ఏను తొలుత నే గూడేని లేని పులుగు
స్వరూపం
ఏను తొలుత నే గూడేని లేని పులుగు
రాయడ, వహించినాడ నా బ్రతుకు బాట
నాట నవయని రెక్క యుయ్యాల కొనల
తెరువె లేని, తీరమె లేని దివ్యసీమ!
అంత నే మారిపోతి సంధ్యామనోజ్ఞ
చిత్రసిందురరేఖగా, చేయి చెయిగ,
మెయి మెయిగ, హాయి హాయిగా మెలగినాను
పైడివన్నియతో నీలినీడతోడ!
నేను మెలమెల్ల రిక్కనైనాను; కాని
ఆ విశాల వినీలసౌధాంతికమున,
ఉండగలనా ప్రవాసినై ఉడుసఖాళి
పలుకరింపక యొక రెప్పపాటు వేళ!
ఇపుడు నే నొక్క తుదిరేయు యిరులచాయ
నెగసికొని చిమ్ముకొని నటియించుకొనుచు
అలము వెలుగుల పరువుల కులికి పారి
కుంచుకొని రిచ్చవడి క్రుంగి క్రుంగి యలసి
యిపుడు నే నొక్క తుదిరేయి యిరులచాయ
నై నశించుచున్నాను....