వోన్నత పరిపూర్ణత సాధించాయి. విష్ణువర్ధన రాజు పాలనలో నిర్మాణం పూర్తి అయిన - పదకొండో శతాబ్ది మహోత్తమ సృష్టి- బేలూరు ఆలయాన్ని మించినది, సున్నితమైన చికిలిపనిలో సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు.

ఉత్తర మైసూరులో కనిపించే శిలాశాసనాలు క్రీ. పూ. మూడో శతాబ్దినాటివి. అవి, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్‌లతో సహా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి[3] సంస్కృతిని దీప్తి మంతం చేసే దీపకళికలు. వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి “ధర్మ లిపులు,” ఆయన కాలంలో సువ్యాప్తమై ఉన్న అక్షరాస్యతకు సాక్షి భూతాలుగా నిలుస్తాయి. 13 వ శిలాశాసనం యుద్ధాల్ని ఇలా నిరసిస్తుంది. “ధర్మవిజయాన్ని తప్ప మరిదేన్నీ నిజమైన విజయంగా పరిగణించకండి.” రాజు నిజమైన ఘనత, తన ప్రజలు నైతికమైన విలువ సంపాదించడానికి అతను చేసే సహాయం మీదే ఆధారపడి ఉంటుందని 10 శిలాశాసనం ఘోషిస్తుంది. 11 శిలాశాసనం “నిజమైన కానుక”ను నిర్వచిస్తూ, అది వస్తురూపమైనది కాక, సత్యవ్యాపన రూపమైన ‘సత్తు’ అని తెలియజేస్తుంది. ‘దేవానాం ప్రియు’డైన ఆ చక్రవర్తి, 6 శిలాశాసనంలో, ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించడానికి, “పగలుకాని, రాత్రికాని, ఏ సమయంలోనైనా సరే” తన దగ్గరికి రావచ్చునని ప్రజల్ని ఆహ్వానిస్తాడు. అంతే కాకుండా, తన రాజోచిత కర్తవ్యాల్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం వల్ల , “తోటి ప్రజలకు తాను తీర్చుకోవలసిన ఋణం నుంచి విముక్తి పొందుతున్నా” నని కూడా అంటాడు, అందులో.

అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనమడు. ఈ చంద్రగుప్తుడు, అలెగ్జాండరు భారతదేశంలో నిలిపిన సైనిక పటాలాన్ని సర్వనాశనం చేసి, క్రీ. పూ. 305 లో సెల్యుకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రం[4]లో మెగస్తనీస్, అనే గ్రీకు రాయబారిని తన ఆస్థానంలో ఆదరిం చాడు. మెగస్తనీస్, సుఖవంతమూ కార్యోత్సాహవంతమూ అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకు వివరాలు రాసి పెట్టాడు.

విజయధ్వజుడయిన చంద్రగుప్తమౌర్యుడు క్రీ. పూ. 298 లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి, తన జీవితంలో చివరి పన్నెండేళ్ళూ చేత కాసులేని సన్యాసిగా గడిపాడు; ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న, శ్రవణబెళగోళ కొండ గుహలో ఆత్మసాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకీ అత్యున్నత శిలావిగ్రహమున్నది ఆ ప్రదేశంలోనే. భారీ పరిమాణంగల గట్టి రాతితో చెక్కన ఈ విగ్రహం, గోమఠేశ్వరమునిపేర క్రీ.శ. 983లో జైనులు ప్రతిష్ఠించినది.

అలెగ్జాండరు భారతదేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు అతని వెంబడి వచ్చినవాళ్ళూ లేదా ఆ తరవాత వచ్చినవాళ్ళూ - గ్రీకు చారిత్రకులూ తదితరులూ- చిన్న చిన్న వివరాలతో సహా రాసి పెట్టిన వాటిలో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఏరియన్, డియోడరస్, ఫ్లూటార్క్, భూగోళశాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని, డా॥ జె. డబ్ల్యు. మెక్ క్రిండిల్,[5] ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి అనువాదం చేశాడు. అలెగ్జాండరు భారతదేశం మీద దాడిచేసి విఫలుడు కావడంలో అత్యంత శ్లాఘనీయమైన విషయం ఏమిటంటే, హిందూ దర్శన శాస్త్రంలోనూ యోగుల విషయంలోనూ పుణ్యపురుషుల విషయంలోనూ అతడు చూపిన గాఢమైన ఆసక్తి; అటువంటివాళ్ళు అప్పుడప్పుడు అతనికి తారసపడుతూ ఉండేవారు, లేదా అతడే గాఢమైన ఉత్సుకతతో వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ మాసిడోనియా యోధుడు ఉత్తర భారతంలోని తక్షశిలకు చేరిన కొత్తలో, తక్షశిలలో గొప్ప సన్యాసిగా పేరుపొందిన దండామిస్‌ను తీసుకురమ్మని ఓనెసికృతోస్ (డయోజినస్ స్థాపించిన హెలినిక్ మాతానుయాయి) ను పంపించాడు.

“విజయీభవ, బ్రాహ్మణ్యగురూత్తమా!” అన్నాడు ఓనెసికృతోస్, దండామిస్‌ను ఆయన అరణ్యవాస ప్రదేశంలో దర్శించుకొని, “మహాబల సంపన్నుడైన జియిస్ దేవుడి కుమారుడూ మానవమాత్రులందరికీ సర్వేశ్వరుడూ అయిన అలెగ్జాండరు మిమ్మల్ని తన సన్నిధికి రమ్మంటున్నాడు. మీరుకనక మన్నిస్తే మీకు గొప్ప కానుకలిచ్చి సత్కరిస్తాడు; కాదంటే మీకు శిరశ్ఛేదన విధిస్తాడు!” అన్నాడు.

నిర్బంధ ధోరణిలో ఉన్న ఈ ఆహ్వానాన్ని, ప్రశాంతంగా అందుకొన్నాడు ఆ యోగి; అందుకొని, “తన పత్రశయ్యమీదినుంచి తల ఎత్తేపాటి ప్రయత్నం కూడా చెయ్యలేదు.”

“అలెగ్జాండరు జియిస్ కుమారుడయితే, నేనూ ఆయన కుమారుణ్ణే” అన్నాడాయన. “నాకున్నదాంతో నేను తృప్తిగానే ఉన్నాను కనక, అలెగ్జాండరు దేదీ నాకు అక్కర్లేదు. అతను మనుషుల్ని వెంట వేసుకుని భూమిమీదా సముద్రంమీదా వృథాగా తిరగటమేగాక, ఆ తిరుగుళ్ళకు అంతు తెలియకుండా ఉన్నట్టు కనిపిస్తోంది.”

“వెళ్ళి అలెగ్జాండరుకు చెప్పు - సర్వేశ్వరుడైన భగవంతుడెప్పుడూ అవమాన దోషానికి కర్త కాడనీ కాంతికి, శాంతికి, జీవానికి, జలానికి, మానవ దేహానికి, ఆత్మకు కర్త అనీ చెప్పు; మరణం మానవులందరికీ విముక్తి కలిగించినప్పుడు - వాళ్ళిక ఏ విధంగానూ దుష్టవ్యాధికి లోను కానక్కరలేని స్థితిలో - ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహ్యించుకునేవాడూ యుద్ధాలు రగిలించనివాడూ- ఆయనే నా ప్రణామాలందుకునే దేవుడు.”

“అలెగ్జాండరు దేవుడేమీ కాడు, అతను కూడా చావుకు లోబడి తీరవలసినవాడే కనక,” అంటూ ఆ తపస్వి, తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా అన్నాడు: “ఇంతదాకా ఆంతరిక విశ్వసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటివాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతనింత వరకూ నరకంలోకి కూడా ప్రవేశించలేదు. ఈ భూమిమీద, సువిశాల ప్రాంతాలమీద సంచరించే సూర్యుడి గమనరీతిని ఎన్నడూ ఎరగనైనా ఎరగడు. అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే!”

ఈ విధంగా ఆ తపస్వి, “ప్రపంచానికి అధినాథుడు” అనిపించుకొన్నవాడి చెవులు గింగురులెత్తి పోయే విధంగా, ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్కచివాట్లు పెట్టి, వ్యంగంగా ఇంకా ఇలా అన్నాడు, “అలెగ్జాండరుకు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే, అతన్ని గంగానది దాటమను; అతని మనుషులందరినీ నిలవరించగల దేశాన్ని చూస్తాడు.[6]

“ఇదుగో, ఇది తెలుసుకో; అలెగ్జాండరు ఇస్తాననే కానుకలు నాకు ఎంతమాత్రం పనికిరానివి; నేను కానుకగా తలిచేవీ నిజమైన విలువ ఉన్నవని గ్రహించేవీ, నాకు రోజూ తిండిపెట్టే మొక్కలు నా దప్పిక తీర్చే నీళ్ళూను. ఆబగా కూడబెట్టుకున్న వస్తుసంపదలు, అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశకరమైనవని రుజువవుతాయి; అజ్ఞానుల్ని పీడించే దుఃఖాన్నీ విసుగుదలనూ మాత్రమే కలిగిస్తాయవి.

“నే నయితే, అడవిలో ఉండే చెట్ల ఆకులమీద పడుకుంటాను. కాపలా కాసుకోడానికి నాకు ఏమీ లేదు; ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాను, అలా కాకుండా, ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా కనక నాకు ఉండి ఉంటే, దాని భారం నా నిద్రను తరిమేసేది. ఈ భూమి నాకు ప్రతిదీ ఇస్తుంది, తల్లి తన పిల్లకు పాలు ఇచ్చినట్టే. నా ఇష్టంవచ్చిన చోటికి నేను పోతాను, భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా.”

“అలెగ్జాండరు నా తల నరికేసినా కూడా, నా ఆత్మను నాశనం చెయ్యలేడు. అప్పుడు, మౌనం దాల్చిన నా తలా చిరిగిన బట్టలాంటి నా దేహమూ భూమిమీద ఉండిపోతాయి; వాటిని తీసుకున్నదే అక్కణ్ణించి. నే నప్పుడు ఆత్మరూపుణ్ణి అయి, నా దేవుడి దగ్గరికి పైకి పోతాను; మనల్ని అందరినీ మాంసకోశంలో ఉంచి కింద ఇక్కడున్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించడానికి మనని ఈ భూమిమీద వేసినవాడూ మనం ఇక్కణ్ణించి వెళ్ళిన తరవాత తన సన్నిధికి చేరినప్పుడు మన జీవితాల మంచిచెడ్డలకు మనదగ్గర సంజాయిషీ తీసుకునే వాడూ ఆయన. పొగరుబోతు పాడుపనులన్నిటికీ న్యాయనిర్ణేత ఆయనే; అణిచివేతకు గురిఅయినవాళ్ళ మూలుగులు ఆ ఆణిచివేతదారుకు శిక్ష విధిస్తాయి.”

“అంచేత అలెగ్జాండర్ని, సంపద కోరేవాళ్ళనీ, చావుకు భయపడే వాళ్ళనీ బెదిరింపులతో భయపెట్టనియ్యి. బ్రాహ్మణుల ముందు అతని ఆయుధాలు శక్తి హీనమైనవి; మేము బంగారానికి మనసుపడం, చావుకూ భయపడం. కనక నువ్వెళ్ళి, అలెగ్జాండరుకు చెప్పు; నీదైన దేదీ దండామిస్‌కి అక్కర్లేదు. కనక, నీ దగ్గరికి రాడు. నీకు దండామిస్ దగ్గర్నించి ఏమైనా కావలిస్తే, నువ్వే రా అతని దగ్గరికి.”

ఓనెసికృతోస్ సముచితంగా సందేశం అందించాడు; అలెగ్జాండరు చాలా శ్రద్ధగా విన్నాడు; “దండామిస్ ముసలివాడూ, దిగంబరుడూ అయినప్పటికీ కూడా, అనేక రాజ్యాల్ని జయించిన తనకు ఏకైక విరోధిగా, తనను మించినవాడిగా తారసపడ్డందుకు, ఆయన్ని చూడాలన్న కోరిక, అంతకు ముందెన్నడూ కలగనంత ప్రబలంగా కలిగింది.”

దార్శనిక ప్రశ్నలకు క్లిష్టమైన సమాధానాలు చెప్పడంలో పేరుగన్న బ్రాహ్మణ తపస్వుల్ని కొందరిని అలెగ్జాండరు తక్షశిలకు ఆహ్వానించాడు. అప్పటి వాగ్వివాదం వివరాలు ప్లుటార్క్ పొందుపరిచాడు; ప్రశ్నలన్నీ అలెగ్జాండరే తయారుచేశాడు.

“అసంఖ్యాకంగా ఉన్నవి ఏమిటి? బతికున్నవా, చచ్చిపోయినవా?”

“బతికున్నవి; చచ్చిపోయినవి లేనివే కనక.”

“పెద్దపెద్ద జంతువుల్ని పుట్టించేది ఏమిటి, సముద్రమా భూమా!”

“భూమి; సముద్రం కేవలం భూమిలో భాగమే కనక.”

“జంతువుల్లో అన్నిటికన్న తెలివయింది ఏమిటి?”

“మనిషికి ఇంతవరకు పరిచయం కానిది.” (అజ్ఞాత మయిన దానికి మనిషి భయపడతాడు).

“మొదట ఉన్నది ఏది, దినమా రాత్రా?” “దినం ఒక దినం ముందునుంచి ఉంది.” ఈ జవాబుకు అలెగ్జాండరు ఆశ్చర్యం ప్రకటించాడు; బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు: “అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం.”

“మనిషి తనను ప్రేమపాత్రుడిగా చేసుకోడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి?”

“తనకు గొప్పశక్తి ఉండి కూడా, తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమపాత్రు డవుతాడు.”

“మనిషి దేవుడు ఎలా కావచ్చు?”[7]

“మనిషికి అసాధ్యమయింది చెయ్యడంవల్ల.”

“బలవత్తరమయింది ఏది? బతుకా, చావా?”

“బతుకు; అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనక.”

అలెగ్జాండరు తనకు గురువుగా, ఒక నిజమైన యోగిని భారత దేశం నుంచి తీసుకువెళ్ళడంలో కృతకృత్యుడయాడు. ఈయన పేరు కల్యాణ స్వామి (స్వామి స్ఫైన్స్); గ్రీకులు ఈయన్ని ‘కలనోస్’ అనేవారు. ఈ యోగి, అలెగ్జాండరు వెంబడి పెర్షియా వెళ్ళాడు. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనేచోట కలనోస్, మాసిడోనియా సైన్యం యావత్తు చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యోగి, బాధకుగాని చావుకుగాని భయపడకపోవడం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూచున్న చోటినించి ఒక్కసారి కూడా కదలకపోవడం చూసి సైనికులు ఆశ్చర్యపోయిన సంగతి చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్ళే ముందు కలనోస్, తన సన్నిహిత సహచరుల్ని చాలామందిని ఆలింగనం చేసుకున్నాడు కాని అలెగ్జాండరుకు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని, టూకీగా ఇలా చెప్పాడు:

“నిన్ను తరవాత బాబిలాన్‌లో చూస్తాను.”

అలెగ్జాండరు పెర్షియా విడిచి వెళ్ళాడు; ఒక ఏడాది తరవాత బాబిలాన్‌లో చనిపోయాడు. అలెగ్జాండరు బతికున్నప్పుడూ చనిపోయేటప్పుడూ కూడా తాను హాజరుగా ఉంటానని చెప్పడానికి భారతీయ గురువు అనుసరించిన తీరే ఆ జోస్యం.

గ్రీకు చారిత్రకులు మనకోసం, భారతీయ సమాజాన్ని గురించి వివరణాత్మకంగానూ స్ఫూర్తిమంతంగానూ రాసిపెట్టారు. హిందూ ధర్మశాస్త్రం ప్రజల్ని కాపాడుతుందని చెబుతూ ఏరియన్, “వాళ్ళలో ఎవ్వడూ ఏ పరిస్థితిలోనూ బానిస కాగూడదు; అలా కాకుండా వాళ్ళు తమ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ, మనుషులందరికీ ఉండే సమాన హక్కును గౌరవిందాలి,”[8] అని అది నిర్దేశిస్తుందని అన్నాడు. మరో గ్రంథంలో ఇలా ఉంది: “భారతీయులు అన్యాయపు వడ్డీ వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టనూ పెట్టరు, అప్పు తీసుకునేటప్పుడు లాంఛనరూపమైన ఏర్పాట్లు చేసుకోనూ చేసుకోరు. తప్పు చెయ్యడం కాని, దాన్ని సహించడం కాని భారతీయుల వ్యవహార రూఢికి విరుద్ధం. అంచేత వాళ్ళు కాంట్రాక్టులూ (ఒడంబడికలు) చేసుకోరు, జామీన్లూ అడగరు.” జబ్బులు నయంచెయ్యడమన్నది సాదాగా, సహజమైన రీతుల్లో జరిగేదని చెబుతారు. “మందుల వాడకం కన్న పథ్యం చెయ్యడం వల్ల జబ్బులు నయమవుతున్నాయి. మలాములు, పాలాస్త్రి పట్టీలు ఎక్కువగా వాడే నివారణోపాయాలు. తక్కిన వాటినన్నిటినీ హానికరంగా భావిస్తారు.” యుద్ధంలో పాల్గోడం, యోద్ధకులజులైన క్షత్రియులకే పరిమితమయింది. “పొలంలో పనిచేసే రైతుకు శత్రువు హానిచెయ్యడు; ఆ వర్గంవాళ్ళను ప్రజాహితకారులుగా పరిగణించి వాళ్ళకు ఏ హానీ కలక్కుండా కాపాడ్డమే దానికి కారణం. ఆ విధంగా భూమి, ఎలాటి విధ్వంస చర్యకూ గురికాకుండా ఉండి, భారీ ఎత్తున పంటలు పండిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి కావలసిన అవసర వస్తువుల్ని ప్రజలకు అందిస్తుంది.”

మైసూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గుళ్ళు, దక్షిణ భారతదేశంలోని అనేక మంది సాధువుల్ని అనుక్షణం గుర్తుకు తెస్తాయి. వారిలో ఒకరు, తాయు మణవార్, మన కొక సవాలుగా ఈ కింది పద్యం

రాశాడు:

“పిచ్చెత్తిన ఏనుగును అదుపు చెయ్యవచ్చు నువ్వు;
 ఎలుగుబంటి, పులి నోళ్ళు ముయ్యవచ్చు;
 సవారి చెయ్యవచ్చు సింహంమీద, ఆడించవచ్చు తాచుపామును;
 బతుకు తెరువు, చూసుకోవచ్చు రసవిద్యవల్ల;
 ప్రపంచమంతా తిరగవచ్చు నువ్వు, ఒకరి కంట బడకుండా,
 దేవుళ్ళని బానిసల్ని చేసుకోవచ్చు; నిత్యయవనుడివై ఉండిపోవచ్చు;
 నీటిమీద నడవవచ్చు; నిప్పులో బతకవచ్చు నువ్వు;
 కాని మనస్సును అదుపుచేసుకోడ మన్నదే అన్నిటికన్నా
                మంచిదీ, వాటికన్న మహాకష్టమయిందీను.”

భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమయిన, సారవంతమయన తిరువాన్కూరు రాజ్యం ఉంది. అక్కడ రాకపోకలు నదులమీదా కాలవలమీదా సాగుతుంటాయి. వెనక ఎప్పుడో జరిగిన యుద్ధాలవల్లా చిన్నచిన్న జమీల్ని తిరువాన్కూరు రాజ్యంలో కలుపుకోడంవల్లా అంటిన పాపాల పరిహారంకోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించటం పరిపాటి. సంవత్సరానికి ఏభై రోజులపాటు మహారాజు, వేదపఠనం వినడానికి ప్రతిరోజూ మూడేసి సార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాడు; లక్ష దీప హారతితో పాపపరిహార తతంగం ముగుస్తుంది.

భారతదేశానికి ఆగ్నేయతీరంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో సమతల ప్రదేశంతో, విశాలంగా, సముద్రాన్ని ఆనుకొని మద్రాసు నగరమూ బంగారు నగరమనే కాంచీపురమూ ఉన్నాయి. ఈ కాంచీపురం క్రీస్తుశకం తొలి శతాబ్దాల్లో పాలించిన పల్లవ వంశరాజులకు రాజధాని. ఆధునిక మద్రాసు ప్రెసిడెన్సీలో మహాత్మాగాంధీ అహింసా ధర్మాలు మంచి ప్రగతి సాధించాయి. తెల్లటి “గాంధీ టోపీలు” ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దక్షిణ ప్రాంతం మొత్తంమీద మహాత్ముడు, “అంటరానివాళ్ళ” కోసం అనేక దేవాలయ సంస్కరణలూ కులవ్యవస్థా సంస్కరణలు తీసుకువచ్చాడు.

గొప్ప ధర్మశాస్త్రవేత్త అయిన మనువు ఏర్పరిచిన కులవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు మెచ్చుకోదగ్గవి. సహజ పరిణామరీత్యా మానవుల్ని నాలుగు గొప్ప వర్గాలుగా వింగడించవచ్చునని ఆయన స్పష్టంగా గమనించాడు: కాయకష్టం చేసి సమాజానికి సేవ చేసేవాళ్ళు (శూద్రులు); ప్రజ్ఞతో, నేర్పుతో వ్యవసాయం, వర్తకం, వాణిజ్యం, ఉద్యోగంవంటి వాటిద్వారా సేవ చేసేవాళ్ళు (వైశ్యులు); పరిపాలన, కార్యనిర్వహణ, రక్షణ దక్షత వంటివిగల పాలకులూ యోధులూ (క్షత్రియులు); చింతనా పరులూ ఆధ్యాత్మికోత్తేజం పొందినవాళ్ళూ దాన్ని అందించేవాళ్ళూ (బ్రాహ్మణులు). “ఎవరయినా ద్విజుడయినదీ కానిదీ నిర్ణయించేది పుట్టుకా కాదు, సంస్కారాలూ కావు, చదువూ కాదు, ఆభిజాత్యమూ కాదు; శీలం, నడవడికా మాత్రమే దాన్ని నిర్ణయించగలవు,” [9]అని చెప్పింది మహాభారతం. జ్ఞానం, సుగుణం, వయస్సు, బంధుత్వం లేదా, చివరికి సంపదను బట్టి సభ్యులమీద గౌరవం చూపించమని మనువు సమాజాన్ని శాసించాడు. ధర్మకార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉంచే సంపదల్ని వేదకాలపు భారతదేశం ఎప్పుడూ ఏవగించుకొంటూ ఉండేది. ఔదార్యంలేని ధనసంపన్నులకు సమాజంలో అధమ శ్రేణే ఇవ్వడం జరిగింది.

అనేక శతాబ్దుల కాలగతిలో కులవ్యవస్థ గిడసబారి వంశానుగతమైన నిర్బంధంగా పరిణమించినప్పుడు, తీవ్రమైన దుష్ఫలితాలు ఉత్పన్నమయాయి. 1947 నుంచి స్వయంపాలన కావించుకొంటున్న భారతదేశం పుట్టుకనుబట్టి కాక, కేవలం సహజమైన అర్హతమీదే ఆధారపడ్డ సనాతన కులమూల్యాల్ని తిరిగి నెలకొల్పడానికి, నెమ్మదిగా నయినా కచ్చితంగా ప్రగతి సాధిస్తోంది. భూమి మీద ప్రతిదేశానికి విలక్షణమైన దుఃఖకారక కర్మ అన్నది ఒకటి ఉంటుంది; జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని గౌరవప్రదంగా తొలగించవలసి ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాన్వితమై, సుదృఢమైన ఉత్సాహంగల భారతదేశం, కుల సంస్కరణ భారాన్ని వహించడానికి సమర్థమైనదేనని నిరూపించుకోగలదు.

శ్రీ రైట్, నేనూ ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలని ఉవ్విళ్ళూరే టంతగా ఆకట్టుకుంది మమ్మల్ని, దక్షిణ భారతదేశం. కాని కాలం, ఎంతో కాలం నుంచి మొరటుతనం అలవాటు కావడంవల్ల మాకు మర్యాదగా గడువులు పొడిగించడం మానేసింది. త్వరలోనే నేను, కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న, భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి వచ్చింది. మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరగా, ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు అధ్యక్షులైన సర్ సి. వి. రామన్‌తో జరిగిన సంభాషణకు ఆనందించాను. మహా ప్రతిభాశాలి అయిన ఈ హిందూ భౌతికశాస్త్రవేత్త, కాంతి విస్తరణలో ముఖ్యమైన “రామన్ ఎఫెక్ట్” కనిపెట్టినందుకు 1930 లో నోబెల్ బహుమతి అందుకున్నారు.

ఒక పక్క మనస్సు వెనక్కు లాగుతూనే ఉన్నా, అసంఖ్యాకులైన మద్రాసు విద్యార్థులకూ మిత్రులకూ వీడుకోలు చెప్పి శ్రీ రైటూ నేనూ ప్రయాణం సాగించడానికి పూనుకున్నాం. దారిలో మేము కొద్ది సేపు, సదాశివబ్రహ్మం[10] గారి స్మారకార్థం నెలకొన్న పవిత్రమైన చిన్న ఆలయాన్ని దర్శించడానికి ఆగాం. పద్దెనిమిదో శతాబ్దిలో జీవించిన ఈ మహాయోగి జీవితగాథ, అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉన్నది. సదాశివబ్రహ్మంగారి స్మారకార్థం నేరూరులో అంతకన్న పెద్ద గుడి ఉంది; దీన్ని పుదుక్కోట రాజుగారు కట్టించారు. అనేక దైవీచికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రాస్థల మిది. అప్పట్లో పరిపాలన చేసే యువరాజుకు మార్గదర్శకంగా ఉండడంకోసం 1750 లో సదాశివ బ్రహ్మంగారు రాసిన ధర్మోపదేశాల్ని, పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరవాతి పాలకులు పవిత్రంగా భద్రపరిచారు.

ప్రేమాస్పదులూ పరిపూర్ణ జ్ఞానసంపన్నులూ అయిన సదాశివ బ్రహ్మంగారిని గురించిన అద్భుత కథలు అనేకం, ఈనాటికి దక్షిణభారత గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు కావేరీనది ఒడ్డున సమాధిలో ఉన్న సదాశివబ్రహ్మంగారు హఠాత్తుగా ముంచుకు వచ్చిన వరదలో కొట్టుకు పోవడం కనిపించింది. ఆ తరవాత కొన్ని వారాలకు, కోయంబత్తూరు జిల్లాలో కోడుమూడి దగ్గిర ఒక మట్టిదిబ్బకు అడుగున లోతుగా కూరుకుపోయి కనిపించారు. ఊరివాళ్ళు పారలతో మట్టి తవ్వుతూ ఉండగా, ఆ పారలు ఒంటికి తగిలి, ఆ సాధువు లేచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

సదాశివబ్రహ్మంగారు ఒకసారి, ఒక వృద్ధ వేదాంత పండితుడితో జరిగిన శాస్త్రచర్చలో వ్యర్థాలాపం చేసినందుకు గురువుగారిచేత చీవాట్లు తిన్నారు; ఆ తరవాత ముని (మాట్లాడని సాధువు) అయారు. “అబ్బాయ్, నువ్వు నోటిని అదుపులో పెట్టుకోడం ఎప్పుడు నేర్చుకుంటావ్ ?” అన్నారు గురువుగారు.

“మీ దీవెనలుంటే, ఇప్పుడు ఈ క్షణంలోనే నండి.”

సదాశివుల గురువులు స్వామి శ్రీ పరమ శివేంద్ర సరస్వతి. ఈయన ‘దహరవిద్యాప్రకాశిక’ అన్న గ్రంథానికి కర్తలు. ఉత్తర గీతమీద ఉత్కృష్టమైన వ్యాఖ్యానం కూడా రాశారు. ప్రాపంచిక మానవులు కొందరు, సదాశివబ్రహ్మంగారు దైవోన్మత్తత చెంది తరచుగా “సభ్యత విడిచి” రోడ్లమీద ఆడిపోతూండడం అవమానంగా భావించి గురువుగారికి ఫిర్యాదు చేశారు. “స్వామీ, సదాశివుడు పిచ్చివాటికంటె మెరుగేమీ కాడండి,” అన్నారు వాళ్ళు.

కాని పరమ శివేంద్రులు ఆనందభరితులై చిరునవ్వు చిందించారు. “అయ్యో, తక్కినవాళ్ళకి కూడా ఈ పిచ్చి ఉంటే ఎంత బాగుండేది!” అన్నారు.

సదాశివుల జీవితం, భగవంతుడి అదృశ్య హస్తంతో జరిగిన అనేక అద్భుత, సుందరలీలలతో విలక్షణత నందుకొన్నది. ఈ లోకంలో అన్యాయంగా కనిపించేది చాలా ఉంది; కాని దైవభక్తులు, ఆయన చేసే తక్షణ న్యాయానికి అసంఖ్యాకమైన సందర్భాల్ని ధ్రువపరచగలరు. ఒకనాడు రాత్రి సదాశివులు ఎక్కడికో వెళ్తూ సమాధి స్థితిలో ఉండగా, ఒక సంపన్న గృహస్థు వడ్ల గాదె దగ్గర ఆగారు. అక్కడ కాపలాకాస్తున్న ముగ్గురు నౌకర్లు ఆ సాధువును చూసి దొంగ అనుకొని కొడదామని కర్రలు ఎత్తారు. అంతే! వాళ్ళ చేతులు అలాగే కదలకుండా ఉండిపోయాయి. పైకెత్తి ఉన్న చేతులతో, చిత్రమైన విగ్రహాల్లా నిలబడిఉన్న ఆ ముగ్గురూ, వేకువ వేళ సదాశివబ్రహ్మంగారు అక్కణ్ణించి వెళ్ళిపోయేవరకు అలాగే ఉండిపోయారు.

మరో సందర్భంలో, కూలీలచేత మట్టి మోయిస్తున్న ఒక మేస్త్రి, దారినిపోయే ఈ మహాయోగిని బలవంతంచేసి పని చేయించుకున్నాడు; ఆ మేస్త్రి తాలూకు కూలీలు వంటచెరుకు మోసుకువెళ్తున్నారు. ఆ మౌన సాధువు సవినయంగా ఆ బరువు మోసుకువెళ్ళి అడంగుకు చేర్చి, ఒక పెద్ద కట్టెల పేర్పుమీద పెట్టారు. వెంటనే ఆ గుట్ట అంతా భగభగా మండిపోయింది.

సదాశివబ్రహ్మేంద్రులు కూడా త్రైలింగస్వామివారిలాగే, బట్టకట్టుకునేవారు కారు. ఒకనాడు పొద్దున ఈ దిగంబరయోగి, పరాకుగా ఒక ముస్లిం సర్దారు గుడారంలోకి ప్రవేశించారు. ఇద్దరు ఆడవాళ్ళు బెంబేలుపడి కెవ్వున అరిచారు; సర్దారు కత్తి దూసి క్రూరంగా సదాశివుల చెయ్యి నరికేశాడు; చెయ్యి తెగిపడిపోయింది. సదాశివులు అదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యమూ పరితాపమూ పెనవేసుకుపోగా ఆ ముస్లిం, నేలమీద పడిఉన్న చేతిని తీసుకుని సదాశివుల వెనకాలే వెళ్ళాడు. ప్రశాంతంగా ఆ యోగి, నెత్తురు ఓడుతున్న మొండి భుజంలోకి ఈ చేతిని జోడించారు. అప్పుడు ఆ సర్దారు, తనకు ఆధ్యాత్మిక ఉపదేశం ఏమైనా చెయ్యమని సదాశివబ్రహేంద్రుల్నీ కోరగా, వేలితో ఇసకలో ఇలా రాసి చూపించారు:

“నువ్వు కోరేది చెయ్యకు; అప్పుడు నీకు నచ్చేది చెయ్యవచ్చు.”

పరిశుద్ధ మనఃస్థితిని అందుకున్న వాడై ఆ ముస్లిం, పరస్పర విరుద్ధమైన ఈ సలహా, అహంకారాన్ని జయించడం ద్వారా ఆత్మవిముక్తి పొందడానికి దారి చూపిస్తుందన్న సంగతి అర్థం చేసుకున్నాడు. ఈ కొద్ది మాటల ఆధ్యాత్మిక ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే, ఆ తరవాత ఆ యోధుడు యోగ్యుడైన శిష్యుడనిపించుకొన్నాడు; అతని పాత అలవాట్లన్నీ పటాపంచలయి పోయాయి.

ఒకసారి ఊళ్ళో పిల్లలు, అక్కడికి 150 మైళ్ళ దూరంలో మధురలో జరిగే ఉత్సవం ఒకటి చూడాలని ముచ్చటగా ఉందని సదాశివుల దగ్గర ఆన్నారు. అప్పుడా యోగి, తమ ఒంటిని ముట్టుకోమని ఆ పిల్లలతో అన్నారు. అంతే! మొత్తం వాళ్ళందరూ కట్టకట్టుకుని ఒక్క క్షణంలో మధురకు రవాణా అయిపోయారు. ఆ ఉత్సవానికి వచ్చిన వేలాది యాత్రికుల మధ్య హాయిగా తిరిగారు వాళ్ళు. కొద్ది గంటల్లో ఆ యోగి, తన వర్దీలో ఉన్న ఆ పిల్లల్ని మళ్ళీ, తమ సులభ ప్రయాణపద్ధతిలో ఇళ్ళకి చేర్చారు. మధురలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు గురించి పిల్లలు స్పష్టంగా చెప్పడం విని, చాలామంది పిల్లల చేతుల్లో మధుర మిఠాయి పొట్లాలు ఉండడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

నమ్మకంలేని ఒక యువకుడు, ఆ సాధువునూ ఆయన కథనూ గేలిచేశాడు. తరవాత ఒక సందర్భంలో శ్రీరంగంలో ఉత్సవం జరుగుతుందని తెలిసి, సదాశివబ్రహ్మేంద్రుల్ని కలుసుకున్నాడతను. “స్వామీ, మీరు పిల్లల్ని మధుర తీసుకువెళ్ళినట్టుగా నన్ను శ్రీరంగం ఉత్సవానికి తీసుకు వెళ్ళగూడదా?” అంటూ అవినయంగా అడిగాడు.

సదాశివులు అతని కోరిక మన్నించారు; మరుక్షణంలో ఆ యువకుడు, ఎంతో దూరాన ఉన్న శ్రీరంగనగర జనసమ్మర్దంలో ఉన్నానని గమనించాడు. కాని పాపం! అతను తిరిగి వెళ్ళిపోవాలనుకున్న సమయానికి ఆ సాధువు ఎక్కడున్నాడు? చివరికి, ఈదురో గోడామని కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడతను.

దక్షిణ భారతంనుంచి వచ్చేముందు శ్రీ రైటూ నేను శ్రీ రమణమహర్షి దర్శనానికి తిరువణ్ణామలై దగ్గరున్న అరుణాచలమనే పుణ్యగిరికి యాత్ర చేశాం. ఆ మహర్షి మమ్మల్ని తమ ఆశ్రమంలో ఆప్యాయంగా ఆదరించారు. పక్కనే బొత్తిపెట్టి ఉన్న ‘ఈస్ట్-వెస్ట్’ పత్రిక సంచికల వేపు చూపించారు. వారితోనూ శిష్యులతోనూ మేము గడిపిన కొద్దిగంటల కాలంలో వారు, చాలావరకు మౌనంగానే ఉన్నారు; వారి సౌమ్య ముఖం దివ్యప్రేమనూ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తోంది.

బాధలు అనుభవిస్తున్న మానవులు, తాము మరిచిపోయిన పరిపూర్ణతాసిద్ధిని తిరిగి పొందడానికి – “నేను ఎవర్ని?” అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే ఉండాలని ఉద్బోధిస్తారు శ్రీ రమణులు; ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడు; పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరడం మానేస్తాయి. ఈ దక్షిణ భారత మహర్షి ఇలా రాశారు:

“ద్వంద్వాలూ త్రితయాలూ దేన్నో ఒకదాన్ని పట్టుకు వేలాడతాయి
 ఆధారం లేకుండా అవుపించవు అవెన్నడూ;
 ఆ ఆధారంకోసం వెతికితే, సడలిపోతాయవి
 అక్కడే ఉంది సత్యం, అది చూసినవాడిక ఊగిసలాడడు.”

  1. శ్రీ రైట్, నేనూ సాగినంత చురుకుగా మాతో సంచారం చేయలేక, మిస్ బ్లిట్ష్, హాయిగా కలకత్తాలో మా బంధువుల దగ్గర ఉండిపోయింది.
  2. ఈ ఆనకట్ట ఒక పెద్ద జలవిద్యుదుత్పాదన కేంద్రం. ఇది మైసూరు నగరానికి వెలుతురు ప్రసాదిస్తుంది; పట్టుబట్టలూ సబ్బులూ చందనం చమురూ ఉత్పత్తిచేసే కర్మాగారాలకు విద్యుత్తును ఇస్తుంది.
  3. అశోక చక్రవర్తి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మత ధార్మిక స్తూపాలు (గుళ్ళు) 84,000 నిర్మించాడు. పద్నాలుగు శిలాశాసనాలూ, పది శిలా స్తంభాలూ ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ప్రతి స్తంభమూ, ఇంజినియరింగ్, వాస్తు, శిల్ప కళలకు విజయ స్తంభం. ఈయన ఎన్నో జలాశయాలూ ఆనకట్టలూ పారుదల నీటి తూములూ కట్టించాడు; పెద్ద పెద్ద రహదారులూ చెట్ల నీడపడే రోడ్లూ వేయించి ప్రయాణికుల కోసం అక్కడక్కడ సత్రాలు కట్టించాడు; వృక్షశాస్త్రాధ్యయనానికి మందులకూ ఉపయోగపడే తోటలు వేయించాడు; మనుషులకోసం, జంతువులకోసం వైద్యశాలలు కట్టించాడు.
  4. పాటలీపుత్ర (ఇప్పటి పాట్నా) నగరానికి ఆకర్షవంతమైన చరిత్ర ఉంది. అది ఎటువంటి ప్రాముఖ్యమూ లేని దుర్గంగా ఉన్న రోజుల్లో, క్రీ. పూ. ఆరో శతాబ్దిలో బుద్ధభగవానుడు దాన్ని సందర్శించాడు. అప్పుడాయన ఇలా జోస్యం పలికాడు. “ఆర్యజనులు సాగినంత దూరం, వర్తకులు ప్రయాణించినంత దూరం, పాటలీపుత్రం అన్ని రకాల సామగ్రి వినిమయానికి కేంద్రంగా, వారికి ముఖ్యనగరం అవుతుంది.” (మహాపరి నిర్వాణ సూత్రం). రెండు, శతాబ్దుల తరవాత పాటలీపుత్రం, చంద్రగుప్త మౌర్యుడి మహాసామ్రాజ్యానికి రాజధాని అయింది. ఆయన మనమడు అశోకుడు, రాజధాని నగరానికి ఇతోధిక సంపన్నత, వైభవం చేకూర్చాడు.
  5. ‘ఏన్షెంట్ ఇండియా’ (ప్రాచీన భారతదేశం) ఆరు సంపుటాలు (కలకత్తా: చక్రవర్తి, ఛటర్జీ అండ్ కంపెనీ, 15, కాలేజీ స్క్వేర్, 1879, పునఃప్రచురణ, 1927).
  6. అలెగ్జాండరు కాని, అతని సేనానాయకులు కాని గంగానదిని ఎన్నడూ దాటలేదు. వాయవ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడం చూసి మాసిడోనియా సైన్యం, మరి ముందుకు చొచ్చుకొని పోమంటూ తిరుగుబాటు చేసింది; అలెగ్జాండరు భారతదేశాన్ని విడవక తప్పింది కాదు. తరవాత అతనికి పెర్షియాలో విజయాలు లభించాయి.
  7. ఈ ప్రశ్ననుబట్టి, ఆ “జియిస్ కుమారుడికి” తానింకా పరిపూర్ణత సాధించలేదేమో నన్న సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉండేదని మనం ఊహించవచ్చు
  8. భారతదేశంలో బానిసతనం లేకపోవడాన్ని గురించి గ్రీకు పరిశీలకు లందరూ వ్యాఖ్యానించారు; హెలెనిక్ సమాజ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైన లక్షణమిది.

ప్రొ॥ వినయకుమార్ సర్కార్ రాసిన ‘క్రియేటివ్ ఇండియా’ (సృజనాత్మక భారతదేశం) అన్న గ్రంథంలో భారత దేశం పాటించిన ప్రాచీన, ఆధునిక విజయాల సమగ్ర స్వరూపాన్ని, అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం, సాహిత్యం, కళ, సమాజతత్త్వశాస్త్రం అన్నవాటిలో ఉన్న ప్రత్యేకమైన విలువల్ని పేర్కొనడం జరిగింది. (లాహోరు: మోతీలాల్ బనార్సీ - ప్రచురణ కర్తలు, 1937, పుట 714).

చదవదగ్గ మరో గ్రంథం, ఎస్. వి. వెంకటేశ్వర రాసిన “ఇండియన్ కల్చర్ త్రూ ఏజెస్” (యుగయుగాలుగా భారతీయ సంస్కృతి) (న్యూయార్కు: లాంగ్మన్స్, గ్రీన్ అండ్ కంపెనీ)

  • “ఈ నాలుగు” కులాల్లో ఒక దాంట్లోకి చేర్చడమన్నది, మొదట్లో, మనిషి పుట్టుక మీద ఆధారపడి ఉండేది కాదు; జీవితంలో అతడు సాధించడానికి ఎంచుకున్న లక్ష్యంవల్ల వెల్లడి అయే సహజ శక్తులమీద ఆధారపడి ఉండేది.” అని 1935 జనవరి “ఈస్ట్- వెస్ట్” పత్రికలో ఒక వ్యాసంలో పేర్కోడం జరిగింది. “ఈ లక్ష్యం ఈ కిందివాటిలో ఏదయినా కావచ్చు. (1) ‘కామం’, కోరిక, ఇంద్రియాలే తాననుకొని గడిపే జీవితం (శూద్రదశ), (2) ‘అర్థం’, లాభార్జన చేస్తూనే కోరికల్ని అదుపులో ఉంచుకోడం (వైశ్యదశ), (3) ‘ధర్మం’, స్వయం శిక్షణతోనూ బాధ్యతతోనూ సత్కర్మతోనూ కూడిన జీవితం (క్షత్రియదశ), (4) ‘మోక్షం’, విడుదల, ఆధ్యాత్మికతతోనూ, మతధర్మబోధనతోనూ కూడిన జీవితం (బ్రాహ్మణదశ). ఈ నాలుగు కులాలూ మానవులకు సేవ చెయ్యడానికి ఉపకరించే సాధనాలు ఇవి: (1) శరీరం (2) మనస్సు (3) సంకల్పశక్తి (4) ఆత్మ. “ఈ నాలుగు దశలకూ శాశ్వతగుణాల్లో లేదా ప్రకృతిగుణాల్లో సామ్యం ఉంది. ఆ గుణాలు ఏవంటే, ‘తమస్సు, రజస్సు, సత్త్వం’; అవరోధం, క్రియాశీలత, విస్తరణ; లేదా, ద్రవ్యరాశి, శక్తి, జ్ఞానం. ఆ నాలుగు సహజ కులాలూ గుణాల్నిబట్టి ఈ విధంగా సూచిత మవుతాయి: (1) తమస్సు (అజ్ఞానం), (2) తమస్సు - రజస్సు (అజ్ఞానం, క్రియాశీలతల కలగలుపు), (3) రజస్సు - సత్త్వం (సత్కర్మ, జ్ఞానం కలగలుపు), (4) సత్త్వం (జ్ఞానం). ఈ విధంగా ప్రకృతి, ప్రతి మనిషిలోనూ ఉన్న ఒక గుణానికి గాని రెండు గుణాల కలగలుపుకు గాని ఉన్న ప్రాబల్యాన్ని బట్టి అతనికొక కులాన్ని నిర్దేశిస్తుంది. సహజంగా ప్రతి మనిషిలోనూ ఈ మూడు గుణాలూ వివిధ నిష్పత్తుల్లో ఉంటూనే ఉంటాయి. ఒక మనిషి కులాన్ని లేదా క్రమోన్నత పరిణామ హోదాను గురువు సరిగా నిర్ధారణ చెయ్యగలుగుతాడు.

    “అన్ని జాతులూ అన్ని దేశాలూ, సిద్ధాంతపరంగా కాకపోయినా ఆచరణలోనైనా, కులవ్యవస్థా లక్షణాల్ని కొంతవరకు పాటిస్తూనే ఉంటాయి. స్వేచ్ఛ అనే గొప్ప లైసెన్సు ఉన్నచోట, ముఖ్యంగా సహజకులాల్లో విపరీత శ్రేణుల మధ్య జరిగే అంతర్వివాహాల్లో, క్రమక్రమంగా జాతి క్షీణించిపోతూ, చివరికి నశిస్తుంది. ‘పురాణ సంహిత’లో, అటువంటి సంగమాలవల్ల కలిగిన సంతానాన్ని కంచరగాడిద వంటి గొడ్డుబోతు సంకరజాతి పశువుతో పోల్చడం జరిగింది; కంచరగాడిద సంతానాన్ని కనలేదు. చివరికి, కృత్రిమ జాతులు అంతరించి పోతాయి. ఎన్నో గొప్పగొప్ప జాతులు నామరూపాలు లేకుండా నశించిపోయిన సంగతి, చరిత్రలో అనేక ప్రమాణాలవల్ల రుజువవుతుంది. ప్రాచీనమైన ఇతర జాతులు అనేకం సంపూర్ణంగా అదృశ్యమైపోగా, జాతి స్వచ్ఛతను కాపాడి, అనేక వేల రకరకాల పరిస్థితుల్లో దాని మనుగడను సురక్షితంగా సాగనిస్తూ విశృంఖలతను అదుపులో పెట్టి మహామేధావుల్ని సృష్టించిన ప్రతిష్ఠ భారతదేశ కులవ్యవస్థకు మాత్రమే దక్కింది.

  • ఈయనకు గల ఆశ్రమోచితమైన బిరుదు స్వామి శ్రీ సదాశివేంద్ర సరస్వతి; ఈ పేరుతోనే ఆయన పుస్తకాలు (బ్రహ్మసూత్రాలకూ, పతంజలి యోగసూత్రాలకూ వ్యాఖ్యానాలు) రాశారు.

    మైసూరు రాజ్యంలో శృంగేరి పీఠాధిపతులుగా ఉండి కీర్తిశేషులైన శ్రీశ్రీ చంద్రశేఖర భారతి స్వామివారు సదాశివబ్రహ్మంగారిని కీర్తిస్తూ ఒక స్తోత్రం రాశారు.