ఎందరో వికీమీడియన్లు/మెగామీడియన్

వికీసోర్స్ నుండి

మెగామీడియన్

వికీలో విధానాలు మార్గదర్శకాల పట్ల సందేహాలున్నాయా? వికీలో కాపీహక్కుల గురించి డౌటా? వికీమీడియా వారి గ్రాంటులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారా? జనానికి తెవికీని పరిచయం చేసే ఔట్‌రీచ్ కార్యక్రమం పెట్టాలా? అన్నిటికీ ఒకటే అడ్రసు - పవన్ సంతోష్. కాలేజీల్లో ఔట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు వికీపీడియాను పరిచయం చేసినా, మహిళలకు ప్రత్యేకించి తెవికీ శిక్షణ కార్యక్రమం పెట్టినా, సిఐఎస్ తరఫున శిక్షకులకు శిక్షణ ఇచ్చినా, అన్నిటి లోనూ పవన్ మార్కు వ్యూహం, ప్రణాళిక, ఫినెస్ ఉంటాయి. తెవికీలో ఇప్పుడు విరివిగా రాస్తూ అగ్రస్థానాల్లో ఉన్న కొందరు వికీపీడియన్లకు శిక్షణ నిచ్చి, వాళ్ళకు వికీ వ్యసనం మప్పిన వ్యక్తి పవనే. వికీల అభివృద్ధికి తోడ్పడుతున్న వికీమీడియన్ల అభివృద్ధికి తోడ్పడుతున్న వికీమీడియన్ అతను - మెటామీడియన్ అతను. మెగామీడియన్!

ఇంటా బయటా, వికీమీడియా ప్రాజెక్టుల లోనూ ఔట్‌రీచ్ లోనూ విశేషంగా కృషి చేసిన పవన్ వంటి వికీమీడియన్లు అరుదుగా ఉంటారు. ఇతర భాషల ప్రాజెక్టుల లోనూ, మెటా లోనూ, వికీ బ్లాగు "డిఫ్" లోనూ తెలుగు వికీమీడియా వాణిని వినిపిస్తూంటాడు. వీటికీ తోడు పుస్తకాలు రాస్తూంటాడు. యూట్యూబరు కూడా. మాతో పనిచెయ్యంటూ సిఐఎస్‌ వాళ్ళు అతన్ని తీసుకున్నారు. అతని రోజులో 25 గంటలుంటాయని వాళ్లక్కూడా తెలిసిపోయినట్లుంది.

చక్కటి భాషలో, సమాచార భరితంగా ఉంటాయి పవన్ వ్యాసాలు. వివాదాస్పద విషయాలను కూడా పటిష్టమైన ఆధారాలతో వివాదానికి ఆస్కారం లేకుండా రాస్తాడు. అదీ పవన్ పవర్. మంచి వ్యాసం ఎలా ఉండాలి అనే దానికి తెవికీలో ప్రమాణాలు స్థాపించాడు. 2016 ఏప్రిల్ లోనే వంద రోజులు వంద వ్యాసాలు లక్ష్యాన్ని చేరుకుని తెవికీలో ఆ బీజాన్ని నాటాడు. ఆ తరువాత అది అల్లుకుని పది మందికీ అంటుకుంది.

మామూలుగా మలయమారుతం లాగా హాయిగానే వీస్తూంటాడు పవన్. నిర్వాహకత్వ బాధ్యతల్లో భాగంగా దుశ్చర్యలను ఎదుర్కొనేటపుడు, అవసరమైతే వడగాడుపూ కాగలడు. 2023 లో వికీ కాన్ఫరెన్సు, 2024 లో తెవికీ పండగ జరిగినపుడు పవనే ముందు ఉన్నాడు. ముందు ముందు జరిగే పండగలకూ ముందుంటాడు. 2021 ఫౌండేషను బోర్డు ఎన్నికలలో పోటీ చేసాడు.

తెలుగు వికీపీడియా తరఫున ప్రపంచానికి రాయబారి పవన్ సంతోష్.