ఎందరో వికీమీడియన్లు/సమాచార సేతువు

వికీసోర్స్ నుండి

సమాచార సేతువు

కుటుంబసభ్యుల మధ్య అభిరుచులు, ఆసక్తులు, నైపుణ్యాలూ కలవాలని ఏమీ లేదు. చాలాసార్లు కలవవు కూడాను. అందుకే వికీలో ఒక వ్యక్తి కృషిచేస్తుంటే కుటుంబసభ్యులు వారిని ప్రోత్సహించడమే తప్ప తామూ నేరుగా వచ్చి కలసి పనిచేయడం తక్కువ. అందుకు మినహాయింపుగా నిలచే కొద్దిమందిలో ఎ.మురళీ గారొకరు. తెలుగులో వికీపీడియా, వికీసోర్సు, విక్షనరీ వంటి ప్రాజెక్టులన్నిటిలోనూ గట్టిగా పనిచేస్తున్న రాజశేఖర్ గారు ఈయన తమ్ముడే. రాజశేఖర్ గారు వికీలోకి వచ్చిన దశాబ్దానికి ఎందుకో ఏ విధంగానో తన అన్నగారి మనసులో కూడా తెవికీలో కృషిచేయాలన్న ఆలోచన విజయవంతంగా నాటారు. నారుపోసినవాడే నీరూ పోశాడు. అంతే, ఆ అత్యంత వేగంగా మహావృక్షంగా ఎదిగి తెలుగు వికీసోర్సులో మధురమైన ఫలాలను అందిస్తోంది.

తెవికీసోర్సులో పుస్తకాల మీద క్రమంతప్పక కృషిచేస్తున్న కొద్దిమందిలో ఈనాడు మురళీ గారొకరు. ప్రత్యేకించి - భారత శిక్షాస్మృతి, చలనచిత్ర చట్టము, ఆహార కల్తీ నివారణ చట్టము, జనన మరణ రిజిస్ట్రీకర చట్టము వంటి డాక్యుమెంట్లను తెవికీసోర్సు ద్వారా డిజటలీకరించి చట్టాలను గురించి తెలుసుకునే అవకాశాన్ని ప్రతీ ఒక్కరికీ కల్పించే చక్కటి కృషిని ఆయన చేస్తున్నారు. తెవికీసోర్సుతో పాటుగా ఇంగ్లిష్ వికీసోర్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల చరిత్రకు సంబంధించిన ఆంగ్ల రచనల మీద కూడా పనిచేస్తున్నారు. అలా అందుబాటులో లేని అవసరమైన సమాచారాన్ని డిజిటలీకరణ ద్వారా అందరికీ అందిస్తున్న సమాచార సేతువు ఆయన.