ఈతని కెదురులేరు యెక్కడ చూచిన నిదె
స్వరూపం
ఈతని కెదురులేరు యెక్కడ చూచిన నిదె
చేతనే ప్రతాపముతో చెలరేఁగీ నితఁడు
దిక్కులు సాధించుటకు దేవదేవోత్తముఁ డదె
యెక్కెను తేరుమీఁద యెచ్చరికతో
చక్కాడి దనుజులను సమరములు గెలచి
యిక్కువతో వీధి వీధీ నేఁగీ నిదిగో
సకలాయుధములునుఁ జక్రము చేతులఁ బట్టి
వెకలియై శంఖము వేవేగ నాడించె
వికలులై రాక్షసులు వీఁగి లోఁగి హతులైరి
అకలంకుఁ డీ హరి అన్నిటాను మించెను
విజయద్వజము నదె వీఁడె శ్రీవేంకటేశుఁడు
భజన నలమేలుమంగ పలుమారు మెచ్చె నదె
త్రిజగములు నితఁడె దిక్కై కాచీ నిదె
గజబిజ లింక నుడుగరో రాక్షసులు 15-156