ఈ నవా బ్దాగమముతో ఈ కిశోర

వికీసోర్స్ నుండి

ఈ నవా బ్దాగమముతో ఈ కిశోర

మధుర కలకంఠమునకు హేమంత మెడలి

గొంతుచెర వీడెనేని, హృదంతరమున

దాగి యొదిగిన ప్రేమగీతాల రుచుల

నొక్క టొకటె నీకయి విప్పుచుండు సకియ!


విరిసికొనిపోవుచున్నవి వీని యమృత

గళ రవమ్మున కపుడె పక్షములు చెలియ!

ఎగసికొనిపోవు నొరు లెవ్వ రెగురలేని

స్వప్నసీమల కూహాప్రపంచములకు!


నీ వొకర్తుక వానిపై నిదుర గొమ్ము;

చల్లగా పోదు వెచటి కెచ్చటికొ గాని;

ఇపు డపుడు నీవు మేల్కొంతువేని, వీని

పాటరెక్కలరొద వినంబడును నీకు;

అంత జ ల్లను నీ బ్రతు కంత; మరల

ఒత్తిగిలి హాయి గన్ను మూయుదువు నీవు!


నాకుమాత్రము గాన మున్నంతవరకు

చాలుచాలు నీ ప్రణయవిశ్వాస మొకటె,

మోసికొందునొ నా గీతములను నిన్ను!

మూగవోదునొ రాయియైపోయి చిరము!