ఆ భా 8 2 31 to 8 2 60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

--రానారె 16:37, 2 అక్టోబర్ 2006 (UTC)

8_2_31

క. మఱియెక్కటి సెప్పెద ని

ద్దఱు కృష్ణులఁ జంపి వీరిధనములు నా కి

త్తఱిఁ దద్రథ మిదియే యని

యెఱిఁగించినయతని కిత్తు నేను ముదమునన్.


8_2_32

వ. అని పలికి శంఖం బొత్తిన దుర్యోధనుం డనుజసంహితంబుగాఁ బ్రమోద

నొందె నప్పుడు నిస్సాణాదితూర్యనిస్వనంబులు దిక్కులం బిక్కటిల్లె మనయోధ

వరులును వరూధినియు నుబ్బునఁ బేర్చి యార్చిన నినదంబులు నింగి ముట్టె

నయ్యెడఁ బ్రహాసభాసురముఖుం డై మద్రవిభుండు రాధేయున కి ట్లనియె.


8_2_33

ఉ. ఎవ్వరు సూప నేల నరు నిప్పుడ కాంచెదు రిత్తవారికిం

గ్రొవ్వున నుజ్జ్వలార్థములు గొం డని యీవల దిట్టు లిచ్చినన్

నవ్వు జనంబు మిక్కిలి ధనంబులు గల్గినఁ జేయ రాదెనీ

కెవ్విధి నైన సద్వ్యయము లెందు నపాత్రపుటీవి యొప్పునే.


8_2_34

వ. అని యంత నిలువక.


8_2_35

క. కొలఁది యెఱుంగక కృష్ణులఁ

గలన గెలుతు ననియె దీవు గంటిమె సింగం

బుల నెత్తఱి నైనను నే

పొలమున నేనియును నక్క పోరి గెలువఁగన్.


8_2_36

ఉ. అగ్గి సొరం దలంచునటు లర్జును నెక్కటి దాఁకఁ గోర్కి నీ

కె గ్గిది మాను మీపలుకు లెవ్వరుఁ జెప్పఁగ లేరు రూ పఱ

స్మ్రగ్గఁగఁ గాల మయ్యెనొకొ నావచనంబు లొకింత కర్ణము

ల్డగ్గఱ నిచ్చి యోధులు బలంబులుఁ దోడుగఁ బోరు టొప్పగున్.


8_2_37

ఆ. ఏను ధార్తరాష్ట్రహిత మాచరించుట

కై పెనంగి చెవుల కప్రియంబు

లైన నిన్నిమాట లాడితి నాబుద్ధి

విని దురాగ్రహంబు విడువ వలయు.


8_2_38

చ. అనవుడు నల్గి సూతసుతుఁ డాతని కిట్లము మద్బలంబు న

మ్మిన నను నిత్తెఱంగునకు మేకొన కుండఁగ మాన్ప మజ్రహ

స్తునకు వశంబు గా దనినఁ జొప్పడునే నినుబోఁటి కాప్తిఁ జె

ప్పినక్రియఁ జెప్పి నీవు వెఱపించిన నే వెఱ పెక్కువాఁడనే.


8_2_39

వ. అనుటయు నతని నగ్గలంబు కోపింపం జేయుటకై శల్యుండు మఱియు

నిట్లనియె.


8_2_40

తే. ఇప్పుడే నీకు బుద్ధులు సేప్ప నేల

నరుఁడు గాండీవగుణనిక్వణంబు సెలఁగఁ

గదిసి నీమెయి బలుతూపుగములు నిగుడఁ

జేసి నిను బుద్ధిమంతునిఁ జేయుఁగాక.


8_2_41

అని యంతం దనివోక యతండు.


8_2_42

సీ. రోషమహాటోపభీషణహరితోడ సమరంబునకు హరిణము గడంగి

దానధారాభీలదంతావళముతోడ సంగ్రామమునకు శశంబు గడఁగి

చండస్వభావోగ్రపుండరీకముతోడ నాజికి సారమేయంబు గడఁగి

దారుణతుండాతిఘోరగృధ్రముతోడఁ గలహంబునకు నురగంబు గడఁగి


ఆ. యడరునట్లు గాదె యస్త్రకళాసము

జ్జ్వలుఁడు పార్ధుతోడ సంగరమున

కీవు గడఁగి యడరు టెల్ల రాధేయ నీ

కేటిబలము నమ్మ నెందుఁ గలదు.


8_2_43

వ. అనియె నివ్విధంబున నధిక్షేపింపబడి కర్ణుండు గోపించి కెంపారుకన్నుల

శల్యునాలోకించి.


8_2_44

క. గుణవంతులగుణములు ని

ర్గుణుఁ డెఱుఁగమి దెల్ల మీవు గుణహీనుఁడ వీ

గుణ మితనియందుఁ గల దని

గణుతింపఁగ నైపుణంబు గలదే నీకున్.


8_2_45

సీ. అర్జును నస్త్రవిద్యాప్రమాణంబు నాయెఱిఁగినయంత నీ వెఱుఁగ వతని

కొలఁదియు వనమాలికొలఁదియుఁగాంచి నాకొలఁదియు నెఱిఁగి వారల మదీయ

దివ్యాస్త్రబలమునఁ దెగటార్ప నగు నని యే నిశ్చయించితి నెట్టు లనినఁ

గడుఁబెద్దకాలంబు గంధపుష్పాదుల నర్చించు చున్నాఁడ ననుదినంబు


ఆ. దొనఁ గరంబు భక్తి నునిచిన నున్నది

యహిమయంబు దారుణాస్త్ర మింత

యంత యనక యెదిరి నాహుతి గొను దాన

జిష్ణు నోర్తు నొండెఁ గృష్ణు నోర్తు.


8_2_46

భార్గవాస్త్రంబున నొక్కనిం బొరిపుత్తు నట్లుఁ గాక యాదవపాండవనివహం

బులోనం గృష్ణార్జునులయందు లక్షీవిజయంబులు సుప్రతిష్ఠితంబు లై యున్న

నయ్యిరువురం బొదివి పెనంగం గనుటకంటె మేలునుం గలదే వారల గ--

కపిధ్వజంబులుఁ జక్రగాండీవంబులు బెడుమానుసులకు భీషణంబులు నా--

బరితోషణంబులు వేవురుగోవిందులుఁ బదివేవురుపార్థులుఁ బన్నినం బో--

నీవు మహాయుద్ధకోవిదుండవు గామింజేసి వెఱచఱచి కాఱు లఱచెద వక--

పక్షపాతంబునఁ బ్రేలెదవో యెఱుంగ నింక నిట్టిమాట లాడితేని ప్రాణం

బుల కొఱ యెల్ల వని పలికి వెండియు.


-: కర్ణుఁడు శల్యునిపైఁ గోపించి యతని దురాచారంబు లుగ్గడించుట :-


8_2_47

సీ. విను పాపదేశసంజనితుండ వగునీకు దుర్బుద్ధి గాక సర్బుద్ధి గలదె

క్షత్త్రియాధమ నీచ కలదు లోకంబున నాబాలగోపాలమైన వాక్య

మతికుటిలుండు సంగతుఁడుగాఁ డేమిటఁ జెలికిఁ గీ డొనరించుఁ జెట్ట వలుకు

దుష్టాత్మకుఁడుఁ గడుఁ గష్టుఁడు మద్రకుం డనునంతవట్టుఁ బ్రత్యక్ష మయ్యె


ఆ. వానిలేక యెల్లవనితలుఁ బురుషులుఁ

గలయ మీకు నెగ్రు గాక యుండు

మున్ను గల్లు పిదపఁ జన్నుఁబా లై పెరుఁ

గుదురు సెప్ప నేల గుణము లింక-.


8_2_48

క. పలువురకుఁ బుట్టి నిచ్చలుఁ

గలు ద్రావుచుఁ బెరిఁగి యెట్లు గఱతురు శీలం

బులు నుచితము లగుభాషణ

ములు నీ విమ్మాట లుడిగి పొదపొదమనికిన్.


8_2_49

చ. మఱియెకఁ డేనుఁ జెప్పెద నమానుషవిక్రమలీల నల్గడం

బఱపియుఁ జంపియున్ రిపునృపాలకసైన్యము రూ పడంచి మై

దొఱఁగుట యొప్పదే తనువు దూఁటులు గాఁ బెఱవారి గెల్పుకో

లుఱ దొకొ నాదుపెం పుడుప నోపుదురే నినుబోఁటు లెమ్మెయిన్.


8_2_50

వ. కినియించి గదం దల వగుల వ్రేటువడక యూరక తేరు వోని మ్మనవుడు మద్ర

పతి యతని నవలోకించి.


8_2_51

ఆ. హితము సెప్పఁ దగనె యే నీకు నదియును

గాక నీరథంబు గడుపు చుండి

కౌరవాధినాధ కార్యార్థి నగునాకు

నున్నరూపు సెప్పకుండ నగునె.


8_2_52

సారథి దక్షుఁడై రథికసారము రథ్యబలంబు నాయుధో

దారత మానమున్ రణవిధంబు నిమిత్తశుభాశుభత్వని

ర్ధారణమున్ మదిం గని హితం బెఱిఁగించుట నీతి గాన నీ

వీరస మెత్తి నోఁ బలికి తేనియుఁ జెప్పుదు సూతనందనా.


8_2_53

వ. ఏ నేమితప్పు సేసిన గదం దల వగులవ్రేసెదవు నీ వి ట్లంటివి గదా యని

హితోపదేశంబు మాననేర్తునే యిది యొకదృష్టాంతంబు వివరించెద

వినుము విని నీవు నాచెప్పినట్ల చేసి తేనియు మేలు సేయ కుండినం గడుమే ల

ని యిట్లనియె.


8_2_54

సీ. అంబుధిలో నొక్కయలఘుతరద్వీపమున ధర్మవర్తి నాఁ జనునరేంద్రు

పురమున నొకవైశ్యవరుఁ డధ్వరాదిసత్కర్మఠుఁడును శాంతిదాంతియుతుఁడుఁ

గరుణాపరుఁడు దాననిరతుండు ధనధాన్యశోభియు బహుపుత్రలాభవిలసి

తుండు నై వర్తించు చుండఁగ నిలు సేరె నొక కాకి యతనిపుత్త్రకులు దాని

తే. కెంగిళులు వెట్టి కొనియాడ నెలమిఁ బెరిఁగి

క్రొవ్వి కడు మీఱి యెట్టిపక్షులును దన్నుఁ

బోల వనియెడుదుర్మానమునఁ దృణీక

రించి యది పెక్కుభంగులఁ గ్రీడ సలుపు.


8_2_55

వ. ఇట్లు విహరించు చుండ నొక్కనాఁడు గొన్నిహంసంబులు పక్షబలంబున సుప

ర్ణుతో సరిసేయం దగునట్టివి సముద్రంబుచేరువఁ జనం గని యాకోమటికొ

డుకు లక్కాకంబునకు వానిం జూపి యిట్లనిరి.


8_2_56

క. పులుఁగులలో నీ వెక్కుడు

విలసద్గతి సంచ లిట్లు వినువీధిఁ గరం

బెలమిం జనియెడు వీనిం

గలసి పఱచి గెలువ వలదె గతులబహులతన్.


8_2_57

అని తారతమ్యజ్ఞానహీను లగునయ్యల్పబుద్ధులు సెప్పిన నుచ్ఛిష్టదర్పితం బగు

నదియును మౌర్ఖ్యంబునం దా నంతటిదాన నని తలంచి వానిదెసకుం జని

మనంబున వీనిలో మేటి యెయ్యదియో యనుచుం జేరి తనచూడ్కికి వచ్చిన

యంచం బురుడించి పఱతము ర మ్మని పిలిచిన నయ్యంచ లన్నియు నిలిచి

బెలుచ నవ్వి యవ్వాయసంబున కిట్లనియె.


8_2_58

మానససరసి వసింతు మ

హీనబలము జవముఁ బక్షు లెల్లను బొగడం

గా నెందుఁ దిరుగుదుము ద

వ్వైనను భేదంబు లేదు హంసల మగుటన్.


8_2_59

వ. ఇట్టిమాయందును.


8_2_60

క. బలశాలి యైనహంసముఁ

బిలిచితి పురుడించి పాఱ బేలతనమునన్

గలవే యింతకు మును హం

సలతోఁ బురుడించువాయసంబులు జగతిన్.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_8_2_31_to_8_2_60&oldid=3172" నుండి వెలికితీశారు