ఆ భా 7 3 211 to 7 3 240

వికీసోర్స్ నుండి


7_3_211 తే. అట్లు భీషణమగు నర్జునాక్రమంబు ఘోరమైన మురారి శంఖారవంబు నధిక భయ సంభ్రమంబుల నావహింప నధిప నలుగడఁ బఱచె సైన్యంబు గలఁగి.

7_3_212 వ. ఇత్తెఱంగున.

7_3_213 క. మును సంకట పడి మూఁకలు గనుకని విచ్చుటయుఁ బిదప గాండివి మెఱసెం బొనుఁగుపడి యుండి తగుగా డ్పున మండు మహానలంబుపోల్కి మహీశా.

7_3_214 వ. అయ్యవసరంబున సింధురాజ రక్షకంబైన బలంబు సంక్షోభ సహితంబుగు నుత్సాహంబునం బొదలి శంఖ భేరి పణవాదిక్వణన మేదుర సింహనాద భరిత రోదసీ కుహరం బయ్యె నచ్చిడి ముడి వడుట యవలోకించి.

7_3_215 క. మందస్మిత సుందర వద నేందు లగుచు హరియు నరుఁడు నేడ్తేఱఁ బ్రియముల్ డెందములం బొంద భవ న్నందనుపై నురవడించినం గని కడఁకన్.

- వృషసేనుండు లోనగు నెనమండ్రు రథికు లొక్కపెట్ట యర్జునుపైఁ గవియుట – సం. 7-79-1

7_3_216 క. వారలఁ బొదువ నడరు బలు తేరుల మొత్తముల మిగిలి దీప్త పటు రథో దారు లగుచు నెనమండ్రురు వీరులు దఱిమిని నితాంత వేగోజ్జ్వలు లై.

7_3_217 వ. వారెవ్వ రెవ్వ రంటేని.

7_3_218 క. దండిమగ లైన వృష సే నుండు శలుఁడు సైంధవుండునుం గృపుఁడును గ ర్ణుండు గురు నందనుఁడు శ ల్యుండును భూరి శ్రవుండు నుర్వీనాథా.

7_3_219 వ. అందఱు నొక్క మొగంబై.

7_3_220 క. తనదైన ప్రతిన నెఱవుట కును ముఖ్యోపాయ మది యగుట నట్లు సుయో ధనుఁ బరిమార్పఁ గడఁగు ఫ ల్గునుఁ దలపడి రాత్మ శంఖ ఘోషంబుల తోన్.

7_3_221 క. అట్లయెడ దేవదత్తము బిట్టొత్తె నరుండు పెక్కు పిడుగుల మ్రోఁతన్ బెట్టు వఱచు తన్నినదము పుట్టించెను దిగులు నీదు పుత్రకు సేనన్.

7_3_222 తే. చెవులు బీఁటలు వాఱంగఁ జెలఁగు నమ్మ హారవమ్మున కులుకక యతనిమీఁద విభుఁడుఁ గర్ణాదులును శర వృష్టి గురిసి రడరి సైంధవు దిక్కున కడ్డ పడుచు.

7_3_223 వ. ఆ సమయంబున నశ్వత్థామ యుబ్బి డెబ్బది మూఁడు మార్గణంబుల మురవైరిని భల్లత్రయంబునం బార్థుని నైదు శరంబులం దురంగంబులం గేతువు నేసిన నవ్వాసవి యతని నూటయాఱింటను గర్ణునిఁ బదింటను వృషసేనుని మూఁటను నొప్పించి యొక్క కత్తివాతియమ్మున శల్యు చాపంబు ముష్టికిం ద్రుంచిన.

7_3_224 సీ. వేగంబ వేఱొక్క విలుగొని మద్రేశుఁ డతని పై దొమ్మిది యమ్ములేయ ముప్పది రెంటను మూఁట నేనిండిను బదియింట నఱువది బాణములను గర్ణ భూరిశ్రవః కర్ణ నందన కృప గురుపుత్రు లేసి రన్నరుని మఱియు నాతని మీఁద దివ్యాస్త్రంబు లైదు గోవిందు మై సప్తతి విశిశములను

తే. ద్రౌణి నిగిడించె నట్టి సందడి జయద్ర థుండు వారల మఱువున నుండి పఱపె సరభసముగఁ ద్రిసప్తతి సాయకంబు లమ్మహా బాహు దెసఁ గౌరవాధి నాథ.

7_3_225 వ. ఇట్లు పెక్కం డ్రొక్క పెట్ట పె ల్లేసినం గినుక నూనిన నవ్వు రౌద్ర రసంబు నలంకరింప.

7_3_226 క. వడి రాధేయుని నాతని కొడుకును బండ్రెంట మూఁటఁ గుదియించుచుఁ గ వ్వడి యొక బలు తూపున నె క్కుడు రయమునఁ దునిమె శల్యుకోదండంబున్.

7_3_227 ఆ. తునిమి తోన యతనిఁ దొమ్మిది యమ్ముల స్రుక్కఁ జేసి మూఁట సొమదత్త తనయు నెనిమిదింట ద్రౌణిని నిరువదే నింటఁ గృపుని నొంచి నిలువరించె.

7_3_228 వ. మఱియు నిరువది మెఱంగు వాలమ్ము లశ్వత్థామ యంగంబునం గ్రుచ్చె నిట్లందఱ తోడను గ్రందు కయ్యంబు సేయు సమయంబున నొక్కొక్కమరి వారి పిఱుంద నోర వాఱం దోఁచు జయద్రథు నేయం దీఱకున్నం దమకంబున నెడనెడ నఱిముఱిం దద్రథంబు దెసకు నతఁడు వాఱ విడిచిన విశిఖంబులు నూఱు గల వప్పుడు భూరిశ్రవుండు వాసుదేవుని చేతి మునికోల నొక కోలం దునిమి కదిసి నొస్సమొగిం గ్రూర నారాచంబులు గుప్పించి నొప్పించిన.

7_3_229 శా. కోపాటోప మహోగ్ర మూర్తి యగుచుం గోదండటం కార లీ లా పూర్ణంబుగ భూనభోంతర మతం డయ్యోధులన్ బాణ జా లా పాతంబునుఁ దూల నేసి చటుల వ్యాపార ఘోరా నిలా క్షేప క్షోభిత వారి వాహ చయ భంగిం జూపె నేపారఁగన్.

7_3_230 వ. అట్లు విచ్చియుం గూడికొని మూఁకలం గూర్చికొని యొండొరులం బురికొల్పికొని.

7_3_231 క. ఆ రథికు లొక్క మొగి న వ్వీరుని పైఁ గవియుటయును విస్ఫురిత శరా సార మతఁడు నిగిడించిన వారి బలము లెల్ల రక్త వారిం దేలెన్.

7_3_232 వ. ఇత్తెఱంగునం దెరలచుం బొదువుచు భవదీయ సైనిక లోకంబు వోక పెనంగె ననిన విని యప్పు డేమేమి యడియాలంబులతో నెవ్వ రెవ్వరి సిడంబులు మెఱసి యుండె నని యాంబికేయుం డడిగిన సంజయుం డిట్లనియె.

7_3_233 సీ. ప్రస్ఫుర ద్వానర పతియును సింహ లాంగూలంబు నుజ్జ్వల గోవృషంబు వారణకక్ష్యయు భూరి మయూరంబు సితయుఁ గాంచన సింధురంబు రత్న యూపంబును రజత వరాహంబు నుద్దీప్యమాన మహోరగంబుఁ గేతనంబుల నొప్పుఁ గ్రీడికి నాచార్య సుతునకుఁ గృపునకు సూతజునకు

తే. నతని నందనునకును మద్రావనీశ్వ రునకు శలునకు భూరి శ్రవునకు సైంధ వునకు రారాజునకు నిట్లు దనరి మెఱయుఁ బది సిడంబులు నభమునఁ బ్రభలు నిగుడ.

7_3_234 క. మన తొమ్మిది సిడముల కం టెను నుజ్జ్వల మగుచు నొక్కటియ పెక్కై యెం దును దాన తోఁచు నయ్య ర్జును సిడము మహోగ్రతం గురుక్షితి నాథా.

7_3_235 తే. అనుడు నమ్మేది నీశుఁ డిట్లనియె నట్లు క్రీడి విస్మయావహరణ క్రీడ సలుప గురుని దర్పంబుచే నాఁక గొని ధర్మ సూను సైన్యంబు లెట్లయ్యె సూత తనయ.

7_3_236 వ. అనుటయు సంజయుం డతని కిట్లనియె.

7_3_237 క. అయ్యెడ భేచరులకు వెఱఁ గయ్యెడు చందమున నట్టి యవసరంబున బ ల్కయ్యము గురు బలము తో నయ్యె యుధిష్ఠిర బలోచ్చయంబున కధిపా.

7_3_238 వ. ఆ సంకుర సమరంబున బృహత్క్షత్త్రుని క్షేమధూర్తియు ధృష్టకేతుని వీరధన్వుండును నకులుని వికర్ణుండును సహదేవుని దుర్ముఖుండును సాత్యకిని వ్యాఘ్రదత్తుండును దలపడిరి శల్యుండు సేనా ముఖంబునకు వచ్చుచుం బోవుచున్న వాఁ డగుట నుచితంబు మెయి నచ్చటి యనికిఁ జొచ్చి ద్రౌపదేయులం దాఁకె భీమసేనుని నలంబుసుండును ధర్మనందను నాచార్యుండును మార్కొని రప్పు డయ్యుధిష్ఠిరుండు.

- ధర్మరాజు ద్రోణునితో యుద్ధము సేసి యోడిపోవుట – సం. 7-81-18

7_3_239 క. గురు మెయిఁ దొంబది సునిశిత శరముల నినుచుటయు నతఁడు సక్రోధుం డై యిరువది యేనిట నాతని యుర స్థ్సలము నొంచి పొదివె నుగ్రాస్త్రములన్.

7_3_240 క. రథమును నశ్వమ్ముల సా రథిఁ దన్నును గప్పు శర పరంపర లెల్లన్ వృథ సేసెం గర లఘు తా ప్రథితుం డగు ధర్మసుతుఁడు బాణౌఘములన్.