ఇతరములన్నియు నడుమంత్రములే యెంచి చూచినను యింతాను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతరములన్నియు నడుమంత్రములే యెంచి చూచినను యింతాను
హితవగు బందుగుఁ డీశ్వరుఁడొకఁడే యితని మరవకుమీ జీవాత్మా

భవకూపంబుల బడలెడినాఁడు పాయనిబందువుఁ డితఁడొకఁడే
దివిస్వర్గంబునఁ దెలేడినాఁడు తిరుగఁబాయకె(డె)పు డితఁడొకఁడే
నవనరకంబుల నలఁగెడినాఁడు నటనలఁ బాయఁ డితఁడొకఁడే
యివలనావలహృదయేశుఁడు విష్ణుఁడు యీతని మరవకు మీజీవాత్మా

పశుమృగాదుల వొడలెత్తినప్పుడు పాయనిబందుగుఁ డితఁడొకఁడే
విశదపుదుఃఖపువేళలనైనా విడువని బంధువుఁ డితఁడొకఁడే
శిశువైనప్పుడు వృద్దైనప్పుడు చిత్తపుబందుగుఁ డితఁడొకఁడే
దశావతారపు విష్ణుఁడొకఁడే యితఁడని తలఁచుమీ జీవాత్మా

భావజకేలినిఁ జొక్కినప్పుడును ప్రాణబంధువుఁ డితఁడొకఁడే
యీవల నావల నిహపరములలో నిన్నిటిబంధువుఁ డితఁడొకఁడే
దైవము దానని శరణనియెడు నను దగ్గరికాచెను యితఁడొకఁడే
శ్రీవేంకటగిరి నాయకుఁడితఁడే చేరి భజించుము జీవాత్మా 4-399