ఆ భా 8 2 121 to 8 2 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

- వోలం సురేష్ కుమార్

8_2_121 అనిన గర్ణుఁ డిట్టు లనియె సంశప్తక బలము చేతఁ బొదువఁ బడి కిరీటి మేఘపిహీతుఁ డైన మిహిరుని చాడ్పున వాఁడి లేక యున్న వాఁడు గంటె.

8_2_122 వ. అనుటయు శల్యుండు.

8_2_123 చ. వరుణుఁడు నీళ్లచేఁ జెడునె వాయు సఖుండు మహేంధనోత్కర స్ఫురణ నడంగునే నరుఁడు వోరుల నేపఱు టేల కల్గు నె వ్వరికిని వానిఁ గీడ్పఱుప వచ్చునె గాలిఁ బరాభవింపఁగా దొరకొనినం జలంబు మెయిఁ దోయధి యంతయుఁ ద్రావ వచ్చినన్.

8_2_124 ఆ. దేవతలకు నైన దేవేంద్ర పుత్రుని నాహవమున గెలువ నలవి గాదు మనము గెలుతు మిట్టి మాట లాతనిఁ జేరఁ జనక యాడి దీన సంతసింపు.

8_2_125 ఉ. మేరువు వోలె నొప్పిన సమీరణ పుత్రుని పేర్మియున్ మహో దారుఁడు ధర్మనందను నుదాత్తతయున్ విజయానుజన్ము లే పారఁగ నున్న సొంపును నహంకృతి యేర్పడ ద్రౌపదీ సుతు ల్వీరల మీఱి పొల్పెసఁగు లీలయుఁ జూడుము సూత నందనా.

8_2_126 వ. పాండవులు ధర్మ పరు లెవ్వలన ధర్మంబు గలుగు నవ్వలనికి జయంబు గలుగుట దప్ప దను సమయంబున సంశప్తక కులంబుం గనుంగొని మన సైన్యంబును సవ్యసాచిం జూచి వారి సేనయును గడంగి యొండొంటితోఁ దాఁకిన గంగా యమునల సంపాతంబు చందంబు దోఁచె నట్టియెడం గురురాజు రాధేయుని మద్ర రాజుం దగు రాజులను సాదరావలోకనంబున సంభావించి యిట్లనియె.

8_2_127 ఆ. ఎద్ది ప్రియము సేయు నేపారు శూరుల చిత్తములకు నది యుదాత్త భంగి నొదవె మీకు బాహు మదమునఁ గొనియాడుఁ డుగ్ర శౌర్య మహిమ యుల్లసిల్ల.

8_2_128 బలు పెసఁగఁ బాండు పుత్రులఁ బొలియించిన నతుల రాజ్య భోగంబును వా రల చేతం బొలిసిన ను జ్జవల నాక సుఖంబుఁ గలుగు ప్రాలుఁడు పోరన్.

8_2_129 వ. అనిన వార లందఱు నుబ్బి సింహ నాదంబులు సేయఁ దూర్య నినదంబులు సెలంగ సైన్యంబులు సంతసంబునం బొదలె నప్పు డశ్వత్థామ రథిక జనంబుల మనంబులం బ్రమదం బెసంగ నిట్లనియె.

8_2_130 క. ఆయుధము విడిచి యుండఁగ సాయక గురు మీరు సూడఁ జంపిన కష్టో పాయుని ధృష్టద్యమ్నుని మాయించియ కాని తొడిన మఱు వే నూడ్పన్.

8_2_131 క. కడువడి వడముడియును గ వ్వడియు నతనిఁ గావఁ బూని వచ్చిర యేనిం జెడుదురు మచ్చాపంబున వెడలు వివిధ విశిఖ శిఖల వేఁడిమి చేతన్.

8_2_132 చ. అన విని యవ్వరిష్ఠ రథికావలి పెల్లుగఁ బాండు పుత్ర యో ధనుల పయిన్ వెసం గవియు దర్పము వార లుదగ్ర వృత్తి మా ర్కొనిన మహోగ్ర భంగియును ఘోరపు లీలల విస్మయం బొన ర్చె ననిమిషాంతరంగములఁ జెల్లె రణంబు నుదీర్ణ రౌద్ర మై.

8_2_133 క. జన సంక్షయంబు పెల్లె మన వచ్చుం బ్రళయ కాల మయ్యెనొ కా కెం దును నిట్టివి గలవే యని మనమునఁ దలపోయ వలసె మము బోఁటులకున్.

8_2_134 వ. అట్టియెడ.

8_2_135 ఉ. ప్రీతి యెలర్ప వీరుల వరించుటకుం జనుదెంచి యప్సరో వ్రాతము గంధ పుష్ప పరివర్షణ కేళి యొనర్ప సౌరభం బాతఱి సంచరించు లలితానిలుఁ డెక్కుడు సేసి వీచె సం జాన నవీన ఘర్మజల జాలక సైనిక లాలనీయుఁ డై.

8_2_136 ఉ. ఆ సమయంబునం గురు కులాగ్రణి భీమునిఁ దాఁకె వైరి సం త్రాసనమత్తవారణ కదంబు సముద్భటుఁ డై యతండు నుం జేసె రణంబు దత్ప్రబలసేన దలంకెడు నట్లుగా సము ద్భాసిత దుర్ని వార్య బహు బాణ విసారణ దారుణోద్ధతిన్.

8_2_137 క. పదపడి రాధేయుం డు న్మద వృత్తిం గవిసె గుణ నినాదంబును బె ట్టిద మగు రథ నిస్వనముం జదల నిగుడఁ బాండవాగ్ర జన్ముని దెసకున్.

8_2_138 వ. ఇట్లు గవిసిన మన సైనికు లిట్లని రివ్విధంబున ధర్మ నందనుం గదియ నడరిన నరుండు వచ్చి యడ్డంబు సొచ్చునపుడు.

8_2_139 చ. నరునకు సూత సూతికి రణం బగు నేఁ డతి ఘోర భంగి నం దరయ నితండు గీ టడఁచు నాతని నన్నటు లున్న వాఁడు దు ర్భర రిపుబాధ దక్కి కురు రాజు సుఖిత్వముఁ బొందు నిప్డు రం డరదము నేరి యీతని మహాస్త్ర విలాసము సూత మేర్పడన్.

8_2_140 క. గెలు పెల్ల భంగి నితనికిఁ గలుగు నను తలంపు వుట్టఁ గా నిపుడు మనం బుల జనియించు మనో థ మలవడుటయుఁ బోర విఱుఁగ నయ్యెడు నదియున్.

8_2_141 వ. అనుచుఁ గూడుకొని రథ కరి తురగ సమ్మర్ద నిర్దళిత భూ భాగంబు గా నురవడింప రాధేయుం డతి భీషణం బగు రథంబున.

8_2_142 తే. మిగిలి యప్పాండవాగ్రజు మగఁటిమియును జలముఁ గోల్పుచ్చి తూలఁ బోఁ బలికి మెఱసె నధిప యతనికి వీఁకమై నడ్డపడఁగఁ గడఁగు నద్దెస యోధుల గర్వ మడఁచి.

- కర్ణుఁడు ధర్మజు పైఁ గవిసి విజృంభిచుట -

8_2_143 వ. అనిన విని సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియెఁ గర్ణుండు దన మొన యెట్లాయితంబు సేసెఁ గౌంతేయ ముఖ్య సైన్య సన్నాహం బెట్టి దతం డతనిం బొదివిన యప్పుడు గవ్వడి యెవ్వలన నుండె నవ్వీరుం డన్నకడ నున్న నా సూత నందనున కట్లు సేయ వశం బగునే వాసవుండు సకల సుర గణంబులతోఁ బన్ని యన్నరునిపై వచ్చి ఖాండవంబు గాల్ప కుండఁ గావం జాలెనే బ్రదుకున కాసపడు మగల కతని మార్కొన వచ్చునే రాధేయునకు వచ్చుం గాక యనుటయు.

8_2_144 తే. ఇట్టు లను సంజయుం డమ్మహీశ్వరునకు నంగపతి మోహరంబు తెఱంగు ధర్మ సుతుని యొడ్డ విధంబు నర్జునుఁడు వారి పోరునెడ లేమియును మీఁది పోరు వినుము.

8_2_145 వ. కృపాచార్యుండు గృతవర్మయు మాగధులు వలపట శకునియు నులూకుండను గుఱ్ఱపు దడంబులతో వారికెలనను సంశప్తక గణం బిరువది నాలుగు వేలు ముఖ్య రథంబు లగ్గలిక నుల్లసిల్లి దాపటను నీ కొడుకులందుఁ గొందఱు కాంభోజ శక యవన సైన్య సమేతంబుగా వారియవులను బహు బల భాసితుం డై దుశ్శాసనుండు వెనుకనుం గతిపయ సోదర పరివృతుం డై కురురాజు పిఱుందను నశ్వత్థామ ప్రముఖ యోధులు గరి నికర కృత సన్నాహు లై యన్నరపతి నియోగింప తనతి పజ్జ నిలువ నిజపుత్రులుఁ దన చుట్టునుం గదిసి యెసక మెసఁగు బరవసంబున మెఱయ సూత సూనుండు సేనా ముఖంబునకుం దిలకం బై నిలిచి పొలిచె నట్లు మోహరించి మదకల మాతంగంబుల తఱచు కతంబున మొయిళ్ల మొత్తంబుల కైవడిం గాఱుకొను నమ్మొన నురవడి నడపించు నా కర్ణునిం గనుంగొని కౌంతేయాగ్రజుండు గాండీవి రావించి యిట్లనియె.

8_2_146 ఉ. సూత తనూజు మోహరము సూచితె యెంతయు గట్టి యై సము ద్ద్యోతిత భంగిఁ దోఁచె నది యుక్కునఁ బై పడి యబ్బలంబు ని ర్ధూతము సేయ కుండఁగ నెదుర్కొని యెమ్మెయి నిల్పరింత మ న్నీతి విధింపుమా బలుపు నేర్పును దజ్జ్ఞులు పిచ్చలింపఁగన్.

8_2_147 వ. అనుటయు సంక్రందన నందనుండు.

8_2_148 తే. సారవంత మై కర్ణుని సైన్య మురవ ణించుఁ గా కేమి దీనికి నృప వరేణ్య పూని చేయంగ వలయుఁ బ్రథాన కార్య మతని సమయించుటయు నాకు నది భరంబె.

8_2_149 వ. అనిన విని యమ్మనుజపతి యతని కిట్లను నట్లేని నీవు రాధేయుని గెలువుము భీమసేనుండు సుయోధనుని నకులుండు వృషసేనుని సహదేవుండు సౌబలుని శతానీకుండు దుశ్శాసనుని సాత్యకి గృతవర్మను ధృష్టద్యమ్నుండు ద్రోణపుత్రుని ద్రౌపదేయులు శిఖండియుం దారును దక్కటి ధార్తరాష్ట్రులం దలపడు వారేను గృపుని తోడం బెనంగెద ననుటయు నట్ల కాక యని యతండు మున్ను దన నిలిచిన నెలవునకుం జనునెడ నయ్యుధిష్ఠిరు పనుపు తెఱంగు వారలందఱకు నెఱింగించె నతండు వలపటి వలన సైన్యాగ్ర వర్తి యయ్యును వృకోదరుండు వామ పార్శ్వవర్తి యయ్యును శైనేయ ద్రౌపదేయ సమేతంబుగా నప్పాండవాగ్రజుండు మధ్య భాగస్థుం డయ్యు నున్న యమ్మోహరం బా సూతనందను మొనయురవణి సరకుగొనక మార్కొనియె ననవుడు నాంబికేయుండు.

8_2_150 మ. నరుఁ డమ్మై విని వచ్చె నన్నరునకు న్సంశప్తక శ్రేణికి న్దుర మత్యుద్భట భంగిఁ జెల్లుటయు ము న్సూచించి తీ వయ్యుధి ష్ఠిరునిం గర్ణుఁడు దాఁకి యోర్చె ననియుం జెప్పంగ వింటిన్ రణం బరయ జిత్రము సెప్పుమత్తెఱఁగు సువ్యక్తంబుగా సంజయా.