ఆ భా 7 4 121 to 7 4 150

వికీసోర్స్ నుండి


7_4_121

క. కని యాతని కొడుకు కడలుం

గనలుం బిరికొనఁగఁ దన్నుఁ గవిసినఁ బొదివెన్

ధనురాచార్యుఁడు శీఘ్రం

బున బెబ్బలికొదమ లేడిఁ బొదివిన మాడ్కిన్.


7_4_122

తే. పొదివి యవలీల నాతనిఁ బొలియఁ జేయఁ

సమదగతి మాఱుకొని జరాసంధ తనయుఁ

డస్త్రగురు నొంచుటయు నతఁ డల్గి యతని

గూల్చెఁ దత్సైనికులు గనుంగొనుచు నుండ.


7_4_123

వ. అట్టియెడ వడముడు ధృష్టద్యుమ్నుండు విన నవ్విప్రవరుం డప్రతిహత తపస్సిద్ధుండు

గాకేమి చూపులన దహించునట్ల తూపులవేఁడిమిం బగఱరూపడంచుచున్న వాఁడనిన

నాద్రుపద నందనుం డతని మార్కొనం గడంగునెడ నాతనిం దలకడచి.


7_4_124

ఆ. క్షత్త్రవర్మ గురుని చాపంబు ద్రుంచిన

వేఱ యొక్క దొడ్డ విల్లు రయము

మెఱయఁ గొని యతండు మెఱుఁగులు గిఱికొను

నారసమున వాని నామ మడఁచె.


7_4_125

ఉ. అప్పుడు చేకితానుఁడు శతాశుగమల్ గురుమేనఁ గ్రుచ్చి తే

రొప్పఱ సూతు నొంచి తురగోద్ధతి మాన్ప నతండు గన్నులన్

నిప్పులు రాలఁ దద్భుజము నిష్ఠర బాణహతంబు సేసి వే

కప్పె శరాళి సూతుఁడు దెగన్ హరు లోటఱి గ్రేళ్లు వాఱఁగన్.


7_4_126

వ. ఇట్లు విరథుం డై చేకితానుం డోటమి కోర్చి యమ్మెయిన తొలంగె నిత్తెఱంగున.


7_4_127

క. పెక్కండ్రు దొరలు దన పే

రుక్కున రూ పఱఁగ ద్రోణుఁ డుద్ధతిఁ దోడ్తో

నెక్కఁగ నితఁడు కుమారుం

డొక్కొ యనఁగ ముదుకఁ డయ్యు నుగ్రత మెఱసెన్.


7_4_128

వ. ఆ సమయంబునం బాంచాలపతి యీ బ్రాహ్మణుండు వృషభంబులుంబోని

భూపాలుర నెల్లను సృగాలంబుల కాహారంబు సేయుచున్న వాఁడు వారింప

వలదే యని కడంగి మొనలం బురికొలిపి కొనుచు నక్కజం బగు కయ్యంబు

సేయుచుండం బాండవాగ్రజుం డాత్మ గతంబున.


- ధర్మరాజు భీముని నర్జునునకుఁ దోడ్పడఁ బుచ్చుట –


7_4_129

ఉ. అర్జునుఁ డొంటి వోయె నని యక్కడఁ బుచ్చితి బాహుసార వి

స్ఫూర్జితు సాత్యకిం బెలుచఁ బోవుటయుఁ గనుఁగొంటి నిద్దఱున్

దుర్జయ శత్రు సైన్యముల దొందడి నేమయిరొక్కొ విక్రమా

వర్జిత వైరి భీముఁడును వారికిఁ దోడుగ నేఁగు టెట్లొకో.


7_4_130

క. తమ్ముని దలంచి కృష్ణుని

తమ్ముఁ బనిచె నాతనిం బదంపడు తన చి

త్తమ్మునఁ దలఁపఁడ ధర్మజుఁ

డెమ్మెయి వాఁడొక్కొ నారె యీ యున్నజనుల్.


7_4_131

తే. పెక్కుచోటుల నెఱిఁగిన యుక్కులావుఁ

గలుగు నీతనిఁ బనుచుట కలుక నేల

యితఁడు గలయ వయ్యిరువుర కెలమి వచ్చుఁ

బనుతు నేనటు శోకంబు వాయవలయు.


7_4_132

వ. అని బహు విధంబుల విచారించి నిశ్చయించి.


7_4_133

ఆ. భీముఁ జేర నరిగి బీభత్సు నీ తమ్ము

నని యెలుంగు గళమునందుఁ దగుల

నశ్రు లొలుక మాట యట సెప్ప లేఁ డతఁ

డార్తి సూచి యిట్టు లనియె నతఁడు.


7_4_134

క. ఏము గలంగిన యప్పుడు

నీ మహిమయ మమ్ముఁ దేర్చు నీకును గలఁగన్

భూమీశ తగునె యివ్విధ

మేమిటఁ బాటిల్లెఁ బనుపు మే పని కైనన్.


7_4_135

చ. అనవుడు నాతఁ డిట్లనియె నక్కడ నప్పుడు బాంచజన్య ని

స్వనము వినంగ నైన నట సాత్యకిఁ బుచ్చితి నేమి పుట్టెనో

యను వెత నిప్పుడ డద్దెస భయంబు దిగంబట నీవు వోయి పా

ర్ధునిఁ గని సింహనాదమున రోదసి నింపుము మాకు నింపుగన్.


7_4_136

క. నీతమ్ముఁ గుఱ్ఱ రూపసి

నీతివిదుఁడు సకల సుగుణ నిధి మద్భక్తుం

డాతని కెడ రగునో యను

చేతోగతి పల్లటిల్లఁ జేయదె తాల్మిన్.


7_4_137

ఆ. అనిన భీముఁ డిట్టు లనియెఁ దద్రథము ర

థ్యముల సారథిని శరాసనంబు

నెఱుఁగు దతని కొలఁది యెఱిఁగిన యదియ నీ

కేల వగవ నిపుడ యేను బోదు.


7_4_138

వ. దేవర యాజ్ఞఁ దల నిడికొని చని యా కృష్ణులఁ గృష్ణానుజునిం గలసి యిక్కడ

కెఱుక సేయుదు నని పలికి పాంచాల నందనుం గనుగొని కుంభ సంభవు బలిమియు

నతని ప్రతిజ్ఞ తెఱంగును నేమఱ కుండుము నాకుం బోక గర్జంబు గాదు గా కున్న

నేలిన వాని యానతి నడప వలయు ననవుడు నతండు.


7_4_139

క. వినుము భవత్సేనాపతి

తనువునఁ బ్రాణములు గలుగ ధర్మజు దెసకుం

జనుదెంచు వాఁడె ద్రోణుం

డనుమానము దక్కి యరుగు మర్జును కడకున్.


7_4_140

వ. అనిన ధృష్టద్యుమ్ను పలుకుల కూఱడిల్లి యనిలతనయుం డన్న చరణంబులకుం

బ్రణతుం డై యాలింగనంబును నాశీర్వాదంబునుం బడసి యున్న యప్పుడు శౌరి శంఖ

విరావంబ వీతెంచిన నవ్విభుం డవ్వీరున కిట్లనియె.


7_4_141

క. విను పాంచజన్య పటు వి

స్వన మదె యిది మఱఁది యెడరు సైరింపక కృ

ష్ణుని రణము సేయు రభసం

బని తలఁచెద నెయ్దు మెయ్దు మధిక రయమునన్.


7_4_142

వ. అనవుడు సవిశేష కల్పితం బగు రథంబు రవంబును దూర్యనినదంబును దన

సింహనాదంబునుం జెలంగ విశోకుని సారథ్య సామర్థ్యంబున రథ్యంబులు నెఱయ

మెఱయం గదలి గొనయంబు సారించి కురు బలంబు నవలోకించుచు నడరు

నవ్వడముడిం దలపడి నీ కొడుకులు దుశ్శల చిత్రసేన కుంభేది వివింశతి దుర్ముఖ

దుస్సహులును వికర్ణ శల విందానువింద సుముఖ దీర్ఘబాహు సుదర్శ బృందారకులును

సుహస్త సుషేణ దీర్ఘ లోచనా భయ రౌద్రకర్మ సుశర్మ దుర్విమోచనులును వివిధ

విశిఖంబులు వరగించుటయు లేళ్లగమిం జూచి పొంగు సింగంబు చందంబునం జెలంగి

యా శరంబులు వారించుచు వారిం గదిపి బృందారకుం దెగఁ జూచి యభయ రౌద్ర కర్మ

దుర్విమోచను లను మువ్వుర మూఁడు వెడంద దూపులం దునిమిన.


7_4_143

క. చలమునఁ బోవక పెనఁగిన

వల నేర్పడ నతఁడు విందు ననువిందు సుశ

ర్ములఁ జంపి సుదర్శను బె

ట్టిలపైఁ బడి యపుడు సావ నేసె నరేంద్రా.


7_4_144

క. పెఱవారు వెఱచి నలుగడఁ

బఱచిన వాయు సుతుఁ డార్చి వఱపె రథం బా

తెఱపిన యరుగుట గని గురుఁ

డుఱుక యతనిఁ దాఁకి కప్పె నుగ్రాస్త్రములన్.


7_4_145

వ. ఇట్లు నిలువరించి నిచలంబున నారాచంబు నాఁటించి యక్కుంభ సంభవుండు దన మనంబున వీఁడు వివ్వచ్చునట్ల నన్నుసరింపఁ గలవాఁడని తలంచి యప్పవన తనయు నుద్దేశించి.


7_4_146

క. నను గెలిచి కాక నీ కి

మ్మొన సొరఁగా నెట్లువచ్చు మును నీ తమ్ముం

డనుమతుఁ డై కాదే చొరఁ

గనియె ననుడు నతఁడు గన్నుఁ గవఁ గెంపారన్.


7_4_147

క. నరుఁ డొక రథికుని యనుమతిఁ

జొరఁ దలఁచునె మనుజసేన సురబల మైనం

దెరలిచికొని విచ్చలవిడి

నరుగుం దన వలయు నెడకు నది యట్లుండెన్.


7_4_148

చ. ప్రియములు పల్కి ని న్ననుసరింపఁగఁ బార్థుఁడు గాఁడు సుమ్ము దు

ర్జయ భుజశక్తి నిర్మథిత శత్రుఁడు భీముఁడు గాని నీవు దం

డ్రియు గురుఁడుం బ్రియుండు నని ప్రీతి యొనర్చెదఁ బూని వైరికిన్

జయ మొనరింతు గాక యని సైఁ తునె దర్పము సూప కుందునే.


7_4_149

వ. అని పలికి.


7_4_150

మ. గద సారించి చెలంగి వైచిన భుజాగర్వంబు సాలించి య

మ్ముదకం డుర్వికి దాఁటి పోయె నది రశ్ముల్ మింటఁ బర్వంగ బె

ట్టిద మై మ్రోయుచు వచ్చి బల్పిడుగు మాడ్కిం దాఁకుడున్ గుఱ్ఱముల్

సదిసెన్ సారథి మ్రగ్గెఁ దేరు వొలిసెన్ సైన్యంబు భీతిల్లఁగన్.