ఏబది వేల బేరము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
   ఈ కథను కె.రామానుజరావు పేరుతో w:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు రచించి 1910 సంవత్సరం w:ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురించబడినది.

చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము. సూర్యోదయము మొదలు రాత్రి పండ్రెండు గంటల వఱకును, ఆ వీధిలో నింటింట లక్ష్మి తాండవమాడుచుండును. ఆ వీధిలో ధనవంతులగు కోమటుల యొక్కయు, వారికంటె ధనవంతులగు గుజరాతీల యొక్కయు, వారి కంటెనెక్కుడు లక్ష్మీపుత్రులగు మార్వాడీల యొక్కయు నిండ్లుండుటచే వర్తకమునకు ఆ వీధి పుట్టిల్లనుటకు సందియము లేదు. రవ్వలు, కెంపులు, మొదలైన విలువ గల రాళ్ళు మానికలతో గొలుచునట్టి వర్తకులచ్చట నున్నారని చెప్పినచో ప్రతి ఇంటను రూపాయిలు, కాసులు, సవరనులు మొదలైన వెండి బంగారు నాణెములెల్లప్పుడును ఘల్లుఘల్లుమనుచుండునని వేరుగ జెప్పవలెనా?

ఒకనాఁడుదయము ఏడు గంటలవేళ జగజీవన్ లాల్ షాహుకారు యొక్క నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱ్ఱముల కోచి బండి యొకటి వచ్చి నిలచెను. ఆ బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱ్ఱపు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, అనగా గుఱ్ఱములను తోలువాఁడును, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. బండి వచ్చి నిలిచిన తోడనే వెనుకనున్న గుఱ్ఱపు వాండ్రిద్దరును దిగి ముందుకు వచ్చి గుఱ్ఱపు కళ్ళెములను పట్టుకొని నిలువబడిరి. ముందు నున్నతాసనముపై గూర్చున్న సేవకుఁడు దిగి యొద్దకు రాగానే యజమానుడు తన జేబులో నుండి తన పేరుగల విజిటింగ్ కార్డునొకదానిని తీసి వానికిచ్చెను. వాడు ఆ యింటి గుమ్మములో కూర్చున్న సేవకుని చేతికిచ్చి నీ యజమానునకీ కార్డు చూపుమని వానిని లోనికి బంపెను. జగజీవన్ లాల్ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్ నర్సాపూర్ అని చదివి తత్తరపాటుతో లేచి బండియొద్దకు వచ్చెను.

ఈ వర్తకుడు గొప్ప రాళ్ళ వర్తకుడని విఖ్యాతి జెందినవాడు. రవ్వలు, కెంపులు, పచ్చలు, వైడూర్యములు మొదలైన విలువైన మాణిక్యముల వర్తకమే యెల్లప్పుడును చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టడే ముట్టడు. ఆతని పద్దులన్నియు వేలు లక్షలు గల సంఖ్యలతో నిండియుండును. గొప్ప గొప్ప రాజులు, మహరాజులితని యద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను నమ్మికగా తీసికొని పోవుచుండిరి. ఆ రాజులకు తగిన మర్యాదలు చేసి వారిని సంతోషపఱచి, వారెక్కుడు తాళ్ళను గొనునట్లు చేయు సామర్ధ్యమీ ముసలి షాహుకారునకుం గలదు. అందుచేతనే ఒకానొక రాజు వచ్చెనని తెలిసిన తోడునే మన షాహుకారు తత్తరపాటుతో లేచి ఎదురేగెను. ఆతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, అచ్చట నిలుచున్న సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారుగారు దిగివచ్చి షాహుకారుతో, షేక్ హాండు చేసి "మీరేనా జగజీవనలాలు షేట్జీగారు" అని యడిగెను. అందుకాతడు 'చిత్తమని' తలయూపఁగా "నేడు బహు సుదినము. ఎన్ని దినముల నుండియో యనుకొనగా నేడు మీ దర్శనము లభించినది. కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను".

"చిత్తము మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, లోనికి దయచేయుడు" అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. వారి వెంటనే జమీందారు గారి భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు షాహుకారు నింటిలోనికి బ్రవేశించిరి. సాధారణముగా జమీందారుల భారలకు ఘోషాయున్నప్పటికిని ఈ జమీందారుఁడు ఇంగ్లీషు ఫ్యాషన్ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండఁజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా మాత్రము లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? అట్టే దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను.

వారందఱును లోనికి వెళ్ళిన తరువాత, ఆ షాహుకారు, మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై వెలగల కుర్చీలతోను, సోపాలతోను, పటములతోను, అలంకరించబడిన హాలులోనికిఁ దీసికొనిపోయి జమీందారుగారి నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును కూర్చుండుటకు చూపించెను. తానును జమీందారుగారి నెదుటనున్న యొక కుర్చీమీఁదఁగూర్చుండినిట్ల సంభాషింపఁదొడఁగెను.

జగ: "అయ్యా మీరు మా యింటికి వచ్చుట సుకలిత విశేషము. తమ రాజధాని ఏ జిల్లాలోదండి."

జమీం: "మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మిక్కిలి గౌరవము గల సంస్థానము. ఇతర జమీందారులకు లేని యనేక గౌరవములు మాకు కలవు. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీఁదగాని మేము కూర్చుండము. కాని నేనింగ్లీషు యెడ్యుకేటెడ్ జంటిల్ మన్ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడ తీసివేసితిని. అంతా నొక్కసారిగా తీసివేసిన బాగుండదని మావాండ్రు మగవారినెదుటనే కూర్చుండక కొంచెము ప్రక్కగా కూర్చుండుదురు. సంస్థానమునకని పేష్కన్ పోగా మూడు లక్షల ఆదా కలదు. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు గారు మీవద్ద నుండి కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము. బాల్యము నుండి ఒక ప్రక్కన పెరిగినట్లు పెరిగినాము."

జగ: "చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము. ఈ సంవత్సరము వారు నా వద్ద ఎంత లేదన్నా పది లక్షల జవారి కొన్నారు."

జమీం: "రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇదివఱకు రవ్వలనేకము కొంటినిగాని ఇట్టి వెన్నఁడును చూడలేదు. ఇంకను మీ వద్ద అట్టి రవ్వలు గలవా?"

జగ: "ఎన్ని ...వలయునో కలవు. కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?" అని అడిగి జమీందారుగారు తలయూపగానే లేచి లోనికిఁ బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుకనొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడఁగెను. అతడు ఇవి బాగున్నదని బాగుండ లేదనియు, అవి బాగున్నవి బాగుండలేదనియు జెప్పుచు దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు "మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెలఁ జెప్పవలయును సుమా"యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. ఒక గంట వఱకు రవల బేరము చేసెను. తుద కేబది వెలగల రవ్వలను బేరముచేసి విడిగా తీయించెను. వర్తకుడు ధర కొంచెమధికముగా జెప్పుచున్నను మన జమీందారు మాత్రము వాని ధరలు చక్కగ నెఱింగిన వాఁడగుటచే మోసపోలేదు. షాహుకారు జమీందారుగారి రత్నపరీక్ష జ్ఞానమునకు మిక్కిలి యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను.

ఇట్లు సిసలు పఱిచిన రవలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారుగారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్ లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె.

"అయ్యా అప్పనగా నాకు చీఁదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. మేము ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. రేపు రావలెనని తలంచితిమి. ఈ త్రోవన నేడు మఱియొక చోటికి పోవుచుండగా నదియో మీ యిల్లని మా బండివోడు చెప్పెను. అందుచే మిమ్ముల చుడవలెనని యాగితిమి. సరే చూచినందుకు లాభమేయైనది. మొదటనిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము వెంట తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండి యార్పేట వఱకు మనవాళ్ళును తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు" అని చెప్పి యాతడు వెంటనే లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెంటనే వెళ్ళిపోయెను.

భార్యాపుత్రులను తన ఇంటనే యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారుగారు మిక్కిలి మర్యాదగలవాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, అతని యుక్తికిని, మర్యాదకును, మిక్కిలి సంతసించెను.

జమీందారుగారు వెళ్ళి అరఘంటయిన తరువాత వాని సేవకుడు పరుగెత్తుకొని మేడమీదకి వచ్చి "దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదఁట, దొరగారు మఱచి ఇంటికి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు, నా చేతికిచ్చిన నేను త్వరగా వెళ్ళెదను. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది" అని తొందరగా పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాఁడు పదియడుగులు వేయఁగా మఱల వానినిఁబిలిచి ఏమో యాలోచించి 'గుత్తి నిటుతే'యని తీసికొని "దినములు మంచివి కావు. ఈ దినములలో ఎవ్వరిని నమ్మకూడదు. లక్షల కొలఁది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? ఇది వఱకు వీడు నమ్మిక కలవాఁడే గాని ధనముఁజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?" అని యడుగగా నాతడు "నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను. అని గంభీర వాక్కుతో తల యూపెను" అంతనామె అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని "సీతా సీతా"యని తన దాసిని పిలిచెను.

అంతవఱకా దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేద క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రముపైకి చక్కగ వినఁబడుచుండెను. యజమానురాలు పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. ముఖము మీద గూడ రవ్వల పతకములు, కెంపుల పతకములు, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. ఆ పిల్లవానిని తెచ్చి యిచ్చినతోడనే, యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి యచ్చట వేయించి వానినచ్చటఁబరుండబెట్టి భద్రమని దాసికిఁజెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువఁగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి "మీనమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని" షావుకారుతో చెప్పెను. అంతనాతడు నవి "కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరె నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మిక లేనియెడల కలియుగ మెట్లుసాగు"నని, "మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా" అని యడిగెను. అందుపై అట్టటనున్న సేవకులు "అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుఁడు నన్ను కోచిబండి మీదనే పంపెను. అది వాకిట సిద్ధముగా నున్నది" అని చెప్పెను. అంత నా యజమానురాలును, సేవకుఁడును బండిలో నెక్కి వెడలిపోయిరి.

యజమానురాలు వెడలిన కొంతసేపటికి యాదాసి షాహుకారు వద్దకు వచ్చి "అయ్యా బీదదానిని నన్ను మఱవకుడు. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసాని గారితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను" అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే అది "అయ్యా మాది శూద్ర జన్మము, కల్లుగాని సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి మీరు దయచేసిన రూపాయితో పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. "నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి" అని చెప్పి దాసి సారాయి అంగడి కొఱకు వెలుపలకు వెడలిపోయెను.

జగజీవనలాల్ షాహుకారు తనకా దినమున మంచి లాభము వచ్చెనని సంతసించుచు జమీందారుగారి రాకకెదురు చూచుచుండెను. పది ఘంటలాయెను. పదునొకండు ఘంటలాయెను. పండ్రెండు ఘంటల సమయమై "ధమ్మ"ని ఫిరంగి మ్రోత వినబడెను. దాసిగాని, జమీందారుగాని, అతని భార్యగాని, సేవకుడు గాని తిరిగి రారైరి. షాహుకారుకు గొంత సంశయము పుట్టఁదొడఁగెను. కానీ కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని యాతఁడు కొంతవఱకు సమాధానము చేసికొనెను. ఇంతలో నొంటిగంటయ్యె రెండు వేసిరి. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. పరుండి నిద్రబోవుచున్న పిల్లడైనను లేవలేదు. కొంత యేడ్వనైనను యేడువలేదు. అయ్యో! పాపము పిల్లవాఁడు ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని యా షాహుకారు ఆ పిల్లవాని యొద్దకుపోయి వాని నెత్తుకొని చూడ బోవనేమి యాశ్చర్యము! వాడు పిల్లవాడు కాడు. అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! అందుకా షాహుకారాశ్చర్యపడి తమ సేవకులనందఱిని పిలిచి దానిని చూపెను. తుదకు వారందఱును అదియొక మోసమని తెలిసికొని "మోసమైన మనకేమి మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి. వారెక్కడకుఁ బ్రోయిన మనకేమి" యని తలఁచి నగలకు మదింపువేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. ఆ నగలన్నియు నురు రూపాయల కంటె నెక్కుడు వెలచేయవు.

ఇదంతయు జూచి జగజీవనలాలు గుండె కొట్టుకొని యేడువసాగెను. పోలిసువారికీ సమాచారమును తెలిపిరి. రహస్యపు పోలిసువారు కొందఱును జగజీవలాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని నిశ్చయించి తిరిగివచ్చిరి.

ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చెఁ గదాయని చింతించుట తక్క జగజీవనలాలుకు మఱియోమి యుపాయమును లేకపోయెను.