ఆ భా 7 3 151 to 7 3 180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_3_151 సీ. అచ్చోటు గదలి వివ్వచ్చుండు సనఁ జన నతని మై వాడును హయచయంబు డప్పియు నతనికి నప్పుడు సైంధవుఁ డున్నెడ దూరమై యుండుటయును గని సంతసము నొంది కౌరవ యోధులు సింహనాదంబులు సేసి తఱును నా రథికోత్తముఁ డచ్యుతుఁ జూచి రథ్యమ్ములు మేనుల నలుఁగు లుండ

తే. నురవడింపవు వీరల సరకు గొనక వీని నిప్పుడ యఱ్ఱులు విడిచి తడవు మనుడు నతఁ డిది వోలున యనుడుఁ దేరు డిగ్గి సారించెఁ గ్రీడి గాండీవ గుణంబు.

7_3_152 చ. ఎడఁగని యబ్బలంబు గుడనేడ్తెఱఁ గిట్టి మహాస్త్ర శస్త్రము ల్గడువడిఁ గుప్పఁ గూరగఁ జనంబున బైఁ దొపఁగింప నేచి క వ్వడి వివిధోజ్జ్వలాస్త్రముల వాని వెసన్ మగిడించి తాఁకు పె ల్లడరఁగఁ జేసె మింటికలయంతయుఁ జిట్టలు గట్టుమంటలన్.

7_3_153 వ. ఇత్తెఱంగున.

7_3_154 క. లావును వెరవును మెఱయఁగ నీ వీరులు పాండు పుత్రునిం బొదివినచో నా వీరుని యక్కజ మగు లావు వెరవుఁ గరతలామలక మై తోఁచెన్.

7_3_155 వ. అట్టియెడఁ జతరంగంబులు.

7_3_156 క. నొచ్చినఁ జచ్చినఁ దెరలిన విచ్చిన నయ్యెడరు సూచి విసువక పైపైఁ జొచ్చినఁ గడుఁ గ్రిక్కిఱిసిన నచ్చట మనసేనలోన నార్పులు వెడలెన్.

7_3_157 వ. ఆ ఫల్గునుండు పాదచారి యై యునికిం దేఁకువ సెడియును గెలుపున కాసపడియును నిట్లు గ్రమ్మిన కౌరవ సైన్యంబు పొంగిన సముద్రంబు పోలిక యగుటకుం దగిన తరంగంబుల చందంబున నిగుడు శర పరంపరల వలనను ఘోషంబు చాడ్పునం జెలంగు తూర్యనాదంబుల వలనను వివిధ సత్త్వంబుల విధంబున నుల్లసిల్ల మాతంగ తురంగ సుభట స్యందన సందోహంబుల వలనను జలియింపక చెలియ కట్టయుం బోలె నవి నిలువరించి యవ్విక్రమ కుతూహలి విజృంభించిన.

7_3_158 సీ. పటు భల్ల నికరంబు పరగినఁ బఱియలై యఱవఱ లయ్యెడు నరదములును నానార్ధచంద్ర బాణ వ్రాత మడరినఁ దునియ లై మేదినిఁ దొరఁకు కరులు శాతనారాచ పుంజంబులు నిగిడినఁ గుదురు లై కూలెడు ఘోటకములు వివిధాస్త్ర తతులు పర్వినఁ గండలై వండఁ దఱిగినట్లుండు పదాతి చయము

తే. నగుచు బీభత్స రౌద్ర మహాద్భుతములు మూర్తిమంతంబుగ మనమొనలు రక్త మాంస మేదోస్థి మస్తిష్కమయ తఁ జూడ ఘోర రూపంబు లై పరిక్షోభ మొందె.

7_3_159 వ. ఇవ్విధంబునఁ గురుసేనం గనుపుకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుంగొని కమల నాభుండు.

7_3_160 క. పెఱికితి నలుఁగులు మేనులు నెఱిఁ బడ నెల్లెడలఁ గలయ నివిరీతి హరు లి త్తఱి నీళులు ద్రావక తె ప్పిఱ వెట్లొకొ శత్రు సైన్య భీకర మూర్తీ.

7_3_161 క. వెన్ను మునుఁగఁ దివియఁగ లే కున్ను ద్రావఁ దగు నీళు లొదవిన హయమున్ నిన్ను గెలిపించు ననవుడుఁ గన్నుల నగి యర్జునుండు గల వివె యనుచున్.

- అర్జునుఁడు దివ్యాస్త్రముల ధరఁ బగిల్చిఁ కొల నుత్పాదించుట – సం. 7-74-32

7_3_162 మ. ధర దివ్యాస్త్రహతిం బగిల్చి కొల నుత్పాదించి వే దానికి న్శరజాలంబున నిల్లు గట్ట మన సైన్యంబున్ వెఱం బొందె న చ్చెరు వందెన్ సుర సంఘముల్ హరి నుతించెం బొంగి యప్పార్థు భూ వర మున్నిట్టివి సూడరున్ వినరు నెవ్వారుం ద్రిలోకంబులన్.

7_3_163 తే. హర్ష మందస్మితము తోడ నమ్మురారి యపుడ హయముల మెయి వెట్టునట్లు సేసి తఱిమి నీళులు ద్రావించి తడవి మగడఁ దెచ్చె మనయోధు లెల్లను బిచ్చలింప.

7_3_164 వ. ఇట్లు సేద దేర్చి.

7_3_165 క. మును దివ్యాస్త్ర బలంబున జనియించిన నీరితోన సంభూతం బై యొనరిన భాణము మే పెం దనివుసనం దురగములకు దర్ప మెలర్పన్.

7_3_166 వ. మేపి కట్టాయితం బయి మనమూ కలనడుమం బడంతుల పిండు లోనం గ్రాలెడు విలాసియుం బోలె విలసిల్లుచు నమ్మహనీయ రథ్యంబులం బూన్చినఁ బండవమధ్యముం డా రథం బల్లన యెక్కె నా తడవున దుర్యోధనుం డనతి దూరవర్తి యై వారలం గని వేగంబున వచ్చుచుండె వారలక్కడ చూడ రయ్యవసరంబున నచ్చటి భూ వల్లభులెల్ల వెల్ల నైన మొగంబులతోడ వెఱఁగంది డెందంబులు గుందుచుండం దమలో నిట్లనిరి.

7_3_167 మ. చతురంగంబులు నొక్కపెట్ట వివిధాస్త్ర జ్వాలలం గప్పఁగా నతి వేగంబున మ్రింగెఁ గ్రోలె ఘనమాయన్ రూపడంగించె నా నితఁ డన్నింటిని రిత్త వుచ్చుచు మదం బేపార నిమ్మై రణ క్షితియం బీనుఁగు పెంటఁ జేసెఁ జెనయం జిట్టాడఁగా శక్యమే.

7_3_168 సీ. కురసేన పైఁ బడ్డ సరకు సేయక మంచు విరియించు భానుని వెరపు మెఱసి యిది నడు గల నని యించుక గొంకక తన ఘోటకంబులఁ దడవఁ బనిచి కొల నక్కజంబుగ నలుఁగుల మొన ఘటియించి యమ్ముల దాని కిల్లుగట్టి సారథి లీల నశ్వముల కార్యము దీర్చునంతకు నవ్వుచు నవుల నిలిచి

ఆ. గారవమునఁ దాను గాని వాఁడును బోలె నరద మెక్కె నింక నడ్డపడఁగ నలవియె పురారి కైనను వీనిచేఁ జచ్చు వాఁడు గాక సైంధవుండు.

7_3_169 వ. అనుచు నీ యోధ వీరులందఱును బెండువడి యుండిరి గాని యందు నొకండేనియు నక్కున మార్కొను వాఁడు లేఁ డయ్యెనట్లు గోపాల దేవుండును గ్రీడియు బాలక్రీడ విధంబుగా విహరించి యనాయాస గమన విలాసంబు మెఱయం జని చని ప్రొద్ధు వాలుట గనుంగొని పాంచజన్య దేవదత్తంబు లొత్తి రయంబు గైకొని యరిగిరా చక్కటిం గొందఱు నరపతు లొండొరులం బురికొల్పికొని యడ్డపడి తవులు వెట్టి బెట్టు పెనంగి సముద్రంబు సొచ్చిన యేఱులుం బోలె నడంగి రట్లు సైన్యంబు గడచి బలితంపు వల ప్రచ్చికొని వెలువడిన మహా మత్స్యంబులును రాహుముఖంబు వెడలిన చంద్రార్కులుం బోలెఁ బొలిచి యట వోవుచుండ నయ్యెడ సైనికులు సింధు రాజు పని సాలించి తొలఁగి రిత్తెఱంగున దుస్తరంబులగు బహుళ బలంబుల నిస్తిరించి యయ్యిరువురుం దల లెత్తి చూచి తమలో నిట్లనిరి.

7_3_170 ఆ. వీఁడె సైంధవుండు వీని చుట్లను గృప శల్య గురు తనూజ సౌమదత్తి కర్ణ కర్ణసుతులు గావలియున్నారు పోటు మగలు గాన పూఁచి పట్టి.

7_3_171 వ. అని పలికి వారలలో నా జయద్రథుం దప్పక చూచి వెండియు.

7_3_172 క. వీ రేమి గాచెదను తా నే రూపున బ్రదుకు వీర లేల సురలు జం భారియుఁ గాచినఁ దన్నును బారి సమరి కాక నింగిఁ బడనిచ్చెదమే.

7_3_173 క. అను పలుకులు నీ యోధులుఁ దనయులు వినుచుండ ఘోరతర దుర్గము లె ల్లను గడచి లాభదేశము సనఁ జొచ్చిన వణిజులట్లు సమ్మద లీలన్.

7_3_174 వ. ఒప్పిన యప్పురుష సత్తములం గనుంగొని యా రథిక జనంబులు విస్మయంబునం దమలో నిట్లనిరి.

7_3_175 తే. పెక్కు నదులీఁది వెడలుట పేర్చుదావ శిఖలు గడచుట దారుణాశీవిషముల బారి దప్పుట గాదె కుంభజ ముఖోగ్ర శూర యోధుల మిగిలి వచ్చుట దలంప.

7_3_176 వ. అనుచు నా కృష్ణుల నుపలక్షించి.

7_3_177 క. గురుముఖ బహు రథిక శరో త్కరములచే నైన క్రొత్త గంట్లను సు మనో భరిత నవ కర్ణికార స్ఫురితాచల యుగము భంగిఁ బొలిచిరి చూడన్.

7_3_178 క. అని యగ్గించుచు సింధు వి భుని దెస విగతాశు లైరి భూ వల్లభ య వ్వనజాక్షు లెఱ్ఱ సెర లొ ప్ప నతని వీక్షించి యార్చి బరవస మలరన్.

- కవచ ధారణంబున దుర్యోధనుం డర్జునుతోఁ దలపడుట – సం. 7-76-37

7_3_179 వ. కడంగి రంతఁ గురుపతి గూడ వచ్చి కుంభ సంభవ కృతం బగు కవచంబు కతంబున భయందు దక్కి బలంబునకుం దల కడచి తన రథంబు జయద్రథుండున్న దిక్కున కడ్డంబుగాఁ జొచ్చిన నతని సూరెల నున్న వీలరోసంబు ముదంబున సింహ నాదంబులు సేయ శంఖ భేరీ స్వనంబులు సెలంగం దమ తేరికిం గట్టెదు లై నిలిచినం గని కృష్ణుండు గ్రీడి కిట్లనియె.

7_3_180 క. ఆపద ముట్టిన యెడ ని ట్లేపారఁగ వలదె రథికుఁ డీతఁడు శశ్వ త్కోపోద్దీప్తుఁడు మా దెసఁ జాప కళా వేది దర్ప సంపన్నుండున్.