ఇతర దేవతలకిది గలదా
స్వరూపం
ఇతర దేవతలకిది గలదా
ప్రతి వేరీ నీ ప్రభావమునకు
రతిరాజజనక రవిచంద్రనయన
అతిశయ శ్రీవత్సాంకుఁడవు
పతగేంద్రగమన పద్మావతీపతి
మతి నినుఁ దలఁచిన మనోహరము
ఘనకిరీటధర కనకాంబర పా
వన క్షీరాంబుధివాసుఁడవు
వనజచక్రధర వసుధావల్లభ
నినుఁ బేరుకొనిన నిర్మలము
దేవపితామహ త్రివిక్రమ హరి
జీవాంతరాత్మక చిన్మయుఁడా
శ్రీవేంకటేశ్వర శ్రీకర గుణనిధి
నీవార మనుటే నిజసుఖము 3-44