Jump to content

ఆ భా 8 1 241 to 8 1 270

వికీసోర్స్ నుండి


8_1_241 క. విను మిత్తెఱఁగున నే న య్యనిమిష వర్గంబు నైన నాజి జయింతున్ మనుజులు పాండు తనూజులు జననాయక నాకు నొక్క సరకే తలఁపన్.

8_1_242 వ. అనిన విని నీ పుత్రుండు ప్రీతుం డయి రాధేయు నగ్గించి నీ కెల్ల భంగిని శల్యు సారథిం గావించెద నని పలికి యుత్సాహ దీప్తుండై.

8_1_243 క. అమ్ముల బండ్లును రథ ర థ్యమ్ములునుం బెక్కు దెత్తు నవనీశులు నా తమ్ములు నేనును నీ పా ర్శ్వమ్మున నడచెదము బరవసం బుగ్రముగన్.

8_1_244 క. అని చెప్పి ప్రీతుఁ డగు నా తనిఁ దోడ్కొని నడచి సముచితంబుగ శల్యుం గని భక్తిఁ బ్రణతుఁ డై యి ట్లను దుర్యోధనుఁడు సవినయముగ నతని తోన్.

- దుర్యోధనుఁడు శల్యునిఁ గర్ణునకు సారథ్యంబును సేయు మని ప్రార్థించుట -

8_1_245 సీ. సత్యవ్రతంబును శాత్రవ దుర్దశా పాదనంబును మహా భాగతయును నీకు నైజంబులు నాకుఁ బెద్దయుఁ గూర్తు గావున ని న్నేను గారవించి వినతుండ నై వేఁడికొనియెద రాజుల నడుమ నీ దగు సౌమనస్య మెఱిఁగి యర్జును సనిఁ దెగటార్పఁగ వలయుట యూహించి సంభృతోత్సాహ లీలఁ

ఆ. గావు మితని ననుచుఁ గర్ణునిఁ జూపి యీ తని రథంబు గడపు మనఘ యిట్టు లైన నితఁడు వగఱఁ బో నీక పొదివి య స్ఖలిత గతుల నొంపఁ జంపఁ జాలు.

8_1_246 చ. గురుఁడును భీష్ముఁడుం జనినఁ గొంచెపు మూఁకలతోడ నేను సం గర విజయంబు గోరి భుజ గర్వమునన్ సడి సన్న పాండు భూ వర సుతు వర్గముం దొడరు వాఁడన కా మది నిశ్చయించు టె వ్వరిఁ గొని యింత నీ వెఱుఁగవా నినుఁ గర్ణునిఁ గాదె నమ్మితిన్.

8_1_247 క. ఇమ్మివ్వరమ్ము సార థ్య మ్మితనికిఁ జేయు మినుస కరుణుఁడు సాహా య్య మ్మొనరిచి నట్లుగఁ దిమి రమ్ము క్రియన్ రూపు సెడి యరాతు లడంగన్.

8_1_248 క. అనిన విని కెంపు సొంపునఁ గనుఁగవ యుగ్రముగ బొమలు గదియఁగ ఫాల మ్మునఁ జెమట వొడమ నీ సుతుఁ గనుఁగొని యిట్లనియె నతఁడు కటములదరఁగన్.

8_1_249 సీ. నను నింత నీచపుఁ బనికి బంపఁగ నీకుఁ దగునె భూవర వర్ణ ధర్మ విధము లెఱుఁగవే శూద్రుల కేనాఁటఁ బరిచర్య సేసిరి మూర్ధాభిషిక్తు లైన రాజులు సూతజు రాధేయు దొరఁ జేసికొని యేను సారథ్యమునకుఁ జొరఁగఁ జాల నీతని బలశాలిఁగాఁ దలఁచెదు నాకంటె నిట్టి బన్నంబుఁ గలదె

ఆ. పగఱ లోన నొకనిఁ బాల్పెట్టు మెట్టి వాఁ డైన సమయఁ జూచి యరుగు వాఁడ నట్టి భంగి సాల దంటేనిఁ దరవాయి గొని వధింతు శత్రు కోటి నెల్ల.

8_1_250 క. విను మేను విక్రమింపఁగఁ గనుఁగొనియెడు నంత వాఁడుఁ గలఁడే కుల శై ల నికాయంబుల వగలుతు వన నిధులు గలంతు ధరణి వ్రత్తుం గలయన్.

8_1_251 చ. నరవర చూడవే తెలియ నాదగు బాహులు మద్బలంబు నీ వరయక పల్కి తే నొకని కక్కట సారథి నై రథిత్వ వి స్ఫురణము దక్క నోపుదునె సూత తనూజుఁడు షోడశాంశమున్ దొలయఁడు నాకు వాసవ సుతున్ ముర మర్దనుఁ జీరికిం గొనన్.

8_1_252 వ. ఇట్లగు టెఱుంగక చెప్పితి వెఱింగియు గర్ణు పక్షపాతంబున నవమానించె మా భూమికిం బోయి వచ్చెద నని పలికి రాజ మధ్యంబున నుండి వెడలి పోపంచినం గురుపతి సప్రణయ బహుమానంబునం జని నిలువరించి సాంతన స్వరంబుతో మధురాక్షర విన్యాసంబుగా నతనితోఁ గర్ణుండ యేల తక్కు నీ కెక్కు డందు నథికులుం గలరే కడింది పగఱకు హృదయ శల్యం బగుటఁ గాదె నీకు శల్యుండు నభిధానం బయ్యె నా యభిప్రాయంబు వినుము ధనంజయునకు రథిక గుణంబు గర్ణుండు మిక్కిలి కృష్ణునకు నశ్వ హృదయ జ్ఞానంబున నీ వధికుండవు ధనంజయునకుఁ బ్రతివీరుంగా మనము కర్ణుం జాలించితి మది కృష్ణుండు నెల్ల నీ కునికిం కృష్ణు వర్తనంబునకుఁ బ్రతి విధానం బాచరింప నిన్నుం గోరితి నింత పతి నీకుం దక్క నొరులకు శక్యం బగునే యనిన విని ముదిత హృదయుం డయి మద్రేశ్వరుండు.

8_1_253 క. ననుఁ గృష్ణుకంటె నధికుం డని యిమ్మనుజేంద్ర కోటి యాకర్ణింపం గొనియాడితి విమల యశో ఘనుఁ డగు కర్ణునకు రథము గడపెద నధిపా.

8_1_254 వ. అని యా సూత నందను నుద్దేశించి వెండియు నిట్లనియె.

8_1_255 క. జన వల్లభ యొక సమయము విను మీతని తోడ నేను విచ్చలవిడిఁ దోఁ చిన మాట లెల్ల నాడుదు నను నెగ్గులు వట్ట కుండినం బొం దొనరున్.

8_1_256 క. అనుటయు గౌరవమున నీ తనయుఁడు రాధేయుఁ జూచి తగు నిట్లగుఁ గా కని పలికి శల్యునిం గనుఁ గొని యిది గడు లెస్స యనియెఁ గురు వంశ నిధీ.

8_1_257 వ. ఇట్లభినందించి యున్న యన్నరేంద్రుం డమ్మద్రపతి మనం బురియాడునో యని శంకించి యతనితో మఱియు నిట్లను నివ్విధం బాచరించుటకు విచారంబు వలవదు తొల్లింటి పెద్దల వృత్తాంతంబు వినుము మార్కండేయ మహాముని మా తండ్రి కేను వినుచుండఁ జెప్పినయది నీకుం జెప్పెద సురలతోడి దురంబున నసుర వరుండగు తారకుండు దెగిన పిదపఁ దదీయ తనయులు విద్యున్మాలియుఁ దారకాక్షుండును గమలాక్షుండును ననువారలు వారిజాసను నుద్దేశించి.

- దుర్యోధనుఁడు శల్యునకుఁ ద్రిపురాసుర వృత్తాంతంబు సెప్పుట -

8_1_258 క. దమమమున నియమంబున ను త్తమమును ఘోరంబు నైన తపమతి నిష్ఠం బ్రముదితు లై చేయఁగ న క్కమల భవుఁడు దోఁచి పరమ కారుణ్యమునన్.

8_1_259 వ. వరంబులు గోరికొం డనవుడు వా రందఱు నొక్కమాటయకా సకల భూతంబుల వలనను సర్వకాలంబుల యందును నవధ్యత్వంబు మాకు నీ వలయు నని యడుగుటయు నయ్యజుండు.

8_1_260 క. ఆ చంద మెందుఁ గల దది గోచరమే యిచ్చుటకును గొనుటకుఁ దగ మై సూచి యడుగుండు శుభదం బై చెల్లెడునట్లుగాఁ బ్రియంబున నిత్తున్.

8_1_261 వ. ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున డించి రాయంచ యక్కాకి దెప్పిఱిన దానిచో నచ్చటి కాకులు విన నింక నిట్టియ విసయంబు లెన్నండును జేయకు మని పలికి నిజ సహచరంబు లగు మరాళంబులుం దానును వలయు చోటికిం జనియె నీవు నా కోమటి కొడుకుల యెంగిలి కూటం బెరిఁగిన యక్కాకంబు చందంబునఁ గురు కుమారుల యెంగిళులు గుడిచి క్రొవ్వి యెక్కుడు వారల ధిక్కరించెదవు నీ కొలఁది యెఱుంగవు దీనం జేటు వాటిల్లుఁ గాన తెటపడ నెఱింగించెద నాకర్ణింపుము.

8_1_262 చ. విరటుని గోవులన్ మరల వెల్చి మదంబున నీదు తమ్మునిం బొరిగొనఁ బార్థుఁ దాఁక కెట పోయితి నాఁ డల ఘోష యాత్ర లో గురుపతి డించి క్రీడి కృపకుం దగు పాత్రము సేసి యెక్కడన్ సురిఁగితి చెప్పుమా నిజము సూత తనూభవ నాకు నేర్పడన్.

8_1_263 వ. అని వెండియు.

8_1_264 చ. పనివడి జామదగ్న్యుఁడు సభన్ వినిపింపఁడె మీకు నెల్ల న ర్జును భుజ వైభవంబు మధుసూదను పెంపును నాఁడ ద్రోణ శాం తనవులుఁ జెప్పరే బహు విధంబుల వారల గెల్వ రామి మున్ వినమె యెఱింగియున్ మఱియు వీఱిఁడి మాటలు వేయు నేటికిన్.

8_1_265 క. ఒంటిమెయిఁ దాఁక నా ము క్కంటికి వశ మగునె కృష్ణ గాండీవున ని ట్లంట యుడిగి తగు రథికుల జంటగొని రణమ్ము సలుపు శత్రులు దలఁకన్.

8_1_266 తే. గొంతి కొడుకును దేవకి కొడుకు మనము గనియెదము దినకర నిశాకరులుఁ బోలె వెలుఁగ నయ్యెడ ఖద్యోత విలసితంబు తోడి దగుఁ గాక నీ పెంపు దోఁపఁ గలదె.

8_1_267 వ. అనిన విని కర్ణుండు గమల నాభుని పెంపును బార్థుని బలిమియు నెఱుంగక యేనే వారిఁ దొడరెద నెట్లు చెప్పినను దొడరుదుఁ దొడరి వా రొండె నే నొంటె నగుదు నింతియ నీవు వెడమాట లాడక యుడుగు మని పలికి యచ్చటి మహీపతులు వి నమ్మద్రపతి కిట్లనియె.

- కర్ణుఁడు శల్యునితోఁ దనకు గలిగిన శాపంబుల తెఱంగు సెప్పుట –

8_1_268 సీ. తలఁచిన నెదకు సంతాపంబు సేయంగఁ జాలెడు నట్టివి జామదగ్న్యు కోపంబు బ్రాహ్మణ శాపంబు గాక యే సరకు గొందునె మురహరుఁ గిరీటిఁ జెప్పెద విను మస్త్ర శిక్షార్థి నై మహేంద్ర నగంబునకు జమదగ్ని సుతునిఁ గోరి పోయినఁ గృపాంభోరాశి యగు నమ్మహాముని గులము నన్నడుగుటయును

తే. బొంకునకు నోర్చి బ్రహ్మాస్త్రమునకుఁ గాఁక బ్రాహ్మణుఁడ నని చెప్పి తత్పాద భక్తి గలిగి మెలఁగంగ శిక్షించె నలఘు బహు వి థాస్త్ర శస్త్ర సంవేదిఁ గా నతఁడు నన్నుఁ..

8_1_269 వ. భర్గవాభిథానం బగు మహాస్త్రంబు లోనుగా ననేక దివ్యాస్త్రంబు లిచ్చెఁ బదంపడి బ్రహ్మం బగు నస్త్రంబు నొసంగె నొసంగి సమరంబున నాపత్సమయంబున దీని బ్రయోగింపు మని యానతిచ్చె మఱు నాఁ డత్తపోధన సత్తముండు మదయాంక తలంబున నొఱగి నిద్రించు చుండ నొక్క జంతువు నా క్రింది తోడఁ దొలిచిన నమ్మహాత్మునకు నిద్రా భంగం బయ్యెడు నని కదల కుండితిఁ దదనంతరంబ మేలుకని యతండు నెత్తుటి వెల్లువఁ గని తత్ప్రకారం బడిగి యేను జెప్ప విని మద్ధైర్యంబున కచ్చెరువడి నీవు బ్రాహ్మణుండవు గా వెవ్వఁడవని యొత్తి యుడుగుటయు వెఱచి సూత సుతుండ నని చెప్పితిఁ జెప్పు నప్పు డక్కీటకంబు నాలోకించిన నది యదృష్ట పూర్వ వికృతాకారం బై యుండె నర్జున హితంబు గోరి యింద్రుం డమ్మునీంద్రునకు నన్నుఁ దేటపఱచి యతనిం గోపింపం జేయువాఁ డై కీట తనువు దాల్చి యట్లు సేసెం గానోపు నా సంయమి గోపించి కపటంబున బ్రహ్మాస్త్రంబుఁ బరిగ్రహించి తది నీకు వలయు కాలంబున దోఁపమియు మృత్యువాసన్నం బైనం దోఁచుటయు నాపద ముట్టిన యెడ భార్గవాస్త్రంబు దోఁప కుండుటయుం గలిగెడు మని శపించె నిది జామదగ్న్యు కోపంబు తెఱంగు బ్రాహ్మణ శాపంబు తెఱం గెఱింగించెద నాకర్ణింపుము.

8_1_270 సీ. శ్రమమునకై యేను సకలాంబకములు నెక్కుడు వెస సేయ నయ్యెడకు నొక్క యాఁ బెయ్య యుఱికి నా యజ్ఞానమున సంపతాఁకునఁ గూలుడు దానిఁ గలుగు బ్రాహ్మణుం డధిక కోపంబున నిది హోమధేను వత్సం బిట్లు దీని శల్య నిహతంబుఁ జేసితి నీవు నా వచన శల్యంబున నిహతుండ వగుము నీకు

తే. సమర మేకాగ్ర నిర్భరోత్సాహ వృత్తి నడవ నరదంబు చక్రంబు పుడమిఁ గ్రుంగ వలయు నెవ్వీరు మార్కొని గెలువఁ గోరి శ్రమము సేసెద వతని చేఁ జావు మీవు.