ఆ భా 7 5 61 to 7 5 90

వికీసోర్స్ నుండి

--రానారె 12:16, 13 ఆగస్ట్ 2006 (UTC)


7_5_61

తే. భానుమఁతునిఁ జంపినపగ మనమునఁ

బెట్టికొని యుండి యాతనిపట్టి భీమ

సేనుపై వడిఁ గాళింగసేనఁతోడ

గవిసి నారాచధారలఁ గప్పి యొప్పె.


7_5_62

క. కినిసి బకమర్దనుఁడు వెసఁ

దనయరదము వానితేరు దాఁక బఱపి యా

తనిమీఁద నుఱికి క్రుమ్మెం

గనుకని నెంపపొడి సెదరఁ గాలం గేలన్.


-: భీమసేనుఁడు దుర్మదదుష్కర్ణులం జంపుట :-


7_5_63

వ. ఆమ్మహోగ్రసముద్ధతిం జూచి పాంచాలసైనికులు సింహనాదంబులు సేసిన

సహింపక సూతసుతుండును దత్సోదరులును నవ్వీరుం బొదివిన నతం

డద్భుతంబుగా ధ్రువునరదంబుమీఁదికి లంఘించి వానిఁ బిడికిటిపోటునఁ

జావం బొడిచి జయరాతునిపైఁ గవిసి యాతని నతనిసూతునిఁ గాళ్ళు

లిరుగేలం బట్టి బెట్టిలపై వ్రేసి గతాసులం జేసిన నలిగి కర్ణుండు శక్తి

వైవ మలంగి వెరవున నొడిసికొని దానిన యవ్వడముడి యతనిపై

వైచినం గని గాంధారమహీవల్లభుండు భల్లంబున నడుమన నఱకె నంత

గురుకుమారు లమ్మారుతిం జుట్టుముట్టి విశిఖంబులు నిగిడించిన గోపించి

దుర్మదునితేరి కురవడించి తురంగంబులం బొరివుచ్చి సారథిం జదిపిన

నాతండు దుష్కర్ణుస్యందనం బెక్కె నయ్యిరువురు నప్పాండుతనయు

తనువున మెఱుంగుటమ్ములు గిఱిగొలుపం గిట్టి యారథంబు గూల నవ


లీలం దన్ని దుర్యోధనద్రౌణికృపకృతవర్మకర్ణశల్యబాహ్లికులు సూచుచుండ

నక్కుమారుల నిద్దఱం గాల నొక్కనిం గేల నొక్కనింగా సమయించె

నివ్విధంబునం జిత్రవధవిహారంబున విజృంభించు నాభీమసేనుం జూచి

రుద్రుండు రభసోద్రేకంబునం బాండవేయులకుఁ దోడ్పడం జనుదెంచెం

గాక మానవు లిట్టివారునుం గలరే యనుచు నీవారెల్లను వెఱచఱచి

యిద్ద ఱొక్కతెరవునం బోకపఱచి రక్కుమారకంఠీరవుం డుక్కునం

దమసేనదిక్కు సూచి యెఱ్ఱవిరిదామరలం దెగడుకన్నులం గౌంతేయా

గ్రజు నుపలక్షించి కేలుమొగిచి ఫాలంబునం జేర్చునప్పుడు తన్మూర్తినతం

డును నకులసహదేవద్రుపదవిరాటులును దేఱిచూడశంకించి మాఱు మొగంబు

లతో నగ్గించి రాసమయంబున.


7_5_64

క. కడువడి గురుఁ డనిలజుపై

నడరినరాధాతనూభవాదులు దోడై

కడఁగుటయుఁ గనుంగొని నీ

కొడుకుగమియుఁ గదిసె నుదితకోపస్ఫురణన్.


7_5_65

తే. వారిఁ దలపడి పోరిరి దారుణముగ

ధర్మసుతుఁడును గవలు నుద్దండవృత్తిఁ

దఱుమ ద్రుపదవిరాటసాత్యకులు మఱియుఁ

జేయఁ గలయట్టి మేదినీనాయకులును.


7_5_65

వ. అయ్యవసరంబున సోమదత్తుండు దనకు సాత్యకి సన్నిహితుం డగుటయు

నతనితో నిట్లనుఁ బ్రాయోపవిష్టున్ డగు భూరిశ్రవుం జంపి తది బోయ

చందంబు గాక రాజధర్మం బగునే యీరేయి నీవు నా చేత బ్రతికిపోవువాఁ

డవే యని పలికి సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన నాశైనేయుఁడు

భూరిశ్రవుండు సచ్చుట యొప్పదేనిని న్నొప్పెడున్నట్లు సంపెద నిట్లు

రమ్ము శలునిచా వొప్పు నొప్పదని యుగ్గడింప వది యేమి నీ

కెట్లయినం గాని కాదని భంగించె నిత్తెఱంగున నొండురుల నో నాడి

యేటు లాడం దొడంగి రప్పుడు నీకొడుకు ఘోటకస్యందనసందోహసమేతం

బుగా నక్కౌరవునకుం దోడ్పడియె శకునియుఁ దనబలంబునుఁ దానును

నాతనిం గూడుకొనియె నవ్విధంబునం బలువు రొక్కనిపైఁ గవిసినం

గని ధ్రుష్టద్యుమ్నుండు భూరిసైన్యసమేతున్ డై వారల నెదుర్కొనం

బోరు ఘోరం బయ్యె నట్టియెడ.


7_5_67


తే. సోమదత్తుండు తొమ్మిది సునిశితాస్త్ర

ముల శినిప్రభు నేసిన నలిగి యతఁడు

నతని నన్నియమ్ములన మూర్ఛితునిఁ జేయ

రథము దొలఁగంగఁ దోలె సారథి గలంగి.


7_5_68 మ.

కని ద్రోణాత్మజుఁ డేచి సాత్యకిభూజాగర్వంబు మాన్పింతుఁ బొ

మ్మని పోఁ బో నడుమన్ ఘటోత్కచుఁడు ఘోరాకారదైత్యవ్రజం

బును దానుం భటుభంగిఁ దాఁకుటయు నీపుత్రుండుఁ గర్ణుండుఁ ద

క్కినవారున్ వెఱ వానితోడియనికిం గ్రీడించి రుర్వీశ్వరా.


7_5_69

వ. అట్లు సంధ్యాసమయసంవర్ధితబలుం డగు నప్పూర్వగీర్వాణునికో ల్తల

కోర్వక మేటిమగ లెల్లం దొలంగిన.


7_5_70

క. గురుసుతుఁ డొక్కరుఁడును సు

స్థిరుఁ డై తద్బాణనిహతిఁ దెరలక యతిని

ష్ఠుర నారాచంబులు పది

యురమున నాటింప దానవోత్తముఁ డలుకన్.


7_5_71

క. వడిఁ జక్రంబున వైచిన

నడుమన గురునందనుండు నఱకెం బుణ్యం

బెడలిన నరుసంకల్పము

వడువున నది వమ్ము గాఁగ వసుధాధీశా.


-: అంజనపర్వుం డశ్వత్థామతో యుద్ధంబు సేసి చచ్చుట :-


7_5_72

వ. అప్పు డద్దనుజునితనయుం డంజనపర్వుం డశ్వత్థామం దలపడి బలుతూపులం

బొదివిన బెదరక యతం డయ్యసురవీరునివిల్లు ద్రుంచి విరథుం జేయు

టయు వాఁడు కరవాలంబు గొనినం దునిమె గద వైచిన దురుము సేసె

నింగి కెగసి మ్రోఁగుచుం బాషాణవర్షంబు గురియ నదియును వారించి

యమ్మాయావిమేన మేఘంబున గిఱిగొను తరణికిరణంబులం గ్రేణిసేయు

పటుబాణంబుల నిగిడించె మగిడి యొండురథంబున నరుదెంచినఁ దల

ద్రెంచె నిట్లు గురుపుత్రుండు వానిం బరిమార్చి పేర్చి పాండవ బలంబులఁ

బరిమార్పం దొడంగినం గని కడంగి హిడింబానందనుడు నిలు నిలు

నాబారిం బడి యెందుఁబో వచ్చుననవుడు నారథికుం డతని నవలోకించి.


7_5_73

ఆ. వలదు రన్న పిన్నవాఁడవు దండ్రి నే

నకట నిన్ను జూచి యలుగ రాదు

పెనఁగు మొరులతోడ ననవుడుఁ బుత్రశో

కాభితప్తుఁ డైన యతఁడు గనలి.


7_5_74

క. ఎక్కడి తండ్రివి నీ వే

నక్కౌంతేయులకుఁ గొడుక నై పగతుర పే

రుక్కు సహింతునె తనయుం

గ్రక్కించెద నిపుడ పట్టి కండలు దిందున్.


7_5_75

క. అని పలికి యిరుసులంతలు

సునిసిత బాణమ్ము లేయుచుం దఱిమిన ద్రో

ణునికొడుకు వాని నన్నిటిఁ

దునుమ నసురమాయఁ బెఱిగి దుర్దాంతగతిన్.


7_5_76

క. గిరి యై పఱతేర నశని

శరమును మేఘత్వ మొంది సాయకవృష్టిం

గురిసినఁ బవనాస్త్రంబును

బరువడి నిగిడించి గురునిపట్టి దెరల్చెన్.


7_5_77

సీ. హైడింబుఁ డల్గి యుగ్రాకృతిఁ గవిసిన దనుజగణంబు మాతంగతురగ

రథనివహంబుతో రారాజుమొన లెల్ల నొక్కెత్తుగాఁ బ్రేల్చి యురవడింప

నన్నరనాథుండు విన్నఁబోయిన గురుతనయుండు నీకు నీయనికి నేమి

పని నీవు సంభమింపకుము దానవుల నక్కడిమానవులను వ్రేల్మిడినతండు.


ఆ. ననిన సంతసిల్లి యతఁడు సౌబలుఁజూచి

వీరె ద్రౌణిబాణదారితాంగు

లైరి పాండుసుతులు దేరిగములతోడ

సత్వరముగ నరిగి జయము గొనుము.


7_5_78

వ. అని యవ్వలను సూపి కృపకృతవర్మకర్ణవృషసేనులను దుశ్శాసనప్రముఖు

లైనకొందఱు దమ్ములను నిరూపించి వీరును నీవును గూడుకొని కవియుం

డని పనిచిన నతండును బింకంబుతోడం బోయె నశ్వత్థామభీమనందనుల

సంగ్రామంబు భీమం బయ్యె నట్టియెడ నాఘటోత్కచుండు.


7_5_79

మ. పటుబాణాహతి ద్రౌణియంగము చలింపం జేసి తచ్చాప ము

త్కటవేగంబునఁ ద్రుంచినం గినిసి యాతం డొండువిల్లెత్తి యు

ద్భటబాహాబలశౌర్యముల్ నెఱపె నాదైత్యుండు సైన్యంబు నొ

చ్చుటయుం జచ్చుటయున్ మహీపతికి మెచ్చుం బ్రీతియుం జేయఁగన్.


7_5_80

వ. ఇట్లసురబలంబు నశ్వత్థామ సించి చెండాడం బాండవ బలంబులు దర్పం

బేది మార్పెట్ట లేక చూచుచుండ నుద్దండపరాక్రమం డగు నాఘటో

త్కచుండు దర్పంబున నెక్కటెక్కటి తలపడి పరిఘంబున వైచినం

బట్టుకొని యతండు దానిన యద్దానవు పై వైచుటయు వాఁడు

దొలంగ నుఱికి ద్రుపపదనందనస్యందనంబునకుం బోయె నయ్యుగ్రసాధనం

బతనితురంగసారథిరథంబుల రూపడంచిన.


7_5_81

ఆ. ఒక్కతేరిమీఁద నుండి ధృష్టద్యుమ్న

భీమసేనసుతులు పెనఁగి రస్త్ర

గురుతనూజువీఁకఁ దెరలక యంత ను

ద్దామసేనతోడ భీముఁ డడరె.


7_5_82

వ. అప్పు డశ్వత్థామ నవ్వుచు నమ్మువ్వురం గ్రొవ్వఱ నేసి భాసమాన మార్గ ణంబులు నిగిడించిన.


7_5_83

మ. భటగాత్రంబుల ఘోటకాంగముల శుంభత్కుంభికాయంబులం

జటులస్యందన ఖండసంచయములన్ సంగ్రామరంగంబు గ

ప్పుట చూడన్ వెఱఁగయ్యె నబ్బలములుం బోకేచి క్రమ్మంగ నె

త్తుటఁ దేల్చెం బొరిమార్చె నాతఁ డడరం ద్రుంచెన్ మథించెం గడున్.


7_5_84

వ. ఇట్లే కాక్షౌహిణీబలక్షయం బాపాదించి యాతపత్ర శతపత్రంబును జామ

రమరాళంబును గేశశైవాలంబును నాయుధమీనంబును మాంసమేదో

మస్తిష్కపంకంబును రక్తజలోద్రిక్తంబును నగునదీప్రవాహంబు నుత్పా

దించె నప్పుడు దర్పంబున సురథుండును శత్రుజయుండును బలానీకుండును

భృషధుండును జయానీకుండును జయుఁడును జంద్రసేనుండును జండ

రయంబున గదిసి బాణంబులు వరగించిన నప్పాంచాలకుమారుల నమానుష

విక్రమంబున సమయించినం గోపించి కుంతిభోజతనూజు లొక్కపెట్ట పదు

మువ్వురతం బొదివిన బదుమూడు మేటితూపులం గీటడంచి కెరలి జము

చందంబున గర్జిల్లిఘటోత్కచుం గాలదండంబుఁ బోనికోలం దేరిపైఁ ద్రెళ్ళి

మూర్ఛిల్ల నేసిన నోసరిల నయ్యరదంబున దోడన ధ్రుష్టద్యుమ్నుండు గొని

పోవుటయుఁ బొంగి సింగంబుచాడ్పున గర్జిల్లిన నిర్జరు లగ్గురునందను

నగ్గించి రంతయుం గనుంగొని.


7_5_85

ఆ. పాండవాగ్రజుండు పవనాత్మజునిఁ గూడి

తఱిమి సాత్యకియును దాను గవిసె

నంత మూర్చదేఱి హైడింబుడొక్కతే

రనువుగాఁగఁ జేసికొని కడంగె.


7_5_86

వ. తోడన ధ్రుష్టద్త్యుమ్నుండును బరవసంబు సేసినం దత్సైన్యంబు లొక్క

మొగిన మొనయుటయును మనమూకఁలును సోమదత్తబాహ్లికపురస్స

రంబుగా నురవడించిన సందడికయ్యం బయ్యె నందు సంజచీకటి చూపు

నకుఁ జొరవ యీకున్నను సైనికనికరవివిధాభరణమణికిరణకలాపంబులుఁ

జర్మవర్మాతపత్రకేతుకీలితరత్న రశ్మిజాలంబులు నాలోకంబునంబు నాపాదించె

న ట్లిరువాఁగును గలయ బెరసి పోరునప్పుడు.


-: భీమసేనునిచేత బాహ్లికుఁడు సచ్చుట :-


7_5_87

క. శినివరుఁడు సోమదత్తుఁడు

బెనఁగఁగ దోడ్పడియె వచ్చి భీముఁడు గడఁకం

దనమఱఁదికి నక్కౌరవుఁ

డెనయే యని బిరుదులాడి యేడ్తెఱ నొంచెన్.


7_5_88

వ. అట్టియెడ.


7_5_89

క. అనలశిఖ వోనినారస

మునసాత్యకి యేయునెడను ముద్గరమున భీ

మునికొడుకు వై చె రెంటం

దనువున నొవ్వడరి సోమదత్తుఁడు సోలన్.


7_5_90

చ. తనయుఁడు మూర్ఛవోయిన నుదగ్రత బాహ్లికుఁడచ్యుతానుజ

న్మిని దలపడ్డ నాతనికి మించి వృకోదరుఁ డన్న రేంద్రు నే

సిన నతఁ డుగ్రశక్తి వయిచెన్ మెయి నాటుడు సోలి యంతలో

నన తెలివొంది ముద్గరమునం బవనాత్మజుఁ డేచి వైచినన్.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_7_5_61_to_7_5_90&oldid=3196" నుండి వెలికితీశారు