ఆ భా 8 1 121 to 8 1 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

--రానారె 13:55, 2 అక్టోబర్ 2006 (UTC)


8_1_121

మ. పటునారాచముదీప్తిజాలము నభోభాగంబునం బర్వ ను

త్కటవేగంబున నేయఁ గంటకము వక్షపీఠముం దూఱి నె

త్తుటిపొం దేముయు లేక యుచ్చి చనిననం దూగాడి యాతండు వ్రా

లుటయుం దేరు దొలంగ సూతుఁడు భయాలోలాకృతిం దోలినన్.


8_1_122

క. అమ్మాద్రీపుత్రుఁడు వా

లమ్ముల దుశ్శాసనునిమహాసైన్యము రౌ

ద్రమ్ముగఁ గలంచె దివిజగ

ణమ్ము వినుతిసేయఁ దమమొనలు నలి నార్వన్.


8_1_123

చ. నకులుఁడు సూతపుత్రుఁడుఁ బెనంగునెడన్ నకులుండు సూతపు

త్రకునకు ని ట్లనుం దలఁచి దైవము నేఁడు నిజప్రసన్న దృ

ష్టికి ననుఁ బాత్రభూతుఁడుగఁ జేయుట గానఁగ వచ్చె నాదుచూ

డ్కికి నిను గోచరంబుగ ఘటించినయాచతురత్వసంపదన్.


8_1_124

క. కౌరవపాండవులకు నీ

వైరము నీవలనఁ గాదె వచ్చెను నిను మ

ద్ఘోరశరనిహతిఁ బడఁ గ

న్నారఁ గనుంగొనగ కోప మాఱునె యొంటన్.


8_1_125

చ. అనవుడు రాజసూతివి మహాస్త్రవిదుండవు నైన నీకు ని

ట్లనుట దలంప నర్హమగు నైనను జెన్నఁటిపల్కులేల నె

ట్టన భుజశక్తి మార్తురకడంక యడంచినఁ బల్కు టొప్పుఁ గా

క నిలిచి చూపు నీచలముకల్మియుఁ జేతులబల్మియుం దగన్.


8_1_126

వ. అని పలికి కర్ణుండు.


8_1_127

సీ. ఉబ్బి మాద్రీసుతు డెబ్బదిమూఁడుదూపులఁ గప్పుటయు నతఁ డలిగి యతని

పైని శతనిశాతబాణంబు లేసిన నాసూతనందనుఁ డక్కుమారు

ధనువు నుగ్గుగఁ జేసి తనువున ముప్పది కాండముల్ సొనిపిన నొండువిల్లు

గొని డబ్బదింట నాతని నొంచి మూఁడుమార్గణములు సూతునంగమునఁ బఱపి


తే. భల్లమున విల్లు దునుమాడి యెల్లజనులు

నద్భుతం బందఁ ద్రిశతసాయకపరీతుఁ

జేసి నకులుండు నిష్ఠురహాసభాసి

తాసనాంభోజుఁ డై పొలు పారె నధిప


8_1_128

క. సూతసంతుఁడు బలువిలు గొని

యాతనివక్షమున నాటె నైదమ్ములు ని

ర్ఘాతసమసప్తశరముల

నాతం డతని నొంచి విల్లు నఱిముఱిఁ ద్రుంచెన్.


8_1_129

వ. మఱియు నొక్కమహనీయకార్ముకంబు గొని కర్ణుండు గడంగె నప్పు డయ్యిరు

వురు నొండొరులతూపులు ద్రుంచుచు నిజమార్గణంబుల నొక ళ్లొకళ్ల నెత్తుట

ముంచుచుం బేర్చి వివిధవిశిఖజాలంబు లడరించిన నంబరంబు శలభపటలసంవృ

తంబునుంబోలె నుండె నాసమయంబున నకులునగ్రభాగంబునకు వచ్చిన సోమ

కబలంబులు గర్ణక్రూరనారాచాది బహుళబాణపాతంబులఁ బలాయితంబు

లయ్యెఁ గర్ణునకు బాసటయై తఱిమినకౌరవసైనికులు మాద్రేయురౌద్ర

విజృంభణమున దూరవిఘటితు లై ర ట్లిరువాఁగును నెడ గలిగి చూచు చుండ

నారథికోత్తము లుదారఘోరాకారంబుల నుల్లసిల్లి భల్లప్రముఖపదరంబులఁ

బరస్పరాంగములం బొదివి యంబుదపిహితమూర్తు లగుమార్తాండశశాంకుల

చందంబు నొంది యన్యోన్యదివ్యాస్త్రతేజోవిలాసంబుల నయ్యైయస్త్రంబుల

వారించుచుం బోరి రట్టియెడ.


8_1_130

క. అలుక వొడమి కర్ణుండు న

కులుచాపము ద్రుంచి సూతుఁ గూల్చి తురగం

బులఁ జంపి చక్రరక్షుల

తలలు నఱికి సిడము ద్రుంచి దరహాసముతోన్.


8_1_131

వ. మెఱసినం గుపితచిత్తుం డై.


8_1_132

చ. పలకయు వాలునుం గొనియెఁ బాండుకుమారుఁడు పెక్కు చెక్క లై

యిలఁ దొరఁగంగ నేసె గద యెత్తినఁ ద్రుంచె రథంబు డిగ్గి యు

జ్వలపరిఘాభిరాముఁ డయి వచ్చిన నప్పరిఘంబు రూపుమా

పి లసితలాఘవస్ఫురణపెంపునఁ గర్ణుఁడు నొంచె నాతనిన్.


8_1_133

ఆ. మర్మభేదు లైన మార్గణంబుల కోహ

టించిసిగ్గుఁ జలము డిగ్గఁద్రావి

యెల్లజనులుఁ జూడఁ బొల్లఁదనంబున

కోర్చి యక్కుమారుఁ డోడి పాఱె.


-: కర్ణుఁడు నకులుని విరథుం జేసి యవమానించుట :-


8_1_134

క. వెనుకొని రాధేయుఁడు నిజ

ధను వాతనికంధరమునఁ దగిలిచి నలిఁ బ

ట్టిన నింద్రచాపపరిగత

ఘనాకృతిని బొలిచె నతఁడు కౌరవనాథా.


8_1_135

ఇట్లు పాండుతనయుబాడుదలఁ బట్టి మందస్మితసుందరాననుం డై.


8_1_136

క. పలుకులు వృథగా నన్నుం

బలికితి ము న్నింక నెన్ని వలుక వలసినం

బలుకుము నీకేఁ దగ నా

యలవుఁ జలము నీ వెఱింగి తంతియ చాలున్.


8_1_137

క. అల వెఱిఁగి పెనఁగు పెనఁగం

దలఁచిన నది గాక సిగ్గు దలచుకొని యనికిం

దొలఁగుట యిం కిట దగు వి

చ్చలవిడి నర్జునునికడకుఁ జనుము కుమారా.


8_1_138

క. అని విడిచె నకులుఁ గుంతివ

చనములు దృఢవృత్తి చిత్తసంకతలితములై

యునికిం గర్ణుండతడును

జని ధర్మజునరద మెక్కె సవ్రీడముగన్.


8_1_139

వ. ఎక్కి నిట్టూర్పు నిగుడం గుంభనిక్షిప్తభుజంగంబుచందంబున నుండె నివ్విధం

బున మాద్రీపుత్రమానమథనవిజృంభితుం డగునవ్వీరుం డప్పుడు మధ్యందిన

గతం బైనమార్తాండబింబంబినకుం బ్రతిబింబంబునుంబోలెఁ బ్రదీప్తమూర్తి

యై వెలిమావులును వెలిపడగయు నుల్లసిల్ల శోభిల్లుతనరథంబు రయంబున

దర్శనీయంబుగాఁ బాంచాలబలంబు దఱసి పెక్కు తెఱంగుల మెఱుంగుటమ్ముల

గములు గదియించి.

8_1_140

సీ. సూతులఁ దెగటార్చి కేతనంబుల వీటతాటంబు సేసి రథ్యములఁ గూల్చి

చామరచ్ఛత్త్రభూషణములు పొడి సేసి రథికజనములశిరములు ద్రుంచి

కొమ్ములు నఱికి ంకుశములు దునిమి తొండములుఖండించి కుంభములు వ్రచ్చి

జోదులతనువులు భేదించి మోరలు గళ్యాలతోడఁ జెక్కలుగఁ జేసి


ఆ. కందములు వగిల్చి కాళ్లులు ద్రెంచి యా

శ్వికులఁ జంపి చర్మవిశిఖకుంత

ముసలముద్గరప్రముఖసాధనములు భ

గ్నములు సేసి భటుల సమయఁ జూచి.


8_1_141

వ. బాహువిలాసంబు మెఱయ నెఱయం బొలిచె భవత్సుతుండు

పర్వతప్రతిముం డగునులూకుపయిం గవిసి కులిశనిభం బగువిశిఖంబున నొంచినఁ

గోపించి యాబల్లిదుండు విఱుగనేయుటయు నక్కుమారుండు


8_1_142

తే. మేలువిలు గొని యఱువదినాలుగమ్ము

లతనిమెయిఁ గ్రుచ్చి సాటకత్రితయనిహతి

సూతు నొప్పించి మఱియు నిశాతశరచ

యమ్ము వరఁగించె నధికరయమ్ము నెఱయ.


8_1_143

వ. దానం గనలి


8_1_144

క. బలువిడి నులూకుఁ డిరువది

శిలీముఖము లొడలఁ జొనిపి సిడము రయముమై

నిలఁ గూల్చిన నీసుతుఁ డు

జ్జ్వలవిశిఖము లయిదు నాటె వానియురయమునన్.


8_1_145

వ. నొచ్చి యాసౌబలనందనుండు రౌద్రంబు రూపంబు దాల్చినవిధంబున విజృం

భించి.


8_1_146

శా. భల్లం బొక్కటఁ ద్రుంచె సూతునిఁ జతుర్బాణాహతిన్ వాజులన్

డొల్లంజేసె నిశాతపంచవిశిఖాటోపంబునం జించె వీ

రోల్లాసంబు వికాసముం బొరయ మే ను క్కేది నీనందనుం

డెల్లం జూడఁగఁ బాఱి యొండొకరథం బెక్కెం గురుగ్రామణీ.


8_1_147

క. గెలుపున మెయి వొదలగ సౌ

బలసూనుఁడు రథము వఱపి పాంచాలబలం

బలుగులపడఁ బలుదెఱఁగుల

యలవుల విహరించె నుద్భటాటోపమున్.


8_1_148

సీ. శ్రుతకర్మ నకులునిసుతుని శతానీకుఁ దాఁకి యశ్వంబుల ధరణి గూల్చి

సూతునిఁ బరిమార్చె నాతఁడు గద వైచి రథవాహనముల సారథిని గేత


నముఁ బొలియించె భూరమణ యిమ్మెయినీదుతనయుండు నకులనందనుఁడు విరథు

లై యొండుదేరుల కరిగిరి సుతసోముఁ దలపడి కడిమి గాంధారనాధుఁ


తే. డతనియడరించువివిధసాయకము లెల్లఁ

దునిమి బాణత్రయంబునఁ దనువు నొంచి

తురగముల నరదమ్ముఁ గేతువుఁ దిలప్ర

మాణశకలంబులుగఁ జేసె మద మెలర్ప.


8_1_149

మ. విరథుం డై పొలివోనిబీరమునఁ బృథ్వీభాగసంచారి యై

శరజాలంబుల భీమసేనసుతుఁ డాశ్చర్యంబుగా నీమఱం

దిరథం బేడ్తెఱఁ గప్పినం దునిమె నుత్సేకోగ్రుఁ డై యమ్మహీ

వరుఁ డబ్బాలునిచాపదండముభుజావష్టంభ మేపారఁగన్.


8_1_150

చ. అతఁడు ప్రదీప్తఖడ్గము రయంబుమెయిం గొని యానృపాలుఁ డు

ద్ధతిఁ బరఁగించుసాయకశతంబులు ద్రుంచుచు నుల్లసిల్ల న

ప్పతి పటుభల్లఖండితకృపాణునిఁ జేసిన నీడఁబోక చే

తితునియ బెట్టు వైచె జగతీవర యాతనివిల్లు రెండుగన్.