Jump to content

ఆ భా 7 5 31 to 7 5 60

వికీసోర్స్ నుండి

--గ్రంధి ఆదిత్య


7_5_31

క. ఆసభ నీవును మీదు

శ్శాసనుండును గర్ణుఁడును బ్రశస్తచరిత్రో

ద్భాసితు లగు పాండవులకుఁ

జేసిన కీడెల్లభంగిఁ జెఱుపదె మిమ్మున్.


7_5_32

ఉ. అన్నివిధంబులం బఱిచి యైనను నక్కటికంబు లేక వా

రి న్నెఱి మాలి కానలఁ జరింపఁగఁ బంచినఁ బోయి వచ్చి య

య్యన్నయుఁ దమ్ములుం దమకు నయ్య సగం బిల వేఁడి కాన కి

ట్లున్నను వారి మార్కొనుట కోర్చతి నే నొక బ్రాహ్మణుండనే.


7_5_33

క. నీవును నచ్చటఁ బన్నిన

నీవారును సైంధవుని ననిం బడకుండం

గావఁగ జాలర యేనును

నీవాఁడన కానె యేల నిందింపంగన్.


7_5_34

వ. అని వీడనాడి వెండియు.


7_5_35

క. పాంచాలురుఁ బాండవులు ను

దంచితగర్వమున ననికిఁ దఱిమి యొడలు మం

డించుచు నుండఁగ ని ట్లుడి

కించెద వొకవలన నీవుఁ గీడుపలుకులన్.


--: ద్రోణుఁడు పాంచాలురఁ జంపక కవచంబు విడువనని ప్రతిజ్ఞ సేయుట  :--


7_5_36

వ. అని పగతురయుత్సాహం బుపన్యసించి.


7_5_37

క. పలుకులఁ బనిలే దీరే

తలపెట్టక పోరువా రుదగ్రత నేనుం

జలము మెఱయఁ బాంచాలురఁ

బొలియింపక కత్తళంబు పుచ్చ నరేంద్రా.


7_5_38

క. కావున మనసైన్యంబులు

సేవ సెడక సంగరంబు సేయునటులుగా

నీ వుత్సహంచి నిజబా

హావిభవము సూపు శక్తి కనురూపముగన్.


7_5_39

వ. అని తెంపు సేసి.


7_5_40

క. భూసురభక్తియు వృద్ధో

పాసనముం గలిగి ధర్మపథవర్తనని

త్యాసక్తుఁడ వగు మనఘా

నాసుతు బోధింపు వగవునకుఁ జొరకుండన్.


7_5_41

వ. నాచేతఁ దెగనిపాంచాలురు గలిగి రేనియు వారిం బోనీక పొదివి తెగఁ

జూచునది యని చెప్పుము.


7_5_42

క. అని పలికి గాఢనిశ్చయ

మున వదనం బెలమిఁ బొంద మును కలఁగిననీ

మొన లెల్ల నొక్కమొగముగ

నొనరిచి తలకొలిపె భూసురోత్తముఁ డనికిన్.


7_5_43

వ. అట్లాచార్యుండు పురికొల్పినం గౌరవపతి సమరసముత్సాహరహితం బగు

మనంబుతో సూతనందనుఁ జేర నరిగి యి ట్లనియె.


7_5_44

క. అరుల కభేద్యం బగున

ప్పరుషున బలుమోహరంబు వన్నించి తుదిం

జొర విడిచెఁ గాని గురుఁడ

న్నరు నాఁగఁడ యతఁడు గీడు నాకుం జూడన్.


7_5_45

క. ఒకఁ డట్లు సొచ్చి భుప

ప్రకరంబులఁ గూల్చి సింధురాజుఁ దునిమె నె

ట్లొకొ యతనికడిమి కుంభజు

నికి వారింపంగ రామి నిక్కం బరయన్.


7_5_46

క. తనమాట నమ్మి సైంధవు

మొనకుం దెచ్చితిమి గాక ము న్నెఱిఁగిన నా

తని నింటఁ బెట్టి వత్తుము

మనసేనయు నివ్విధమున మడియక యుండున్.


7_5_47

క. మన మెంత సెట్టలమొ ఫ

ల్గునుపై నాతనికి నంత గూర్మిగలిగె నే

మనఁగల దింక నతనిఁగొని

యని సేయుద మనుట కార్యమగునే మనకున్.


7_5_48

చ. అన విని కర్ణుఁ డి ట్లనియె నగ్గురు దూఱఁగ నేల యాతఁ డో

పినటుల పోరుఁ గాక నరుబీరము లావును నెక్కు డైన వా

ని నుడుపవచ్చునే విధియ నేర్చు విషం బిడి యిల్లు గాల్చి కా

ననమున కేఁగఁ జేసి యొకనాశముఁ గంటిమె గొంతిసంతతిన్.


7_5_49

క. కావున మన సైంధవునిన్

దైనను తెగటార్చె వంతఁ దలరి మనమునం

జేవ సెడ నేల పోరం

గా విధి పంచినటు లయ్యెఁ గడఁగన వలయున్.

7_5_50

క. అనునెడఁ బాండవసేనలు

మొనసి కదియ నడిచె నీదుమొనలుం దగ మా

ర్కొనియె నిటు లుభయబలములు

ననిమిషులకు వేడ్క వుట్టునట్లుగఁ దాఁకెన్.

7_5_51

క. తురగము తురగముఁ గరి కరి

నరుఁడు నరుఁడు దేరు తేరు నలిఁ దాఁకినయ

ప్పరుసఁదన మేమి సెప్పుదుఁ

బొరి మిడుఁగుఱు లెగసి కైదువులపొడి రాలెన్.


7_5_52

వ. అట్టియెడ నీకొడుకు సైంధవునిచావునకు దుఃఖితుం డగుటఁ బ్రాణంబుల

దెస నిరపేక్షుం డయి కడంగినం గని ద్రోణకృపకర్ణులు వారింపం ద్రోచి

తలకడచి దర్పప్రచండగతిం బాండవసైన్యంబు సొచ్చి నిశితవివిధవిశిఖపరం

పరలు పరగించినఁ జతురంగంబులయఁగంబులు ధరం దొరఁగి చిక్కువడి

మదకలమాతంగంబు గలంచినకమలాకరంబుచందం బయ్యె నప్పు డందుఁ

జేయంగలబలుమగ లెల్ల నొక్కమొగిం గవిసి యమ్మహీపతిం బొదివిన

నతండు భీమసేనుఁ బదిబాణంబులను నకులసహదేవద్రుపదవిరాటద్రౌపదే

యుల మూఁడుమూఁడుమార్గణంబులను శిఖండిని నూటను ధృష్టద్యుమ్ను

డెబ్బదింటను ధర్మపుత్రసాత్యకుల నైదైదమ్ములను ఘటోత్కచు నఱువది

నాలుగింటను నొప్పించి కేకయచేదిప్రముఖయోధవరుల ననేకసాయ

కంబుల బెట్టు వఱిచి సింహనాదంబు సేసిన.


7_5_53

క. ఆధర్మనందనుఁడు స

క్రోధాత్ముం డగుచు నేసెఁ గోదండము ను

గ్గై ధరఁ దొరఁగఁగ నాతఁ డ

బోధంబునఁ దేరిమీఁదఁ బొలుపఱి వ్రాలెన్.


7_5_54

తే. ఇట్లు మూర్ఛిల్లుటయుఁ గౌరవేశ్వరుండు

సచ్చె ననియెడు నెలుఁగులు శంఖకాహ

శారవంబులు సెలఁగఁ బ్రియంబు నొందె

వారిబలములు ద్రోణుఁ డేపారి కదిసె.


7_5_55

వ. అంత.


7_5_56

క. తెలివొంది యుధిష్ఠిర నిలు

నిలు మని రభసమునఁ దాఁకు నీసుతుఁ గని యా

బల మేచిన నీబలముం

బెలుచ నిగుడ నపుడు రణము భీషణ మయ్యెన్.


7_5_57

వ. అనిన విని ధృతరాష్ట్రుం డట్టియెడ నాచార్యుం డెవ్విధంబున నరివధంబు

సేసె నిందలియందలి చేయంగల సైనికోత్తము లెత్తెఱంగునం బెనంగిరి

చెప్పు మనవుడు సంజయుం డిట్లను నట్లుభయబలంబులుఁ బురికొని

పోరుచు నుద్దండరయంబు మెఱసి యుధిష్ఠిరప్రముఖపాండవులును శైనే

యాదియాదవులును ద్రుపదప్రభృతిపాంచాలురును విరాటపురస్సరమా

త్స్యులును గుమారవర్గంబును మఱియు ననేకదండనాయకులును సాయ

కాసారంబు పరగించుచు భారద్వాజ పై నడరిన నతం డత్యుదీర్ణుం డయు

కర్ణుండు మొదలుగాఁ గలబలుమగ లిరుగెలంకుల సంరంభంబునం దఱుమ

విజృంభించె నయ్యవసరంబున నెగసినధరణీపరాగంబు జనంబులచూడ్కులు

నిగుడ నీక యుండె నాలోనన శుండాలసుభటఘోటకంబులయంగంబులం

గ్రమ్ముదెంచురుధిరం బది యడంచిన నమ్మొనలకడంక రెట్టించె నప్పుడు

కౌరవులదిక్కున ఘూకసృగాలరవంబులు సెలంగ వా రది సరకు సేయక

సమరోన్మత్తులై నెత్తురుటేఱులు వాఱఁ గేలి సలిపి రాసమయంబునఁ

గేకయరథికులును ధృష్టద్యుమ్నతనయులును లోనగువారిం బెక్కండ్ర

నక్కుంభసంభవుండు నుఱిపియు మఱియుఁ బలువురఁ బఱపియుఁ గడిమి

నెఱపం బ్రతాపశీలుం డగుశిబి సాహసరసికుం డై.


7_5_58

క. ఉరవడిఁ దాఁకుటయును బది

శరము లతని మేనఁ గ్రుచ్చె సాయకగురుఁడ

చ్చెరు వగుమగఁటిమి నతఁడు

ద్ధురుఁ డై తత్సూతుశిరము ద్రుంచెం బెలుచన్.


7_5_59

తే. త్రుంచి తోడన ముప్పదితూపు లతని

యొడల నాటుడు హయములమెడలు నూతు

గళము నజ్జనపతికుత్తుకయును దునిమె

ఘోరభల్లషట్కమ్మునఁ గుంభభవుఁడు.


7_5_60

వ. అప్పుడు

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_7_5_31_to_7_5_60&oldid=3218" నుండి వెలికితీశారు