ఒక్కసారి బ్రతికించు
ఒక్కసారి బ్రతికించు
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
పాపాలు పాపాలు ఘోరమైన నేరాలు
అందుకు నరకంలో శిక్షలు శులాల్తొ పొడుస్తారు
సలసలకాగే నూనెలో వేస్తారు ఱంపాలతో కోస్తారు
చిత్రహింసలు పెడ్తారు ఏం వింటేనే భయంగావుందా
అందుకే దేవుడి హుండీలో లక్షలూ కోట్లూ పోస్తున్నావా
స్వాములు బాబాల చుట్టూ తిరుగుతున్నావా?
నీకీసత్యం తెలియదేమో నరకంలో పెట్టే శిక్షలు
కాలిబూడిదైన నీదేహానికేమో నీ ఆత్మకు
కాదేమో నీ ఆత్మ నాశనరహితమైనది
గీతలో రెండో అధ్యాయం చదవలేదా??
నైనం చిందన్తి శస్త్రాణి నైనం దహతి పావక:
నచైనం క్లేదయన్త్యాపో నశోషయతి మారుత:
పుణ్యాలు చేస్తే హాయిగా పొందవచ్చు స్వర్గ సౌఖ్యాలు
మగచచ్చినాళ్ళయితే రంభాది అప్సర సంయోగాలు
ఏమి పిచ్చి ఆలోచలు ఏమి మూఢ విశ్వాసాలు
నువ్వు చేసే పాపపుణ్యాల ఫలితం నువు బ్రతికివుండగానే
అనుభవిస్తావేమో కొంచెం నిదానంగా ఆలోచించు భవితలో
కలిగే పరిణామాలను వూహించు వుహూ!
నీకు నమ్మకం లేదు నమ్మకం రాదు భయాంధోళనా
సమ్మిళతమైనభక్తితో నీపాపాలను
ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నావా?
ఓ అనంత విశ్వ సృష్టి కర్తా మానవాతీత
అఖండ శక్తి దాయకా నేను చచ్చిపోయాక
నా కట్టె కాల్చేలోపుగా ఒక్కసారి బ్రతికించు
చచ్చాక అంతా శూన్యమేనని ఇది నాస్వానుభవమని
ఈ నరకం స్వర్గం లేవని అబూతకల్పనలేనని
పాపపుణ్యాల ఫలితాలు ఇక్కడే అనుభవిస్తామని
ఈ సత్యాన్ని ఉద్ఘాటించి మళ్ళీ చచ్చిపోతా