ఆ భా 8 2 61 to 8 2 90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

--రానారె 16:22, 26 జనవరి 2006 (UTC)


8_2_61

సీ. అనుటయుఁ గాక మిట్లను హంసములతోడ గతులు నూటోకేకటి గలవు వాన

నొక్కటొక్కట శతయోజనవ్యాప్తి నే మెఱయుదుఁ బొడవుగా మీఁది కెగసి

చనుట యచ్చటనుండి చక్క నేలకుఁ జోడు వట్టి డిగ్గుట దూరపాతభంగి

సంగతి పరువడి చారులీలాగతి వక్రయానము వలయక్రమంబు


ఆ. లోను గాఁగ నెట్టు లైనను మీకోరి

నట్ల పఱచి మేటియంచ యైన

దాని నివుడ గెలుతుఁ దక్కటియంచలు

భయము వొందఁ గాకిపదువు వొంగ.


-: కాకము హంసముతో సముద్రము మీఁదకు బఱచి భంగపడుట:-


8_2_62

వ. అనుటయు విని మున్నాహూతం బైనహంసం బక్కాకంబు నాలోకించి.


8_2_63

ఆ. నూఱుగతుల నీవు వాఱు దే వన్నియు

నెఱుఁగఁ బులుఁగు లెల్ల నెట్లు వాఱు

నడరి యాకసమున నిడుబాట నట్ల పా

ఱుదము రమ్ము జలధిచదల ననిన.


8_2_64

వ. అయ్యెడం గూడినకాకంబు లపహసించి శతప్రకారగతి యగుదీనితో నేకయాన

పర్యవసానహీనసముత్సాహదోహలి వగునీ వెట్లు మచ్చరించెదవు పఱచి భంగ

పడియెదవు గాక యనుటయు నమ్మరాళం బాగమిం బాసి పరవఁ దొడంగినం

దోన యవ్వాయసంబునుం బఱచె నిట్లు రెండును మున్నీటిపై మిన్ను దఱి

సి పాఱునట్టియెడ.


8_2_65

క. రాయంచ మందగతిఁ జను

వాయస మతితీవ్రభంగి వలను మెఱసి లీ

లాయితము లొప్ప బహుగమ

నాయాసము నొంది పఱచు నగ్గలికమెయిన్.


8_2_66

ఆ. ఎలమిఁ గడచి పోవుఁ బిలుచుఁ గ్రమ్మఱి వచ్చి

ముక్కు ముక్కుమీఁద మోపు జుట్టు

నేచి తిరుగు నీఁక లీఁకలతో రాయు

నొరయుఁ జిత్రగతుల మురియు నవ్వు.


8_2_67

వ. ఇవ్విధంబునం గాకం బనేకప్రకారప్రసరణచతురం బై సంచరించుటం జూచి

ముదితంబు లైనవాయసంబు లధికస్వరంబుల మెఱయుచు హంసంబుల గేలి

గొని నవ్వుచుఁ దరువులపయిం ద్రుళ్లిత్రుళ్లియాడుచు మరాళంబు పరాభ

వంబుఁ బొందెడుఁ జూడుం డని పెద్దయెలుంగునం బలుకు చుండఁ దదీయ

కలకలం బాలించి హంసంబు భరితోత్సాహం బై.


8_2_68

క. పొడవునకు నెగసి యెప్పటి

పడమటిదెస నిగిడి పెలుచఁ బఱచినఁ గూడం

గడురయమునఁ జని యంచం

గడవం గాకీలకఱచి కాకము పాఱున్.


8_2_69

వ. పాఱి పాఱి డయ్యుటయు నయ్యంచ యుదంచితత్వరితగమనకళావైదగ్ధ్యంబు

మెఱయం బఱచిన బీఱువడి కాకం బాకులాంతరంగంబును వికలాంగంబును

నై యిట్లని వితర్కించు.


8_2_70

క. నేరక తొడరితిఁ గాల్కొన

భూరుహములు లతలు గిరులుఁ బొదలేమియు లే

వారయ బహుసత్త్వమయము

వారిధి డిగి సోఁకినపుడ వలయుం బొలియన్.


8_2_71

వ. అనుచు దీనమానసం బయి భయంబునం గలంగి డప్పి సొగసి యవశత నంత

కంతకు డిగుచు చున్నయక్కాకిం గనుంగొని కలహంసం బి ట్లనియె.


8_2_72

ఆ. నీ వనేకగతులు నే ర్తిది యేగతిఁ

జనుట చెపుమ వాయసంబ యేను

గడవ నరిగి పిలివఁ గా నేల తడసెద

వెఱక లేటి కిట్టు లెడల విడువ.


8_2_73

వ. అనియె నట్టియెడ.


8_2_74

క. తలకొని జలములు పక్షం

బులు దుండము దోఁక సోఁక బొరిఁబొరి నెగయన్

బలమఱి మెయి దిగఁబడఁగా

సొలసి యెగయలేక వాయసుఁడు వెగడొందెన్.


8_2_75

వ. ఇట్లు మున్నీటిపయిం బడి యగ్గలం బగుదురవస్థకు బెగ్గలంబు నొందుకా

కంబు నాలోకించి పలుక నగుం గాక పలికినట్ల యెవ్వరికిఁ జేయఁ దీరుఁ బని

తీరెం గదా యనిన రాయంచకు నక్కాకం బిట్లనియె.


8_2_76

క. ఎంగిళులు గుడిచి క్రొవ్వునఁ

బొంగినమెయితోడ గర్వమునఁ దిరుగుచు నా

కుం గలదె యెందు నెదురు వి

హంగమపతి నైన గెలుతు నని మును దలఁతున్.


8_2_77

క. నాకొలఁది యిప్పు డెఱిఁగితి

నీకరుణాలోకనంబు నిగిడించి శర

ణ్యా కావు న్ను మగుడం

గాకులలోఁ గలుపఁ దగవు గాదే నీకున్.


8_2_78

వ. అని యిత్తెఱంగున.


8_2_79

క. ఆకులతఁ బొంది పలుకుచుఁ

గా కా యని చంచు దెఱపగా నఱచుచు నీ

రాకరమున మునిఁగెడున

క్కాకిం గలహంస పరమకారుణ్యమునన్.


8_2_80

క. వెఱవునఁ దత్తనువుం దన

చరణంబుల నిఱికి యెత్తి చా వుడిపి బల

స్ఫురణంబు మెఱయ వీఁపున

ధరియించుచు వచ్చెఁ బక్షితతులు నుతింపన్.


8_2_81

వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటినెలవున డించి రాయంచ యక్కాకి దెప్పిఱిన

దానితో నచ్చటికాకులు విన నింక నిట్టియవినయంబు లెన్నండును జేయకు మని

పలికి నిజసహచరంబు లగుమరాళంబులుం దానును వలయుచోటికిం జనియె

నీవు నాకోమటికొడుకులయెంగిలికూటం బెరిఁగినయక్కాకంబుచందంబునఁ

గురుకుమారులయెంగిళులు గుడిచి క్రొవ్వి యెక్కుడువారల ధిక్కరించెదవు

నీకొలఁది యెఱుంగవు దీనం జేటు వాటిల్లుఁ గాన తేటపడ నెఱింగించెద

నాకర్ణింపుము.


8_2_82

చ. విరటునిగోవులన్ మరల వెల్చి మదంబున నీదుతమ్మునిం

బొరిగొనఁ బార్థుఁ దాఁక కెట పోయితి నాఁ డల ఘోషయాత్రలో

గురుపతి డించి క్రీడి కృపకుం దగుపాత్రము సేసి యెక్కడన్

సురిఁగితి చెప్పుమా నిజము సూతతనూభవ నాకు నేర్పడన్.


8_2_83

వ. అని వెండియు.


8_2_84

చ. పనివడి జామదగ్న్యుఁడు సభన్ వినిపింపఁడె మీకు నెల్ల న

ర్జునిభుజవైభవంబు మధుసూదను పెంపును నాఁడ ద్రోణశాం

తనవులుఁ జెప్పరే బహువిధంబుల వారల గెల్వ రామి మున్

వినమె యెఱింగియున్ మఱియు వీఱిఁడిమాటలు వేయు నేటికిన్.


8_2_85

క.ఒంటిమెయిఁ దాఁక నాము

క్కంటికి వశ మగునె కృష్ణగాండీవుల ని

ట్లంట యుడిగి తగురథికుల

జంటగొని రణమ్ము సలుపు శత్రులు దలఁకన్.


8_2_86

తే. గుంతికొడుకును దేవకికొడుకు మనము

గనియెదము దినకరనిశాకరులుఁ బోలె

వెలుఁగ నయ్యెడ ఖద్యోతవిలసితంబు

తోడి దగుఁ గాక నీపెంపు దోఁపఁ గలదె.


8_2_87

వ. అనిన విని కర్ణుండు గమలనాభునిపెంపును బార్థుబలిమియు నెఱుంగక యేనే

వారిఁ దొడరెద నెట్లు చెప్పినను దొడరుదుఁ దొడరి వా రొండె నే నొండె

నగుదు నింతియ నీవు వెటమాట లాడక యుడుగు మని పలికి యచ్చటి మహీ

పతులు విన నమ్మద్రపతి కిట్లనియె.


-: కర్ణుడు శల్యునితోఁ దనకుఁ గలిగినశాపంబులతెఱంగు సెప్పుట :-


8_2_88

సీ. తలఁచిన నెదకు సంతాపంబుసేయంగఁ జాలెడునట్టివి జామదగ్న్యు

కోపంబు బ్రాహ్మణశాపంబు గాక యే సరకు గొందునె మురహరుఁ గిరీటిఁ

జెప్పెద విను మస్త్రశిక్షార్థినై మహేంద్రనగంబునకు జమదగ్నిసుతునిఁ

గోరి పోయినఁ గృపాంభోరాశి యగునమ్మహాముని గులము నన్నడుగుటయం?


తే. బొంకునకు నోర్చి బ్రహ్మాస్త్రమునకుఁ గాఁగ

బ్రాహ్మణుఁడ నని చెప్పి తత్పాదభక్తి

గలిగి మెలఁగంగ శిక్షించె నలఘుబహువి

ధాస్త్రశస్త్రసంవేదిఁ గా నతఁజు నన్ను.


8_2_89

వ. భార్గవాభిధానం బగుమహాస్త్రంబు లోనుగా ననేకదివ్యాస్త్రంబు లిచ్చెఁ బద-

పడి బ్రాహ్మం బగునస్త్రంబు నొసంగె నొసంగి సమరంబున నాపత్సమయంబు-

దీనిం బ్రయోగింపు మని యానతిచ్చె మఱునాఁడత్తపోధనసత్తముండు మ-

యాంకతలంబున నొఱగి నిద్రించు చుండ నొక్కజంతువు నాక్రిందితొడఁ దొలి

చిన నమ్మహాత్మునకు నిద్రాభంగం బయ్యెడు నని కదల కుండితిఁ దదనంతరంబ

మేలుకని యతండు నెత్తుటివెల్లువఁ గని తత్ప్రకారం బడిగి యేను జెప్ప విని

మద్ధైర్యంబున కచ్చెరువడి నీవు బ్రాహ్మణుండవు గా వెవ్వఁడవని యొత్తి యడు

గుటయు వెఱచి సూతసుతుండ నని చెప్పితిఁ జెప్పునప్పు డక్కీటకంబు నాలో

కించిన నది యదృష్టపూర్వవికృతాకారం బై యుండె నర్జునహితంబు గోరి

యింద్రుం డమ్మునీంద్రునకు నన్నుఁ దేటపఱచి యతనిం గోపింపం జేయువాఁడై

కీటతనువు దాల్చి యట్లు సేసెం గానోపు నాసంయమి గోపించి కపటంబున

బ్రహ్మాస్త్రంబుఁ బరిగ్రహించి తది నీకు వలయుకాలంబున దోఁపమియు మృత్యు

వాసన్నం బైనం దోఁచుటయు నాపద ముట్టినయెడ భార్గవాస్త్రంబు దోఁప

కుండుటయుం గలిగెడు మని శపించె నిది జామదగ్న్యుకోపంబుతెఱంగు బ్రాహ్మణ

శాపంబు తెఱం గెఱింగించెద నాకర్ణింపుము.


8_2_90

సీ. శ్రమమునకై యేను సకలాంబకములు నెక్కుడువెస సేయ నయ్యెడకు నొక్క

యాఁబెయ్య యుఱికి నాయజ్ఞానమున నంపతాఁకునఁ గూలుడు దానిఁ గలుగు

బ్రాహ్మణుం డధికకోపంబున నిది హోమధేనువత్సం బిట్లు దీని శల్య

నిహతంబుఁ జేసితి నీవు నావచనశల్యంబున నిహతుండ వగుము నీకు


తే. సమర మేకాగ్రనిర్భరోత్సాహవృత్తి

నడవ నరదంబుచక్రంబు పుడమిఁ గ్రుంగ

వలయు నెవ్వీరు మార్కొనిగెలువఁ గోరి

శ్రమముసేసెద వతనిచేఁ జావుమీవు.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_8_2_61_to_8_2_90&oldid=3459" నుండి వెలికితీశారు