ఎంతో మహానుభావుడవు
స్వరూపం
ఎంతో మహానుభావుడవు నీవు ఎంతో చక్కని దేవుడవు వింతను చేసితివీ లోకమందున సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర
తొలివేల్పు జాంబవంతుని చేసినావు మలివేల్పు పవనుజుగా జేసినావు వెలయ సూర్య సుగ్రీవుగ జేసినావు ఇల సర్వసురలకోతుల జేసినావు
కారణ శ్రీసీతగ జేసినావు గరిమ శేషుని లక్ష్మణుని జేసినావు ఆ రెంటిని భరతశత్రుఘ్నుల జేసినావు నారాయణ నీవు నరుడవైనావు
రాతికి ప్రాణము రప్పించినావు నాతి యెంగిలి కానందించినావు కోతిమూకలనెల్ల గొలిపించినావు నీటిపై కొండల నిల్పించినావు
లంకపై దండెత్తి లగ్గెక్కినావు రావణ కుంభకర్ణుల ద్రుంచినావు పంకజాక్షిని సీత పాలించినావు లంకేశు దివ్యపుష్పక మెక్కినావు
పరగ నయోధ్యకు బరతెంచినావు పట్టాభిషిక్తుడవై పాలించినావు వర భద్రగిరియందు వసియించినావు ధరను రామదాసు దయ నేలినావు