Jump to content

ఆ భా 7 4 211 to 7 4 240

వికీసోర్స్ నుండి

-మధు


7_4_211

ఆ. ఏచి కురుకుమారు లేవురఁ దురగసా

రథులతోడఁ గూడ రయము మెఱయ

వసుధఁ గూల్చె మెఱుఁగు వాలారు తూపులా

ఱాఱు నిగుడఁ జేసి యద్భుతముగ.


7_4_212

క. అనిఁ బడినరాచకొడుకులఁ

గని కర్ణుం డేటిబ్రదుకుగా బ్రదికెద నే

నని యింక నెన్నఁటికి లా

వని భీముని నొంపవలదె యని తెం పెసఁగన్.


7_4_213

ఆ. కదిసి డెబ్బదేనుకాండంబు లాతని

మేనఁ బఱపి యుబ్బు మిగిలి నవ్వ

నతఁడు నూటయేను శితవిశిఖంబుల

నతని నేసి చాపయుష్టిఁ ద్రుంచె.


7_4_214

మ. రయమారన్ బలువిల్లు పుచ్చుకొని యారాధాసుతుం డేయ దు

ర్జయుఁ డమ్మారుతి వొంగి సూతుని వెసం జానేసి విల్ ద్రుంచుచున్

హయసందోహముఁ గూల్చి హాస్యమునకున్ హాసంబు సేయన్ గద

న్భయదాకారత వైచె నాతఁ డది భగ్నం బయ్యె నాభీముచేన్.


7_4_215

వ. ఇట్లు గద ద్రుంచి పైపై నేయు పావని బరవసంబునకుం దెరలక

యొండుకోదండంబు గొని కర్ణుం డతనితనుత్రాణంబు దునియులు సేసి పెల్లే

సిన నతండును దదీయకంకటంబును భుజుంబును భేదించె నిప్పరుసునఁ బాద

చారి యై పెనంగు నయ్యోధవరుం జూచి భూవరుండు సత్వరుండై పను

పం జిత్రవిచిత్రచిత్రాక్షచారుచిత్రులును జిత్రధ్వజచిత్రాయుధచిత్రకర్ము

లును శరాసారంబులు బరగించుచు ధర్మపుత్రానుజుం దాఁకిన నతండు

మహావాతపతిత భూరుహప్రతతిభంగి దోఁప నక్కుమారసప్తకంబును రథ

సప్తిసారథిసహితంబుగాఁ బొడ వడంగంజేసె నాసందునఁ గల్పితస్యందనుం

డై యాసూతనందనుం డప్పాండునందనునిపై నురవడించిన.


7_4_216

క. అఱిముఱి నిరువురశరములు

తఱచుగ నొండొరుల బెట్టు దాఁకిన నయ్యి

ద్దఱు నెత్తుటఁ దోఁగి కడున్

వఱలిరి కల్పాంతనవదివాకరులక్రియన్.


7_4_217

క. అరదములు చిత్రగతులం

జరియింపఁగ ధైర్యములును శౌర్యంబులు ను

ద్ధురబాహావీర్యంబులు

సరి యై మెఱయంగ నధిక సంరంభములన్.


7_4_218

ఉ. ఒండొరుమీఁద సాయకము లొక్క మొగిం బరగింతు రేపు మై

నొండొరుబానాముల్ నఱకి యుర్విపయిన్ నెఱయింతు రుగ్రు లై

యొండొరుమేనులన్ శరము లుచ్చి చనన్ నిగిడింతు రిట్టు లు

ద్దండతఁ బోరి రాఱనిమదంబుల నొండొరు మీఱునాసలన్.


7_4_219

క. మరుదాత్మజుఁ డేచిన న

న్నరుఁడు హరియు సంతసంబునం బొదలుదు రు

ద్దురతం గర్ణుఁడు మిగిలినఁ

గర ముబ్బు విభుండు దమ్ముగమియుం దానున్.


7_4_220

తే. సూతనందనునకు నెడ సొచ్చి చొచ్చి

సమదుఁ డగుభీమసేనుచేఁ జచ్చి చచ్చి

బలము లఱుగ నాకర్ణుండు దొలఁగిపోవఁ

జూచుఁ దెగిపోఁడు పడిన నీసుతులఁ జూచి.


7_4_221

వ. శోకంబునం గోపంబునం గర్ణువిక్రమాటోపంబు దీపించిన.


7_4_222

క. గొడుగునను వింటికొమ్ముల

సిడమున నరదంబునందు సెల లవిసి కడున్

వడి నిగిడెడు చాడ్పున న

వ్వడముడి దెస నమ్ము లడరె వసుధాధీశా.


7_4_223

క. దానికి మనమున నించుక

యైనను దలఁకక సమీరణాత్మజుఁ డవి పై

రానీక నిలిపి యతనిం

దా నిరువదినారసములఁ దలరఁగఁ జేసెన్.


7_4_224

వ. అప్పుడు.


7_4_225

క. మనవారు వారివారలు

ననిలతనయు విక్రమంబు నగ్గింప సుయో

ధనుఁడు దనయొద్దియోధుల

ననుజులనుం గర్ణుఁ గావుఁడని పనుచుటయున్.


-: భీమసేనుచేత శత్రుంజయాదికురుకుమారులు చచ్చుట  :-

7_4_226

వ.అప్పుడు శత్రుంజయుండును శత్రుసహుండును సుదేహుండును మదనుం

డును ద్రుముండును జిత్రబాహుండును వికర్ణుండును గర్ణరక్షణపరు లై

కడిమి వెలయఁ దలకడచి యొక్కట భీమసేనుం దాఁకి ధరాధరంబు నంబు

ధారలం గప్పు జలధరంబులచందంబున నతని నతినిబిడశరపరంపరల బొద

వినం బెరిఁగిన దర్పంబునం బొదలి యతండు దృఢైకముష్టి నిర్ముక్తమార్గణ

సప్తకంబున వారిం బిలుకుమార్చి యార్చిన నాసింహనాదంబు విని ధర్మ

తనయుం డది విజయాగ్రజుండు నిజవిజయం బెఱింగించునట్లుగా నెఱింగి

మనంబునం బొంగి ద్రోణుదెసకుఁ దఱిమి కయ్యంబు సేసెనట్లు పలువురు

దమ్ములు వొలిసిన దుర్యోధనుండు దనమనంబున జూదంబునప్పుడు విదు

రుండు సెప్పినట్ల యగుచున్న దని విషాదంబు నొంది యాసభ నమ్మెయిఁ

బాండవు లం బఱిచిన పాపఫలం బనుభవించె ననపుడు వైచిత్రవీర్యుండు.


7_4_227

క. గతవృత్తములకు పగవం

గత మేమి యతండు వెఱ్ఱికార్యము నాదు

ర్మతిఁ దప్పె నోర్చి కొడుకుల

కత వినియెదఁ జెప్పు చెప్పఁ గలయది యెల్లన్.


7_4_228

వ. అనిన నతనికి సంజయుం డి ట్లను న ట్లనిలజుం డార్చినం బేర్చి కర్ణుం డతని

పయిం గవిసి ఘోరసంగ్రామంబు సేయుచుండ నీసేన భీమసేనుఁ జుట్టు

ముట్టిన నతండు బెట్టిదంబు లగు భల్లప్రముఖబాణంబులఁ గేతుఛ్ఛత్త్రచామ

రంబులు సూతరథరధ్యరథికావయవంబులుఁ దురంగమాతంగసుభటాంగం

బులుఁ దునియ లై తొరఁగి పెరుగు నెత్తురుటేఱుల వెంబడిం బాఱం

జేయుటయుఁ బతితశేషం బగునబ్బలం బిరుగెలంకులం దొలంగి యంప

పెట్టునేల కవుల సని చూచుచుండె వెండియు రాధేయుండు రయంబున

నతనిం దాఁకి పోరె నట్టియెడ నమ్మారుతనందనుండు.


7_4_229

క. అభీలతఁ గర్ణునిక

ర్ణాభరణము చుక్కవడినయట్లు వడఁగ సం

శోభితశరమున నేసి మ

హాభల్ల మురస్థ్సలమ్ము నాఁడగ నేసెన్.


7_4_230

క. ఆలోచన యారథికుని

ఫాలస్థలి నోలి నెనయఁ బదినారసముల్

గీలించిన నని యచ్చట

నీలోత్పలమాల వోలె నెఱయం బొలిచెన్.


7_4_231

తే. అలిగి బాణశతంబున నాతఁ డతని

నొంచె నవ్వీరుచాపంబు ద్రుంచె నతఁడు

పఱపె బలువింటఁ గర్ణుండు పటుశరములఁ

బట్ట పవలింటిసూర్యుని ప్రభలు వలయు.


7_4_232

వ. ఇట్లేయు నాసూతనందనువిల్లు విదుర్పు దోఁపక గుడుసువడుటఁ జక్రా

కృతిం బొలుచు ననలశిఖలచెలువు దాల్చె నట్టిరయంబునకు భయంబు గొనక

భీముండు నిగిడించు హేమలి స్తనారాచధారలు గగనలక్ష్మీకనకాభరణం

బులచెన్ను చేకొనియె నప్పుడు కోపంబు రూపంబు గైకొన్నకైవడి

నుదీర్ణుం డై యక్కర్ణుండు.


7_4_233

చ. పవననజుచాపమున్ హరులపగ్గములం దునుమాడి కాఁడితో

నవి పెనఁగాడఁగా వెడఁదయమ్మునఁ గేతువు గూల్చి సూతుమే

నవియఁగ నేసినం బఱచె నాతఁడు ఫల్గునుచక్ర రక్షుతే

రివెనుక కుగ్రశక్తి యుడరించెఁ జలింపక భీముఁ డత్తఱిన్.


7_4_234

క. అది సూతనందనుఁడు దొ

మ్మిదిశరములఁ దునుముటయు సమీరసుతుఁడు బె

ట్టిదముగ వాలుఁ బలుకయు

న్మదమునఁ గొన నతఁడు పలక నఱకె నఱకినన్.


7_4_235

మ. కరవాలంబున వైచి యారథికుల్ ఖండింప నొండొక్కని

ష్ఠురచాపం బతఁ డెత్తునంతకు జవాటోపంబుఁ గోపంబు మ

చ్చరముం దేటపడన్ వియచ్చరులు మెచ్చన్ భీముఁ డాసూతసూ

తిరథం బల్లల నాడ దానిపయికిం దెం పొప్ప లంఘించినన్.


7_4_236

వ. అతండు కేతనఁబునకుం గుదురుగాఁ బెను పొనరం గావించినపీఠంబు

నడుగున నొదింగినం దేరిపయి నతనిం గానక భీమసేనుండు నలుదిక్కులుం

బరికించి యతని పాఱుటయు లేకున్న నయ్యరదంబు క్రిందఁ దూఱె నను

తలంపున నతని బట్టికొనువాఁ డై డిగ్గ నుఱుకుటయుం దోడన తోఁచి

రాధేయుండు రథచిత్రగతులు మెఱయ రయంబారఁ బెక్కునారాచంబు

లొక్కమొగిం దనువునఁ జొనుపుచు నేచిన నయ్యనిలతనయుండు సాధన

వైకల్యంబున వెడంఘుపడియును వెన్నెక మున్ను వివ్వచ్చుచేతం జచ్చిన

సామజంబులహయంబులఁ బుచ్చికొని డాచేత నొడ్డుకొనుచు వలచేత

వైచుచుఁ బెనంగె నవియును వివిధవిశిఖంబులఁ దునియలు సేయుచు నెఱఁ

కులు నోనేయుచుఁ గర్ణుండు గదిసి తఱుమఁ దదీయస్యందనంబునకు దుర్గ

మ బగు నని యతం డర్జునాస్త్రపతితంబు లైన చతురంగంబులతిట్టల

యోలంబు సొచ్చిన.


7_4_237

తే. మొనలతోడను దనతోడ మున్ను పెనఁగి

శ్రమము వొందియు న ట్లరదమున కరిగి

వెండియును బోరి కడు డస్సి బెండు వడిన

యన్నిరాయుధుఁ జూచి సూతాత్మజుండు.


7_4_238

క. మనమునఁ గుంతీవాక్యం

బును నొలసిన నేయు టుడిగిపోయి కదిసి న

వ్వున మో మొప్ప నతని కి

ట్లను వింటం గడుపు లీల నల్లఁ బొడుచుచున్.


-: కర్ణుఁడు భీమసేను నవమానించి నీచోక్తులు పలుకుట  :-

7_4_239

ఆ. తిండిపోత నీకు భండనం బేటికిఁ

గడవఁ జేరి మనసు కాంక్ష దీఱ

నోపు కొలఁది మ్రింగి యూరక నీ వింటి

కడన యుండు మింక నడచిపడక.


7_4_240

వ. అని మరియును.