ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అధ్యాయం : 39

శిలువ గాయాలున్న

థెరిసా నాయ్‌మన్

“భారతదేశానికి తిరిగి వచ్చెయ్యి. నీకోసం పదిహేనేళ్ళు ఓపిక పట్టి ఎదురు చూశాను. త్వరలో నేను ఈ శరీరాన్ని వదిలి, అటుతరవాత నా కాంతిమయ నివాసానికి చేరుకుంటాను. యోగానందా, రా!”

ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీయుక్తేశ్వర్‌గారి స్వరం నా లోచెవిలో వినిపించి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఆయన సందేశం ఒక్క రెప్ప పాటు కాలంలో పదివేల మైళ్ళు ప్రయాణించి, మెరుపులా నాలోకి దూసుకు వచ్చింది.

పదిహేనేళ్ళు! ఔను, ఇప్పుడు నడుస్తున్నది 1935 అని గ్రహించాను; మా గురుదేవుల ఉపదేశాల్ని అమెరికాలో వ్యాప్తి చెయ్యడానికి పదిహేనేళ్ళు గడిపాను. ఇప్పుడాయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు.

తరవాత కొద్ది వ్యవధిలో, నా ప్రియమిత్రుడైన శ్రీ.జేమ్స్ జె. లిన్‌కు నా అనుభవం చెప్పాను. ప్రతి రోజూ క్రియాయోగ సాధనవల్ల ఆయన పొందిన ఆధ్యాత్మికాభివృద్ధి గణనీయతనుబట్టి నే నాయన్ని తరచుగా ‘సెయింట్ లిన్’ (లిన్ ఋషి) అని పిలుస్తూండేవాణ్ణి. సనాతన యోగపద్ధతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని పాశ్చాత్యదేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం, ఈయన్నీ మరికొందరు పాశ్చాత్యుల్నీ చూసినప్పుడు గ్రహించి సంతోషించాను.

నా ప్రయాణాల ఖర్చుకు తామే విరాళమిస్తామని పట్టుపట్టి, ఔదార్యం చూపించారు లిన్. ఆర్థిక సమస్య అలా పరిష్కారమవడంతో నేను, యూరప్ గుండా ఇండియాకు ఓడలో ప్రయాణం చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. 1935 మార్చిలో, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను, కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం, చిరస్థాయిగా మనుగడ సాగించడానికి రూపొందించిన మతాంతశ్శాఖారహితమైన, లాభార్జనరహితమైన సంస్థగా రిజిస్టరు చేయించాను. నా రచనలన్నిటి మీదా ఉన్న హక్కులతో సహా, నా కున్నవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు విరాళంగా ఇచ్చేశాను. అనేక ఇతర మత, విద్యాసంస్థల్లాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా సభ్యులు ప్రజలూ అందించిన ధర్మనిధుల మీదా విరాళాల మీదా ఆధారపడింది.

“నేను మళ్ళీ వస్తాను. అమెరికాని ఎన్నడూ మరిచిపోను,” అని చెప్పాను నా విద్యార్థులకు.

ప్రేమాస్పదులైన మిత్రులు కొందరు లాస్ ఏంజిలస్‌లో నా కిచ్చిన వీడ్కోలు విందులో, వాళ్ళ మొహాలవేవు చాలాసేపు చూసి, కృతజ్ఞతతో ఇలా అనుకున్నాను, “ప్రభూ, ఏకైక ప్రదాతవు నువ్వేనన్న సంగతి గుర్తుంచుకున్నవాడికి, మర్త్యుల్లో స్నేహమాధుర్యం కొరవడ్డం ఉండదు.”

1935 జూన్ 9 న న్యూయార్కులో ‘యూరోపా’ అనే ఓడలో బయలుదేరాను. నాతోబాటు, ఇద్దరు విద్యార్థులు వచ్చారు: నా కార్యదర్శి శ్రీ. పి. రిచర్డ్ రైట్, సిన్సినాటీ వాస్తవ్యురాలైన ఒక వృద్ధురాలు మిస్ ఎటీ బెట్. అంతకు ముందు వారాలు పనుల హడావిడిలో గడిస్తే, ఇప్పుడు దానికి విరుద్ధంగా మందకొడిగా గడిచాయి. మహాసాగర ప్రశాంతిలో గడిచిన రోజుల్లో ఎంతో ఆనందం అనుభవించాం. అయితే, మా విరామ కాలం అల్పాయుష్కమే అయింది; ఆధునిక నౌకల వేగానికి, విచారకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి!

ఉత్సుకత ఉన్న యాత్రిక బృందాలన్నిటిలాగే మేమూ అతివిస్తారమూ ప్రాచీనమూ అయిన లండన్ నగరంలో బాగా తిరిగాం. నేను వచ్చిన మర్నాడు కాక్స్‌టన్ హాలులో ఏర్పాటయిన పెద్ద సభలో ఉపన్యాస మిమ్మని నన్ను ఆహ్వానించారు. అక్కడ సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ నన్ను లండన్ శ్రోతలకు పరిచయం చేశారు. మా బృందం స్కాట్లండ్‌లో సర్ హారీ లాడర్‌గారి ఎస్టేట్‌లో ఆయన అతిథులుగా హాయిగా ఒక రోజు గడిపాం. ఆ తరవాత మేము ఇంగ్లీషు ఛానల్ దాటి యూరప్ ఖండంలో ప్రవేశించాం; నేను బవేరియాకు ప్రత్యేక యాత్ర చెయ్యాలని అనుకోడమే దానికి కారణం. కానర్‌స్రాత్‌లో ఉండే థెరిసా నాయ్‌మన్ అనే గొప్ప కాథలిక్ మార్మిక భక్తురాలిని దర్శించడానికి నా కిదే ఏకైక అవకాశమని భావించాను.

అప్పటికే కొన్నేళ్ళ కిందట నేను, ఒక వ్యాసంలో థెరిసాగురించి ఇచ్చిన విస్మయం కలిగించే సమాచారం చదివాను; అది ఏమిటంటే:

(1) 1898 గుడ్‌ఫ్రైడే నాడు జన్మించిన థెరిసా, ఇరవయ్యో ఏట ఒక ప్రమాదంలో గాయపడింది. ఆమె గుడ్డిదయింది; పక్షవాతం వచ్చింది.

(2) 1923 లో, ‘లిటిల్ ఫ్లవర్’గా పేరుగన్న సెంట్ థెరిసా ఆఫ్ లిసాక్స్‌కు చేసిన ప్రార్థనల వల్ల అలౌకిక రీతిలో ఆమెకు మళ్ళీ చూపు వచ్చింది. ఆ తరవాత థెరిసా నాయ్‌మన్ అవయవాలకు తక్షణమే రోగ నివారణ జరిగింది. (3) థెరిసా 1923 నుంచి అన్నపానీయాలు పూర్తిగా మానేసింది; కాని దైవప్రసాదంగా ‘పలచని రొట్టె’ ముక్క (వేఫర్ ) మాత్రం మింగుతుంది.

(4) 1926 లో థెరిసా తలమీదా, రొమ్ముమీదా, చేతులమీదా, పాదాలమీదా క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి. ప్రతి శుక్రవారం[1]నాడూ ఆమె, మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నీ తన శరీరంలోనే పడుతూ, ‘క్రీస్తువ్యథ’ (Passion of Christ) అనుభవిస్తుంది.

(5) సాధారణంగా, తన ఊళ్ళో వాడుకలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన థెరిసా, శుక్రవారం సమాధి స్థితుల్లో పలికే పదబంధాల్నీ, ప్రాచీన అరామయిక్ భాషా రూపాలుగా పండితులు గుర్తించారు. అంతర్దర్శనాల్లో ఆమె, సముచిత సమయాల్లో హిబ్రూకాని గ్రీకుకాని మాట్లాడుతుంది.

(6) మత ధర్మాధికారుల అనుమతితో థెరిసా చాలాసార్లు నిశితశాస్త్ర పరీక్షకు నిలిచింది. ప్రోటస్టెంట్ జర్మన్ వార్తా పత్రిక సంపాదకుడైన డా॥ ఫ్రిట్జ్ గెర్లిక్, “కాథలిక్ బండారం బయటపెట్టడానికి” కానర్ స్రాత్ వెళ్ళాడు కాని, చివరికి గౌరవ ప్రపత్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు.

ఎప్పటిలాగే నేను, ప్రాచ్యపాశ్చాత్యాల్లో ఎక్కడయినా సరే, ఒక సాధువును కలుసుకోడమంటే ఎంతో కుతూహలపడేవాణ్ణి. మా యాత్రా బృందం జూలై 16 న, కానర్‌స్రాత్ విచిత్ర గ్రామంలో - అడుగు పెడు తూంటే నా కెంతో ఆనందం కలిగింది. బవేరియా రైతులు (మేము అమెరికా నుంచి తీసుకు వచ్చిన) ఫోర్డుకారునూ అందులో ఉన్న రకరకాల మనుషుల్నీ - ఒక అమెరికన్ యువకుడూ, ఒక వృద్ధురాలూ, పొడుగాటి జుట్టును కోటు కాలరులోకి దోపుకొని ఉన్న, గోధుమ ఛాయగల తూర్పు దేశీయుణ్ణి చూసి చాలా కుతూహలం కనబరిచారు. కాని దురదృష్టవశాత్తు పాతకాలంనాటి ఒక నుయ్యి పక్కన పూస్తున్న జిరేనియం పూలతో శుభ్రంగా, అందంగా ఉన్న థెరీసా కుటీరం, చడీ చప్పుడూ లేకుండా మూసి ఉంది. ఇరుగుపొరుగువాళ్ళు కాని, ఆ మాటకు వస్తే - పక్కనించి వెళ్ళిన పోస్ట్‌మాన్ కాని, మా కేమీ సమాచారం ఇవ్వలేకపోయారు. వానపడ్డం మొదలయింది; ఇంక వెళ్ళిపోదామని అన్నారు మా సహచరులు.

“ఊఁహుఁ! థెరిసా దగ్గరికి దారితీసే ఉపాయం ఏదో ఒకటి తెలుసుకునేవరకు నే నిక్కడే ఉంటాను.” అన్నాను మొండి పట్టుదలతో.

రెండు గంటలు గడిచాక కూడా మేము, విసుగు పుట్టించే వానలో మా కారులోనే కూర్చుని ఉన్నాం. “ప్రభూ! ఆమె ఇక్కణ్ణించి అదృశ్య మయినట్లయితే నన్నెందుకు తీసుకువచ్చావయ్యా ఇక్కడికి?” అంటూ నిష్టూరమాడుతూ నిట్టూర్చాను. ఇంతలో, ఇంగ్లీషు మాట్లాడే ఒకాయన మా పక్కన ఆగాడు; తనవల్ల, ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు, మర్యాదగా.

“థెరిసా ఎక్కడుందో నాకు కచ్చితంగా అయితే తెలీదు. కాని ఆవిడ తరచుగా, ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో, ఐక్‌స్టాట్ యూనివర్సిటీలో విదేశభాషలు నేర్పే ప్రొఫెసర్ ఫ్రాన్జ్ పుట్జ్ గారింటికి వెడుతూ ఉంటుంది,” అన్నాడాయన.

మర్నాడు పొద్దున మేము, ప్రశాంతమైన ఐక్‌స్టాట్ పట్నానికి వెళ్ళాం. డా॥ వుట్జ్ మమ్మల్ని సాదరంగా పలకరించారు ఇంటిదగ్గర; “ఔను, థెరిసా ఇక్కడే ఉంది.” నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారని, మా గురించి ఆమెకు కబురు పంపాడాయన. కబురు తీసుకువెళ్ళినతను, ఆమె సమాధానంతో తిరిగి వచ్చాడు:

“తమ అనుమతి లేకుండా ఎవరినీ చూడవద్దని బిషప్పు నాకు చెప్పినప్పటికీ, భారతదేశపు భగవద్భక్తునికి నేను స్వాగతం చెబుతాను.”

ఈ మాటలకు నేను గాఢంగా చలించి, డా॥ వుట్జ్ వెంబడి, మేడ మీది గదిలోకి వెళ్ళాను. శాంతి, ఆనందాల పరివేషంతో ప్రకాశిస్తున్న థెరిసా, వెంటనే లోపలికి వచ్చింది. ఆమె నల్లటిగౌనూ, మల్లెపువ్వులాటి తెల్లటి తలముసుగూ వేసుకుని ఉంది. అప్పటి కామె వయస్సు ముప్ఫై ఏడు అయినా కూడా అంతకన్న చిన్నదానిలా కనిపిస్తుంది; ఆమెలో శిశుసహజమైన స్నిగ్ధతా ఆకర్షణా ఉన్నాయి. ఆరోగ్యంగా, తీర్చి దిద్దినట్టుగా ఉన్న రూపంతో, గులాబి చెక్కిళ్ళలో, ఉల్లాసంగా ఉన్న ఈమె, ఏమీ తినని సాధ్వి!

అతి మృదువైన కరచాలనంతో థెరిసా నాకు స్వాగతం చెప్పింది. ఒకరినొకరం, దేవుని ప్రేమికులమని తెలుసుకొని, మౌన భాషణతోనే ముగ్ధులమయాం. డా॥ వుట్జ్, మాకు దుబాసిగా వ్యవహరిస్తామని దయతో అన్నారు. మేము కూర్చున్నాక, థెరిసా నావేపు సహజ కుతూహలంలో చూస్తోందని గమనించాను; బవేరియాలో హిందువులు కనిపించడం అరుదన్న సంగతి స్పష్టమే.

“మీ రేమీ తినరా?” ఆమె నోటినించే జవాబు వినాలని నా కోరిక.

“ఊఁహుఁ, రోజూ పొద్దున ఆరింటికి ఒక్క హోస్ట్[2] తప్ప.”

“ఆ హోస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది!”

“కాయితమంత పలచగా, చిన్న నాణెమంత ఉరువులో ఉంటుంది,” అంటూ ఇంకా ఇలా అంది ఆమె, “అది నేను పవిత్రానుష్ఠాన కారణాల వల్ల తీసుకుంటాను; అది దైవార్పితమయింది కాకపోతే మింగలేను.”

“ఆ ఒక్క దానిమీదా మీరు, నిండు పన్నెండేళ్ళపాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదూ?”

“నేను దేవుడి వెలుగువల్ల జీవిస్తున్నాను.”

ఆమె జవాబు ఎంత స్పష్టంగా ఉంది! ఎంత ఐన్‌స్టైన్ పద్ధతిలో ఉంది!

“శక్తి, ఆకాశం (ఈథర్) నుంచి సూర్యుడినించీ గాలినించీ మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతారని నాకు స్పష్టమవుతోంది.” చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. “నే నెలా జీవిస్తానో మీరు గ్రహించారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను.”

“ ‘మనిషి కేవలం రొట్టెవల్ల కాకుండా, దేవుడి నోటినించి వెలువడ్డ


ప్రతి మాటవల్లా జీవిస్తాడు’ అంటూ క్రీస్తు పలికిన సత్యానికి మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం.”[3]

నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్ళీ ఆనందం ప్రకటించింది. “అది నిజానికి అంతే, ఈనాడు నేనీ భూమిమీద ఉన్నానంటే, దానికున్న కారణాల్లో ఒకటి, మానవుడు కేవలం తిండి వల్లనే కాకుండా, దేవుడి అదృశ్య కాంతివల్ల బతగ్గలడని నిరూపించడానికి.”

“తిండిలేకుండా బతకడమెలాగో మీరు ఇతరులకు నేర్పగలరా?”

ఆమె ఒక్కరవ్వ ఆశ్చర్యచకితురాలయినట్టు కనిపించింది. “అది నేను చెయ్యలేను; దేవుడు దాన్ని ఆశించడు.” నా చూపు, బలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతులమీద పడేసరికి, థెరిసా, రెండు చేతుల వెనకాలా కొత్తగా నయమయిన గాయాల తాలూకు నల్చదరం మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమయిన, చంద్రవంక ఆకారంలో ఉన్న, చిన్న గాయాన్ని చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఈవేపు నుంచి అవేపుకి ఉంది. వాటిని చూసేసరికి, తూర్పుదేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చదరపు ఇనపమేకులు గుర్తుకు వచ్చాయి నాకు; వాటికి బొడిపె చంద్రవంక ఆకారంలో ఉంటుంది; అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తు లేదు.

ఆ సాధ్వి, వారంవారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధిస్థితుల గురించి కొంత చెప్పింది. “నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా, క్రీస్తు వ్యథనంతా గమనిస్తూ ఉంటాను.” ప్రతివారం, గురువారం నడిరాత్రి నించి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తురు ఓడుతుంది. మామూలుగా ఆమెకుండే 121 పౌన్ల బరువులో పది పౌన్లు తగ్గిపోతుంది. థెరిసా, సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా, వారంవారం కలిగే, ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది.

బైబిలు కొత్త నిబంధనల్లో గ్రంథస్థమైన ప్రకారం ఏసు జీవితమూ ఆయన్ని శిలువవేయడమూ అన్నవాటి చారిత్రక యథార్థతను క్రైస్తవు లందరికీ తిరిగి ధ్రువపరచడానికీ ఆ గలిలీయ గురువుకూ ఆయన భక్తులకూ ఉండే శాశ్వతానుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను.

ప్రొఫెసర్ వుట్జ్, ఆ సాధ్వితో తమకు గలిగిన కొన్ని అనుభవాలు చెప్పాడు. “థెరిసాతో సహా మేము చాలామందిమి, ప్రకృతి దృశ్యాలు చూడ్డంకోసం తరచుగా జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటాం,” అన్నాడాయన. “కొట్టవచ్చేటట్టు కనిపించే భేదం ఏమిటంటే - మే మందరం రోజుకు మూడేసిసార్లు భోజనాలు చేస్తూ ఉంటే, థెరిసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులా తాజాగా ఉంటుంది. మే మందరం ఆకళ్ళతో నకనకలాడుతూ, చొరబడ్డానికి దారి పక్క హోటళ్ళ కోసం చూస్తూ ఉంటే, థెరిసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది.”

ఆ ప్రొఫెసరుగారు, ఆసక్తి కలిగించేటటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. “థెరిసా తిండి తినదు కనక, ఆమె పొట్ట అక్కళించుకుపోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు. కాని ఆమెలో చెమట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి; చర్మం ఎప్పుడూ మృదువుగా, దృఢంగా ఉంటుంది.”

మే మింక సెలవు తీసుకునే సమయంలో, థెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలన్న కోరిక వెల్లడించాను.

“సరే, వచ్చే శుక్రవారం కానర్‌స్రాత్‌కు రండి,” అన్నదామె సౌహార్దంతో. “బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఐక్‌స్టాట్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం.”

థెరిసా నా చేతుల్ని మెల్లగా, చాలాసార్లు ఊపి, మా బృందంతోబాటు వీథి గుమ్మం దాకా వచ్చింది. శ్రీ రైట్, కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్ళు తొంబలు తొంబలుగా పోగవడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూశాం; ఆమె చిన్న పిల్ల మాదిరిగా మావేపు చెయ్యి ఊపుతూ తొంగిచూసింది.

ఆ మర్నాడు థెరిసా సోదరు లిద్దరితో ముచ్చటించాం. వాళ్ళు చాలా దయగలవాళ్ళూ కలుపుగోలు మనుషులూ. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే, ఆ సాధ్వి రోజుకు ఒకటి రెండు గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటిమీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా, సత్తువగా ఉంటుంది. ఆమెకు పక్షుల మీద ప్రేమ; చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటికి సంరక్షణచేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతూంటాయి. ప్రార్థనలకోసం, రోగనివారక ఆశీస్సులకోసం కాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటా రామెకు. ఆమె చలవవల్ల తీవ్రవ్యాధులు నయమయినవాళ్ళు చాలామంది ఉన్నారు.

ప్రార్థనద్వారా, ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకొని అనుభవించే శక్తి థెరెసాకు ఉందని, ఆమె తమ్ముడు ఫెర్డినాండ్ - సుమారు ఇరవైమూడేళ్ళవాడు, నాకు చెప్పాడు. ఒకసారి, క్రైస్తవమత సంబంధ మైన పారిష్‌లో ఫాదరీగా శిక్షణ పొందడానికి ప్రవేశించబోతున్న యువకు డొకడు, గొంతు జబ్బుతో బాధపడుతూ ఉండడంవల్ల, ఆ జబ్బు తన గొంతుక్కి రావాలని ఆమె ప్రార్థించినప్పటినించి, ఆ సాధ్వి భోజనం మానేసింది.

గురువారం మధ్యాహ్నం మా బృందం, బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరజాల జుట్టువేపు ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే మాకు కావలసిన అనుమతి పత్రం రాసి ఇచ్చాడు. దానికి రుసుమేమీ లేదు. చర్చివాళ్ళు ఈ నియమం పెట్టింది, ఊసుపోకకు వచ్చే పర్యాటకుల తొక్కిస లాట నుంచి థెరిసాను కాపాడడానికే. అంతకు ముందటేళ్ళలో అయితే, శుక్రవారాల్లో వేల కొద్దీ జనం గుమిగూడుతూ ఉండేవాళ్ళు.

శుక్రవారం పొద్దున సుమారు తొమ్మిదిన్నరకి మేము కానర్‌స్రాత్ చేరాం. థెరిసా కుటీరంలో, పై కప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందనీ, అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిందనీ గమనించాను. తలుపు లిప్పుడు మూసి లేవు; ఆనందంగా స్వాగతం పలుకుతూ బార్లా తెరుచుకుని ఉన్నందుకు సంతోషించాం. సుమారు ఇరవై మంది సందర్శకులు బారుగా నిలబడి ఉన్నారు; ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంది. ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించడానికి చాలా దూరాలనుంచి వచ్చినవాళ్ళు అనేకమంది ఉన్నారు.

నే నామెను చూడడానికి వచ్చింది కేవలం, తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తి పరుచుకోడానికి కాక, ఆధ్యాత్మిక హేతువులవల్ల వచ్చానన్న సహజావబోధంతో థెరిసా, ప్రొఫెసరుగారి ఇంట్లో నా మొదటి పరీక్షలో నెగ్గింది.

నా రెండో పరీక్ష ఏమిటంటే, మేడమీదున్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను, ఆమెతో అతీంద్రియ భావగ్రహణ, దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడంకోసం, నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో పక్కమీద పడుకొని ఉంది. నాకు సరిగా వెనకాల శ్రీరైట్ ఉన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా, అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను.

థెరిసా కింది కనురెప్పల నుంచి నెత్తురు, అంగుళం వెడల్పు ధారగా పలచగా, ఎడతెరిపిలేకుండా స్రవించింది. ఆమె చూపు, నుదుటి మధ్యనున్న జ్ఞాననేత్రం వేపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టిఉన్న గుడ్డ, [క్రీస్తు] ముళ్ళ కిరీటం తాలూకు గాయాలనుంచి వచ్చిన నెత్తుటితో తడిసి ముద్దయింది. ఆమె గుండెమీదున్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల కిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరంమీద గాయమయినచోటనే, ఆమె కయిన గాయంనుంచి వచ్చింది ఆ నెత్తురు.

మాతృవాత్సల్యంతోనూ ప్రార్థనపూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి థెరిసా చేతులు; ఆమె ముఖంలోని అభివ్యక్తి వ్యథాభరితంగానూ దివ్యంగానూ కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్టూ లోపలా బయటా కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టూ కూడా ఉంది. ఏదో విదేశభాషలో గొణుగుతూ ఆమె, తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి, కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది.

నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె ఆంతర్దర్శనాల్లోని దృశ్యాల్ని చూడడం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జనసమూహం మధ్యలో శిలువకొయ్యలు మోసుకు వెళ్తున్న ఏసును గమనిస్తోందామె.[4] గాభరాగా చటుక్కున తల ఎత్తింది; ఆ క్రూరభారం కింద ప్రభువు పడిపోయాడు. అంతర్దర్శనం అదృశ్యమయింది. గుండె తరుక్కుపోయే జాలితో థెరిసా, బరువుగా తలగడమీదకి వాలిపోయింది. సరిగ్గా ఈ సమయంలో, నా వెనకాల దభీమని పెద్ద చప్పుడయింది. ఒక్క క్షణం తల తిప్పి చూశాను; సాగిలబడ్డ ఒక శరీరాన్ని ఇద్దరు మనుషులు సాయంపట్టి తీసుకువెళ్ళడం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి వస్తున్నందువల్ల, పడిపోయిన మనిషిని వెంటనే పోల్చలేకపోయను. మళ్ళీ నా కళ్ళని థెరిసా ముఖం మీద నిలిపాను, నెత్తుటి వాగులవల్ల, చావు దగ్గరపడ్డవాడి ముఖం పాలిపోయినంతగా పాలిపోయిన ఆమె ముఖం, ఇప్పుడు పరిశుద్ధతనూ పవిత్రతనూ, ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ఉంది. అటుతరవాత నా వెనకాల శ్రీరైట్‌ను చూశాను. అతను చెంపకు చెయ్యి ఆన్చుకుని నిలబడ్డాడు, చెంపనుంచి నెత్తురు ఓడుతోంది.

“డిక్ , పడిపోయినవాడివి నువ్వా?” అంటూ ఆదుర్దాగా అడిగాను.

“ఔనండి. ఆ భయంకర దృశ్యం చూసి మూర్ఛపోయాను.”

“బాగుంది; తిరిగివచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం ఉంది నీకు,” అన్నాను ఓదార్పుగా.

ఓర్పుగా కాసుకుని ఉన్న యాత్రికుల బారును గుర్తు చేసుకుని నేనూ శ్రీరైట్, మౌనంగా థెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధినుంచి బయటికి వచ్చాం.[5] ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలుబళ్ళ మీద ఆధారపడక్కర్లేకుండా, పల్లెపట్టుల్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డు కారును ఆపగలిగినందుకు సంతోషించాం. జర్మనీ, హాలండ్, ఫ్రాన్స్, స్విస్ ఆల్ప్స్ గుండా మేము సాగించిన యాత్రలో ప్రతిక్షణం మమ్మల్ని ఆనందభరితుల్ని చేసింది. ఇటలీలో అసిసీకి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం; వినయస్వరూపుడయిన సెంట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటుచేసుకున్నదది. గ్రీసుతో మా యూరప్ పర్యటన ముగిసింది; అక్కడ మేము ఎథీనియన్ దేవాలయాలు సందర్శించాం; సాధుసత్తముడైన సోక్రటీస్,[6] తన ప్రాణం తీసే విషం తాగిన ఖైదుకొట్టు చూశాం. ప్రతిచోటా, తమ కల్పనలను చలవ రాతిమీద సాక్షీభూతం కావించిన ప్రాచీన గ్రీకుల కళాకౌశలానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు.

సూర్యకాంతిలో ఉజ్జ్వలమైన మధ్యధరాసముద్రంమీద ఓడలో ప్రయాణంచేసి పాలస్తీనాలో దిగాం. ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ, నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను. సున్నితమైన హృదయం గలవాడికి, క్రీస్తు మహిమ పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది. బెత్లెహాములో, గెత్సెమేన్‌లో, కాల్వరీలో, పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర, జోర్డాన్ నదీతీరంలో, గలిలీ సముద్రతటంలో భక్తి పురస్సరంగా, నేను ఆయన పక్కనే నడిచాను.

మా బృందం, బర్త్ మాంజర్ (పుట్టు గోలెం), యోసేపు వడ్రంగం కొట్టు, లాజరు గోరీ, మార్తా మేరీల ఇల్లు, కడపటి రాత్రి విందు జరిగిన హాలు సందర్శించింది. పురాతన చరిత్ర మా కళ్ళముందు బహిర్గత మయింది; దృశ్యం తరవాత దృశ్యంగా, యుగయుగాంతరాలు దర్శించడం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్యనాటకాన్ని నేను దర్శించాను.

తరవాత ఈజిప్టు చేరాం; ఆధునికమైన కెయిరోసూ పురాతనమైన పిరమిడ్లనూ చూశాం. ఆ తరవాత ఓడలో, దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం; చివరికి అదుగో, భారతదేశం!

  1. యుద్ధ సంవత్సరాలు మొదలుకొని థెరిసా, ఏడాదిలో కొన్ని పవిత్ర దినాల్లో తప్ప, ఆ ‘వ్యథ’, ప్రతి శుక్రవారం అనుభవించేది కాదు. ఆమె జీవితాన్ని గురించి వచ్చిన పుస్తకాలు ఇవి: ‘థెరిసా నాయ్‌మన్’ : ఎ స్టిగ్మాటిస్ట్ ఆఫ్ అవర్ డే’ (మన కాలపు శతచిహ్నధారిణి: థెరిసా నాయ్‌మన్. ‘ఫర్దర్ క్రానికల్స్ ఆఫ్ థెరిసా నాయ్‌మన్’ (థెరిసా నాయ్‌మన్, తదుపరి వృత్తాంతాలు) - ఈ రెండూ ఫ్రిడ్‌రిక్, రిటర్ వాన్ లామా రాసినవి; ఎ. పి. షింబర్గ్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ థెరిసా నాయ్‌మన్’ (1947): ఇవన్నీ విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఉన్న బ్రూస్ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురించింది; జొహానెస్ స్టెయినర్ రాసిన ‘థెరిసా నాయ్‌మన్’, అమెరికా, న్యూయార్కులో స్టేటస్ ఐలాండ్‌లోని ఆల్బా హౌస్ ప్రచురించింది.
  2. యుఖారిస్టిక్ పిండిరొట్టె రేకు.
  3. ‘మత్తయి’ 4 : 4. మనిషి శరీరమనే బ్యాటరీ కేవలం స్థూలమైన ఆహారం (రొట్టె) వల్ల కాకుండా, స్పందనశీలక విశ్వశక్తి (మాట లేదా ‘ఓం’) వల్లనే పనిచేస్తోంది. ఆ అదృశ్య శక్తి, చిన్న మెదడు అనే ద్వారంగుండా మానవ శరీరంలోకి ప్రసరిస్తుంది. శరీరంలోని ఈ ఆరో కేంద్రం, మెడకు వెనకాల, వెనుబాముకు సంబంధించిన ఐదు చక్రాలకు (ప్రాణశక్తిని ప్రసరింపజేసే “చక్రాలు” లేదా కేంద్రాలు) పైన ఉంటుంది. శరీరానికి సరఫరా అయే విశ్వప్రాణశక్తి (ఓం) కి ప్రధాన ప్రవేశ ద్వారమనే చిన్న మెదడు (మెడుల్లా), కనుబొమల మధ్య ఉండే ఒంటికన్నులోని కూటస్థ చైతన్య కేంద్రంతో ద్విముఖం (ద్వి ధ్రువత, పొలారిటీ) గా కలిపి ఉంది: ఆ ఒంటికన్ను మానవుడి సంకల్పశక్తికి స్థానం. అప్పుడు విశ్వశక్తి, మెదడులో ఉన్న ఏడో కేంద్రంలోకి వచ్చి చేరి అక్కడ నిలకడగా ఉండి అనంత శక్తుల్ని పుంజీభవింపజేసుకున్న ఆశ్రయంలా ఉంటుంది (దీన్నే వేదాల్లో, కాంతిరూపమైన సహస్రారకమలంగా చెప్పారు). బైబిలులో ఓంకారాన్ని పరిశుద్ధాత్మ (హోలీ ఘోస్ట్) గా, లేదా సృష్టినంతనీ దైవపరంగా నిలిపి ఉంచే అదృశ్య ప్రాణశక్తిగా ప్రస్తావించడం జరిగింది. “ఏమిటీ? మీ దేహం, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమనీ అది మీకు దేవుడు అనుగ్రహించిందనీ, మీరు మీ సొత్తేమీ కాదనీ మీకు తెలియదా?” - కోరింథీయులకు 6 : 19. (బైబిలు)
  4. నేను రావడానికి ముందు గడిచిన గంటల్లో థెరిసా, క్రీస్తు జీవితంలోని తుది పది రోజుల అంతర్దర్శనాలు అనేకం పొందింది. మామూలుగా ఆమె సమాధి స్థితి ‘కడపటి రాత్రి విందు’ (Last Supper) వెంబడి జరిగిన సంఘటనల దృశ్యాలతో మొదలయి, శిలువమీద క్రీస్తు మరణంతోగాని, అప్పుడప్పుడు, ఆయన్ని సమాధి చెయ్యడంలోగాని ముగుస్తూ ఉంటుంది.
  5. 1948 మార్చి 26 తేదీన జర్మనీ నుంచి వచ్చిన ఐ. ఎన్ . ఎన్. వార్తలో ఇలా ఉంది: “ఈ గుడ్‌ఫ్రైడేనాడు ఒక జర్మన్ కర్షకస్త్రీ మంచం మీద పడుక్కొని ఉంది; శిలువ వేసిన మేకులవల్లా, ముళ్ళకిరీటంవల్లా క్రీస్తు శరీరం మీద ఎక్కడెక్కడినించి నెత్తురు ఓడిందో, ఆమె శరీరంలోని ఆ భాగాల్లో తల మీద, చేతులమీద, భుజాలమీద నెత్తుటి మరకలున్నాయి. వేలకొద్దీ జనం, విస్మితులైన జర్మన్లూ, అమెరికన్లూ, తన కుటీరంలో మంచంమీద ఉన్న థెరిసా నాయ్‌మన్ పక్కనుంచి నిశ్శబ్దంగా నడుస్తూ సాగిపోయారు.

ఈ మహాక్షతచిహ్నధారిణి, 1962 సెప్టెంబరు 18 తేదీన కాసర్‌స్రాత్‌లో మరణించింది (ప్రచురణకర్త గమనిక).

  • సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని, గురించి ‘యూసేబియన్’ లో ఒకచోట ఇలా చెప్పడం జరిగింది: “అరిస్టోజినస్ అనే సంగీతకారుడు భారతీయుల్ని గురించి ఈ కింది కథ చెప్పాడు. భారతీయుల్లో ఒకడు ఏథెన్స్‌లో సోక్రటీస్‌ను కలుసుకుని తన తత్త్వం విషయవిస్తృతి ఏమిటని అడిగాడు. ‘మానవ దృగ్విషయాల అనుశీలన’ అని జవాబిచ్చాడు సోక్రటీసు. దీని కా భారతీయుడు విరగబడి నవ్వాడు. “దివ్య దృగ్విషయాల్ని ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాల్ని ఎలా అనుశీలన చెయ్యగలడు మనిషి?” అన్నాడతను.

    పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీక్ ఆదర్శం: ‘‘మనిషి, నువ్వు స్వయంగా తెలుసకో” (Man, know thyself) అని, హిందువు అనేది: “మనిషీ, నీ ఆత్మను తెలుసుకో” (Man, know thy self) అని. “నేను ఆలోచిస్తాను, కనక నేను ఉన్నాను,” అంటూ డెకార్ట్ (Descartes) అన్న వాక్యం తాత్వికంగా చెల్లదు. తార్కిక వివేచన శక్తులు, మానవుడి పరమ తత్త్వాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచం లాగే శాశ్వతపరివర్తనలో ఉన్నది; అంతిమ నిర్ణయాల్ని అది అందించలేదు.

    బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు. దేవుణ్ణి అన్వేషించేవాడే ‘విద్య’ను నిజంగా ప్రేమించేవాడు; విద్య అంటే, మార్పుచెందని సత్యం. తక్కినదంతా ‘అవిద్య’; అంటే సాపేక్ష జ్ఞానం.