ఇక్ష్వాకుకులతిలక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
       కాంభోజి రాగం         త్రిపుట తాళం


ప: ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా నన్ను

రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ1: చుట్టు ప్రాకారములు సొంపుగచేయిస్తి రామచంద్రా

ఆ ప్రాకారమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ2: గోపుర మంటపాలు కుదురుగ కట్టిస్తి రామచంద్రా నను

క్రొత్తగ చూడక నిత్తరి బ్రోవుము రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ3: భరతునకు చేసితి పచ్చల పతకము రామచంద్రా

ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ4: శత్రుఘ్నునకు నేను చేసితి మొలత్రాడు రామచంద్రా

ఆ మొలత్రాడునకు పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ5: లక్ష్మణునకు చేసితి ముత్యాల పతకము రామచంద్రా

ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ6: సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా

ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ7: వాహనములు మీకు వరుసతో చేసితి రామచంద్రా జగ

న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ8: కలికి తురాయి నీకు పొలుపుగ చేసితి రామచంద్రా

నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ9: మీ తండ్రి దశరథ మహారాజు మెట్టెనా రామచంద్రా

లేక మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ10: అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా

ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ11: సర్కారు పైకము తృణముగ నెంచకు రామచంద్రా

దెబ్బల కోర్వను అప్పుతీర్పుమయ్య రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ12: ఏటికి చల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా

నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ13: కౌసల్య పుత్రుడు దశరధ తనయుడు రామచంద్రా

కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీ రామచంద్రా || ఇక్ష్వాకు ||


చ14: భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా

నీవు క్షేమముగ రామదాసుని నేలుము || ఇక్ష్వాకు ||

This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.