ఎంతో రమ్యమై యున్నది

వికీసోర్స్ నుండి


పల్లవి:
ఎంతో రమ్యమై యున్నది - రాములభవన
మెంతో రమ్యమై యున్నది
కంతుకోటిజితకాంతి గలిగి భువి
సంతతమును రామచంద్రులుండు గృహ ||ఎంతో రమ్యమై||

చరణం1:
పావన మైనట్టి భక్త కదంబము
సేవసేయఁగ మన సీతావరునిగృహ ||ఎంతో రమ్యమై||

చరణం2:
ఇంపుగ వీణ వాయించుచుఁ గీర్తన
లింపుగ జేసి కీర్తింప రాముని భవన ||ఎంతో రమ్యమై||

చరణం3:
క్రొత్తగ వ్రాసిన చిత్తరు ప్రతిమలు
మొత్తమై మెఱయ రఘూత్తముని సదన ||ఎంతో రమ్యమై||

చరణం4:
వాసి గలుగు భక్తవరులు గూడి నుతిఁ
జేసి వేడువేళ శ్రీరాముల సదన ||ఎంతో రమ్యమై||

చరణం5:
కోరి వేడు తూము నారసింహునిఁ బ్రోచు
ధీరుని భద్రాద్రి విహారుని సదనము ||ఎంతో రమ్యమై||