Jump to content

ఉదాహరణపద్యములు

వికీసోర్స్ నుండి

త్రిపురవిజయము

సీ.

స్ఫురితవిశ్వంభరాభూతంబు రథము త
              ద్రథ మధ్యమునఁబొల్చు రాతివిల్లు
విల్లు విడ్వకతిర్గు వెలుగుఁ జక్రంబులు
              చక్రారి కులపతి చారునారి
నారి బట్టగ బారు నాగరికపు గరి
              కరిమీద విహరించు ఘనశరంబు
శరము నాభినిగన్న శతవృద్ధు సారథి
              సారథిమాటలు సైంధవములు
గాఁగ నేగిఁ గడకతోఁ బురములు
గెలిచివచ్చి గెలుపు గిరజతోఁడ
చెలఁగి చెలఁగి చెప్పి చెలువొందు శంభుండు
కాచుగాత మనలఁ గరుణతోడ.

1

(సోమయాజి)

సీ.

బాణంబునకు నారి పంకింపదని కాని
              గరి గన్నముడిగి నివ్వెరగు నొందు
బలువు రొక్కటమెట్టి బలువైనదని
              యరదంబుసాగ దొక్కడుగునైన
మృదుపదక్రమశుద్ధి బెనువైనవని కాని
              హరులు చూపట్టవే యనువునందు
మిగుల నేర్పరియని మేటి మాటయ కాని
              జడుఁడు సారథి యెన్నిచందములను
చక్రయుగ్మంబు సరివిధి జరుగు టరిది
విల్లు పెనుపున మోపెట్ట వీఁగుబలము
లనక త్రిపురంబు లొకకోల నవని గూల్ప
నీక చెల్లినయదికాదె నీలకంఠ.

2

(ఎఱ్ఱాప్రెగడ)

సీ.

ఓజుచే ముట్టక యొగ్గానఁ బట్టక
              చక్కఁగా దివిఁబాఱు చక్రమునును,
లాయానఁ గట్టక లలిమేఁత వెట్టక
              వర్ణహీనంబయిన వారువములు,
తవన వెట్టక జీవితము కాసు ముట్టక
              సత్త్వసంపద చూపు సారథియును,
కడచీల దట్టక ఘనముగా మెట్టక
              గంభీరసంపద గలుగునిరుసు,
గలిగి తనరారు నరదంబుఁ గడఁక నెక్కి
త్రిపురవిజయంబుఁ జేకొన్న దేవదేవుఁ
డిందుశేఖరుఁ డానందమందిరుండు
మనల గరుణావిధేయుఁడై మనుచుగాత!

3

(రంగనాథుఁడు)

సీ.

తొలిపల్కు మునికోలఁ దోఁచు వారువములు
              వారువములఁ గన్న సారథియును
సారథిఁగన్న యస్త్రము నస్త్రమునుమోచు
              గరి గరితోడ దొడరెడు నారి
నారిమీఁదటి తేరు తేరిమీఁదటి విల్లు
              నా విల్లుపై బంటు లరుగు పథము
మెఱుఁగుఁ జిప్పలజోడు మెయిజోడుపైగతుల్
              గతులపై విజ్జోడుకండ్లు గండ్ల
సరి వెలుఁగుచున్న ములికియు సంఘటించి
విషమలక్ష్యముల్ సమదృష్టి విరుగనేసి
జయము చేకొన్న విలుకాఱ చక్రవర్తి
కరుణ దళుకొత్త మనలను గాచుఁగాత.

4

(భాస్కరుఁడు)

సీ.

సారథి శతవృద్ధు చక్రంబు లొనఁగూడి
             జరగపు రథమున సంఘటించి
యుదకంబు చోకున కోర్వని యరదంబు
             చేతికి బిరుసైన ఱాతివిల్లు
గఱితాకు కోర్వక గడగడ వడకుచు
             మువ్వంక వోయెడి చివ్వనారి
మేపు నీరును లేక మెదలాడనోపక
             వర్ణహీనంబైన వారువములు
నిట్టి సాధనములు నీకు నెట్టులొదవె
త్రిపురముల నెట్లు గెలిచితి దేవదేవ
యనుచు నగజాత చెలులాడ నలరు శివుఁడు
చిత్త మిగురొత్త మనల రక్షించుగాత.

5

(చిమ్మపూడి అమరేశ్వరుఁడు)

సీ.

తలకమ్మి కొండయు విలుకమ్మి కొండయుఁ
             గడయును నడుముగాఁ గలుగుతేరు
సరసిజముకుళంబు సద్వాక్యసకలంబు
             మాతయు నాలియౌ మాతలియును
మిన్నులఁజనువాఁడు కన్నులవినువాఁడు
             నంక పర్యంకంబులైన శరము
చల్లని పవనంబు నెల్లయిన భువనంబు
             మేఁపును మోఁపుగా మెలఁగు నారి
కాఁక కోర్చువిల్లు గఱిగల గుఱ్ఱాలు
పగలు రేయునుఁ దిరుగు బండికండ్లు
గలుఁగఁ బురజయంబుఁ గైకొన్న నినుఁగొల్తు
చిరశుభాంక సోమశేఖరాంక.

6

(పాలకురితి సోమయ్య)

సీ.

తివిరి రాశికి నెక్కి తిరుగు చక్రంబులు
             మెట్టులఁ బదిలమయి మెఱయుతేరు
బహుముఖంబులనేర్పు పచరించు సారథి
             వ్రాసి చూపగరాని వారువములు
గట్టియై వీఁక నక్కఱదీర్చు విలుగమ్మి
             శ్రుతిహితంబుగ మ్రోఁత చూపు నారి
విజయానుకూలంబు విలసిల్లు బాణంబు
             సరిలేని కోటు లసంఖ్యబలము
దనకు నబ్బుటయునుఁ బురత్రయము గెలిచి
పృథులవిఖ్యాతిఁ గైకొన్న రథికవరుఁడు
జయముఁ దేజంబు భూతియుఁ బ్రియమెలర్ప
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత.

7

(కానుకొల్ని అన్నమరాజు)

సీ.

వరఘోటములు సూతు వదనంబునని చూచు
             సూతుండు కార్ముక స్ఫురణ సూచు
కార్ముక మరదంబు గదియంగ ననిచూచు
             నరదంబు బాణంబు నందఁ జూచు
బాణంబు గరి బట్టి యాడఁగఁ జూచు
             గరి మౌర్విచిత్తంబు గలఁపఁజూచు
మౌర్వి చక్రంబుల మాయింతునని చూచు
             జక్రముల్ భటకోటి జయము చూచు
గాన యేమి సెప్పఁగా నిట్టిగతి చోద్య
వేద్య మెందునయిన వినఁగఁ గలదె
త్రిపురవిజయదామ ధీరతాగుణభీమ
రథికసార్వభౌమ రాజమౌళి.

8

(పేరమరాజు జక్కన)

సీ.

కొండంత హేమకోదండంబు విలసద
             హీనగుణంబున నెక్కువెట్టి
హరినీలమణికాంతి యగునమ్ము శరధి పొం
             దెడలించి వలచేత నేర్చిపట్టి
స్వరముల సకళించు వారువంబుల గుణా
             ధార భూతంబగు తేరఁ బూన్చి
నలుదిక్కులను జూడ్కు లొలయంగ సకలంబుఁ
             గనువాని సారథిగా నొనర్చి
కడఁగి రథచక్రములు తన కన్నులట్ల
యేమఱకయేఁగి త్రిపురంబు లేర్చి సకల
లోకములు నెమ్మిఁబ్రోచు పినాకపాణి
మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత.

9

(మారన)

సీ.

జడివట్టుఁ బడగలు పడగల మీఁదిచోఁ
             గదలెడి కండ్లును గండ్ల నడుపు
సూత్రించు జోడును జోడుపైఁ జరియించు
             బంట్లును బంట్లకుఁ బాయరాని
ధనువును ధనువుతోఁ దగిలిన యరదంబు
             నరదంబు క్రిందికి నరుగు నారి
నారి నిద్రించు బాణము బాణ మొదవించు
             సూతుండు సూతసంజాతహరులు
గాఁగ నద్భుతార్థకరపదార్థావళి
యుల్లసిల్ల నొప్పుచున్న దిపుడు
త్రిపురహరణకరణదృఢదత్తవీర మ
నోరథంబు దేవ నీరథంబు.

10

(నిశ్శంకుని కొమ్మయ)

చ.

కదలదు తేరు రథ్యములు గట్ట నశక్యము సూతుఁడంటి మా
ముదుసలి చక్రముల్ సరసమోపవు విల్లు బరళ్ళు నారియున్?
గుదిగొను నమ్ము శార్ఙ్గమునకుం బనుపడ్డది గాన వింతపెం
పొదవఁ బురత్రయంబు నెటు లోర్చితివో త్రిపురాంతకేశ్వరా.

11

(జైతరాజు ముమ్మయ – విష్ణుకథానిదానము)

అర్ధనారీశ్వరము

ఉ.

పామును హారము న్నెలయఁ బాపటసేసయు నేఱు మల్లికా
దామము తోలు దువ్వలువు దట్టపుభూతియుఁ జందనంబు మై
సామున జాలనందముగ సన్నిధి సేసినఁ జూడఁ గంటినే
నామదిలోఁ గుమారగిరినాథుని శైలసుతాధినాథునిన్.

1

(రావిపాటి త్రిపురాంతకుఁడు)

సీ.

తల్లిదండ్రులతోడి తగు లొల్లకుండియుఁ
             దల్లిదండ్రుల తోడి తగులు వలచి
కందర్పు మీఁది యక్కటికంబు సెల్లియుఁ
             గందర్పు మీఁది యక్కటిక మొదవి
సంసార కేలీప్రసక్తిఁ వోదట్టియు
             సంసారకేలీప్రసక్తి గలిగి
సగుణవిశేషయోజన ముల్లటించియు
             సగుణవిశేషయోజనము మరఁగి
సగము పురుషుండు కంజాక్షి సగముగాగ
నర్థనారీశ్వరాకృతి ననువు పఱచి
హరుఁడు తల్లింగమధ్యంబు నందునుండి
హరివిరించుల కంతఁ బ్రత్యక్షమయ్యె.

2

(నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము)

సీ.

కెంజాయ జడముడి కేశపాశంబును
             బూపచందురుఁడును బూవుదండ
యురగకుండలమునుఁ దరళతాటంకంబు
             వనజాప్తుఁడగు కన్ను వాలుఁగన్ను
ముదు(పంబుగ)లపేరు ముత్యాలహారంబుఁ
             గడుఁ గొంచెమగు జన్ను ఘనకుచంబుఁ
బులితోలుదుప్పటి వెలిపట్టుచీరయుఁ
             బాపపెండెంబును బసిఁడియందె
మృదువుఁ దెలుపును నగుభూతి మృగమదంబు
నింతయొప్పునె కుడివంక నెడమవంక
నిమ్మహాదైవమున కని యిచ్చమెచ్చి
యర్ధనారీశ్వరునిఁ గొల్చి రఖిలజనులు.

3

(పెదపాటి సోమయ – కేదారఖండము)

శివస్తుతి

సీ.

కహ్లారమకరంద కలితమందాకినీ
             లహరీపరీతకోలాహలంబు
బాలేందుచంద్రికా పరభాగశోభాప
             రాగసంభావితారగ్వధంబు
సేవాసమాసన్న సిద్ధసీమంతినీ
             తాలవృంతోత్తాలతాండవంబు
కాత్యాయనీదత్తకర్ణావతంసక
             ర్పూరఖండామోదపూరితంబు
మారుతంబు నా ముందట మలసియాడఁ
గలుగునొకో యొకనాఁడని కన్నులార
శివుని జూచెడి పుణ్యంబు చింత మెఱయ
మొదలివేలుపుఁ బొడఁగంటి మ్రొక్కగంటి.

(సోముఁని హరివంశము 2.173)

సీ.

గరళకూటవినీలకంఠాయ శంభవే
             మదనాంతకాయోన్నమఃశివాయ
కాద్రవేయాధిప గ్రైవేయభూషాయ
             మధుజిత్సకాయోన్నఃశివాయ
కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ
             మహలోలుపాయోన్నమఃశివాయ
వేదాదినిశ్శేషవిద్యావధూమౌళి
             మణికలాపాయోన్నమఃశివాయ
గంధదంతావళజలంధరాంధకాది
విబుధపరిసంధివాహినీనిబిడగర్వ
బంధఘోరాంధకారసంభారకిరణ
మాలినే శాశ్వతాయోన్నమఃశివాయ.

(శ్రీనాథుని భీమఖండము 3.210)

ఉ.

వాలినభక్తి మ్రొక్కెద నవారితతాండవకేలికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్
బాలశశాంకమౌళికిఁ గపాలికి మన్మథగర్వసర్వతో
న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాలికిన్.

(బమ్మెర పోతరాజు – బాగవతము)

సీ.

పాతాళకుహరంబు సరగు సొమ్ములపెట్టె
             వెలుకుగుబ్బలి పెద్దకొలువుమేడ
కలశపాథోరాశి కరమొప్పు వంటిల్లు
             మలగి పారెడు నీరు మ............
శరథికూఁతురు గుబ్బచనుదోయి కనదొన
             విద్దుఁ దాపసునెమ్ము వింటిబద్ద

చెన్నొందు దితికుక్షి చీరలడిండిగం
             బింట గట్టని కొండ యెక్కిరింత
........రాకారమైన యాకాశమెల్లఁ
             బూవుఁ జంద్రిక నలువ నెమ్మోముదమ్ము
లశ్వశాలలునై నీకు నమరుఁగాదె
             వర్ణితాసూన చిద్భావ వామదేవ.


లయగ్రాహి.

సింధుర నిశాటమద సింధుఘట జన్ము సుర
             సింధు కనకాంబురుహ గంధవిచరత్సు
ష్పంథయవితత్యసిత బంధుర జటాపటల
             బంధ విలసత్కుముద బంధి (బ్రమదాస)
(మ్మంధ) లలితాంగు నను సంధిత జగత్కుశలుఁ
             గంధర వినీలతర కంథరును(దార)
స్కంధ వృష వాహనుఁగబంధమథనప్రియు జ
             లంధరుహరుం గొలి(చెనతఁడంతకవిరోధిన్)

(పోతరాజు భైరవుని శ్రీరంగమాహాత్మ్యము)

సీ.

ఎనిమిది రూపంబు లేకమై కనుపట్టి
             దీపించు నెవ్వాని దివ్యమూర్తి
గణుతింపఁదగు దేవగణముల యాఁకలి
             వెసదీర్చు నెవ్వాని నొసలి కన్ను
రాదసంబున జొరరాని చోటులు చొచ్చె
             వడిమెయి నెవ్వాని వాహనంబు
నాణెమై యరువది నాల్గుపీఠములందు
             రాణించు నెవ్వాని రాణివాస

మనఁగనుంగొనఁ బాయరానట్టి మోహ
మిచ్చి నొదవించు నెవ్వాని యిల్లువిల్లు
బెరయు నెవ్వాని పలుకులు బేసియగుచు
నెందు నెవ్వాని సేవింతు రెల్లసురలు.

(నిశ్శంకు కొమ్మయ)

సీ.

దీపించు నే వేల్పు దివ్యాలకంబులఁ
             గాళీకుచాంగరాగంబుభూతి
కొమరొందు నేవేల్పు గురుజటాభరసీమ
             నమృతాంశుఖండంబు నభ్రగంగ
కడుమించు నేవేల్పు గాత్రవల్లిక చుట్టు
             వ్యాఘ్రచర్మము వారణాజినంబు
కరమొప్పు నేవేల్పు కంఠపీఠంబున
             భుజగేంద్రహారంబు పునుకపేరు
నట్టి వేలుపు శంకరుండాదిమూర్తి
వేదవేదాంతవేద్యుండు విశ్వభర్త
విసకితోజ్జ్వలవదనారవిందుఁడగుచు
నుచి(తరీతిఁ) బేరోలగం బున్నయంత.

(శ్రీగిరన్న – శ్రీరంగమాహాత్మ్యము)

సీ.

ఔఁదలం జదలేటి లేఁదరంగంబులు
             బాలచందురుని నుయ్యాల (లూఁపఁ)
దొడవుల తలలఁ జెన్నడరు మానికముల
             చాయ దిక్కుల నెఱసంజ పఱుపఁ
దోరంపుటేనికతోలి యుత్తరికప్పు
             కుత్తుక కఱతోడఁ బొత్తుసేయ
బూడిదపూతల బూదర సరచిన
             పునుకలపే రురంబునఁ దలిర్ప

మూడు లోకంబులును గాద మొరసినట్లు
చేతముమ్మొన కైదువు (చెన్నుమీఱ)
వేల్పుఁబదువుచూడ్కికిం గడువింతవేడ్క
సేసె ముక్కంటియున్న యా చెలువుపెంపు.

(ప్రబంధపరమేశ్వరుని హరివంశము ఉత్తర.6.38)

సీ.

తమ్ముల బెదరించిఁ దళుకువెన్నెలసోగ
             కన్నె గేఁదగిఱేఁకు గారవింపఁ
బదినూఱు పడగలఁ బఱపైన పదకంబు
             సవడి ముత్యపుబన్ననరముఁ బ్రోవ
మిసమిసమనమించు భసితాంగరాగంబు
             వరఁగుజందనచర్చఁ బరిఢవింప
మెఱయు మువ్వన్నె లమరుపుట్టముకొంగు
             చెఱఁగులునునుబట్టు చేలఁ బెనుప
మించి తలమీఁద నురువుపై మేనఁగట్టి
యీడుదోడుగ నుమతోడఁ గూడి జగము
లెల్ల రక్షించు నిను భజియింతు మెపుడు
భయదదురితలతాదాత్ర ఫాలనేత్ర

(పోతరాజు వీరయ్య – త్రిపురవిజయము)

శివతాండవము:

మ.

కరఢక్కారవవాద్య మింపొదవ గంగాతుంగరంగత్తరం
గరవప్రస్ఫుటతాళసమ్మిళితతత్కంజాతపుంజస్ఫుర
ద్వరపుష్పంధయమంథరధ్వనులు గీతంబొప్పఁ దౌర్యత్రికం
బిరవైయుండఁగ నీదు తాండవమునం దేపారు సర్వేశ్వరా!

(జైతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము)

ఉ.

ఆడఁగ గెంజడల్ దొలకి యాడఁగ జాహ్నవి దిక్కులెల్ల న
ల్లాడఁగ భూతధాత్రి యసియాడఁగ దారము నాకసంబు నూ
టాడఁగ ముజ్జగంబుఁ గొనియాడఁగ నిచ్చట నీవు తాండవం
బాడఁగ గౌరి నిన్సరసమాడఁగ జేరునటే మహానటా.


శా.

ఆడెం దాండవ మార్భటిన్ పటహలీలాటోప విస్ఫూర్తి సం
క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ
క్రోడాఘాటకరోటికోటరకుటూకోటీలుఠచ్ఛిందు వీ
చీడోలాపటలీపరిస్ఫుటతరస్ఫీతధ్వనిప్రౌఢిమన్.

(శ్రీనాథుని భీమఖండము 4.148)

సీ.

కపిలజటాజూట గంగాసముత్తుంగ
             వీచీఘటలు మిన్ను వీఁకదాఁకఁ
బ్రబల బాహార్గళ పరికంపితస్ఫార
             ఢక్కాధ్వనిని దిశల్ పిక్కటిల్ల
జ్వాలాకరాళ భీషణ శారదస్థూల
             శూల యుద్ధప్రభల్ సూర్యుఁ బొదువఁ
బ్రకట బంధుర దీర్ఘ పటువజ్ర నిష్ఠుర
             పదఘట్టనము లుర్వి యదలనొదవ
విమల శార్దూల చర్మాంచలములు దూల
మహిత మండన ఫణిఫణామణులు గ్రాల
నసమ రౌద్ర రసావేశ మావహింప
నారభటి భూరితాండవం బాచరించె.

(పోతరాజు వీరయ – త్రిపురవిజయము)

అంబికాస్తుతి

చ.

చులుకనఁ జాపముం దిగుచుచోఁ గటకాముఖపాణిమీఁదఁ బొ
ల్లొలయు నఖాంశులం గదిసి యొప్పెడు గెంజిగురాకు గుత్తిచే
నలవడి కర్ణపూరమున నంటిన తుమ్మెదవోని పార్వతీ
లలన కటాక్షదృష్టి మనలం జరితార్థులఁ జేయుఁ గావుతన్.

(కానుకొలను అన్నమరాజు – అమరుకము)

ఉ.

కూడెడు వెండ్రుకల్ నిడుదకూఁకఁటఁ బ్రోవఁగ జోడు పైవళుల్
(జూడగ) దోఁపఁ గ్రొమ్మొలకచన్నుల మించు దలిర్ప సిగ్గునం
జూడఁగ నేరముల్ మెఱుఁగుఁజూపుల నీన హిమాద్రియింట నీ
వాడుట శూలికిన్ మనమువాడుట గాదె తలంప నంబికా.

(త్రిపురాంతకుఁడు – అంబికాశతకము)

సీ.

ప్రణవపీఠిక నెక్కి భాసిల్లు నేదేవి
             యామ్నాయహేమహర్మ్యాగ్రవీథిఁ
జరియించు నేదేవి సహజారుణజ్యోతి
             రానందమూర్తియై బ్రహ్మనాడి
నేదేవి ఠవణిల్లు నిచ్ఛాక్రియాజ్ఞాన
             శక్తిభేదమున విశ్వంబు నిండి
తోడునీడయుఁ బోలెఁ దులకించు నేదేవి
             యెల్లకాలంబు విశ్వేశుఁ గూడి
యట్టి దేవి జగన్మాత యఖిలవంద్య
నిఖిలవిద్యాకళేశ్వరి నిత్యమహిమ
నొకతెయును శ్రీగళుని క్రేవ నుల్లసిల్లు
నలఘుకల్యాణశుభగాత్రి యద్రిపుత్రి.

(నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము)

ఉ.

ఆదిమశక్తి యీతరుణి యాద్యకుటుంబిని యీకుమారి ము
త్తైదువ యీతలోదరి చిదాత్మక యీసతి విశ్వమాత యీ
పైదలి సర్వలోక గురుభామిని యీ చపలాక్షి యంచు బ్ర
హ్మాదులు వచ్చి నిచ్చలు హిమాద్రికి ని న్నెఱిఁగింతు రంబికా!

(త్రిపురాంతకుఁడు – అంబికాశతకము)

సీ.

కాశకర్పూరనీకాశఁగా భావింపఁ
             గవితానిరూఢి ప్రఖ్యాతి నొసఁగు
యావకారుణదేహయష్టిఁగాఁ జింతింప
             మదకుంభినీయాన మరులుగొలుపు
నీలజీమూతసన్నిభఁగా విలోకింప
             సకలమాయాప్రపంచము నడంచుఁ
గనకచంపకదామగౌరిఁగా శీలింప
             నంహస్సమూహంబు సంహరించు
శంభుదేవి విశాలాక్షి సదనుకంప
యోగిజనసేవ్య యోగపయోదశంప
శ్రీకరకటాక్ష లేశ రక్షితనిలింప
ముజ్జగంబుల మొలిపించు మూలదుంప.

(పిల్లలమఱ్ఱి వీరయ్య - పురుషార్థసుధానిధి)

ఉ.

నందుని కూర్మినందన యనంగ యశోదకృశోదరంబు నిం
డందగ నావహించి ప్రకటంబుగ విష్ణునితోడఁబుట్టుఁవై
సుందరి గోకులైకనవశోభనయై జనియించి యే జగ
ద్వందిత యొప్పు నయ్యసురదారణి నాదిమశక్తిఁ గొల్చెదన్.


తే.

తనువులం దెల్ల నెలసి చేతనయనంగఁ
బ్రజ్ఞయన మాయయనఁగ బూరణి యనంగఁ
పరయనఁఘ శాంతియననొప్పు హరపురంధ్రిఁ
బరమభద్ర దాక్షాయణిఁ బ్రస్తుతింతు.


సీ.

చంద్రబింబానన చారునేత్రత్రయ
             శోభిని సురముని స్తుత్యచరితఁ
గాళిఁగాత్యాయనిఁ గంసధిక్కారిణి
             నహిత భయంకర నభయదాత్రి
బ్రహ్మవాదినిఁ గామపాలిని సిద్ధ సౌ
             దామిని రేవతీతరుణి నచల
యోగ ప్రదాయిని యోగిని గంధర్వి
             లక్ష్మి సరస్వతి లజ్జఁగీర్తి

సకలతిథులం జతుర్దశి షష్ఠిఁ బౌర్ణ
మాశిఁ బంచమి మహనీయమహిమ నంబ
ధృవఁ దపస్విని సావిత్రి దృష్టిశాంతి
దేవమాత భక్తిప్రియఁ దలఁతు భక్తి.

అష్టాదశయోగవీరశక్తులకు—

సీ.

లక్ష్మికొల్లాపురి లంకశాంకరి విశా
             లాక్షి కాశికను వింధ్యమున దుర్గఁ
గన్యకన్యాకుబ్జఁ గామరూపంబునఁ
             గామాక్షి కాంచిని గామకోటి
మండలిఁబుండ్రక మాణిక్యదత్తవా
             టమున నార్యావర్తమునఁ ద్రిపుర
జ్వాలాధరంబున జ్వాల హేమచ్ఛత్ర
             పురిమహాయోగ శ్రీగిరిని భ్రమర
విరజవిరజిహుంకృతిపీఠ సింహ
ళమున నరసింహికను గాశ్మీరమునవాణి
యుజ్జయిని మహంకాళిని యున్నతముగఁ
జూచువారలు జముపురిఁ జూడరెందు

వినాయకునికి—

ఉ.

అల్లన తొండమెత్తి శివునౌఁదల యేటిజలంబువుచ్చి సం
ఫుల్లతఁ బాదపీఠకము పొంతనయున్న సహస్రనేత్రుపై
జల్లి శివార్చనాకమలసంహతిఁ బ్రోక్షణసేయునట్లు శో
భిల్లు గజాననుండు మదభీప్సితసిద్ధికరుండు గావుతన్.

(విజయసేనము)

శా.

గీర్వాణాచలసాను వాత్మరదన క్రీడాహతంబైన న
య్యుర్వీరంధ్రమునం దనంతఫణరత్నోద్యత్ప్రభల్ పర్వి

క్పర్వంబై పొడిగట్టిపేర్చిన మదిం గంబంబ యంచుం గన
ద్గర్వోన్మీలితనేత్రుఁడై మొరయు వేదండాననుం గొల్చెదన్.


శా.

జేజేయంతు భజింతు నిష్టఫలసంసిద్ధుల్ మదింగోరి ని
ర్వ్యాజప్రౌఢి గృపావలంబుని గటప్రస్యందిదానాంబునిం
బూజాతత్పరదేవదానవకదంబున్ బాలకేలీకలా
రాజత్కౌతకరంజితోరగపతిప్రాలంబు హేరంబునిన్.

(శ్రీనాథుని నైషధము)

శా.

విఘ్నధ్వాంతనిరాసవాసరపతిన్ వేదండరాజాననున్
విఘ్నాధీశ్వరునిం గపోలఫలకావిర్భూతదానచ్ఛటా
నిఘ్నాళిన్ నిరుపాధికాధికకృపానిత్యోదయోపఘ్నుఁ గ్రౌం
చఘ్నాజ్యేష్ఠు భజింతుఁ గావ్యరచనాచాతుర్యసంసిద్ధికై.

(భావన పెమ్మన – అనిరుద్ధచరిత్రము)

ఉ.

తొండము నేకదంతమును దోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయు గజ్జెలును మెల్లనిచూపును మందయానముం
గొండొకగుజ్జురూపమునఁ గోరినవిద్యకెల్ల నొజ్జయై
యుండెడు బార్వతీతనయు నోలి గణాధిపుఁ బ్రస్తుతించెదన్.


శా.

క్రీడాలోలత దంతకోరకశిఖిం గీలించి భూచక్రముం
గ్రోడగ్రామణి మించియెత్తి ఫణు లక్షుద్రానుమోదంబునం
జూడాభోగము లెత్తిచూఁడఁగ దిశాశుండాలరాణ్మండలిన్
వ్రీడం బొందఁగఁ జేయు దంతిముఖు నిర్విఘ్నార్థమై కొల్చెదన్.

(కాకమాని గంగాధరుని బాలభారతము)

ఉ.

ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందమోదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.

(బమ్మెర పోతరాజు – భాగవతము)

ఉ.

అంకముఁ జేరి శైలతనయాస్తనదుగ్ధములానువేళ బా
ల్యాంకవిచేష్టఁ దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంకఁగుచంబుగాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్.

(అల్లసాని పెద్దయ్య – మనుచరిత్రము)

కుమారస్వామికి—

చ.

చనవున రెండువక్త్రములు చన్నులపా ల్గుడువంగ నొక్క మో
ము నగఁగ నొక్కయాననము ముద్దు నటింపఁగ నొక్క యాస్యము
న్గనఁగ నిదేమి పల్కదని యాలపనంబునఁ జెక్కులించు ను
బ్బున నగు షణ్ముఖుం డెలమిఁ బొంది త్రిశక్తులు మాకు నీవుతన్.

(విక్రమసేనము)

చ.

తమకముతోడఁ దల్లియును దండ్రియు నొక్కట ముద్దు వేడ సం
భ్రమమున వచ్చి తల్లిముఖపద్మము తండ్రి మొగంబు లైదు వే
గమ తన యాఱుమోములను గైకొని ముద్దిడు మేటివేలుపుం
గొమరుఁడు నాదు వాణికి నకుంఠితశబ్దము లిచ్చుఁగావుతన్.

(విష్ణుకథానిధానము)

సీ.

తలిదండ్రుల పొందు దప్పి యొండెడ నార్వు
             రువిదల యేదువ నొదిగినతఁడు
కడువడి బలుగొండఁ గాఁడిపారినమేటి
             ఘనసాయకము గేలగ్రాలునతఁడు
కమియాడగాఁ బాపకవణంబు దినియాడు
             రెక్కలతురగంబు నెక్కినతఁడు
భోగిపాన్పున నిద్ర భోగించు దేవునిం
             దరిమిన రక్కసు నురిచినతఁడు

గీ.

సవడిమోములఁ జతురత సమకొనంగ
జోడుమాటలు సరివడ నాడునతఁడు
దంతిముఖు గూర్మితమ్ముఁడై తనరునతఁడు
కదలె బలముల నడిపింపఁ గ్రౌంచవైరి.

(వీరయ్య – త్రిపురవిజయము)

భైరవునికి—

మ.

క్షయకాలంబున సింధుసాగరరసాస్వాదాతిరేకంబునన్
నయనాబ్జంబును ఘూర్ణితంబుగను సంధ్యాకాళరాత్రీకర
ద్వయతాళానుగతిప్రమోదమున మత్తల్లీమహానృత్తముల్
ప్రియ మొప్పారఁగఁ జేయు భైరవుఁడు గల్పించు న్మహైశ్వర్యముల్.


ఉ.

వ్యాలవిభూషణాళియు దిగంబరమున్ గదయుం ద్రిశూలమున్
వ్రేలెడుగెంజెడల్ గగనవీథిఁకి జాఁగిన యుగ్రరూపు నా
భీలచతుర్భుజంబులు నభేద్యకరాసియుఁ జంద్రఖండమున్
ఫాలవిలోచనంబుగల భైరవు గాంచె విభుండు ముందఱన్.

(పోతరాజు – భేతాళపంచవింశతి)

వీరభద్రునికి—

సీ.

ఎవ్వఁడు డాచేతి క్రొవ్వాడినఖములఁ
             జిదిమె బాషాదేవి చిగురుముక్కు
కనకమేఖల గ్రుచ్చికట్టె నెవ్వఁడు లీల
             బిరుదుమైఁ బూషార్కుమెఱుగు బండు
కొనరకెవ్వఁడు పదాంగుష్టభాగంబున
             నుడురాజుపొట్ట గుజ్జురుకనూరె
తరిగె నెవ్వఁడు ఖడ్గధారాంచలంబున
             నగ్ని నాలుకలేడు నంటదరిమి

మొరదినెవ్వాడు ముప్పదిమూడుకోట్లు
వేలుపులుఁ బారఁబార వెన్వెంట దగిలె
నట్టి శ్రీవీరభద్రుఁ డీయద్రిమీఁద
భద్రకాళియుఁ దానుండు బద్మనయన.

(శ్రీనాథుని కాశీఖండము)

సీ.

శూలి కన్నులఁగెంపుఁ జూపినరౌద్రంబు
             పొదల ముందరిదెసఁ బొడమినతని
భువనభయంకరస్ఫూర్తి బెంపెసలార
             శరభావతారకం బరగినతని
జన్నంపు సిరికొన సాగజూచిన తాతఁ
             జేకొని తలవంపు జేసినతనిఁ
దళదళమని మించు దుళగించు గైదువుల్
             కరముల బదినూటఁ గలిగినతని
సురలు నసురలుఁ బలుమరుఁ జూచి బెదర
బిరుద పెండెంబు డాకాలఁ బెట్టినతని
భద్రకాళి మహాశక్తిఁ బరమభక్తిఁ
బాయకుండెడు శ్రీవీరభద్రుఁ దలఁతు.

(పోతరాజు వీరయ – త్రిపురవిజయము)

భృంగీశ్వరునికి—

శా.

క్షామక్షాము...న్నికటప్రకటవక్షఃపీఠముం బాండుర
క్షామిశ్రావయవంబులైన వికటాకారంబులో నవ్వులై
చాముండాకరతాళకుట్టితలయస్థానంబుగా నుబ్బుతత్
హ్రీముద్రంబుగఁ బేరణీవిధమున న్నర్తించె మహాభృంగియున్.

(అనిరుద్ధచరిత్రము)


తే.

గజ్జపరిఁ ద్రొక్కిజూపెఁ బాగడవిధంబు
గీతమున కాడెఁజేసె సంకీర్తనంబు
పాడె సూదాదిగీతప్రబంధవితతి
భృంగి పంచాంగకంబైన పేరణమున.

నందికేశ్వరునికి—

మహాస్రగ్ధర.

కనిరాబ్రహ్మాచ్యుతాదుల్ఘనకనకలతాగ్రంథిసంబంధిజూటా
వనిఖాలద్బాలచంద్రస్వయముపచయకృద్వర్ణప్రభాసం
జనిబాస్వద్ఫారభాగస్థలసితభరితస్థాసకశ్రీసమగ్రా
సనపద్ముం బుణ్యపద్ము న్జరణనతవిపన్నాశు నా నందికేశున్.

(వీరమాహేశ్వరాచారసంగ్రహము)

సీ.

తుహినధాత్రీధరోత్తుంగగాత్రస్ఫూర్తిఁ
             బరిపూర్ణచంద్రికాప్రభలు మాయ
కఠినబంధురతరస్కంథఘంటాధ్వని
             నెదిగి దిశావలు లెదురుమ్రోయ
పవచండనిష్ఠురపటుపాదఖురహతిఁ
             బరి వైరియై మహీభాగ మగల
వరభోగభోగీంద్రవాలవాతోద్ధతిఁ
             జెదరి ధారధరశ్రేణు లవియ
వర్ణితాయతశృంగతీవ్రక్షతములఁ
బెల్లుకొని పద్మజాండంబు చిల్లులొలయఁ
జండగతివచ్చు గైలాసశైల మనఁగ
నెసగు పడివాగెతో వృషభేంద్రు డమరె.

సీ.

పాటించు నెయ్యది బహుల నిర్మలధర్మ
             గంభీరమగు మూర్తిగౌరవంబు
కావించు నెయ్యది కాంతిమై దిశలకు
             వాడని చంద్రికావైభవంబు
గర్జించు నెయ్యది ఖణిలు ఖణిల్లన
             ఘోరవైతేయుల గుండె లగల
మెచ్చించు నెయ్యది మీనకేతనవైరి
             వాహ్యాళికావల్గువల్గనముల
నది రయంబున నవ్విభునగ్రవీథి
నిర్భరారూఢినొప్పఁ బ్రాదుర్భవించెఁ
బృథులపదపాతనిర్ఘాతభీతపన్న
గేశ్వరంబైన శ్రీవృషభేశ్వరంబు.


సీ.

గురుగోత్రతటములు గోరాడ నునుమొక్క
             వోయిన వలిగొమ్ముదోయి మెఱయ
ఘనమేఘతలములు గాల్ద్రవ్వ క్రొమ్మెఱుం
             గులపసనూనిన గొరిసెలొప్ప
భూరిదిగ్భిత్తులతో రాచికొన సన్న
             గఱుకెక్కి కప్పారు కంఠ మొప్ప
నలఘు వాయుస్కంధములు దాఁకి తారలు
             దొరుగ నాడెడు నిడుదోఁక యలర
తారశిఖరి గీలించిన మేరుశకల
మనఁగ ధవళాంగకల్పితంబైన పసిఁడి
పల్లమును రత్నకింకిణీ పరికరంబు
నసుర వృషభేంద్రుఁ డాయితంబై తనర్చె

(ప్రెగడగారి హరివంశము)

విభూతికి—

సీ.

భసితంబు వేదోక్తపదనిరూఢంబగు
             భసితంబు మునిజనప్రాణపదము
భసితంబు సర్వేశుభక్తి కారాధంబు
             భసితంబు సకలశుభప్రదంబు
భసితంబు దుర్మేఘపటలానిలంబగు
             భసితంబు లోకైకపావనంబు
భసితంబు భవరోగభంజనౌషధమగు
             భసితంబు ప్రత్యక్షభర్గమూర్తి
భసిత మనవరతాశేషభయహరంబు
భసిత మసమసుజ్ఞానవైభవకరంబు
భసిత మాభరణము యోగివిసరమునకు
భసితమహిమ వర్ణింపంగ బ్రహ్మతరమె.


సీ.

కపిలవర్ణము గోవు కడునొప్పునందనాఁ
             జనియించెఁ దద్గర్భమున విభూతి
నల్లనిమొదవు వర్ణనకెక్కు భద్రనాఁ
             దద్గర్భమున భసితంబు వుట్టె
నెఱ్ఱని ధేనువు నేపారుసురభినాఁ
             గలిగె భస్మంబు తద్గర్భమునను
పొగచాయగల యావు పొలుచుసుశీలనా
             క్షారంబు వొడమె దద్గర్భసరణి
చిత్రవన్నియలను సురుచిరము దాల్చు
కఱ్ఱి మనోభిధాన మంగీకరించుఁ
బ్రభవమొందె దదీయగర్భమున రక్ష
పంచముఖముల నిట్లుద్భవించె భీతి.

(కుంటముక్కుల తిమ్మయ – శైవాచారసంగ్రహము)

శా.

ఆజ్ఞాసిద్ధికరంబు ముక్తిదము చిత్రానందసంధాయి శై
వజ్ఞానాంకురశిష్టబీజము ప్రభావప్రౌఢసంవిత్కళా
జిజ్ఞాసావిభవప్రదాయకము లక్ష్మీకారణం బూర్జిత
ప్రజ్ఞామూలము భక్తలోకమునకుం బంచాక్షరీమంత్రమున్.

(వీరమాహేశ్వరము)

సీ.

కమలజాండంబులు కందుకంబులు సేసి
             యొండొండ తాటింపనోపువారు
విలయవహ్నులఁ బట్టి వెసదండలుగ గ్రుచ్చి
             యురమున ధరియింప నోపువారు
తివిరిసంహారభైరవునైనఁ బొరివోవ
             నొకమాత్ర వసిమాల్పనోపువారు
కాలచక్రకియాఘటనంబు ద్రిప్పి
             యొండొకలాగు గావింపనోపువారు
ప్రమథవీరులు వివిధరూపములతోడ
హసనలనుఘనదాపనాద్యలఘుగతులు
వెలయ గోటానకోటులు కొలిచి ...........
రతఁడు హరు గొల్వనేతెంచునవసరమున.

బ్రహ్మకు—

చ.

వలపెటువంటిదో ముసలివాఁడనవచ్చునె యద్దిరయ్య ప
ల్కులజవరాలు దాఁ జదువులోన జపంబులలోనఁ బాయ ద
గ్గలముగ నెల్లప్రొద్దును మొగంబునఁ గట్టిన యట్టులుంటు నీ
నలువకు నంచుఁ గాముకులు నవ్వు విధాత శుభంబు లీవుతన్.

(జైతరాజు ముమ్మయ – విష్ణుకథానిధానము)

సీ.

పైఁడిచాయలతోడి పక్షసంపుటముల
             మెలఁగుదేజుల తేరు గలుగునతని
మొకరితుమ్మెదలకు మకరందరసధార
             లొసఁగు బీఠమున గూర్చుండునతని
సత్కవీంద్రుల మానసములలో విహరించు
             గొమరాలి కింపులు గులుకునతని
దిక్కులు నాల్గింట లెక్కదప్పకయొప్పు
             నాననంబుల మాటలాడునతనిఁ
గనిరి యింద్రానలాంతకదనుజవరుణ
పవనభవసఖేశానపూర్వకముగాఁగ
నమరులందరు మధుకైటభాసురేంద్ర
మదవిమర్దకనాభిపద్మజుని నజుని.

(నిశ్శంకుని కొమ్మయ)

సీ.

మహనీయతర యాజమాన సూత్రంబులు
             జపియించు ముఖచతుష్టయము దనర
పావననవనీతపరిలేపనంబున
             మెఱుఁగెక్కియున్న క్రొమ్మేను వెలుఁగ
బహుచిత్రమృదుసూక్ష్మపక్ష్మశోభితమైన
             హరిణాజినోత్తరీయంబు మెఱయ
శ్రీవత్సలాంఛన శ్రీమూర్తిచింతన
             సంభృతానందబాష్పములు దొరుగ
శారదాదేవి సావిత్రి శ్రద్ధ తుష్టి
మతియుఁ గుశసూత్రకాంచిధామములు వెట్టి
నెమ్మిఁ గొలువంగ దర్భాసనమ్ముమీఁదఁ
జూడ నొప్పెఁ బితామహసోమయాజి.

(కుడిచెర్ల తిప్పరాజు – కాంచీమాహాత్మ్యము)

సీ.

వేదాదులగు మహావిద్యలన్నియుఁ గూడి
             మూర్తిమంతంబులై మొనసి కొలువఁ
గ్రతుమరీచ్యంగిరకణ్వాదిసంయముల్
             పలుమాఱుఁ గనుసన్నఁ బనులు సేయ
సురసిద్ధకిన్నరగరుడవిద్యాధర
             యక్షాదు లంతంత నభినుతింప
నారదవిశ్వసనత్కుమారాంగిర
             శతరుతు లుభయపార్శ్వముల మెఱయ
భాషతోఁగూడి యానందభరితుఁడగుచు
సత్యలోకేశ్వరుండుండు సంస్తుతింప
నిమ్మహాసృష్టికెల్లను నితఁడు కర్త
చూడుమీ బ్రహ్మలోకంబు సుభగమూర్తి

(పెదపాటి సోమయ - కేదారఖండము)

సరస్వతికి—

చ.

అమృతమువంటితల్లి కమలాసనుబట్టపుదేవి వేదశా
స్త్రముల విహారభూమి కలప్రాణులకెల్లను బల్కుదోడు వి
శ్వమున సమస్తవిద్యల విశారద శారద నాదువక్త్రప
ద్మమున వసించి మత్కృతి జమత్కృతి పుట్టఁగఁజేయుఁగావుతన్.


ఉ.

వెన్నెలరూపు గప్పురపువేలుపు వజ్రపుబొమ్మలెల్లఁ దా
బన్నిన నొప్పులెస్సమునఁ బంకజమధ్యమునందుఁ బొల్చి క్రీఁ
గన్నుల బ్రహ్మఁ జూచి చిలుకం బలికించుచునున్నవాణి యు
ద్సన్నవశబ్దభావరసతత్త్వము మత్కృతికిచ్చు నెప్పుడున్.

(గంగరాజు చౌడన్న – నందచరిత్రము)

సీ.

సింహాసనము చారుసితపుండరీకంబు
             చెలికత్తె చెలువారుబలుకుచిలుక
శృంగారకుసుమంబు చిన్నిచుక్కలరాజు
             పసిఁడికిన్నెరవీణె పలుకుఁదోడు
నలువనెమ్మోముదమ్ములు కేలిగృహములు
             తళుకుటద్దంబు సత్కవులమనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు
             చక్కనిరాయంచ యెక్కిరింత
యెపుడు నేదేవి కాదేవి యిందుకుండ
చంద్రచందనమందారసారవర్ణ
శారదాదేవి మామకస్వాంతవీథి
నిండువేడుక విహరింపుచుండుగాత.

(శ్రీనాథుని నైషధము)

ఉ.

చీటికిమాటికిన్ మొగుపుచేతులు మౌళి ఘటించి మ్రొక్కెదన్
హాటకగర్భుబోటికి మహాకవికాంక్షితకల్పకాటవీ
వాటికిఁ దారకాహృదయవల్లభమంజులపుష్పమంజరీ
జూటికి వల్లకీస్ఫురితశుద్ధవరాటికి వాగ్వధూటికిన్.

(భావన పెమ్మన – అనిరుద్ధచరిత్రము)

విష్ణుస్తుతి.

సీ.

ఎవ్వని పొక్కిట నీరేడు జగములఁ
             బన్నిన విభుఁగన్న పద్మమలరు
నెవ్వని యురమున నిందిర సవతియై
             చిరలీలఁ గౌస్తుభ శ్రీవెలుంగు
నెవ్వని చేతుల హేతు లారఁగ గదా
             కరవాల శంఖ చక్రమును మెఱయు
నెవ్వని యంఘ్రి మున్నిటిబాపములు బాయ
             గంగపుట్టిన పుణ్యకథలు వొల్చు

నట్టి పరమపురుషు నాదినారాయణుఁ
బుండరీకనయను భుజఁగశయను
జిన్ముయాత్ముహరి హృషీకేశుఁ గేశవు
నిను భజింతు రఖిలమునులు సురలు.

(భాస్కరరామాయణము – యుద్ధకాండము)

శా.

శ్రీరామాస్పదమైన పేరురముపై శ్రీవత్సచిహ్నంబుదా
నారూడంబుగఁ దాల్చి శ్రీకిఁదగు చిహ్నంబొప్పువాఁడౌటసొం
పారందెల్లమిసేయు దేవుఁడు కృపావ్యాసక్తుఁడై మామక
ప్రారంభంబు నిరంతరాయశుభసాఫల్యంబుగాఁ జేయుతన్.


ఉ.

శ్రీకినిరంతరంబుఁ గడుఁజెన్నెసలారఁగ రాగలీల ను
త్సేకముఁ బొందియొప్పు తనచిత్తము సూపెడు మాడ్కి నిత్యర
మ్యాకృతియైన కౌస్తుభము నక్కుపయిం బచరించు నుత్తమ
శ్లోకుఁ డహోబలేశుఁడు ద్రిలోకుఁడు లోకముఁ గాచు గావుతన్.

(ఎఱ్ఱాప్రెగడ నరసింహపురాణము)

ఉ.

శ్రీస్తనకుంకుమద్రవనిషిక్తభుజాంతరభాగవిస్ఫుర
త్కౌస్తుభనూతనార్కరుచిగర్వితనాభిసరస్సరోరుహ
ప్రస్తుతమత్తభృంగరవరాగరసోల్బణభోగిభోగత
ల్సాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్తకిల్బిషుల్.


శా.

శ్రీరామాకుచమండలామిళితకాశ్మీరార్ద్రవక్షంబుతోఁ
బారావారతరంగసంగతలసత్పర్యంకనాగంబుపైఁ
గారుణ్యామృతపూరపూరితకటాక్షశ్రీల బెంపొందుగం
భీరస్వాంతుఁ డనంతుఁ డాశ్రితజనాభీష్టప్రదుం డెల్లెడన్.

(అనంతన్నఛందము)

శా.

శ్రీరామాగృహలిప్తసన్మృగమదశ్రీఁ బొల్చి వక్షంబునన్
శ్రీవత్సంబు వెలుంగఁ గౌస్తుభము లక్ష్మీదీపమై యొప్పున

ద్దేవీఖేలనలోలచిత్తుఁడగు శ్రీదేవుండు కృష్ణుండు
సద్భావం బొప్పఁ గృపావలోకనమునం బాలించుఁ ద్రైలోక్యమున్.

(రెడ్డిపల్లె ముద్దమరాజు – అష్టమహిషీకల్యాణము)

శా.

ఓనారాయణ యోమురాసురహరా యోభక్తచింతామణీ
యోనీలాంబుదవర్ణ యోగుణనిధీ యోలోకరక్షామణీ
యోనీరేరుహపత్రనేత్ర కృప నాయుల్లంబులో నుండవే
యోనావే భవభందముల్ జెరుపవే యోదేవకీనందనా.

(సోముని హరివంశము)

శా.

ఓలక్ష్మీపతి యోపురాణపురుషా యోపుణ్యసంకీర్తనా
యోలోకేశ్వర యోగజేంద్రవరదా యోద్వారకావల్లభా
యోలీలామనుజావతారనటనా యోకృష్ణ యోయచ్యుతా
యోలి న్నాదు మనస్సరోవరములో నోలాడవే యోహరీ.


మ.

జయనారాయణ పుండరీకనయనా శార్ఙ్గీ జగన్నాయకా
జయపీతాంబర భక్తవత్సలవిరించిస్తోత్రపాత్రక్రియా
జయ జంభారివిరోధివిక్రమకళాశ్లాఘవిఘాతక్రమా
జయగోవింద ముకుంద మంథరధరా శౌరీమురారీహరీ.


చ.

అసదృశసర్వశాస్త్రనిచయంబుల కొప్పుఁ బురాణపంక్తిలో
మిసిమి సమస్తవేదముల మీగడ మంత్రచయంబులోని య
య్యుసురు విశిష్టధర్మముల యుక్కుతపంబుల చేవ యంచు నిం
పెసఁగఁగ నీదునామము మునీంద్రులు సెప్పుదు రర్థి నచ్యుతా.


ఉ.

అంగజగాల మాపదకు వ్యాధులకెల్ల బొజంగు భీతికిం
గొంగ దరిద్రవృత్తమునకు గొయ్య యఘంబుల వేరువిత్తు దు
స్సంగతి వెన్నుసమ్మెట విషప్రకరంబుల డెత్తి దేవ నీ
మంగళనామధేయము సమాశ్రితభక్తివిధేయ మచ్యుతా.

(జైతరాజు మమ్మయ – విష్ణకథానిధానము)

సీ.

నారాయణునకుఁ బ్రణామంబు గావింతు
             నడుగుల కెరఁగుదు నచ్యుతునకుఁ
గైటభారికి నమస్కారంబు వాటింతు
             మ్రొక్కుసేయుదు నాదిమూలమునకు
వందనం బొనరింతు వాసుదేవునకును
             దండ మొనర్తు గదాధరునకుఁ
బ్రణుతి సంపాదింతుఁ బరిపూర్ణమూత్రికి
             నంజలి ఘటియింతు నఖిలపతికి
ననుచు నానందభరితులై యమరదైత్య
మునినరోరగముఖ్యులు వినతు నగుచుఁ
గొలువనొప్పు జగత్పతిఁ గొలుతు నిన్ను
నఖిలభూతాత్మ యాదినారాయణాత్మ.


సీ.

ఆరఁగాఁ బండిన నల్లనేరెడుబండు
             మెఱుఁగున మెఱుఁగారు మేనివాఁడు
వెదవెద విరిసిన విరిదమ్మిరేకులఁ
             దెగడు కన్నులుగల మొగమువాఁడు
మెండైన యేనికతుండంబు మెచ్చని
             యిరుదోయి చేతులం బరగువాఁడు
దొమ్మిదిరూపుల తుమ్మెదవాయని
             పువ్వదామరగల బొడ్డువాఁడు
గలిమిముద్దియ యురమునఁ గలుగువాఁడు
కడగి మిన్నేటిసెలయైన యడుగువాఁడు
వన్నెగల పైడిచీరల వన్నెకాఁడు
నేడు నాచూడ్కి జుట్టమై నిలిచెననుచు

సీ.

కమలజుదమ్ముడు గొమరుండుఁ గూడి నీ
             మూర్తియుఁ గీర్తియు మూదలింపఁ
జతురాస్యు జదువులం జననియుఁ గూడి నీ
             యునికియు మనికియు నుపచరింప
హరుశిరోమాల్యంబు వరధనుప్రభయు నీ
             యజ్జయు సజ్జయు ననుసరింప
ననుసరింపఁగ నేర్తు నీ వఖిలజగము
జగము లొగిఁబ్రోవ నిల్చిన జగదధీశ
యీశ వాణీశ నిర్మలహృదయవాస
వాసుదేవ జగత్త్రయావాసదేవ.


సీ.

సూర్యునింబోలు గౌస్తుభముపైఁ బ్రాలంబ
             మనియెడు బరివేష మతిశయిల్ల
మేఘంబు సరియైన మేనిపైఁ బీతాంబ
             రప్రభయును దటిత్ప్రభలు మెఱయ
నిండుఁ జందురు నవ్వునెమ్మొగంబున సుప్ర
             సన్నతయును సుధాసార మమర
జలజంబుఁ దెగడెడు జరణంబునను దివ్య
             దీర్ఘికయను బువ్వుదేనె దొరుగ
హస్తముల శంఖచక్రగదాంబుజంబు
లమర ధర్మార్థకామమోక్షముల మాడ్కి
నఖిలలోకేశుఁ డాద్యుఁ డన్యయుఁ డమేయుఁ
డమ్మహాత్ముంజు మెరయు నారాయణుండు.

సీ.

ప్రాణంబుఁతో గూడ రక్కసి చన్నులఁ
             బాలు ద్రాగిన ప్రోడబాలుఁ డితఁడె
వ్రేల్మిడిఁ జాణూరు విరచి లోకములు మె
             చ్చించిన యాజగజ్జెట్టి యితఁడె
దుర్వృత్తుఁడగు గంసు దునుమి యాతని తండ్రిఁ
             బట్టంబు గట్టిన ప్రభు వితండె
సత్యభామకు పారిజాతంబుపైఁ గల
             కోర్కె దీర్చిన రసికుం డితండె
వెన్నలును గోపికాచిత్తవిత్తములును
నరసి మృచ్చిలనేర్పు నా హరి యితండె
శ్రుతిశిరోభాగములఁ దన సుభగచరణ
సరసిజామోదమున నూను జతురుఁ డితఁడె.

(సోమయాజి యుద్యోగము)

సీ.

తొమ్మండ్రుకొడుకులఁ దొలివేలుపుల జేయ
             బొడమించె నేదేవు బొడ్డుదమ్మి
మూడుత్రోవలఁ బాఱు మున్నీటిగర్తనాఁ
             బరగు నేదేవుని పాదతటిని
పండ్రెండురూపుల పగలింటిరాజు దా
             వలతి యేదేవుని వలనుఁ గన్ను
వేయిమానికెపుదివ్వెలతోడఁ బడగల
             మ్రాల్చు నేదేవుని మలక పాన్పు
మునులకెల్ల నేదేవుని మూర్తి వెలుఁగు
హృదయగేహంబులో దీప మెత్తినట్లు
హరి మురారి నద్దేవు మహానుభావు
మనసులో గంటి భవములు మానునంటి.

సీ.

పుండరీకములతోఁ బురుడించు గన్నులఁ
             గారుణ్యమను తేనె గడలుకొనఁగ
మందారశాఖతోఁ మలయఁజాలెడు గేలఁ
             బాంచజన్యంబను పండు మెఱయ
నుదయాద్రితటముతో నుద్దించు నురమునఁ
             గౌస్తుభంబును దివాకరుఁడుఁ దోపఁ
నాకలోకంబుతో నవ్వు పాదంబున
             నాకాశనది యను నమృత మొప్ప
నమృతధారాధరము మాటలాడినట్లు
భాగ్యదేవత రూపు చేఁబట్టినట్లు
లలితగతినున్న సద్గుణాలంకరిష్ణు
విష్ణుఁ బొడగంటి భవములు వీడుకొంటి.


సీ.

పన్నగంబుల రాజుఁ బగవాఁడు గూడి నీ
             శయనంబుఁ బయనంబు సంతరింప
దుగ్ధవారాసికూతురు నాలుఁగూడి నీ
             శరణంబుఁ జరణంబు నవదరింపఁ
జందురుచెలికాఁడు సైదోడుగూడి నీ
             యుల్లంబు మొల్లంబు నుపచరింపఁ
దామరపగవాఁడు దయితుండుఁగూడి నీ
             బడినూపు గుడినూపుఁ బరికరింపఁ
గంపమానమనోద్యానగతులు మాన
నేకతంబున్న మునులను నేకతంబు
లేక పొడగానవచ్చు నీలీలఁ గాన
నన్యుఁ డేనాటి ధన్యుండె యంబుజాక్ష.

(సోముడు)

సీ.

నీలాద్రి దనరు మాణిక్యపు శిఖరంబు
             క్రియ నూత్నరత్నకిరీట మెసఁగ
గగనంబు నడిమిచక్కటినొప్పు నరుణాంశు
             కరణిఁ గౌస్తుభము వక్షమున వెలుఁగ
జలరాశి బొదివిన సాంధ్యపయోదంబు
             క్రమమున పీతాంబరము దలిర్ప
మేచకాభ్రంబున మెరయు సురేంద్రచా
             పము లీల వనమాల ప్రస్ఫురిల్ల
నల్లనునుజాయ మేనొప్పఁ దెల్లదమ్మి
విరుల సిరిగన్న కనుదోయి యరుదుగాఁగ
నమరు జగదీశు సకలహితార్థజన్ము
జన్మవిరహిత వసుదేవజాతఁ గాంచి.

(ప్రెగడగారి నరసింహపురాణము)

దశావతారములకు

.
సీ.

శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ
             మల్లశంకరధర్మ మహితబుద్ధి
కగకూర్మ కిటినరమృగ కుబ్జరామ రా
             మానంతబుద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి
             ముఖముష్టికస్థి విముక్తఖలులఁ
పుచ్ఛాగ్రపృష్టవిస్ఫురదంష్ట్రనఖగుణ
             పరశుబాణకరాంగఖురపుటములఁ
జెరివి తార్చి యెత్తి చేరి బంధించి ని
ర్జించి యేసి యోర్చి చెరిచి మట్ట
గడఁగనున్న శౌరి కరుణాకరుఁడు శుభా
కరుఁడు మా కభీష్టపరుఁడుగాఁత.

భీమన చెప్పినది

సీ.

శ్రుతులును నిర్జరస్థితులును మగుడింప
             నిగుడింపఁ జాలు నీ నేర్పుకలిమి
ధరణియు రిపుగర్వసరణియు ధరియింప
             హరియింపఁ జాలు నీ యలవుకలిమి
భ్రాత నర్మిలిఁగన్నమాతనుఁ బాలింప
             లాలింపఁ జాలు నీ లావుకలిమి
గేహని రవిసుతావాహిని సాధింప
             భేదింపఁ జాలు నీ పేర్మికలిమి
జనులఁ బాతకజనులను జరుప నురుప
నలరు నీ నేర్పు కలిమిచిహ్నములు నీకు
మత్స్యకూర్మమహీధరమనుజసింహ
ఖర్వరామత్రయీబుద్ధకలికిగతులు.

ఆంధ్రకవి రామయ్య – విష్ణుకంచీమహాత్మ్యము

శ్రీలక్ష్మికి

ఉ.

చందనచారుపత్రము సంస్తుతకౌస్తుభకర్ణికంబున
స్పందితలాంఛనభ్రమరసంజమనోజ్ఞమునై తనర్చు గో
విందు నురస్థలంబ యరవిందముగా సొగయించియున్న య
య్యిందిర చూచుగాత కృప నింపగుజూపుల భక్తసంతతిన్.

ఎఱ్ఱాప్రెగడ నరసింహపురాణము

మ.

హరికిం బట్టపుదేవి పుణ్యములప్రోవర్థంబు బెన్నిక్క చం
దురు తోఁబుట్టువు భారతీగిరిసుతన్ తోనాఁడు బూఁబోడి తా
మరలం దుండెడు ముద్దరాలు జగము ల్మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములఁ బాపు తల్లి సిరి యిచ్చు న్నిత్యకల్యాణముల్.

పోతరాజు భాగవతము – దశమస్కంధము

సుదర్శనము

సీ.

దైతేయకాంతల తళుకుఁ గెమ్మోవుల
             వీటికాశ్రీలకు వీడుకోలు
వేల్పుటిల్లాండ్ర క్రొవ్విదపుఁ జన్నులమీఁది
             యళువు పయ్యెదలకు నిలువనీడ

విశ్వజగత్త్రయీవిజయలక్ష్మీగాఢ
             బిరుదోత్సవములకుఁ బెండ్లివిందు
పరిపంథివాహినీ పరిచిత పరిభవ
             ప్రాప్తి సంకథలును బాయుద్రోవ
సేసి యయ్యది విలసిల్లుఁ జిత్రమహిమ
నది ప్రయోగింప నెత్తె నయ్యచ్యుతుండు
విలయసమయసముద్భూతవిపులదహన
దారుణస్పర్శనంబు సుదర్శనంబు.

వీరమాహేశ్వరము

సీ.

ప్రళయ మార్తాండ మండల చండతర సము
             ద్భూతభూరిప్రభాపుంజ మగుచు
ఘనసహస్రారనిర్గతమహోగ్రానల
             జ్వాలావలీఢ దిగ్జాల మగుచు
సహజతేజోవిశేషక్షణాంతర్భూత
             సర్వదివ్యాస్త్ర విస్తార మగుచు
గఠిన నిర్ఘాత సంఘాత భీషణఘోష
             నిర్భిన్న రాక్షసీగర్భ మగుచు
సకలశుకముఖ్యమునియోగిజనసమగ్ర
మహితనిగమార్థసంస్తూయమాన మగుచు
వచ్చె మానసవేగమై వనజనాభ
దాసభయకర్శనంబు సుదర్శనంబు.

పోతరాజు భైరవుని శ్రీరంగమాహాత్మ్యము

సీ.

రక్షోవధూవృత్తవక్షోజపరివిప్త
             కుంకుమక్షోదంబు గ్రొవ్వడించి
శక్రారిమదవతీవక్రాలకాభోగ
             ఘనతమఃపరభాగ గరిమ నడఁచి

క్రవ్యాదయౌవనిగ్రైవేయమణిహార
             కహ్లారదీప్తుల గర్వ మడఁచి
దైవతాహితవీరతరుణీసముల్లాస
             దరహాసచంద్రికా దర్ప మడఁచి
చటులసంవర్త పరివర్త చండకిరణ
శతశతాఖిల పరిదీప్త సారఘోర
దర్శనం బగునట్టి సుదర్శనంబు
గలుగ నీ కసాధ్యంబులు గలవె కృష్ణ.

భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము

సీ.

దైతేయమదవతీధమ్మిల్లములతోడ
             విరుల నెత్తావికి వీడుకోలు
దనుజశుద్ధాంతకాంతాకటాక్షములతోఁ
             గలికికాటుకలకుఁ గానివావి
దానవమానినీస్తనకుంభములతోన
             బసపుబయ్యెదలకుఁ బాయు తెరువు
దైత్యావరోధనదయితాధరములతో
             సొబగు వీడెములకుఁ జుక్కయెదురు
సేస సురసుందరీకరౌశీరతాల
వృంతచలితాంతకుంతలవిలసదింద్ర
కులవధూటీలలాటికాకుంకుమంబుఁ
బదిలపఱుపఁ జక్రంబ నీభరమకాదె.


మ.

సతతంబు న్నుతియింతు జంతుమయసంసారక్రియారక్షణా
క్షతశౌర్యక్షపితారిపక్ష మగుటన్ సంగ్రామభీమభ్రమా
గతగేహాంతికదీర్ఘికాతటలుఠత్కంఠచ్ఛిదాచ్ఛాదన
క్షతజక్షౌళితకేలితామరసరక్షశ్చక్రముం జక్రమున్.

సీ.

వడఁకు బన్నగరాజు బడగలమీఁద స
             ర్వంసహాకాంతపేరుర(రణ)ము సూప
నుఱ్ఱూతలూగిన యుదయాస్తగిరులచే
             నాకాశలక్ష్మి కోలాటమాడఁ
దెరలెత్తి సప్తసాగరములుఁ బొరలంగ
             వరుణుండు గొండిలి పరిఢవింప
మొకములచాయ వేరొక చందముగ నిల్చి
             కమలసంభవుడు పెక్కణ మొనర్ప
మంగలములోని పేలాలమాడ్కిఁ జుక్క
లిక్కడక్కడఁ జడ దిక్కు లెనిమిదియును
బగులఁ బాతాళములును గుబ్బతిలఁ జెలఁగె
శౌరి పూరింప నప్పాంచజన్యరవము.

సోముని హరివంశము

ఉ.

ధన్యవిభూతిశోభితుఁడు తామరసేక్షణుఁ డొత్తె నూర్జిత
ధ్వన్యతులోగ్రతాదళితదానవసైన్యము ధూతభూతచై
తన్యముఁ దోషితీండ్రముఖదైవతసంస్తుతిమాన్యము న్నదీ
జాన్యుదరాంతరస్థగితసన్నుతజన్యము పాంచజన్యమున్.

భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము

గరుత్మంతునికి

చ.

ఘనతరకంధరుండు దృఢకాయుఁడు దీర్ఘముఖుండు రక్తలో
చనుఁడు మహోత్తమాంగకుఁడు సానుసుసంగతపక్షసారమం
డనుఁడు బరిస్ఫురద్యుతివిడంబితబాలదివాకరుండు లో
కనయనపర్వనిర్వహణకారి సుపర్ణుఁడు పుట్టె భూవరా.

అనుశాసనికము – సోమయాజి

సీ.

ఘనపక్షవిక్షేపజనితవాతాహతిఁ
             బర్వతశ్రేణుల పాదుగదల,
విపులాస్యకర్ణికావిర్భూతదీప్తుల
             వలయాద్రి యవ్వల వెలుకఁబార
శతకోటిశరచండజవభవారవముల
             శరధులు ఘూర్ణిల్లి బరలుగడవ
వితతాద్భుతాపాది విభ్రమోదితకాంతి
             దెసలహోమద్యుతి దీటుకొనఁగ
సిద్ధచారణ గణనుతశ్రీఁ (దన)ర్చి
మింటఁ బరఁగు రెక్కలతోడి మేరువనఁగ
వచ్చెఁ దన రాక కఖిలంబుఁ బిచ్చలింపఁ
బక్షిదేవుండు బుండరీకాక్షుకడకు.

భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము

సీ.

సర్వ(పథీనుఁడై) చను పతంగుండు గ
             లఁడొకాక యరయ నన్యుఁడు జగమున
నెఱకలు వడసి యెయ్యెడఁ బ్రవర్తిల్లెడు
             మేరఁగాంచెనొకాక మేరుశిఖరి
అంబరశ్యామకయంబుధి పొగరుగా
             భ్రమసి యెక్కెనొగాక బాడబాగ్ని
హైమమై పరగు బ్రహ్మాండంబు పక్వమై
             తగఁబుట్టెనోకాక ఖగ మొకండు
వైనతేయుండు నీదృశవ్యాప్తిదీప్తుఁ
డాతఁడోకాక యితఁడని యఖిలజనులు
బహువిధానుమానారంభపరతఁ జూడ
నరుగుదెంచెఁ బక్షిప్రభుఁ డభ్రవీథి.

ప్రెగ్గడ హరివంశము (అ5-141ప)

మ.

హరిదంతద్విపదంతకుంతశిఖరాహంకారనిశ్చింత ని
ర్జరరాజార్జితవజ్రజర్జరితవిచ్ఛాయైకరోమచ్ఛని
స్థిరవిద్యుద్ప్రతిపక్షవక్షుఁడయి వచ్చెన్ వైనతేయుండు భా
స్కరబింబమ్మును నంబరమ్ము దగమ్రింగం బట్టుచందమ్మునన్.

సోముని హరివంశము

(స్కరబింబప్రతిబింబమంజరము మ్రింగంబాఱు చందంబునన్)

(ముద్రితప్రతి)

ఉ.

ఆతతపక్షమారుతరయప్రవికంపితఘూర్ణితాచల
వ్రాతమహార్ణవుండు బలవన్నిజదేహసముజ్జ్వలప్రభా
ధూతపతంగతేజుఁ డుదితుండయి తార్క్ష్యుఁడు తల్లికిన్ మనః
ప్రీతి యొనర్చుచు న్నెగసె భీమజవంబున నభ్రవీథికిన్.

నన్నయభట్టు – ఆదిపర్వము

సీ.

పులుగురాయఁడు తమ్మికొలఁకుల చెలికాని
             బండిబోయినితోడి పాలివాఁడు
పన్నగస్త్రీలకు బాలిండ్ల పసపాస
             మగుడింప నోపిన మగల మగఁడు
దంభోళి కొకయీకతాఁకు కానిక సేసి
             యమృతంబుఁ దెచ్చిన యవఘళుండు
వినతముద్దులపట్టి వనధిచెంగట బోయ
             పల్లె నాఁకలిగొన్న భవ్యబలుఁడు
పక్షములు దాల్చి వచ్చిన పసిఁడికొండ
యట్టు విలసిల్లు మేటి వాహనము గాఁగ
నడచె హతశేషదేవసైన్యములు దాను
నసురకులమర్దనుండు జనార్దనుండు.

నిశ్శంకుని కొమ్మన

సీ.

గజకచ్ఛపంబు లె ....రుని............
             కుక్షిలోనికిని రాజభిక్ష
సకలలోకములు నే జవసత్వసంపన్ను
             ఖురళికాయాత్రకు గోష్పదంబు
బలభేదివజ్రమే యలఘు రెక్కలలోనఁ
             జిక్కిపెంపె........... చితపుల్ల
కద్రూతనూజవర్గంబు లే మహనీయు
             నాగ్రహంబునకుఁ జొక్కాకుపటువ
యతఁడు హరిఁ గొల్వ నచ్చోటి కరుగుదెంచె
శంఖచూడాసుదక్షిణక్షమపయోద
వాహనోదారతాభీలసాహసైక
జనితదాక్షిణ్యుఁడైనట్టి వినతపట్టి.

ఆంధ్రకవిరామయ్య – కాంచీమహత్త్వము

ఉ.

ఆయతచండతుండనిహతాహినికాయునిఁ దప్తహాటక
చ్ఛాయుని సర్వవేదమయసన్నుతకాయుని దేవదానవా
జేయుని నప్రమేయుని నశేషవిహంగకులాధిపత్యధౌ
రేయునిఁ బ్రస్తుతింతు సుచరిత్రవిధేయుని వైనతేయునిన్.

భైరవుని శ్రీరంగమహత్వము

క.

అక్షీణకనకసన్నిభ
పక్షయుగోద్భూతఘోరపవమానమహా
విక్షేపకంపితానే
కక్షోణిధరేంద్రుఁ డగుచు గరుడుఁడు వచ్చెన్.

భాగవతము – దశమస్కంధము

సీ.

కుప్పించు నురవడి కుంభిని వడిగ్రుంగి
             సర్పాధిపతితలల్ చదియనడుమ
నెగయు నూఁకున మీదికెత్తిపారిన తరు
             శ్రేణులు చుక్కలం జెదరనడువ
నెఱులు సారించునేపునం గడలొత్తి
             యేడువారాసులు నెడములొత్తఁ
బరుచు బల్విడి నభ్రపంక్తులు నుడిఁగొంచు
             వలయంపుఁగొండ యవ్వలికిఁదూలఁ
బర్వతములు వడఁక బ్రహ్మాండకోటర
మద్రువ గగనవీథి నరుగుదెంచె
రఘుకులేంద్రబంధనిఘటితత్వరితాంత
రంగుఁ డగుచు నవ్విహంగవిభుఁడు.

భాస్కరుని రామాయణము – యుద్ధకాండము

విష్వక్సేనునికి

క.

శ్రీరమణచరణసేవా
చారనిరూఢానధాను సత్కీర్తిజయ
శ్రీరాజమానుదానవ
వీర ఖగశ్యేనుఁ దలతుఁ విష్వక్సేనున్.

భైరవుని శ్రీరంగమహత్వము

శా.

ఇష్వాసక్రకచాదిసాధనపరాహీనప్రభాంగీకృతా
భిష్వంగద్యుమణిద్యుతిప్రకరుఁడై పీతాంబరాలంకృతున్
విష్వక్సేనుని గౌస్తుభాభరణు నుర్వీశ్రీయుతుంగొల్చి యా
విష్వక్సేనుఁడు సంచరించు గణరాడ్విఖ్యాతుఁ డాచక్కటిన్.

రామకవి రామయ్య – కాంచీమహత్వము

శేషునికి

చ.

బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీతల మజస్రసహస్రఫణాలిదాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

నన్నయభట్టు ఆదిపర్వము

మ.

శయనంబై యుపధానమై నిలయమై సచ్ఛత్రమై పాదుకా
ద్వయమై మంగళపీఠమై మృదులవస్త్రంబై సమస్తోచిత
క్రియలన్ జక్రికి నిత్యసన్నిహితమూర్తిన్ బొల్చు శేషాహి న
క్షయమేధానిధిఁ గావ్యలక్షణకళాచార్యుం బ్రశంసించెదన్.

భైరవుని శ్రీరంగమహత్వము

హనుమంతునికు -

చ.

పరిచరుఁగాఁగనేలె నిరపాయచరిత్రుని శత్రుకానన
స్ఫురదురునీతిహోత్రుని సముజ్జ్వలమేరుసమానగాత్రునిన్
బరమపవిత్రుని న్మునిసుపర్వతతిస్తుతిపాత్రునిన్ మనో
హరఫలశేముషీకబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్.

భైరవుని శ్రీరంగమహత్వము

శా.

సంతోషంబునఁ బొంది యేలె విమలస్వాంతున్ మహాదానవ
ధ్వాంతవ్యూహవిదారణోజ్జ్వలవివస్వంతున్ యశఃపూరితా
శాంతున్ సాహసవంతు నిర్భరజయాయత్తైకవిశ్రాంతు ధీ
మంతున్ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్ జవాత్యంతునిన్.

చినమల్లు శ్రీగిరన్న – శ్రీరంగమహత్వము

శా.

అంతంతం గబళింపఁగాఁ గడఁగి బాలార్కున్ ఫలభ్రాంతివే
శంతోల్లంఘనకేలి దాటెను సరస్వంతున్ మహాదానవా
క్రాంతారామమహీరుహంబుల నుదగ్రక్రీడఁ ద్రుంచెన్ హనూ
మంతుండున్ గపి యున్నవిం గపులె సామాన్యాటవీచారముల్.

రాయసం గణపయ – సౌగంధికాపహరణము

భాగవతులకు -

సీ.

హరిసేవనామృతాహ్లాదుఁ బ్రహ్లాదును
             సన్నుతచారిత్రు శక్తిపుత్రు
సంగీతవిద్యావిశారదు నారదుఁ
             బుణ్యతమశ్లోకుఁ బుండరీకు
భారతసంహితాభ్యాసు వేదవ్యాసు
             నతులపావనవేషు నంబరీషు
నవిరళజ్ఞానవిద్యాసముత్సుకు శుకుఁ
             గ్లిష్టాఘకర్దమగ్రీష్ము భీష్ము
నరు విభీషణు సనకు సనందుఁ గపిలు
వాయునందను శేషాహి వైనతేయు
లాదియగు భాగవతులను నాళువారిఁ
బరమభక్తిఁ దలంపుదుఁ బ్రతిదినంబు.

మణికి సింగరాజు పద్మపురాణము

మ.

వినుతింతున్ హరిభక్తిపెంపున జగద్విఖ్యాతులై పుణ్యకీ
ర్తనులైనట్టి పరాశరుం గపిలు వేదవ్యాసుఁ బ్రహ్లాదు న
ర్జును రుక్మాంగదు నంబరీషుని వసిష్ఠుం బుండరీకుం మరు
త్తనయున్ భీష్ము విభీషణున్ సురమునిన్ దాల్భ్యున్ శుకున్ శౌనకున్.

భైరవుని శ్రీరంగమహత్త్వము

నారదునికి—

సీ.

ఉదయార్కరుచిఁ బొర నొలచికొన్నట్టి మ
             వ్వమున చెంగావి గోపనము మెఱయ
వెన్నెల జరిగొన్న విద్యుల్లతలమాడ్కి
             యజ్ఞోపవీతంబు లరుతఁబొలయ

ననుకైనకుసుమం బెట్టిన పల్లవంబుల
             చాయ సన్నపు గుజ్జుజడలుగ్రాల
గందువోఁ జదలేటిఁ గడిగిమ శశిరీతి
             యడగెలి ముత్యంపు గొడుగు దనర
జగతిఁ దనుకాంతి యసమచంద్రావి
భాతిఁ బ్రసరింప దివినుండి పార్థివేంద్రు
కొలువునకు వచ్చె సభయెల్ల నెలమిఁ జూడ
నారదుఁడు సర్వలోకవిహారశీలి.

భైరవుని శ్రీరంగమహత్త్వము

సీ.

తనచేతివల్లకీతంత్రీచయంబునల
             సతతనారాయణశబ్ద మొప్ప
నానాసంగీతహరిగీతవరసుధా
             ధారల యోగీంద్రతతులు సొక్కఁ
గపిలజటాభారకాంతిపుంజంబుల
             దిశలు ప్రభారతధీ (తధీధితి) వహింప
తనులగ్నతులసికాదామగంధంబులు
             గగనాంతరాళంబు గప్పుకొనఁగ
వచ్చె మింటనుండి వాసవీనందను
కడకు మాటలాడఁ .... తోడ
భద్రవిమలకీర్తిపారగుం డారూఢ
నయవిశారదుండు నారదుండు.

బమ్మెర పోతరాజు భాగవతము – ప్రథమస్కంధము

సీ.

కర్పూరనవపరాగవిపాండుతనుకాంతి
             యకదొరచారుచంద్రికలు గాయ
వికటారకూటపల్లకడారముల
             బద్ధమగుటంబు రేయెండ చిగురులీన

హరిణాజినోత్తరరీయచ్ఛాయ బ్రహ్మతే
             జఃకృశానుని పొగచాయ నెఱయ
కుటిలహవిర్మహీకుబ్జలలామంబు
             నొసలిపైఁ జీఁకటి నూఁగువార
నచతురాననపద్మజుం డనలికాక్ష
శంకరుం డచతుర్భుజచక్రపాణి
యఖిలలోకైకసంపూజ్యుఁ డరుగుదెంచె
నారదుఁడు కాంతిజితశరన్నీరదుండు.

పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము

సీ.

కడిఁదియుద్ధంబులఁ గదిసి యాఁకలిదీర
             మించు జూపుల నారగించువాఁడు
గడియసేపైన నొక్కెడ నూరకుండక
             త్రిభువనంబుల సంచరించువాఁడు
నూఱుతంత్రులవీణె నూతనంబగు క్రియా
             హేవాకమొప్ప వాయించువాఁడు
గోర్లు దాఁటించి నిర్నిమిత్తంబు
             వీకున బోరు గావించువాఁడు
మునివరేణ్యుండు పద్మగర్భునికి నింపు
గొనలు సాగంగఁ బుట్టిన కొడుకుగుఱ్ఱ
చనియె శర్వాణిఁ గొలువంగఁ దనువిలాస
శారదాంబుదవర్ణుండు నారదుండు.

నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము

సీ.

ప్రాలేయకిరణబింబస్ఫూర్తిఁ దలపించు
             విశదంపుఁ దనుకాంతి దిశలు వ్రాక
జిగినిండఁ దొలఁకెడు జిగురుటాకులసొంపు
             వాటించు ఘనజటాభరము మెఱయ

కాంచనమౌంజీవికాసంబు గెడగూడి
             చెలువు సూపుచు మృగాజినము దనర
కమనీయకోమలకరపయోరుహమునఁ
             బ్రకటితంబగు విపంచిక దలిర్ప
హరికథాలాపశోభితమైన యట్టి
యాననంబు బ్రసన్నత నలరుచుండ
గగనమునుండి సమవర్తి కడకు వచ్చె
నమరసంయమివరుఁడు విద్యాగురుండు.

చందలూరి చిక్కన్న – నాచికేతోపాఖ్యానము

కవిస్తుతి

కవులకు – వాల్మీకిస్తుతి

శా.

శ్రీరామాయణకావ్యకల్పన విరించి న్వేదఘంటాపథో
ద్ధారప్రౌఢమనీషి సర్గముని మార్తాండుం దపఃకీర్తి ల
క్ష్మీరమ్యున్భువనైకవంద్యుఁడగు వాల్మీకిం గవిగ్రామణిన్
ధారాళస్థిరభక్తియుక్తిఁ దలఁతుం దత్త్వజ్ఞచూడామణిన్.

కాకమాని గంగాధరుని బాలభారతము

ఉ.

రామకథాసుధారసము బ్రహ్మపయోంబుధి మున్గి యుండఁగా
నేమునివాక్యమందరమహీధరసన్మథనంబుచే సము
ద్ధామత సంగ్రహించి విబుధప్రకరంబున కిచ్చె నర్థిమై
నామహితుం బ్రచేతసుని యాత్మజుఁ గొల్చెద నాదిసత్కవిన్.

రెడ్డిపల్లి ముద్దరాజు అష్టమహిషీకల్యాణము

శా.

శ్లోకంబుల్ శతకోటికాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపములు మాయింపంగ నిర్మించి సు
శ్లోకుండైన పురాణసంయమివరుం జూతు న్మనోవీథి వా
ల్మీకిన్ బ్రహపదావతీర్ణకవితాలీలావతీవల్లభున్.

శ్రీనాథుని భీమఖండము

కవిస్తుతి – వ్యాసులకు

శా.

సంసారార్ణవపారగుం బరమహంసవ్రాతచూడాపదో
త్తంసంబున్ శ్రుతిసంకరోద్దళనపాథక్షీరభేదక్రియా
హంసంబున్ జగదేకవంద్యు జలదశ్యాము న్మహాపాతక
ధ్వంసాభారతు భారతామృతవిధిన్ వ్యాసుం బ్రశంసించెదన్.

గంగాధరుని బాలభారతము

మ.

తలతున్ భారతసంహితాధ్యయనవిద్యానిర్మితిప్రక్రియా
నలినప్రోద్భవునిం గళిందతనయాంతర్వేదిపుణ్యస్థలీ
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు నక్షీణని
ర్మలసాహిత్యకలాసమృద్ధికై పారాశర్యమౌనీశ్వరున్.

భీమఖండము

కవినుతి – కాళిదాసుకు

శా.

ద్రాక్షాపాకనవీనవైఖరిఁ బ్రబంధస్తోమముల్ సెప్పె న
ధ్యక్షుండయ్యె మహాకవీంద్రులకు నాహా యెట్టి పుణ్యాత్ముఁడో
సాక్షాద్భారతిఁ గాక యీతఁడు మనుష్యవ్యక్తియే యంచు సం
లక్షింపందగు గాళిదాసు గృతలీలావ్యాసుఁ గీర్తించెదన్.

ఆంధ్రకవి రామయ్య కాంచీమహత్వము

సంస్కృతకవులకు

ఉ.

భారవిఁ గాళిదాసు శివభద్రుని మాఘుని బాణు భామహుం
జోరు మయూరునిం దలఁపుచున్ మఱియుం గవులై విదగ్ధు లె
వ్వారలు వారినెల్ల ననవద్యుల నాద్యులఁ బ్రస్తుతింతు సం
సారసుఖైకసారవిలసత్కవితారసవైభవార్థినై.

జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానము

సీ.

కైవార మొనరింతు గంభీరసాహిత్య
             ఘంటాపథోద్భాసుఁ గాళిదాసు
వర్ణింతు నుజ్జ్వలవాణీసుధాపూర
             పాథోధిపరిబాణు భట్టబాణుఁ

బ్రణుతింతు నుద్దండభాషాసమాక్షిప్త
             హరబాహుకేయూరుఁ డగు మయూరు
సన్నుతి గావింతుఁ జాటుధారాప్రౌఢిఁ
             గోమలతాయత్తు సోమదత్తు
భక్తి నంజలి రచియింతుఁ బ్రవరసేన
భాస శివభద్ర భవభూతి భట్టహర్ష
భారవి మురారి హేరంబ చోరులకును
మఱియుఁ దక్కిన సుకవుల మతిదలంతు.

గంగాధరుని బాలభారతము

సీ.

ప్రణుతింతు రసభావభావనామహనీయ
             కవితాసముల్లాసుఁ గాళిదాసు
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబద్ధ
             పరితోషితస్థాణు భట్టబాణు
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య
             భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంభోధివార్వీచిసంభార
             గంభీరవాక్సముత్కర్షు హర్షు
భాస శివభద్ర సౌమిల్ల ధమ్మిలులకు
మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తప కవి దండిపండితులకుఁ
గీలు కొలుపుదు నొసలిపైఁ గేలుదోయి.

శ్రీనాథుని భీమఖండము

సీ.

భట్టనారాయణభాషారమాదేవి
             లబ్ధవర్ణుల కర్థలబ్ధిఁ జేయు
బాణవాగ్భామినీప్రసవమంజరి విశా
             రదుల కలంకారరమణిఁ జేయు

రాజశేఖరభారతీజహ్నుకన్యక
             సుకవీంద్రులకు భావశుద్ధిఁ జేయు
మాఘవాణీశీతమారుతగతి సార
             మతులకు రోమోద్గమంబుఁ జేయు
నని యెఱింగి వారియడుగులు దలఁచి న
మస్కరించి దండి నమ్మురారి
వామనుని గుణాఢ్యు క్షేమేంద్రు నిల నలం
కారవిధులఁ దలఁచి గారవమున.

అమరేశ్వరుని విక్రమసేనము

కవినుతి – నన్నయభట్టు

క.

శబ్దార్థరసవిశారదు
శాబ్దికమూర్ధన్యు శబ్దశాసనబిరుదున్
శబ్దాయమానవిస్ఫుర
శబ్దఘటారభటి నన్నపార్యుఁ నుతింతున్.

గంగాధరుని బాలభారతము

క.

నెట్టుకొని కొలుతు నన్నయ
భట్టోపాధ్యాయ సార్వభౌముఁ గవితా
పట్టాభిషికుతు భారత
ఘట్టోల్లంఘన సమర్థు (పటిష్ఠ) గాఢప్రతిభున్.

శ్రీనాథుని భీమఖండము 1-8

కవినుతి – తిక్కనసోమయాజికి

ఉ.

ఆంధ్రకవిత్వతత్త్వసముదంచితకీర్తినిఁ దిక్కయజ్వ నీ
రంధ్రతరప్రభావనిధిం బ్రస్తుతిసేయుఁదు నుల్లస
త్కంధ్రగభీరమంజుతరగర్జితవిభ్రమభవ్యభంగి సై
రంధ్రికయైన చాటుమధురస్ఫుటబంధురవాగ్విజృంభికన్.

గంగాధరుని బాలభారతము

ఉ.

పంచమవేదమై పరఁగు భారతసంహిత నంధ్రభాషఁ గా
వించెఁ బదేనుపర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
ర్వంచితకావ్యవైభవవిరాజికిఁ దిక్కనసోమయాజికిన్.

(భీమఖండము 1-9)

కవిస్తుతి - తెలుఁగుకవుల సమూహమునకు

సీ.

శబ్దశాసనకావ్యసంఘట్టనక్రమా
             నందిత బుధవర్యు నన్నపార్యు
నుభయభాషారచోన్నిద్రభద్రవ
             చోరాజిఁ దిక్కనసోమయాజి
లక్ష్యలక్షణకళాలంకారసౌభాగ్య
             సత్కావ్యవిన్యాసు శంభుదాసు
ఛందోనిబంధన చాతురీధౌరేయ
             వాగ్ధాము వేములవాడ భీము
రసికజనపద్మదిననాథు రంగనాథుఁ
బ్రకటకృతికర్మనిస్తంద్రు భాస్కరేంద్రు
నమితరసభావు శ్రీత్రిపురారిదేవు
సూక్తితిమిధాము నాచనసోముఁ దలఁతు.

ఆంధ్రకవి రామయ్య కాంచీమహత్త్వము

వసిష్ఠుకు

చ.

కనియె శ్రుతిస్మృతిప్రకరగాఢతరార్థపటిష్ఠు దివ్యబో
ధనపదవీమహత్వసముదగ్రగరిష్ఠుఁ దపోవిశేషసం
జనితనితాంతపుణ్యగణసంచయనవ్రతనిష్ఠు శేముషీ
జనితహితప్రభావమునిసంఘవరిష్ఠు వశిష్ఠు నయ్యెడన్.


చ.

పరమవివేకసాగరుఁడు పంకజసంభవసంభవుండు ధూ
మరహితవహ్నితుల్యుఁ డసమానతపోనిధి విష్ణుభక్తి త
త్పరుఁ డఘదూరుఁ డాద్యుఁడు కృపారసచిత్తుఁడు దివ్యబోధనా
స్థిరుఁ డగు నవ్వసిష్ఠుఁ డరుదెంచె దిలీపనృపాలు పాలికిన్.

పద్మపురాణము – మణికి సింగరాజు

వ్యాసులకు

ఉ.

ప్రాంశుపయోదనీలతనుభాతు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశు జటచ్ఛటాభరణు నాగమపుంజపదార్థతత్వని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరుకృత్యు భారతీ
వంశవివర్ధనుం ద్రిదశవందితు సాత్యవతేయు గొల్చెదన్.

భారతము

సీ.

ప్రోగులై యెందును ప్రోగేర్పడకయున్న
             శ్రుతులన్నియును నోలి సూత్రపఱచి
ముఖ్యశాస్త్రంబులు మునికోటి చదివించి
             యెల్లచోట్లను వెలయింపఁబనిచె
నాదిపురాణంబు లయ్యైమతంబుల
             పేరులు పెట్టి రూపించి తెలిపి
పంచమవేదమై పరగు మహాభార
             తముచేసి పురుషార్థసమితిఁ బ్రోచె
పుట్టినప్పుడ సంస్కృతి పొలము గడపు
గట్టి యెరుకబండినప్రోడ పట్టి గనియె
నెవ్వఁ డట్టి సద్గురు నుతించి భక్తి
విష్ణుమాహాత్మ్యకథ మీకు విస్తరింతు.

ప్రబంధపరమేశ్వరుని నారసింహపురాణము

సీ.

పులినంబు తొలుచూలు పుండరీకాక్షుని
             యవతారభేదంబు కవులరాజు
బహుపురాణగ్రంథభారతసంహితా
             పరిగుంభనక్రియాపండితుండు
కఱ్ఱివన్నియవాఁడు కౌరవాన్వయకర్త
             శ్రుతు లేర్పరించిన సూత్రధారి
సిద్ధనీవారముష్టింపచాధ్యక్షుండు
             శుకునికూరిమితండ్రి సకలవేది
కాళికేయుండు యోజనగంధిపట్టి
తత్త్వనిర్ణేత ఘనతపోధర్మరాశి
నైమిశారణ్యమునిసభాభూమి కెలమి
నేగె నొకనాడు వ్యాసమునీశ్వరుండు.

నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము

చ.

అతులమనీషఁ బేర్చి నిగమావలి చిక్కులు దీర్చు సూత్రముల్
దృతి నొనరించి పెంపెసగు దివ్యపురాణములెల్లఁ జెప్పి భా
రత మనుపేరి వేదము తిరంబుగ జేసెను విష్ణుమూర్తి సూ
రత మహనీయబోధను బరాశరసూనుగురించి మ్రొక్కెదన్.

పద్మపురాణము

క.

హరిదాసును వనవాసును
బరిచితపరమోపవాసు భాసురవాసున్
...................................
విరచిత కాశీనీవాసు వేదవ్యాసున్.

చిరుమురి గంగరాజు – కుశలవోపాఖ్యానము (ఆ - ప)

ఉ.

భారతభారతీశుభగభస్తిచయంబులఁ జేసి ఘోరసం
సారవికారసంతమసజాలవిజృంభముఁ బాచి సూరిచే
తోరుచిరాబ్జబోధనరతుండగు దివ్యుఁ బరాశరాత్మజాం
భోరుహమిత్రుఁ గొల్తు మునిపూజితు భూరియశోవిరాజితున్.

నన్నయభట్టు – ఆదిపర్వము

శుకయోగికి

సీ.

ప్రతినిమేషము బరబ్రహ్మంబు నీక్షించి
             మతిఁ జొక్కి వెలుపల మఱచువాఁడు
కమలంబుమీది భృంగముల కైవడి మోము
             పై నెరసిన కేశపటలివాఁడు
గెర వ్రాసి మాయ నంగీకరించిన భంగి
             వసనంబుఁ గట్టక వచ్చువాఁడు
సంగిగాడని వెంట జాటు భూతముల కా
             బాలుర హాసశబ్దములవాఁడు
మహితపదజానుజంఘోరుమధ్యహస్త
బాహువక్షోగళాననఫాలకర్ణ
నాసికామస్తకనయనయుగళుఁ
డైన యవధూత శుకమూర్తి యరుగుదెంచె.

భాగవతము

కశ్యపునికి

మ.

జగముల్మూడు తలంపులోన సృజియింపంజేయు వాగ్వల్లభున్
మిగులం గూర్మితనూజుఁగాఁ గనిన లక్ష్మీనాథుఁ డెవ్వానికిం
బొగడొందన్ సుతుఁ డయ్యె నట్టి సుమహత్పుణ్యుం బ్రశంసింపఁగాఁ
దగదే కశ్యపసన్మునీంద్రుని విశుద్ధజ్ఞాననిస్తంద్రునిన్.

శ్రీరంగమహాత్మ్యము (అ1-ప-24)

భరద్వాజునికి

మ.

జ్వలదగ్నిప్రథమానతేజుని భరద్వాజున్ వినిర్ధౌతవ
ల్కలభాస్వత్పరిధాను బింగళజటాలంకారుఁ గృష్ణాజినో
జ్జ్వలసంవ్యాను దపఃకృశీకృతతనున్ శాంతాత్ము బ్రహ్మైకని
శ్చలచిత్తున్ విజితేంద్రియున్ బ్రముదితస్వాంతున్ గృపావంతునిన్.

కుడిచెర్ల తిప్పరాజు కాంచీమహత్వము

శా.

తోరంబైన తపోవిశేషమున సద్యోజాతవక్త్రంబునన్
గౌరీవల్లభూచేత దీక్షగొనుచున్ సప్తర్షులం దొక్కఁడై
తారావీథి నలంకరించి కనియెం ద్రైయ్యర్థసంఘాతమున్
భారద్వాజమహామునీంద్రుఁ దగదే భక్తిం బ్రశంసింపగన్.

శ్రీనాథుని నైషధము (అ1-19)

శా.

అంభోజాసనమానసాంబుజభవుం డధ్యాత్మవిద్యోన్నతా
రంభుం డిద్ధతపోవిశేషమితప్రస్ఫీతఘోరాఘసం
రంభుం డంచితశాంతిసంయుతుఁడు భారద్వాజమౌనీంద్రు డు
జ్జృంభించెన్ వరసప్తసంయమిజనశ్రేణీసముద్భాసియై.

బృహన్నారదీయము

విశ్వామిత్రునికి

సీ.

పంచాక్షరీమంత్రపరమోపనిషదర్థ
             వాసనాసురభి యెవ్వానిబుద్ధి
శ్రుతిపాఠపూతవాక్పతిముఖస్తుతులచే
             వదిలె నెవ్వడు నవస్వర్గసృష్టి

బాహుజుండయ్యుఁ దపశ్శక్తి నెవ్వాడు
             బ్రహ్మర్షియై యెక్కె బ్రహ్మరథముఁ
బందెమోడి దివంబు పంచియిప్పించె ని
             శ్శంక నెవ్వడు హరిశ్చంద్రునకును
నమ్మహాత్ముండు సకలలోకైకవినుతుఁ
డౌర్వసేయునితోడి మండ్రాటకాఁడు
నిష్ఠతోడుత నాశ్చర్యనియమవృత్తిఁ
దరమునకునుండె నంబికాధవునిగూర్చి.

శాకుంతలము – పిల్లలమఱ్ఱి వీరయ్య

గౌతమునికి

సీ.

చరియంచువారికి సంకల్పసిద్ధిగా
             నిర్మించె నెవ్వాఁడు నిజవనంబు
సార్వకాలికఫలసస్యంబుఁ గల్పించి
             వరమునిశ్రేణి నెవ్వాఁడు బ్రోచె
చీకటితప్పు సేసిన నెవ్వఁడదలించె
             నింద్రుని తనువెల్ల హేయముగను
నుర్వీసురశ్రేణి కొమరి లేకుండఁగఁ
             బలికె నెవ్వఁడు ప్రతాపంబు మెఱసి
యట్టి శ్రీవీరశైవాగమాదివేది
యైన గౌతమసంయమి యాశ్రమంబు
బొంతనెంతయు నొప్పారి పొగడనెగడు
ననఘమానస శ్రీవైజయంతిపురము.

పెదపాటి సోమయ కేదారఖండము

మార్కండేయునికి

శా.

చండాంశుప్రతిమప్రతీకరుచు లాశాచక్రవాళంబునన్
నిండంబర్వఁ బ్రవాళపాటలజటానీకంబు దూలం గ్రియా
పాండిత్యప్రథమానసంయమికదంబం బర్థి సేవింప మా
ర్కండేయుం డరుదెంచెఁ దన్మఖదిదృక్షాకౌతుకోల్లాసియై.

భైరవుని శ్రీరంగమహత్వము

సీ.

కల్పాంతవార్ధి మోఁకాలిబంటిగా నేయ
             తీశ్వరుఁ డొంటిమైఁ దిరిగినాఁడు
వటపత్రవిధిని నెక్కటినున్న బాలు నే
             తాపసాధిపుఁడు ముద్దాడినాఁడు
తనపేర నే తపోధనమౌళి సుస్థిర
             స్థితి బురాణంబు సంధించినాఁడు
హరుని మెచ్చించి సంహారకాలుని జయో
             న్మాద మే మునిరాజు మాన్చినాఁడు
గనియె నటువంటి సంయమీంద్రుని మహాత్ము
దనయుఁడుగ నమ్మృకండుని ధర్మపత్ని
సహజశివభక్తిరతుని విశ్వప్రసిద్ధు
ననఘకీర్తి మార్కండేయుఁ డనెడివాని.

వీరమాహేశ్వరము

మృకండునికి

సీ.

ఆయువగ్గలముగా నాశీర్వదింపుచో
             నేపుణ్యుఁ బురుడింతు రెల్లవారు
జనులకు నేమహాత్ముని పురాణము సర్వ
             వర్ణాశ్రమాచారనిర్ణయంబు
నేయయ్య చేసిన యీశ్వరస్తోత్రముల్
             పఠియించినను మృత్యుభయము వాయు
... ... ... ...
             శివలింగములఁ బ్రతిష్ఠించి నెగడె
నట్టి లోకైకమాన్యు మహానుభావు
సుతునిఁగా బడసి వెలసిన సుకృతమయుని
ఘను మృకండుమునీంద్రునిఁ గరివిభుండు
గనియెఁ దొలుమేన సుకృతపాకమునఁ జేసి.

జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానము

అగస్త్యునికి

సీ.

ఎవ్వాఁడు వింధ్యాద్రి నిఱ్ఱింకు లింకించె
             గంభీరకంఠహుంకారగర్జ
ప్రణవప్రంచాక్షరోపనిషత్ప్రపంచంబు
             నెవ్వాఁడు శివునిచే నెరిగికొనియె
గడసిల్లుధరయొడ్డ గెడవెన నెవ్వాఁడు
             త్రాసుపైఁ గటిలచందమున వంచె
నంభోధు లేడింటి నాపోశనం బెత్తి
             కలిగించె నెవ్వాఁడు క్రమ్మఱంగ
భీమనాథేశ్వరుఁడు గౌరిఁ బెండ్లియాడి
దక్షిణాముఖకల్యాణదర్శనమున
వత్సరము వత్సరమున నెవ్వానిఁ జూచు
నతఁడు గగనాగ్రమాణిక్య మరుగుదెంచె.

భీమేశ్వరపురాణము – శ్రీనాథుఁడు

సీ.

ప్రణవపంచాక్షరోపనిషత్ప్రపంచంబు
             కడదాఁక నెఱిఁగిని కఱదలాని
వాతాపిదైత్యు నిల్వలునితోఁ గూడంగ
             జఠరాగ్ని వేల్చిన సవనకర్త
కోపించి నహుషుని గుంభీననంబుగా
             హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునందు వండవట్టిన నీటి
             కాలుష్యముం దెలుపు కతకఫలము
పాండుభసితత్రిపుండ్రాంకఫాలభాగ
భద్రరుద్రాక్షమాలికాభసితవక్షు
భార్యయును దాను నేతెంచు పరమశైవుఁ
గాంచె వింధ్యాచలేంద్రంబు కలశభవుని.

కాశీఖండము

ఋష్యశృంగునికి

ఉ.

అంగన లేగుదెంచి ముదమారఁగ గాంచి రధీతవేదవే
దాంగుని సర్వసంయమిముఖాబ్జపతంగుని నిర్జితేంద్రియా
నంగుని లిప్తభూతలసదంగుని సద్గుణసంగునిన్ వ్రతా
భంగుని సంతతోదితతపఃకృతభంగుని ఋష్యశృంగునిన్.

భాస్కరుని రామాయణము – బాలకాండము

దేవేంద్రునికి

సీ.

ఉచ్చైశ్శ్రవంబును నురుమదసురభిక
             పోలపాళీవిలోలాలికలర
వాన్వితమై వాలు నభ్రశుండాలంబు
             వాహనంబులు వీరవైరిభీష
ణాంశుల మించు నూరంచుల కైదువు
             కొమరారు పరివార మమరగణము
పట్టన(పు)దేవులు పౌలోమి యీగతి
             నెల్లభోగములకు నెల్ల యగుచు
విలసదమరికరాంభోజవీజ్యమాన
చామరానిలసంచారచలితచారు
చికురభారుఁడై చూడఁగఁ జెలువు మిగిలి
వేయుగన్నుల యింద్రుఁడీ విభుఁడు దరుణి.

భావన పెమ్మనంగారి అనిరుద్ధచరిత్రము

అగ్నిదేవునికి

సీ.

భర్గభట్టారకు పర్యాయమూర్తికి
             షాణ్మాతురుని కూర్మిజనకునకును
మేషరాజము నెక్కు మేటిరౌతున కమ
             రాధీశు పొరుగు దిశాధిపతికి
హరిణవాహనుని నెయ్యపుసంగడీనికి
             సామిధేనిప్రియస్వాంతునకును
యాయజూకులయిండ్ల ననుఁగుఁజుట్టమునకు
             స్వాహాస్వధాప్రాణవల్లభునకు

దండములు వెట్టెదము మోడ్చెదము కరములు
సేవ యొనరించెదము మమ్ముఁ గావు ప్రోవు
యాగవేదికి విచ్చేయు మారగింపఁ
బ్రథమజన్ముల యింటి కల్పద్రుమంబ.

పురుషార్థసుధానిధి – పిల్లలమఱ్ఱి వీరయ

సీ.

కఱకుచీకటులమూఁకలు నుగ్గునూచుగా
             నురిచి నూరక త్రాగు నెరతనంబు
బొట్టేటిరాయని చొళయంబుఁ గదలించి
             వాహ్యాళి గదలెడి వైభవంబు
క్రతుభాగములు దెచ్చి కైతప్పు గాకుండ
             వేల్పుల కందించు వెరవుసొంపు
మూఁడుమూర్తులు దాల్చి మురువుతో జన్నంపు
             వేదిపైఁ గొలువుండు విభ్రమంబు
నీకుఁ జెల్లు నొరుల నీతోడిసాటికిఁ
బేరు గ్రుచ్చి యెన్నలేరు జగతి
వశమె నిన్నుఁ బొగడ స్వాహావధూకుచా
భ్యున్నతప్రకాశ యోహుతాశ.

వీరమాహేశ్వరము