ఇది విభాత మహోత్సవమ్మేమొ
స్వరూపం
ఇది విభాత మహోత్సవ మ్మేమొ! ఇదియు
నూత్న కళ్యాణతూర్య మనోజ్ఞగాన
నృత్యకోలాహల మ్మొకో! ఇది సువర్ణ
మంగ ళాక్ష తాళీ ర్వర్ష మగునొ, కాదొ!
ప్రేయసీ! సుఖస్వప్న దరిద్ర మైన
బ్రతుకు నాది, నిద్దురవోవు వల్లకాడు;
నమ్మ గోరని బరువునేత్రమ్ము లెటులు
నులిమికొనునొ, పాపము, మేలుకొలుపె మరచి!
త్రిజగతీపతి కోటీర దివ్యరత్న
రాజి నేలు వజ్రాలతురాయి వీవు!
ఏనొ పాతాళ లోకంపు టిరుకుసందు
లందు దిగబ్రాక వెరచు గాఢాంధరేఖను!
తారకా పూర్ణ చంద్ర మార్తాండనింబ
మండితమ్ము మహాకాళ మంటపమ్ము
నందె కాదె పాణిగ్రహణమ్ము దొరకు;
పతిత వె ట్లౌదు? నే నెటు పక్షి నౌదు?