ఆ భా 8 1 91 to 8 1 120

వికీసోర్స్ నుండి

--రానారె 13:39, 21 సెప్టెంబర్ 2006 (UTC)


8_1_91 మ.

కని విందుడు ప్రదీప్తచాపధరుఁ డై కాండప్రసారంబులన్

శినినీరుం గుసుమాఢ్యకింశుకసముం జేయంగ నయ్యోధుఁ డా

తనియంగంబులఁ బంచవింశతిశితాస్త్రంబుల్ వడిం గ్రుచ్చె నే

పున వా రొండొరుసూతులం దునిమి నిప్పుల్ రాలుకన్దోయితోన్.


8_1_92 తే.

ఒకళు లొకళులహయముల నుర్విఁ గూల్చి

యొండొరులకార్ముకమ్ములు ఖండితములు

సేసి తేరులు డిగ్గి రుద్భాసితాసి

చర్మశోభితహస్తు లై సరభసముగ.


8_1_93 వ.

ఇట్లు పాదచారు లై మండలప్రచారంబుల మెఱయుచు.


8_1_94 క.

చేరి బహుచిత్రగతులం

బోరంగా నొడ్డనములఁ బొలిసెం బలకల్

నేరిమిమై గెళవున శిని

వీరుం డిరువఱియ గాఁగ విందుని వ్రేసెన్.


8_1_95 వ.

ఇత్తెఱంగున నయ్యిరువురం జంపి సాత్యకి యుధామన్యుతే రెక్కి యుక్కున

వేఱొక్కరథంబు సన్నద్ధంబు గావించుకొని కైకేయబలంబులం బఱపెఁ జిత్ర

సేనుండును నీమనుమం డగుశ్రుతకర్మయుం బెనంగునెడ నాశ్రుతకర్ముండు.


8_1_96 క.

ఆరాజు నైదువాలిక

నారసముల నొంప నతఁడు నవశరముల న

క్కౌరవుని నేసి నొంచెను

సారథి నైదింట నధికసంరంభమునన్.


8_1_97 సీ.

శ్రుతకర్మ గోపించి క్రూరనారాచ మజ్జననాథుజత్రుదేశమున నాటం

బడి మూర్ఛవోయినఁ బైపయి వెండియు నేయఁ దెప్పిఱి యతం డెసకమెస

నుక్కునఁ దునుమాడె నక్కుమారునిశరాసన మతఁ డొండొకచాప మెత్తి

తఱచుటమ్ముల నేదు వెఱిగినచందంబు సేసె రయంబునఁ జిత్రసేను


తే. నాతఁ డాతనియురమున శాతశరము

దూఱ నేయ నబ్బాలుండు దోఁచె వివిధ

బాణజాల మన్నరపతిశోణితమున

భల్ల మొక్కటఁ దల నేల డొల్ల సేసె.


-:ప్రతివింధ్యుఁడు చిత్రుఁ డనురాజుం జంపుట:-


8_1_98 ఉ.

ఏలినవానిపాటు గని యేడ్తెఱఁ దద్బల యొక్కపెట్ట యా

భీలతఁ జుట్టు ముట్టుటయుఁ బేర్చినయుద్ధతిఁ దీవ్రసాయక

జ్వాలలు నేర్చి యుద్భటభుజావిభవం బలరంగ నల్గడం

దోలె నుదాత్తవిక్రమకుతూహలి నీమనుమండు భూవరా.


8_1_99 సీ.

అప్పుడు ప్రతివింధ్యుఁ డైదుబాణములఁ జిత్రునిమేను నొంచి తత్సూతువక్ష

మునఁ గ్రూరశరములు మూఁడు నాటించి యొక్కమ్మునఁ గేతు వల్లార్చి పేర్చి

యతఁడు ద న్నుగ్రనవాస్త్రపీడితుఁ జేయ విలుద్రుంచి వెసఁ బంచవిశిఖనహతుం

గావించి శక్తి యుగ్రమ్ముగ వైచినఁ బెలుచ నాలుగుదునియలుగఁ జేసె


తే. నలిగి యాతండు గద వైచి యక్కుమారు

ఘోటకంబుల సూతునిఁ గూల్చె నదియ

పట్టుకొని వైచె మగుడ నప్పాండుపౌత్రు

చేయి వడి నుచ్చి పోవ నచ్చిత్రుఁ డధిప.


8_1_100 ఉ.

బాహువు నొచ్చినం గినిసి భాసురతోమర మెత్తి కౌరవ

వ్యూహము సంచలింప నతఁ డుగ్రత వైచినఁ గంటకంబుఁ ద

ద్దేహము నుచ్చి పోవుటయుఁ ద్రెళ్లె నరేశ్వర యవ్విభుండు వ

జ్రాహతిఁ గూలుపర్వతమునాకృతి నుత్కటవైకృతంబుగన్.


8_1_101 వ.

ఇట్లు చిత్రుండు దెగటాఱినం గనుంగొని మనయోధులు ప్రతివింధ్యుపై నడరి

యనేకాస్త్రశస్త్రంబులం బొదివినం బొలివోనికలితనంబున నేల కుఱికి యక్కు

మారుండు గోదండటంకారంబున నంబరంబు పూరించుచు బాణాసారంబు

వరఁగింపఁ బాండవసైనికులు బెట్టిదంపుటురవడిం గదిసి యతనికిం దోడ్పడుట

యు మనవారలు వెన్నిచ్చి పఱచి రప్పు డశ్వత్థామభీమసేనులసంగ్రామంబు

భీమం బయి చెల్లె నందు.


8_1_102 క.

గురుపుత్రుఁడు దొంబదిశిత

శరములఁ బావనిరథంబు సంవృతముగఁ జే

సె రయం బారఁగ సాయక

పరంపరలు వఱపె నతనిపై నతఁ డలుకన్.


8_1_103 వ.

వాని మగిడించి.


8_1_104 చ.

అనిలజుఫాలము గురునం

దనుఁడు పటుప్రదరకీలితము నేయుడు నా

తని నిటలంబున నతఁ డే

పున బాణత్రయము నాటె భూవరముఖ్యా.


8_1_105 వ.

మఱియును.


8_1_106 చ.

గురుసుతభీమసేను లతిఘోరవిధంబులఁ బోరి యొండొరుం

దెరలుప లేనిసామ్యమున దీపితి లై లయకాలవిస్ఫుర

త్తరణియుగంబుఁ బోలె శరధామసమగ్రతఁ బ్రజ్వరిల్లి యొ

ప్పిరి రథచిత్రచారులఘుభీషణసంచరణంబు లొప్పఁగన్.


8_1_107 తే.

వారి వీక్షించి ఖచరులు వోరు లెందుఁ

జూడమే దీని కెన యని యాడఁగలదె

కలుగ వింకను వీరలబలముఁ జలము

నలవు వెరవు నిట్లుండునే యనుచునుండ.


8_1_108 ఉ.

ఒండొరుకేతువుల్ దునిమి యొండొరుసూతుల నొంచి యేపుమై

నొండొరుతేరివాహములయుబ్బడఁగించి నిశాతవిస్ఫుర

త్కాండచయంబు లొండొరులకాయములన్ వడిఁ గ్రుచ్చి వ్రాలి ర

ప్పాండుసుతుండుఁ గుంభజునిపట్టియు మూర్ఛలు దమ్ముఁ గ్రమ్మినన్.


8_1_109 వ.

ఇట్లు రథంబులపై నొఱగి మూర్ఛిల్లిన.


8_1_110 క.

అనిలజుసారథియును గురు

తనయునిరథచోదకుఁడు నతని నాతనినిం

గొని యుల్లంబుల బలితపుఁ

దనుకు సొరఁగ ననికిఁ దొలఁగఁ దోలిరి రథముల్.


8_1_111 ఉ.

క్రీడితనూజుఁ డైనశ్రుతకీర్తియు శల్యుఁడు నేచి దిక్కు ల

ల్లాడఁగఁ బోరుచో శరము లా ఱయిదుల్ శ్రుతకీర్తి శల్యుమై

గాడఁగ నేయ మూఁడుపటుకాండము లాతనిమేనఁ గ్రుచ్చి సం

తాడితుఁ జేసె సూతు నిశితప్రదరంబున నాతఁ డుద్ధతిన్.


8_1_112 చ.

నరతనయుండు దత్తనువు నాటఁగఁ దొమ్మిదియమ్ము లేసి స

త్వరముగ సూతునంగమున వాలికతూపులు మూఁడు నాటి ని

ష్ఠురశరపంచకస్ఫురణ సూపినఁ గోప మెలర్ప నమ్మహీ

శ్వరుఁడు గడంగి విల్ దునిమి సప్తశరంబుల నొంచె నాతనిన్.


8_1_113 వ.

అట్టియెడ.


8_1_114 సీ.

వేఱొక్కవి ల్లెత్తి వివ్వచ్చుకొడు కఱువదినాలుగమ్ములు వఱసె మద్ర

పతిమేన నతఁడు దొంబదితూపు లడరించి యేసె నవ్వీరుశరాసనంబు

ఖండంబులుగ వాఁడు గం డడంగక గద వైచినఁ బొడిసేసి యేచి శక్తి

నిగిడింపఁ దునుమాడె నిశితభల్లంబునఁ ద్రుంచెఁ దదీయసూతునిశిరంబు


ఆ.

వాయుజవము లైనవాహంబు లప్పుడు

గలఁగి యరద మనికిఁ దొలఁగ నీడ్చెం

దెఱపి గాంచి శల్యుఁ డఱిముఱిఁ జొచ్చి క

లంచెఁ బాండుసుతుబలంబు నధిప.


8_1_115 సీ.

కమలాకరములీలఁ గలఁచి యాడెడుగంధదంతావళముసముద్దండతయును

దర మిడి మృగసముత్కరము ఘోరంబుగా వధియించుకంఠీరవంబు నేపు

నీరసారణ్యంబు నిర్భరాటోపతఁ గాల్చుదావాగ్నియుగ్రక్రమంబుఁ

బ్రకటవిక్రాంతిఁ బురత్రయంబును సమయించుఫాలాక్షునియేడ్తెఱయును


ఆ.

బోల్పఁ బట్టు నయ్యె భుజగర్వశౌర్యప్ర

తాపదుర్దమప్రకోపములకు

మద్రవిభుఁడు గోలుమసఁగి శాత్రవసైన్య

హననకేలి సల్పునవరసమున.


-: దుశ్శాసనుఁడు సహదేవునితో యుద్ధంబు సేసి మూర్ఛిల్లుట :-


8_1_116 ఉ.

ధీరజనోత్తముండు సహదేవుఁడు మైగలి దుస్ససేనుఁడున్

వీరులు పిచ్చలింపఁ బ్రజ విన్నద్రువం బొరి నార్వఁ బోరుచో

వారక సాయకత్రయము వాఁడిమి నయ్యువరాజు నొంచె వి

స్తారమనోఙ్ఞహారలసితం బగునాఘనబాహువక్షమున్.


8_1_117 చ.

ధృతి వొగడొంద నేచి సహదేవుఁడు నీసుతు శాతదీప్తస

ప్తతిశరవిద్ధుఁ జేసి వడిఁ దద్రథచోదకు మార్గణత్రయా

హతుఁడుగఁ జేయ నల్గి వెస నాతనిచాపము ద్రుంచి యాతఁ డు

ద్ధతి యలరంగ డెబ్బదిశితప్రదంబుల మేను నొంచినన్.


8_1_118 సీ.

నకులానుజుఁడు గృపాణంబున వైచిన దుస్ససేనునివిల్లు దునియలయ్యె

నెడ గని యవ్వీరుఁ డేచి బల్వింట మంటలు గ్రమ్మున మ్మేయుటయు నతండు

గడువెస నెత్తినకరవాలమునఁ ద్రుంచి యతనిమై లక్షించి యదియ వైన

నడుమన యాతండు నఱకినఁ బ్రస్ఫీతచాపంబు గొని చతుష్షష్టినిశిత


ఆ.

కంకపత్రములను గడఁక నయ్యువరాజు

పరఁగఁజేయుటయును బాండుతనయుం

డడఁచె నొక్కటొకటి నైదైదుతీవ్రశి

లీముఖముల బాహులీల మెఱయ.


8_1_119 వ.

ఇట్లు విక్రమవిజృంభితుం డై సహదేవుండు శతశాతశిలీముఖంబు లడరించిన.


8_1_120 చ.

రయమున వాని నన్నిటి శరత్రితయంబునఁ ద్రుంచి సాయక

ద్వయంమున నాతనిం బటునవప్రదరంబుల సారథిన్ భవ

త్ప్రియతనయుండు నొంచి దివి దీటుకొనంగఁ జెలంగి యార్వ న

త్యయసమవర్తిచాడ్పున నతం డుదితభ్రుకుటీవిలాసుఁ డై.