ఇతరమేదియు లేదు యెఱఁగమింతే కాని

వికీసోర్స్ నుండి

ఇతరమేదియు లేదు యెఱఁగమింతే కాని
రతికెక్కే పనులెల్లా రామచంద్రుఁడే పో

ధనమై చేరేవాఁడు దైవమై కాచేవాఁడు
మనసులోఁ దలఁచేటిమాధవుఁడే
మునుకొన్న గ్రామములై ముందరనుండేవాఁడు
 కొననాలికమీఁదటి గోవిందుఁడే పో

తల్లియై పెంచేవాఁడు తండ్రియై పుట్టించేవాఁడు
వెల్లవిరిఁ దాఁ గొలిచే విష్ణుమూరితి
ఇల్లాలై సుఖమిచ్చి యెంచఁ బుత్రులైనవాడు
చెల్లుబడిఁ దా మొక్కేటిచేతిపై శ్రీహరియే

దేహమై వుండేటివాఁడు దినభోగమైనవాఁడు
యీహల శ్రీవేంకటేశుఁ డితఁడొక్కఁడే
మోహచారమైనవాఁడు మోక్షమై నిలిచేవాఁడు
 సాహసించి నమ్మఁగలసర్వేశుఁ డితఁడే 4-11