ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
 మతివారూఁ దమవంటి మనుజులేకాక

చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమేకాక
సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవా రెవ్వరు
బోరునఁ జేసినపాపపుణ్యాలే కాక

తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
 గుడికొన్న తనలోని గుణాలేకాక
కడుఁగీర్తీ నపకీర్తి గట్టెడివా రెవ్వరు
 నడచేటితనవర్తనములేకాక

ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు
 నవిచినజ్ఞానాజ్ఞానములే కాక
తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు
కొనమొద లెఱిఁగినగురుఁడేకాక 2-174