ఏను నిద్దుర వోదునో యేమొ, కరుణ

వికీసోర్స్ నుండి

ఏను నిద్దుర వోదునో యేమొ, కరుణ

సెలవు గైకొన కేగగా వలదు; ఇన్ని

నాళ్ళ యెడలేని యెడబాటు నా నిరీక్ష

ణమ్ము బరువులు బరువులై నయనయుగళ

మయ్యె, దిగలాగు నిద్దురమరపులకును.


ప్రియతమా, ఇక నిదురింతు పిలువబోకె,

బాసిపోకు నిర్భాగ్యపు బ్రదుకు దాటి!

ప్రియతమా, పొరలి పొరలి మొయిళు లేవొ

మేలుకొననీవు రెప్పల వాలి యదిమి!


ఎటు లెగసి యెగసిపడుదు! ఎటులు బేల

కేల నిన్నంటి యదిమికో తూలిపోదు!

అబ్బ! నా బ్రతుకంట నీ యడుగుదోయి

నాప, ప్రియతమ శృంఖలమ్మై పెనంగ,

దిక్కుమాలిన యెడద బంధింపలేను!


ప్రియతమా, నిను వదలికోలేను, నిదుర

కడలియై కాటుకై కనుగవ నడంచు!

ప్రియతమా, వీడిపోకోయి, వీడలేని

నా మమతచిచ్చు కునుకునా నన్నుబోలి!