ఏ దేశమేగినా ఎందు కాలిడినా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము


ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో జనియించినవాడ నీ స్వర్గఖండమున ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో నినుమోసె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యెందు లేదురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల ఝండాలు ఆడునందాక


అందాక గల ఈ అనంత భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ గీతములు

తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా శౌర్య హారము రాజ చంద్రులర్పింప రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా

దిక్కులకెగదన్ను తేజములు వెలుగ జగముల నూగించు మగతనంబెగయ రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర

వేలగిండీ దివ్య విశ్వము పుత్రా అవమానమేలరా అనుమానమేల భారత పుత్రుండనచు భక్తితో బలుక.