Jump to content

ఆ భా 7 3 181 to 7 3 210

వికీసోర్స్ నుండి


7_3_181 క. కోమునఁ బెరిఁగిన వాఁడు మ హా మానోదగ్ర చిత్తుఁ డట్లగును సం గ్రామంబున కలుకం డు ద్దామ భుజావీర్య దుర్మద స్ఫురితుండన్.

7_3_182 క. మనకును నితనికి సైంధవుఁ డను నొడ్డున నయ్యె జూద మధి కౌద్ధత్యం బున గెలువుము చిరకాలము మనమున రారాజు నలుక మ్రందింపు తగన్.

7_3_183 ఉ. ఈతఁడు మీకు నాపదల కెల్లను మూలము ధర్మపుత్రు దు ర్ద్యూమతునం బరా భవము నొందఁగ జేసిన పాప నిశ్చయుం డా తరణీ లలామమున కమ్మెయి భంగ మొనర్చె వీఁడు నీ చేతులలా వెఱుంగఁడు విశిష్ట శుభం బిది నీకు ఫల్గునా.

7_3_184 క. ఎఱిఁగినఁ జేరఁడు చేరుట యెఱుకువ మా మనకు దైన మిచ్చిన సిరి యి ట్లఱిమిన యాలో గ్రక్కున నఱకు మితఁడు దెగిన మన మనః పీడ దెగున్.

7_3_185 మ. వెరవే సంపదఁ గోరి గాండీవ గుణా విర్భూత బాణాలి కి ట్లెర యై వచ్చుట యిమ్మహీపతి కితం డేలొక్కొ యత్యంత ని ష్ఠరు శౌర్యోన్నతి నిన్నుఁ దాఁక దలఁపం జోద్యంబు వీ డగ్గ మై దొరకో లర్జున నీకుఁ దొంటి సుకృత స్తోమంబు కల్మిం జుమీ.

7_3_186 క. ఇతఁడు వడినఁ బ్రజ విచ్చును ధృతి సైంధవుఁ డఱిమెనేనిఁ దెగు నాతం డు ద్ధతి విడిచి పాఱిపోయినఁ బ్రతిన కదియ చాలుఁ గడఁగు పటు శౌర్యనిధీ.

7_3_187 వ. అని పెక్కు భంగులం జెప్పిన విని వివ్వచ్చుం డచ్యుతు నాలోకించి.

7_3_188 ఉ. ద్రౌపది వడ్డబన్నము లుదగ్రత మేదినిఁ బెద్దకాల మి చ్ఛా పరతంత్రుఁ డై తన వశంబుగఁ జేసిన వీని గర్వముం గోపము వెంపదే మనము గుందఁగఁ జేయదె యింత సెప్ప నే లా పొరిగొందు నీతనిఁ జలంబు బలంబును నీవు మెచ్చఁగన్.

7_3_189 ఆ. ఒరుల దిక్కు సనక యరదంబు నీతని యున్న యొడకు నడపు మన్న నతఁడు నట్ల చేయఁ దనకు నభిముఖు లై వచ్చు వారిఁ జూచి మనుం వల్లభుండు.

7_3_190 క. మనమునఁ గొంకక యెదురుగఁ జనియె నిజోద్ధతికి మెచ్చి జనపాలకు లె ల్లను బిచ్చలింప సేనా నినదం బెసఁగంగ ఘోర నిష్ఠుర వృత్తిన్.

7_3_191 క. తముఁ బిలుచుచు నివ్విధమున సమ దాటోపగతి నడరు జనపతిఁ గని చి త్తము లలర నార్చి నిజ శం ఖము లొత్తిరి శార్ఙ్గధరుఁడు గాండివ ధరుఁడున్.

7_3_192 చ. ఎలమిఁ జెలంగు కృష్ణుల యహీన సముద్ధతిఁ జూచి శోక వి హ్వలు లయి మానవేంద్రు దెస నాసలు మాని మృగంబు భ్రాంతి ను జ్జ్వల దనలంబులో నుఱుకు చందముగాఁ గొని నీదు యోధ వీ రు లకట చచ్చెఁ జచ్చె నని మ్రోయఁగ నాతఁడు వారి కిట్లనున్.

7_3_193 క. భయ మేటికి వినుఁడు ధనం జనునిం గేశవుని నాదు శర కీలనాసం చయమున నేర్చెదఁ బేర్చెద నయనా నందంబు మీ కొనర్చెదఁ గడిమిన్.

7_3_194 వ. అని పలికి పార్థుం గనుంగొని యవష్టంభంబున.

- దుర్యోధనుఁ డర్జునుం దలపడి యధిక్షేపించుట – సం. 7-75-35

7_3_195 చ. వినుము కిరీటి దివ్య శరవేదివి నాఁ జను దేను లేని చో టను మును సెల్లె నీకు నిచటం జన నిత్తునె యిప్డు నీ బలం బును హరినేర్పుఁ జూచుటకుఁ బోరికి వచ్చితి నీవు పాండు రా జునకు జనించి తేనిఁ దెగి చూపుము శౌర్యము నస్త్రవీర్యమున్.

7_3_196 వ. అనుచుఁ గ్రూరంబు లగు మూఁడు నారాచంబుల నన్నరు నేసి శర చతుష్టయంబున హయంబులు నొప్పించి పది బాణంబులు పద్మనాభు నురంబునం గ్రుచ్చి మునిగోల యొక్కకోలం దునిమినం గినిసి క్రీడి యాతనిపైఁ జాతుర్దశ నిశత ప్రదరంబులు వరగించిన నవి యమ్మహీపతి మైమఱువు దాఁకి మిట్టి పడుటయుం జూచి దొమ్మిది దూపుల తోడం బంచాశుగంబులు నిగిడించిన నవియు నిష్ఫలంబు లగుటయు నిరువదెనిమిది బాణంబు లడరించె నవ్వాలమ్ములు నమ్మెయిన వ మ్మైన విషాదంబున వాసుదేవుండు వాసవి కిట్లనియె.

7_3_197 క. మున్నెన్నఁడు నివ్విధ మేఁ గన్నది గా దమ్ము లెడలె గాండీవము లా వున్నీ భుజముల శక్తియు మిన్నకఁ పోఁ జిత్రమిది యమిత్ర ధ్వంసీ.

7_3_198 ఆ. నీకుఁ జూడ ముష్టనెలవు నాకర్షణ గాఢతును బాణగతియుఁ దొంటి యట్లొ యొండు భంగి యై తోఁచెనో నాకు నున్న రూపు సెప్ప వన్న పార్థ.

7_3_199 చ. పిడుగుల యట్ల తాఁకి రుపు బృందములం దెగటార్చు నాజి నె ప్పుడు భవదీయ దివ్య శర పుంజము లొక్కట నిప్డు పొల్లు వో యెడు నిది నీవు నిమ్మతి విహీనపు జంతువు నేమి నేట్లకుం జెడుటకు నొక్కొ విస్మయము సెందెడు డెంద మలంతఁ బొందెడున్.

7_3_200 వ. అని యిట్లు దన్ను నిందించు కొనుచు గోవిందుం డడిగిన బురందర నందనుం డతని కిట్లనియె నిది యొక్క కవచ ధారణంబు మున్ను ద్రోణుఁ డొక్కరుండ యెఱుంగుఁ బదంపడి నాకు నెఱింగించె నిప్పుడు సుయోధనుండును నెఱుంగు తెఱంగు గావించెం గావలయు నిమ్మెయి మైమఱువు త్రిలోకంబుల కభేద్యం బగుటయు నీవు నెఱుంగుదు వెఱింగియు న న్నడుగ నేల భువనత్రయంబునందును వస్తు ప్రకారంబులు నీ యెఱుంగని యవియుం గలవే యది యట్లుండె నితండు దీని నగ్గురు కరుణం బడసిన వాఁడై.

7_3_201 క. విను మాఁటదివోలెం దన తనువున కడ్డంబు గాఁగఁ దగిలిచికొన్నాఁ డనఘ యిటు లైన నెట్లగు నని యెఱుఁగడు దీని విధము లన్నియు దెలియన్.

7_3_202 క. నా వింటి బలువుఁ జేతుల లావును జూడు మిదె నీ తలం కుడుగఁగ నే నీ విభునిఁ గవచ రక్షితుఁ డై విలసిల్లంగ నీక యలఁచెదఁ గృష్ణా.

7_3_203 వ. అంగిరసుం డమరపతికి నొక్క మహాస్త్రం బిచ్చె దాని నతండు నా కొసంగె నది నిఖిల కవచ నిర్భేదనశీలం బై యుండు దాన నిమ్మెయినుఱు వఱువుళ్లు సేసెద.

7_3_204 క. అని వెస నా దివ్య శలం బనూనమంత్ర ప్రకాశ మగునట్టులుగా గొనయమునఁ జేర్చి తిగిచినఁ గని యశ్వత్థామ బాహుగర్వం బలరన్.

7_3_205 తే. అధిప సర్వాస్త్రఘాతి యై యతిశయిల్లు నస్త్రమునఁ జిత్రముగఁ దెగయంద తునిమె నమ్మహాస్త్రంబు నట్లది వమ్ము గాఁగ నెఱిఁగి వెఱఁ గంది హరి కతఁ డిట్టు లనియె.

7_3_206 వ. ఆచార్యపుత్రు నస్త్ర ప్రభావంబున నవ్విశిఖంబు వినిహితం బయ్యెఁ బునః ప్రయోగంబు సేసిన నది యొప్పమి సేయు నని వింటి నా వింటి బలిమిన సాధించెదం జూడు మను నవసరంబున నయ్యిరువురను దుర్యోధనుండు.

7_3_207 క. తొమ్మిది తొమ్మిది వాలిక యమ్ముల మున్నేసి పటు శరాసారము పైఁ గ్రమ్మించిన మనదెసఁ దూ ర్యమ్ములునుం గీర్తనములు నార్పులుఁ జెలఁగెన్.

7_3_208 ఆ. అలిగి యవుడు గఱచి యన్నరుఁడా నృపు తురగములను సూతుఁ దునిమి వైచి రథము నఱకి యధిక రయమునఁ దఱచుగ నాఁటెఁ గరతలముల నారసములు.

7_3_209 వ. ఇట్లు విరథుండును వికల హస్తుండును సై విషణ్ణుండగు నన్నరనాథుండు వెడం గగుటం గటకటం బడి యా కంకటంబు నిష్ఫలం బను బుద్ధిం బుచ్చి వైచి యొండొక కవచంబు దొడిగె నయ్యెడరు గనుంగొని శ్రీఘ్రంబునం దత్సైనికోత్తములు చతురంగ బహు బలంబులతోఁ గవిసి కవ్విడిం జుట్టి ముట్టి యలుఁగుల సోనలు గురిసిన నతండు సంరంభ విజృంభితుం డగుటయు.

7_3_210 చ. అఱిముఱిఁ ద్రెళ్లెఁ దేరులు గజావళి గూలెఁ దురంగ మాంగము ల్గిఱికొనియెన్ మహిన్ భటులు లెక్కకు మిక్కిలి సేన పాడుగా నఱు మయి రప్డు కృష్ణుఁడు నినాదము భూ గగనాంతరంబునం దఱచుగ నొత్తె నిర్మథిత దానవ సైన్యముఁ బాంజచన్యమున్య