ఆ భా 7 3 121 to 7 3 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_3_121 క. మనమూఁక యొదిఁగి గుంపులు గొని యెప్పటియట్ల యగుడు గురుఁ డతి రభసం బున ధృష్టద్యమ్నుని భీ ముని ధర్మజుఁ బొదివి యుగ్రముగ నేసె నృపా.

7_3_122 వ. అయ్యవసరంబున.

7_3_123 క. ఉభయ బలంబులుఁ బురికొని యిభ తురఁగ స్యందనంబు లిలఁ బ్రోవులుగా సభ యాశ్చర్యాత్మకు లై నభశ్చరులు వొగడ నీ సునం బోరాడెన్.

- ధృష్టద్యుమ్ను ద్రోణాచార్యుల యుద్ధము – సం. 7-72-22

7_3_124 వ. అట్టి సంకుల సమరంబున సుస్థిరోత్సాహుం డై నిజవ్యూహం బభేద్యం బగునట్లుగా శుంభదవష్టంభంబునం బేర్చి కుంభ సంభవుండు ధృష్టద్యమ్ను మిగిలి పాండవ సైన్యంబు దైన్యంబు నొందించుచున్న నప్పాంచాల కుల ప్రదీపకుండు గోపోద్ధీపితుం డయి పారావత వర్ణంబులగు తన రథ్యంబుల నగ్గురు నరుణాశ్వంబులన్ బెరయ నరతంబు వఱపించి పలకయు వాలును గొని సాహసికత్వంబున నతని తేరకడ నొగఁ ద్రొక్కి యెక్కి కాఁడిపయిం జిత్రగతులు మెఱసి తఱ చై తొరఁగు తదీయ శరంబులు నిజ శరీరంబుఁ జోఁకనీ కుండెడు నాలోఁ జేయార్పు రాకుండియుఁ దమకంబునం గృపాణంబు విసరినం దద్రథ తురంగంబుల యంగంబులు నెడవెడ దాఁకు కొలఁది నయ్యాచార్యుండు రయంబున.

7_3_125 తే. అలుఁగు చెక్కలుగాఁ జేసి హఠుల సూతఁ దునిమి సిడమును బలకయుఁ ద్రుంచి వైచి మేను లక్షించి కులిశంబుఁ బోనిదొడ్డ నారసం బేయ సాత్యకి నడుమ నఱకె.

7_3_126 వ. ఉట్లు శినిపుంగవుండు సింగంబు వొదివిన కురంగంబుఁ గాఁచు చందంబున ధృష్టద్యుమ్ను రక్షించి తొలంగం గొనిపోయె ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె.

7_3_127 క. పులివాతికండఁ గొనుగతి నలవునఁ బాంచాల తనయు నయ్యెడరునకుం దొలఁగించిన సాత్యకి పై నలుక వొడమకుండు నెట్టు నాచార్యునకున్.

7_3_128 వ. అనుటయు నమ్మానస పతికి సూతసూనుం డిట్లను నట్లు సేసినం గినిసి గురుండు ఱెక్కలు గల పెనుఁబాము కైవడి సాత్యకిపై గవియుటయు నతండు నిజ సారథి నాలోకించి యివ్విప్రుండు ధర్మతనయ భయంకరుం డితని మార్కొన వలయు నని పలికి తేరు సమ్ముఖంబు సేయించె నిత్తంఱంగున.

7_3_129 క. తలపడి చాపరుచులు మెఱుఁ గులగములుగ గుణ నితాంత ఘోషంబులు గ ర్జలుగా నా రథికోత్తమ జలదయుగము మెఱసి సాంద్ర శర వర్షములన్.

7_3_130 వ. అంతకంతకుం గదిసి భల్లంబుల నేట్లాడం దొడంగిన.

7_3_131 చ. గొడుగులు గేతనంబులును గూలెఁ దనూద్గత రక్తధార లొ క్కెడు గజదాన తోయముల లీల వహించె బలద్వయంబు న ప్పుడు వెఱఁగందె నచ్చెరువుఁ బొందె వియచ్చర కోటి యిట్లు పో రెడునెడ ద్రోణు విల్లు నెస రెండుగ సాత్యకి ద్రుంచెఁ ద్రుంచినన్.

7_3_132 క. గురుఁ డొండొక విల్లెత్తిన సరభసముగ నదియుఁ దునిమె సాత్యకి మఱియుం ద్వరితముగ నెక్కు వెట్టఁగ శరాసనము లెన్ని యేనిఁ జక్కడిచె వడిన్.

7_3_133 వ. అట్టియెడ నాచార్యుం డాత్మగతంబున.

7_3_134 తే. రామునందును గార్తవీర్య క్షితీశు నందు నరునందు భీష్మునియందు దక్కఁ గలుగునే యెందు నీ యస్త్రబలము వీని యాశువిక్రమ మద్భుతం బయ్యెఁ జూడ.

7_3_135 వ. అని యగ్గించెఁ జారణ సిద్ధ సాధ్యులు సంకీర్తనంబులు సేసిరి వెండియు నొండుకోదండంబులు గొని యగ్గురుండు దొరంగించిన శరంబులు శైనేయుండు దుత్తుమురు సేసిన.

7_3_136 క. ఏ వీరున కైనను నిది భావారూఢంబు గాని పనియే యనుచున్ మీ వారెల్లను బెలుచం గైవారము సేసి రతనిఁ గౌరవనాథా.

7_3_137 వ. అప్పలుకులు సహింపక.

7_3_138 శా. ఆగ్నేయాస్త్రము ద్రోణుఁ డేసిన సుద్యజ్జ్వాలికా మాలికో ద్విగ్నం బయ్యె నభంబు వారుణ శరావిర్భావముం జేసెఁ గ్రో ధాగ్ని స్ఫుర్తి వెలుంగ నాశినివరుం డబ్బాణముల్ ద్రాసని ర్మగ్నవ్యోమ చరంబులై తొడరి పోరంబ జొచ్చె నొండొంటితోన్.

7_3_139 క. ఘోరంబు గాఁగ హాహా కారము లెసఁగంగ బలయుగంబును డయ్యం బోరి పెడఁబాసి శాంతము లై రెండును నిలిచె నమ్మహాస్త్రము లధిపా.

7_3_140 వ. ఆ సమయంబున ధర్మజ భీమ నకుల సహదేవులు శైనేయునకు బాసట యై తఱిమిన ధృష్టద్యుమ్ను ప్రముఖ రథిక వరులుం దలకడచి భారద్వాజుం దాఁకుటయు దుశ్శాసను మున్నిడికొని మనదిక్కు రాజ కుమార వర్గంబు వారలతోఁ దలపడిన నుభయ బలంబులుం బురికొని యోహరిసాహరిం బెనంగుచుండె నప్పు డక్కడ.

7_3_141 క. నరుఁడు దనతేరు వోయెడు తెరువునకై నంతసేనఁ దీవ్రాస్త్రములన్ ధరఁ గూల్పఁగ నయ్యెడ న య్యరదముఁ గృష్ణుండు వఱపు టద్భుత మయ్యెన్.

7_3_142 వ. ఇవ్విధంబున రౌద్ర రసంబు దళుకొత్త దర్పంబున సైంధవుం డున్న దిక్కునకుం బోవంబోవ.

- విందానువిందు లర్జునుచేత మృతి బొందుట – సం. 7-74-17

7_3_143 క. విందానువిందు లేక స్యందన గతులై కడంగి సైన్యంబులుఁ దా రుం దెప్పదెరల నాసం క్రందన నందనుని మీఁదఁ గవిసిరి గడిమిన్.

7_3_144 వ. ఇట్లవంతీశ్వరు లురవడించి.

7_3_145 చ. హరుల పయిన్ మురారి పయి నాతని మెనను బాణ వర్షముల్ గురిసి రతండు వారి నతి ఘోర శరంబుల నొంప ధీరతం దెరలక వారుఁ దద్రథము దేల్చిరి తూపుల వెల్లి నల్గి య య్యిరువుర విండులుం దునిమి యేపున మూఁకల పెల్లడంచుచున్.

7_3_146 క. తోడన కడు వేగంబునఁ గ్రీడి తురంగముల సూతుఁ గేతనమును దు న్మాడుచు విందుని తల యిల పై డొల్లఁగ నేసెఁ దీవ్ర భల్ల ప్రహతిన్.

7_3_147 వ. ఇట్లు దల దునుముటయు బలుగానిం గూలు తరువు పోలికం బడిన యగ్రజు నాలోకించి యనువిందుం డలుకయు నమ్మలికంబు నుల్లంబునం బెనంగొన గద గొని సంరంభంబున.

7_3_148 చ. అరదము డిగ్గి తీవ్ర గమనాతిశయంబునఁ గిట్టి బాహు వి స్ఫురణ దలిర్ప దానవనిషూదను ఫాలము వ్రేసి యార్వ ను ద్ధుర రభసం బెలర్ప గదఁ ద్రుంచి పదంబులు బహు శాఖలున్ శిరమును ద్రెంచి వాని బలి సేసె ధనంబజుఁ డాజి భూమికిన్.

7_3_149 ఆ. దొరలు వడిన సేన దులక యవ్వీరుఁ జుట్టుముట్టుటయును బెట్టు గవియు కాఱుచిచ్చు దఱచుఁ గానల నీఱుగఁ జేయు పగిదిఁ దోఁపఁ జేసె నతఁడు.

7_3_150 వ. ఇవ్విధంబున.