ఇతని చందము హరిహరి యేమి చెప్పఁగొలఁది హరిహరి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇతని చందము హరిహరి యేమి చెప్పఁగొలఁది హరిహరి
 అతి రహస్యముల హరిహరి అదిగో మనకుఁ జిక్కె హరిహరి

అదివిష్ణుఁ దితఁడు హరిహరి అదె యశోదకొడుకు హరిహరి
వేదమూర్తి ఇతఁడె హరిహరి వెన్నదొంగిలించె హరిహరి
సాదుబండి విఱిచె హరిహరి చంటివిషము చెరిచె హరిహరి

పరమపురుషుఁడితఁడు హరిహరి పనులఁ గాచె నిదివో హరిహరి
సిరికి మగఁడు దాను హరిహరి చెలఁగి రోలఁ దగిలె హరిహరి
పరగఁ జూడరోయి హరిహరి బదుకరోయి కొలచిహరిహరి

అమరవంద్యుఁ డితఁడు హరిహరి అణఁచెఁ గంసుని హరిహరి
విమతదానవారి హరిహరి వించె మద్దులు హరిహరి
 అమరె నిదివో హరిహరి శ్రీవేంకటాద్రి మీఁద హరిహరి
జమళి రామకృష్ణుఁడు హరిహరి సర్వమితఁడు హరిహరి 15-115