Jump to content

ఎందరో వికీమీడియన్లు/జిజ్ఞాసువు

వికీసోర్స్ నుండి

జిజ్ఞాసువు

పదిహేనేళ్ళ కిందట తెవికీలో కృషి మొదలుపెట్టిన వ్యక్తి సుల్తాన్ ఖాదర్. తెలుగు సినిమా, గ్రంథాలయాలు, పంజాబ్ ఎడిటథాన్, ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం వంటి అనేక వికీప్రాజెక్టుల్లో పనిచేసి వికీ అభివృద్ధికి తోడ్పడ్డాడు. సినిమాలు, రాజకీయాలు, జీవితచరిత్రలు వంటి అనేక అంశాలపై రాస్తారు.

వైవిధ్యమైన అంశాలపై వ్యాసాలు రాయడమే కాదు, ఇస్లాముకు సంబంధించిన పలు వ్యాసాలు రాసి తెవికీకి వైవిధ్యం తీసుకువచ్చిన వారిలో సుల్తాన్ ఖాదర్ ఒకరు. మతపరమైన అంశాలపై రాసినప్పటికీ, కొన్ని మత సంబంధ వ్యాసాల్లో వేడిగా చర్చలు జరిగినపుడు ఆ చర్చలకు దూరంగా ఉండి సంయమనం పాటించాడు, సుల్తాన్ ఖాదర్. బహుశా, తెవికీ అనేది విస్తృతమైన విజ్ఞాన సర్వస్వం అనే భావన పట్ల ఆయన కున్న నిబద్ధత అందుకు కారణం తప్ప మరొకటి అయి ఉండే అవకాశం లేదు. చర్చల్లో సౌమరస్యం, వివాదాస్పద అంశాలపై సంయమనంతో రాయడం సుల్తాన్ ఖాదర్ విశిష్టత. సహజంగానే 2014 లో ఆయనకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారం వచ్చింది.

సుల్తాన్ ఖాదర్ వలన ఇతర వికీపీడియన్లకు ఒక పెద్ద ప్రయోజనం ఉంది. తనకు తెలీని సంగతుల గురించి ఊరుకోరాయన, చర్చ లేవదీస్తారు. దానివలన ఆయనతో పాటు ఆనేకమంది ఇతరులకు కూడా దాని గురించిన సమాచారం తెలుస్తుంది. ఆ విధంగా ఆయన జిజ్ఞాస వలన అనేకసార్లు జ్ఞానవితరణ జరిగింది.