Jump to content

ఆ భా 8 2 091 to 8 2 120

వికీసోర్స్ నుండి

- వోలం సురేష్ కుమార్

8_2_091 చ. అనుటయు భీతి వేఁడికొని యీవులు వేయును నెడ్ల నాఱు నూ ఱును రథముల్ శతంబును మెఱుంగుల మొత్తముఁ బోనియంగ నా జన శతకంబు దంతి శత సప్తకముం గొని శాంతిఁ బొందవే యనినను మాన దయ్యె వసుథామరు కోపము తీవ్ర రూపమై.

8_2_092 వ. మానక యున్న మఱియును.

8_2_093 క. నాకుఁ గల సొమ్ము లెల్లను నీ కిచ్చెద ననుఁ బ్రసాద నిరత కటాక్షా లోకితుఁ జేయు మనుడు నతఁ డీ కాఱులు మాను మనుచు నేఁగెం బెలుచన్.

8_2_094 వ. ఇట్లరుగుచు నలుక పెంపునం గన్నుల నిప్పులు రాల మరలి కనుంగొని నా పలుకులకు బొంకునుం గలదే నీ కీ దుష్కర్మంబు పరలోకంబునకు బాధకంబు గాకుండ నిదియ ప్రాయశ్చిత్తం బయ్యెడుం గాక పొమ్ము సూత నందనా యేనెట్లంటి నట్లగుట దప్ప దరుగు మనియెం గావున నా జామదగ్న్య బ్రాహ్మణుల శాపంబులకు వెఱతు సత్యంబ పలికితి నీయున్న రాజులును నా తోడి సుఖ దుఃఖంబులకుం గలవా రగుటం జేసి కృష్ణార్జునులకు నే వెఱవ నింద్ర యమ వరుణ కుబేరులు వజ్ప దండ పాశ గదా హస్తులై బెట్టు ముట్టినను బెదర నని యుండుదుఁ దక్కిన వారిం జెప్ప నేల యిప్పుడు బ్రహ్మాస్త్రంబును దోఁచుచున్నది యన్నరుని యున్నెడకు మన రథంబు నడపుము పుడమి జనంబులు మదీయ కోదండ పాండిత్యం బొండొరులకుం జెప్పికొని యచ్చెరు వందు చుండునట్లు సేసెద నమ్మేటి మగని మృత్యు నివాసంబు నొందించెద.

8_2_095 సీ. కాండ మహా తరంగముల వైరుల ముంచు విజయాంబు రాశికి వేల నగుదు బాణరశ్ములఁ బరిపంథులఁ బొదివెడు నర్జునాదిత్యున కభ్ర మగుదు విశిఖోగ్ర శిఖల విద్విషుల నేర్చు కిరీటి ఘోర దావాగ్ని కాసార మగుదుఁ బ్రదర వేగమున నరాతులఁ గూల్టు పార్థాతి వాయువునకు నచల మగుదు

తే. విల్లు పట్టెడు వారికి నెల్ల నెక్కు డనఁగ నగడిన గాండీవి నాహవమునం దొడరఁ బ్రాణంబులకు నాస పడు లఘు ప్ర కారులకు వచ్చు నే నాకుఁ గాక శల్య.

8_2_096 వ. అని పలికిన విని యమ్మద్రపతి వీని యంతరంగంబు గలంగఁ దా నర్జును చేతం జచ్చుట నిర్ణయించె నెట్లనిన నిట్టి యప్పుడు జనులు దన మీఁదం జాలమి వెట్ట కుండుటకుం గాదె జామదగ్న్య బ్రాహ్మణుల శాపంబులు భూపాలురు విన నుగ్గడించె నిక్కలంక యే నీరజ్జులానికి నర్జును గుణ విశేషంబు లెఱింగించి మదం బడంచిన కతంబునం గలిగెఁ గౌంతేయాగ్రజునకు నా యిచ్చిన వరంబు సఫలం బయ్యె నని మనంబునం దలంచె మనుజేశ్వర విను మా శల్యుండు సెప్పిన యాఖ్యానంబునం జిత్తం బెరియు చునికిం జేసి యా సూత నందనుం డతనితో మఱియు నిట్లనియె.

- కర్ణుఁడు హంస కాకీయో పాఖ్యానము విని కోపించి శల్యుని దూఱుట -

8_2_097 క. దృష్టాంతము సెప్పెద నని కష్టాత్మా నీవు నన్నుఁ గాకము నరు ను త్కృష్ట మరాళము గాఁగ ని కృష్టపుఁ గథఁ జెప్పి తిది సఖిత్వము తెఱఁగే.

8_2_098 ఆ. నీచులకు బలంబు నెట్టన పరుస ని కాఱు లఱచు చున్కి గాన యిట్లు పలికి తింతఁ జేసి భయ మయ్యెనే నాకు నట్టిమాట లింక నాడ కుడుగు.

8_2_099 క. అడిగితి నే నిను నాక వ్వడి భుజ బల మెట్టిదని యవారణ నీ వి ప్పుడు నృపు లెల్లను విన వా విడిచి పొగడె దిట్లు వంది విధమున నతనిన్.

8_2_100 చ. అని మొని శత్రులం బొగడు టారయ మూర్ఖత గాదె యిట్టి దు ర్జనుల సహింతురే పెలుచఁ జంపక సై రణ సేయుకాల మై నినుఁ దెగఁ జూడ నైతి ధరణీపతి కయ్యముపై భరంబునన్ గొనకొని సూత కృత్యమునకు దగఁ బంచిన వాఁడు గావునన్.

8_2_101 వ. అని వెండియు.

8_2_102 తే. అకుటిలు డగు నాకు నత్యంత కుటిల వృత్తి సహితంబు సేసెద విత్తెఱంగు మిత్త్ర వంచన మారయ మైత్త్రి సప్త పద కృతోద్భూతి యనియెడు పలుకు వినవె.

8_2_103 క. జను లెట్టిది మిత్త్ర విధం బని చెప్పుదు రట్టి చంద మఖిలము దుర్యో ధను నందుఁ గలదు నా యెడ మన మూఱడియుండు నా కమంద ప్రీతిన్.

8_2_104 క. జను లెట్టిది శత్రు విధం బని చెప్పుదు రట్టిచంద మారయఁగా దు ర్జనుఁడ వగు నీకు నా యెడ వినుము కలిగె దీన మనసు విచ్చెం గుటిలా.

8_2_105 ఉ. కావున నీకు నప్రియముఁ గౌరవ రాజనుకుం బ్రియంబును గా నిధి మెచ్చ బాహుబల గర్వ మఖర్వము గాఁగ లక్ష్మికిం జేవయుఁ గీర్తి కున్నత విజృంభణముం గలుగన్ ముకుంద గాం డీవులఁ దాఁకి గెల్చెదఁ గడింది మగంటిమి యుల్లసిల్లఁగన్.

8_2_106 వ. అని పలికి మఱియును.

8_2_107 తే. భండనంబునఁ బార్థు చేఁ బడక నేఁడు మేలు చేయైతి నేనియు మృత్యువునకు నెన్నఁడును నగపడ నాకు నివ్విధంబు సందియును లేక చిత్తంబు నందుఁ దోఁచె.

8_2_108 చ. వినుత మహాస్త్రముల్ వఱపి విక్రమ సంపద నాకుఁ జూపు న ర్జును భుజ లీల కోర్చెద వసుంధరఁ జర్కము గ్రుంగి నా రథం బునకు నవార్య మై యెడరు వుట్టక తక్కిన శల్య చూడు మీ నను విశిఖావలీ విలసంబున నాతని యేపు మూపెదన్.

8_2_109 వ. నీకు వెఱపింప నయ్యెడు కొలంది వారిని వెఱపింపుము కర్ణుండు విక్రమంబులకుం గీర్తికి నాస్పదం బగుటకు జనియించిన వాఁడు గాని భయంబు గొనుటకుం గాదు కురుపత్ని సన్నిధి నీవు సారథ్యంబునకుం బూను చుండి పలికి కొన్న బాస కతంబున బ్రదికి పోయి తనిన విని శల్యుం డీ యనర్థ ప్రలాపంబులం బ్రయోజనం బేమి వినుము కర్ణ కర్ణులు వేవు రైనం గిరీటిని గెలువం జాలుదురే యనుటయు నతండు గినుక నెఱ్ఱనై కన్నుంగవ తోడి నవ్వు నవ్వుచు నిట్లను ధృతరాష్ట్రు సన్నిధి నుత్తమ ద్విజుల గోష్టి నఖిల దేశాచార విదుండైన వృద్ధ బ్రాహ్మణుండు సెప్ప నింటి బాహ్లీక దేశంబున వారు గో మాంసంబు నంజికొని మద్య పానంబు సేసి నగ్నులై యసంగత దురాలాపంబులతోఁ దిరుగుదు రని తొడంగి యనేక ప్రకారంబుల బాహ్లిక దేశ నిందోపన్యాసంబు సేసె నట్టి బాహ్లికుల కొడయుండవు తత్కృతంబులగు పుణ్య పాపంబున నాఱవ పాలు నిన్నుం జేరు నట్లుం గాక వారి యనాచారంబులు వారింపమిం జేసి యాకల్మషంబు లెల్లను నిన్నుం బొందు బాహ్లికుల కంటె మద్ర దేశ జాతు లవినీతు లని యార్యులు సెప్పుదురు నిన్నేమి సెప్పం గల దింత వట్టు నెఱింగి నాలుక యడంచి యుండు మనవుడు నమ్మద్రేశ్వరుండు.

8_2_110 క. లావులు రథ్యతి రథ సం ఖ్యా వేళం దెలియఁ జెప్పెఁ గాదే భీష్ముం డా వచనమ్ములు మనమున భావింపుము క్రోధ మేల బలియుఁడ నీకున్.

8_2_111 తే. విడుతు రాప్తుల బంధుల వెలలు గన్న నమ్ముదురు కుల కాంతల నంగ దేశ జనితు లగు వారు విభుఁడ వజ్జనుల కిట్లు లేలొకో నొడ్ల చరితంబు లెన్న నీకు.

8_2_112 క. పర దోషము సెప్పఁగ నే ర్తురు గా కాత్మీయ మైన దోషంబు మదిం బరికింపఁగ నథములు నే ర్తురె తలఁపక యుంటి వలుకతో నుండకుమీ.

8_2_113 వ. అని యుల్లసం బాడి మఱియును.

8_2_114 ఆ. సకల దేశములను సన్మార్గ వర్తులు గలరు దుష్ట తతియుఁ గలిగి యుండు మది నెఱుంగ నేర్యు మధ్యస్థు లదియును నదియు నుగ్గడింతు రెదురు మెచ్చ.

8_2_115 వ. ఒక దేశంబు దాఁ గీడ యగుట కలుగునే యట్లుంగాక సదాచార దురాచారంబులు దైవం బెఱింగెడు నీ వనాత్మజ్ఞుండ వూరకుండు మనియె నట్లయ్యిరువురు వివాదంబు సేయుట యాలించి చేరి కౌరవ పతి సఖి భావం బుపన్యసించి రాధేయు రాజత్వ గౌరవంబు గొనియాడి మద్ర విభుని వారించిన నా సూత నందనుండు నగుచు శల్యు నుద్దేశించి పొద పొద రథమ్ము పో నిమ్ము పోనిమ్మని పలికె నట్లరిగి శల్యుండు సస్మితుం డగుచు వెండియు నర్జును నుగ్గడించి కృష్ణుండు సారథియును గాండీవంబు సాధనంబును నై యప్రతిహత మనోరథుం డగు నా రథికు తోడం బెనంగ నోపితేని నీవ మా కెల్లను రాజ వమ్మేటి మగని యరదంబు మన మొగ్గరంబు సొచ్చి చిక్కున వఱుచుట గలుగు నని యెఱుంగ నయ్యెడు మన మేమఱక యుండ వలయు నీ తోఁచు దుర్నిమిత్తంబు లను సంధింపుము.

- శల్యుఁడు గర్ణునితో నప్పుడు దోఁచు నుత్పాతంబులు సెప్పుట -

8_2_116 క. వఱళులు మన చేరువఁ బె ల్లఱచుట బెట్టెదురు గాలి యడరుట గ్రద్దల్ తఱ చయి యాడుట వికృతపు టఱపులతో రేఁగి కాకు లఱచుట గంటే.

8_2_117 వ. అని వెండియు.

8_2_118 ఆ. సిడము గామ సూడు వడఁకెడు మన తేరి చుట్టు మెఱయఁ గట్టినట్టి చిఱుత పడగలందుఁ గంటె వెడలెడు మంట లు గ్రంబు గాఁగ నోపు రణము నేఁడు.

8_2_119 వ. అనియె నప్పుడు రాధేయుండు థృష్టద్యుమ్నాభి రక్షితం బయున ధర్మ తనయ వ్యూహంబు గనుంగొ ని రథిక వరులం దగిన యెడల నమర్చి తన మోహరం బాయితంబు సేసికొని యురవడింప నమ్మద్రపతి యఱ్ఱెత్తి యాలోకించి.

8_2_120 ఉ. అల్లదె యర్జున ధ్వజ విహారము గానఁగ నయ్యెడుం గపీం ద్రోల్లసనంబునన్ మెఱసి యుద్భటు లైన త్రగర్తు లేపు శో భిల్లఁగ వారె యన్నరుని బెట్టుగఁ దాఁకి రతండు నంప పె న్వెల్లి నిగిడ్చి ముంచె నదె నింగి గుణ ధ్వని వొంగ వారలన్.