ఆ భా 7 5 401 to 7 5 434

వికీసోర్స్ నుండి

7_5_401

మ. నియతిం బావకబాణ మేయుడు మహాగ్నిజ్వాలికామాలిక

ల్హ యసందోహరథవ్రజద్విరదమాలాసద్భటశ్రేణికా

క్షయముం జేయుచు సర్వభూతభయదాకరంబునం బేర్చి య

త్యయకాలజ్వలనోద్ధతిం గవిసి యేకాక్షౌహిణిం ద్రుంపఁగన్.


7_5_402

క. కురుసేన యుబ్బి యార్చుచు

హరియు నరుఁడు మడియుదురు శరానలశిఖలన్

సరి గలరే త్రిభువనముల

గురుసుతునకు ననఁగఁ దూర్యఘోషము లెసఁగన్.


7_5_403

తే. ఎల్లదివ్యబాణంబులుఁ బొల్లవోవఁ

జేయునట్లుగ బ్రహ్మ సృజించినట్టి

కీర్తనీయమహాస్త్రంబు గ్రీడి మంత్ర

నిష్ఠ యొప్పఁ బ్రయోగించె నృపవరేణ్య.


7_5_404

వ. ఆ బ్రహ్మాస్త్రంబుచేత నద్భుతం బగునశ్వత్థామయాగ్నేయాస్త్రంబు సంక్షీణ

బగుటయుఁ గైటభాంతకుండును గిరీటియుం బాంచజన్యదేవదత్తంబులు

పూరించినఁ బాండవసైన్యంబున సింహనాదశంఖభేరీమహారావంబులు

సెలంగెఁ గౌరవసేన లేటమొగంబు వడియె నప్పు డద్గురునందనుండు.


7_5_405

ఆ. తెల్ల మయ్యె నాకు దివ్యాస్త్రబలము లే

కునికి సిగ్గుమాలి యనికి నింకఁ

గడఁగ నేల దీని నుడిగెదఁ గా కని

యుల్లమునఁ దలంచి విల్లు వైచి.


7_5_406

వ. అరదంబు డిగ్గి తొలంగి పోవంబోవ.


7_5_407

క. జిగి దొలఁకాడఁగ నేలకు

మొగి లేలొకో డిగ్గె ననఁగ ముందటఁ దోఁచెన్

విగతదురితత్వభాసుం

డగువేదవ్యాసుఁ డమ్మహాపురుషునకున్.


7_5_408

వ. తోఁచిన వినయసంభ్రమంబులతోడ వినతుం డై గద్గదకంఠుం డగుచు

మునీంద్రా మదీయం బగునాగ్నేయాస్త్రంబు వృథ మయ్యె నిది యేమి

మాయయో యెఱుంగ సురాసురగంధర్వాదిజాతులకును దుస్సహం

బయినయద్దివ్యసాధనంబు మనుష్యు లగు కృష్ణార్జునుల దహింపఁ జాల

దయ్యె ననవుడు నాతపోధనవర్యుండు వినుము నీసంశయంబు నాపెద నని యతని కి ట్లనియె.


7_5_409

ఆ. ఆదిదేవుఁ డైన యవ్విష్ణుఁ డఖిలలో

కాభిరక్షణార్థ మై జనించి

మహితతపము సేసె మైనాకశైలంబు

నందుఁ బెద్దకాల మభవుగుఱిచి.


7_5_410

సీ. పవనాశనుఁడు నూర్ధ్వబాహుండు నగుచు నన్నారాయణుం డతిఘోరనిష్ఠఁ

జలుపునాతపమున సంతుష్టుఁడై బాలశశిరేఖ నొప్పారుజడముడియును

శూలపినాకాదిసుమహదాయుధముల వెలిఁగెడుచేతులు విలసదురగ

యఙ్ఞోపవీతసమంచితవక్షంబు శోభిల్లఁగాఁ బొడసూపె శంభుఁ.


తే. డపుడు పద్మాక్షుఁ డవ్విరూపాక్షునకు ధ

రాతలము జానుపాణిశిరంబు లొంద

మ్రొక్కి నిలుచుండి నుదుటిపై మోడ్పుఁగేలు

భక్తిఁ గదియించి యి ట్లని ప్రస్తుతించె.


7_5_411

క. స్థావరములు జంగముములు

నీవలనం గలిగెఁ దద్వినిర్మలరక్షా

ప్రావీణ్యము దగఁ బ్రభువుల

కేనారల కైన నీవ యిత్తు మహేశా.


7_5_412

క. సురలాదిగఁ గలజీవులు

పురుషార్థచతుష్టయంబుఁ బొంది సుఖిత్వ

స్ఫురణము నొందుట నీదగు

కరుణాతిశయంబు వడసి కాదె కపర్థీ.


7_5_413

క. వేదములు ధర్మవాచక

వాదంబులుఁ దద్విలాసవంతం బగుధా

త్రీదేవోత్కరము భవ

త్ప్రాదుర్భావములు గావె బాలేందుధరా.


7_5_414

క. నినుఁ దనుఁగా నతినిర్మల

మనస్సమాధిప్రకర్ష మగ్నతవలనం

గనుఁగొని తద్రూపభజన

మొనరించు మహాత్ముఁ డమృత మొందు బశుపతీ.


7_5_415

వ. అని మఱియు ననేకభంగులం బ్రస్తుతించి దేవా నిన్ను భక్తి భజియించు

నాకు ననన్యసులభప్రభావం బొసంగుమని యభ్యర్తించుటయు దేవముఖ్యుం

డగువిష్ణుదేవుం బ్రసన్నదృష్టి నాలోకించి యప్పరమేశ్వరుండు నీవు నర

సురగంధర్వకిన్నరగరుడోరగాదిభూతంబుల నవలీల గెలిచి పరమతేజో

విరాజమానుండ వై వర్తింపుము నీకు నస్త్రంబులశస్త్రంబుల నగ్ని జలంబుల

నశనినార్ద్రృంబునను శుష్కంబునను స్థావరంబునను జంగమంబునను జావు

నొప్పులు లేకుండంగలయవి దొడరిన నన్నైనజయింపు మని వరం బిచ్చెం

గావున నన్నారాయణుం డవిజయ్యుం డై నెగడె నతనియంద జనియించిన నరుండును నట్టివాఁ డై కూడి సంచరించునరసఖుం డగునద్దేవుండు నిజ

మాయావిశేషంబుల జగన్మోహనుం డై విహరించు నమ్మహాత్ము లిరువు

రును దానవుల వధియించుటకును ధర్మసంస్థాపనంబు సేయుటకు నై వలసిన

యప్పుడెల్లను జననాదికృత్యంబులు గైకొని వినోదింతురు వారలు గదా

యీ కృష్ణార్జునులని చెప్పి కృష్ణద్వైపాయనుండు వెండియు ని ట్లనియె.


7_5_416

క. నీవుఁ దపస్తేజోవి

ద్యావిభవసమగ్రమూర్తి వగు దైవమ నీ

కే వినిపించెదఁ దెలియం

గా విను వారలకు నీకుఁ గలయంతరముల్.


7_5_417

తే. శుభ్ర మగు నుర్విమృత్తిక సురుచిరంపుఁ

బ్రతిమ గావించికొని యందుఁ బరము నావ

హించి పూజావిశేషంబు లెల్లఁ జేసి

నీవు దొలుమేనఁ గొలిచితి నిష్ఠతోడ.


7_5_418

క. వారలు లింగాధిష్ఠా

నారూఢుంగా నొనర్చి యర్చించిరి భ

వ్యారాధనపరు లై మును

గౌరీపతి నతులనియమకల్పన వెలయన్.


7_5_419

వ. ఎత్తెఱంగునం జేసినను బరమేశ్వరారాధనంబు సర్వార్థసాధనం బగు నందును

లింగంబునందుఁ బూజించుట యర్చయంధారాధించుటకంటె ననేక

గుణంబు లెక్కుడు గావున లింగార్చనపరు లగువారల నర్చారాధకుండ

వగు నీకు నెట్లు జయింప వచ్చు మీమీపూర్వజన్మంబులయర్చనంబుల ఫలం

బులు దారతమ్యంబులతో ననుభవింపవలవదే యని తెలియం బలుకుటయు

నశ్వత్థామ పులకితాంగుండును సమాహితాంతరంగుండు నై రుద్రునిం

దలంచి నమస్కరించి గేశవుం గొనియాడి పరాశరనందనున కభివందనంబు

సేసిన నమ్మహాత్ముని యంతర్థానంబు సేయఁ దానును మరలి వచ్చి నిజ

రథారూఢుం డై యరుణగభస్తి యస్తగిరిసమీపంబున కరుగుటఁ గనుం

గొనుచుఁ గురుపతిపాలికిం జని యతనికిం గాలోచితం బెఱింగించినవాఁడై

బలంబులఁ దివియ నియమించె నట్లు తిరిగి దీనంబు లగు నానలంబులతోడం

గౌరవులు విడిదలకుం బోయిరి పాండవులు బహుతూర్యనినదంబులు సింహ

నాదంబులుం జెలంగం బొంగారినసముద్రంబుచందంబున నుల్లసిల్లుసైన్యంబు

మగిడించికొని నిశ్చింతంబు లగునంత:కరణంబులతోఁ గృష్ణోపలాలితు లగుచు

నిజశిబిరంబులకుం జనిరి తదనంతరంబ ధనంజయుండు.


-: వేదవ్యాసమునీంద్రుఁ డర్జునునకుఁ బరమేశ్వరుమహిమ సెప్పుట :-


7_5_420

మ. మహనీయాకృతి సమ్యమిప్రవరు ధర్మస్ఫూర్తిసంకీర్తనీ

యు హుతాగ్నిప్రతిమానతేజుఁ గరుణాయుక్తుం బ్రదీప్తాన్వయో

ద్వహు నాశ్చర్యకరప్రబోధనిధి వేదవ్యాసుఁ బుణ్యున్ జయా

వహుఁ డై వచ్చినవాని నాగమసుఖావాసాననాంభోరుహున్.


7_5_421

వ. అంతంతం గనుంగొని యత్యంతవినయసంభ్రమంబులతో దండప్రణామంబు

సేసి యాసనార్ఘ్యపాద్యాదిపూజనంబుల నారాధించి సమీపభూమిం

గూర్చుండి కృతాంజలి యై సుప్రసన్నం బగునమ్మహామునివదనంబు వీక్షించి.


7_5_422

తే. అవధరింపు మహాత్మ కయ్యమున నేను

శాత్రవుల నేయఁ బూనుచో సరభసముగ

నడరి ముందట నొకరుఁడు పుడమి నడుగు

లిడక పావకనిభమూర్తిఁ యెసక మెసఁగ.


7_5_423

చ. కిరణము లుల్లసిల్లఁ దనకేల నుదగ్రపుశూల ముండఁగా

బొరిఁబొరి నందు ఘోరముగఁ బుట్టిన శూలపరంపరల్ గరం

బరుదుగ వారినెల్లఁ దెగటార్పఁగ నే వెనుకన్ శరంబులం

గురియుచుఁ జంపినాఁడ ననికొందు జయంబు సముద్భటంబుగన్.


7_5_424

క. అప్పురుషుఁ డెవ్వఁడో యని

యెప్పుడు మదిఁ దలఁతు నతని నేర్పడ నాకుం

జెప్ప వలయు నని యడిగిన

నప్పార్థున కిట్టు లనియె నమ్ముని ప్రీతిన్.


7_5_425

వ. నీయడిగినయతండు.


7_5_426

ఉ. ఆదికి నాది లోకంబులన్నిఁటికిం బ్రభుఁ డవ్యయుండు వే

దాదిపవిత్రవాచకసహస్రపరిస్ఫుటవాచ్యరూపుఁ డం

హోదళనప్రకారకశుభోదయకారకదివ్యనాముఁ డం

బాదయితుండు దృఙ్మహితపాలుఁడు లోలుఁడు భక్తియుక్తికిన్.

7_5_427

క. యోగీంద్రుచిత్తకమలా

భోగమధుపవిభుఁడు ప్రకృతిపురుషాత్ముఁడు ని

ర్భోగస్వరూపుఁ డవ్య

క్తాగోచరుఁ డధికసులభుఁ డమలాత్ములకున్.


7_5_428

ఉ. నీలగళుండు శంకరుఁడు నిత్యుఁడు సత్యసురూపుఁ డుజ్వల

త్కాలమహానలప్రశమకప్రచురామృతవృష్టివిస్ఫుర

ద్బాలమృగాంకశేఖరుఁడు దైత్యకులప్రవిదారణక్రియా

లోలపరశ్వథుండు సకలుం డమలుండు ప్రియుండు శాంతికిన్.


7_5_429

వ. అని ప్రశంసించి కవ్వడి గనినవాఁడు రుద్రుం డగుటఁ దేటపఱచి దక్షమఖ

మథనత్రిపురమర్దనాదు లగు నద్దేవునిదివ్యలీల లుపన్యసించి మహాదేవపశుపతి

శివప్రముఖంబు లగు తదీయభవ్యనామంబులకుం బ్రవృత్తినిమిత్తంబు లగు

నర్థంబులు దెలియ నిర్వచనంబు సేసి యట్టిపరమేశ్వరుండు నీకు వరదుం

డయి సన్నిధి సేసె నతనిఁ గని పెన్నిధిఁ గన్న పేదవోలెం గృతార్థుండ

వై తయ్యంధకాసురభంజనుకతంబున గడిందిపగ ఱడంగుదు రయ్యాదిమ

ధనుర్ధరుం డివ్విధంబున వైరివధం బాపాదింప నీకు గెలుపు గొనుట

సుకరంబయ్యె నీతపంబు పెంపునం దొల్లిసన్నిహితుం డై నీకుం బ్రియంబుగా

దివ్యాస్త్రంబు లొసంగె నంతటం దనివి పనక యిత్తెఱంగున భక్త పరాధీన

త్వంబు ప్రకటించె నీవు పుణ్యాత్ముండ వప్పరమాత్ము నాత్మనిలిపి నమస్క

రింపు మాసర్వలోకశరణ్యు శరణంబు సొరు మక్కరుణాకరుండు శరణా

గతులకు నాయురారోగ్యైశ్వర్యాదిసకలాభిమతంబులు నిత్యంబులుగాఁ

బ్రసాదించు నని నిర్దేశించిన నయ్యర్జునుండు దండప్రణామపూర్వకంబుగా

భక్తిరసాయత్తం బగుచిత్తంబునం జంద్రధరు నెలకొలిపి సాంద్రానందం

బనుభవించి సాత్యవతేయుచరణంబుల కెఱంగిన నమ్మునీంద్రుం డయ్యింద్ర

నందను నభినందించి సుఖివి గమ్మని దీవించి విజయంచేసె నని యిట్లు సంజ

యుండు ధృతరాష్ట్రున కెఱింగించెనని జనమేజయునకు వైశంపాయనుండు

సెప్పుటయు.


7_5_430

క. మునివర ద్రోణునివృత్తము

విని సంతుష్టుంద నైతి విను వేడుక నా

మనమునఁ దోడ్తో నొదవెడు

వినిపింపు దగంగ మీఁదివృత్తాంతంబున్.


7_5_431

వ. అని యడుగుటయు.

7_5_432

చ. అమరకిరీటకోటికలితారుణరత్నమరీచివీచికా

సముదయఖేల నోల్లసనచారుపదాంబుజకాంతిపూర దు

ర్దమదనుసూనుసంచయవిదారణ చిత్తవిహారబోధనా

గమహితనాదనిర్వహణకౌతుకవిశ్రుత రక్షితాశ్రితా.


7_5_433

క. జనవినుత బాదరాయణ

మునీంద్ర వాగమృతనిధిసముద్భూతాహ్లా

దనకీర్తిసుధాకిరణా

వినతాఖిలభద్రకరణ విశ్రుత చరణా.


7_5_434 మాలిని. అమృతమయవిలాసా యాగభాస్వద్విలాసా

విమలహృదయరమ్యా వీతరాగాదిగమ్యా

కమలభవనమస్యా గౌరవాధిక్యశస్యా

శమదమపరివర్తీ శాశ్వతానందమూర్తీ.


గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్య

పుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం

బయిన శ్రీమదాంధ్ర మహాభారతంబున

ద్రోణపర్వంబునందు సర్వంబును

బంచమాశ్వాసము.

శ్రీమదాంధ్ర మహాభారతము నందలి ద్రోణపర్వము సంపూర్ణము