ఆ భా 7 4 061 to 7 4 090

వికీసోర్స్ నుండి


7_4_061

క. పలుతునియలు సేయుచుఁ దూ

పులు దనదెసఁ జేరనీక పోర శినివరుం

డలిగి తురగముల సారథి

నిలఁ గూల్చి తదుత్తమాంగ మేడ్తెఱ నఱకెన్.


7_4_062

వ. నఱకి నిజ సారథిం జూచి.


7_4_063

క. గురుఁ డను జలనిధిఁ గడచితి

నొరులు దలంబంగ నాకు నులిగాలువ లీ

నరపతుల సరకుగొన నీ

వరదము సననిమ్ము నేఁటి యని కలయకుమీ.


7_4_064

వ. అనవుడు వాఁడు నగుచు నీ విక్రమంబునకు నా వెరపు సంగడంబు గాదె

సంగరంబున నేమి సేయుదు నెవ్వనిపైఁ దేరు నడపుదు ననిన విని శినివరుండు

వివ్వచ్చు చేతం జచ్చిన కరి తురగ నర నికాయంబుల తిట్టలు సూపి యజ్జాడం

దేరు వఱపు మదె గాండీవ గుణ చండనాదంబు వీతెంచుచున్న యది నేఁడు

పాండవ మధ్యముం డిచ్చిన ధనుర్విద్యా విలాసంబు మెఱయను బాండు సూనుల

కేను జేయు భక్తి స్నేహంబులు నెఱపను వలయు నాకడంక గని కురువిభుం

డిరువురు ఫల్గునులను బుద్ధి గలంగునట్లు సేసెద నని పలుకు నవసరంబున

నద్దెసం గాంభోజ యవన సైన్యంబు లతని కడ్డపడం గడంగిన నవ్వీరుండు

గుణంబు సారించి యబ్బలంబు వలనికిఁ దేరు వఱపించి.


7_4_065

క. నానాస్త్రంబులు ముందఱ

నే నిగుడన్ బడలు వడిన వీర భటులపై

నేనుంగుల గుఱ్ఱంబుల

పీనుంగుల మీఁదఁ దేరు పెలుచం బఱపెన్.


7_4_066

వ. ఇవ్విధంబున వెండియు గిరాత శక బర్బర సారదయనన ప్రము ఖ మ్లేచ్ఛ సేనల

రూపడంచి నీ మూఁకలు గలఁగం దఱిసి చిత్రవర్మంబు మైచాయగా నారాచంబులు

నఖంబులును విల్లు బలు మొగంబును నై బెబ్బులివోలెం బోవం బోవ దుర్యోధన

దుశ్శాసన చిత్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్ధర్షణ క్రథ ప్రభృతి రథిక నికరంబు

రభసంబునం బోకుపోకు మను నెలుంగులతోఁ బిఱింది దెసం దఱిమినం

దత్కలకలంబు విని యతండు సూతు నాలోకించి.


7_4_067

క. మందగతిఁ జనుము నావెను

కందగిలెడు సైన్య జలధి గ్రక్కున శోషిం

పం దీవ్ర శరార్చుల నం

దంద వడిం బఱపి నగుచు నరుగుద మనినన్.


7_4_068

క. అతఁ డట్లచేయ నబ్బల

మతి రయమున నెయిది పొదువ నరిగి కరి చతు

శ్శతియు హయత్ర శతియు వసు

మతిఁ గూల్చెను శినివరుండు మద మెలరారన్.


7_4_069

వ. అంత నిలువక చలంబున నా సేన శైనేయుపై బెట్టు గిట్టె నట్టియెడ.


7_4_070

క. నర తురగ ద్విరద రథో

త్కరములతో నతని శరము దాఁకని రూపుం

బరికించియుఁ గానం ద

త్త్వరితత్వంబునకు వేఱ వర్ణన యేలా.


7_4_071

క. నరు బాహాస్ఫురణమునకు

సరి యగు నెక్కు డగుఁ గాని సాత్యకి భుజ వి

స్ఫురణం బల్పము గా దని

సుర నికురుంబంబు పొగడుచుం జూచె నృపా.


7_4_072

మ. కురు ముఖ్యుండును దోడి సైనికులు పెక్కుల్ దూపు లొక్కుమ్మడిం

గురియం బిన్నటి నవ్వుతో నతఁడు తత్కోదండ సూతాశ్వకే

తు రథంబుల్ వికలత్వముం బొరయఁగా దోర్దర్ప దుర్దాంతుఁ డై

వెరవుం జేవయు లావును దెలిపె నుర్వీనాథ యా సేనకున్.


7_4_073

వ. అప్పుడు


7_4_074

క. కదిసి నరేంద్రుఁడు సూతుని

మదమును దురగముల యుబ్బు నూనిచి నిశిత

ప్రదరముల నతని యంగము

పొదివె శకుని దోడువడఁగ భుజబల మలరన్.


7_4_075

వ. పొదివిన నొదవిన కోపంబు నాటోపంబున.


7_4_076

మ. ధరణీనాథ మురాంతకానుజుఁడు గాంధారేశు చాపంబునుం

గురువంశాగ్రణి సూతు కంఠము నతి క్రూరాస్త్ర పాతంబునం

గర మాశ్చర్యము గాఁగఁ ద్రుంచినఁ దురంగస్తోమ మామేదినీ

శ్వరుతే రచ్చటు వాయ నీడ్చికొని పెల్చం బాఱె దుర్వార మై.


7_4_077

వ. ఇత్తెఱంగునం బాఱిన.


7_4_078

క. తమ్ములు దొరలును నేపఱి

యమ్మనుజాధిపుని పజ్జ కరుగుటయును సై

న్యమ్ము వెఱచఱచి విచ్చిన

నెమ్మదిఁ దన యరుగుదెస శినిప్రభుఁ డరిగెన్.


7_4_079

వ. అనిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె.


7_4_080

క. పులికిఁ బసులు వాఱిన క్రియ

నలవుఁ జలము సిగ్గు విడిచి యట్లొక్కని కో

ల్తల కోర్వక విఱిగిన పు

త్రుల నే మని విందు నేను రోయక యింకన్.


7_4_081

క. అనుఁడు నతఁ డవ్విభుని కి

ట్లను నీవును నగ్రసుతుఁడు నవినయములు సే

సినఁ బాటిల్లిన యాపద

వినకుండఁగ వశమె మీఁదు విను తెలియఁగన్.


7_4_082

వ. అట్లు గాసి యై కోపించి నీ కొడుకు పురికొల్ప నంబష్ఠటేంకణ పారద ప్రముఖ దేశంబుల బలంబులు దుశ్సాసన పూరస్పరంబుగా రయంబునం జని సాత్యకిం జుట్టుముట్టిన నా జెట్టి మగండు నిజభుజ విక్రమాటోపంబునకుం బాటవంబు దలకొల్పిన.


7_4_083

మ. విఱిగెం బెక్కురథంబు లొక్క మొగి నుర్విం గూలె శుండాలముల్

చఱ చై రాలెఁ దురంగ మావయ వసంతానంబు లింతింత లై

కుఱుకుల్ గట్టె భటాంగకంబులు రణక్షోణిం బ్రవాహంబు లై

పఱచెన్ నెత్తురు భూతకోటి విహరింపం బ్రస్తుతింపన్ సురల్.


- దుశ్శాసనుఁడు సాత్యకితో యుద్ధంబు సేసి పాఱిపోవుట –


7_4_084

క. రోషమున దుస్ససేనుఁడు

పాషాణ ప్రథన నిపుణ పార్వతి కతతిన్

భీషణముగఁ గవియింప జి

గీషం బొదువుటయుఁ జూడ్కిఁ గెం పారంగన్.


7_4_085

క. శినివరుఁ డాణా లెల్లను

దునియలుగా సేయ మగిడి తొరఁగుచు నవి వై

చిన వారిన నొప్పంపఁగ

గనుకని నమ్మూఁక విచ్చెఁ గౌరవవాథా.


7_4_086

తే. విచ్చుటయు నంటఁ దాఁకి యవ్వీరుఁ డంప

వెల్లిఁ దేల్చిన వెగడంది పెల్లగిల్లి

యధిప దుశ్శాసనుఁడు మొదలైన యోధ

గణము లెల్లను ద్రోణుని కడకుఁ బఱచె.


7_4_087

వ. ఇవ్విధంబునఁ దనచేరువకుం జనినయాదుశ్శాసనునిం గనుంగొని మున్ను శైనేయు చన్నదెసం బుట్టినయక్కోలాహలం బాకర్ణించుచున్న యగ్గురుం డిట్లనియె.


7_4_088

క. ఏమి యువరాజ విభునకు

సేమమె సైంధవుని నేమి సేసె నరుఁడు నా

వేమిటి కిట్లీ రథిక

స్తోమముతో విఱిగి తెందుఁ జొచ్చెద వింకన్.


7_4_089

క. అడుకులు దిన్నట్లగునే

కడుపునఁ గుట్టెత్తినపుడు గడుఁ బఱచితి నాఁ

దొడ లెఱుఁగక పాండు సుతుల

నుడిగి మడుఁగ వలసె నిప్పు డొక సాత్యకిచేన్.


7_4_090

వ. భీమార్జునుల బారిం బడి యేమి గాఁ గలవాఁడ వని పలికి యలుక వొడిమిన నంత నిలువక.