ఆ భా 7 3 031 to 7 3 060

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_3_031 వ. అని పలికి యిట్లనియె నా రేపకడ గురుండు సంగరోత్సాహ దీప్తుం డయి వెడలి శంఖంబు పూరించి సైన్యంబులోనం గలయ మెలంగు నప్పుడు మన యోధులాయుధంబు లంకించుచు నొండొరులతోడ బిరుదులు వలుకుచు నిది యేమి యర్జునుండు దడసె గోవిందుండు దఱిమికొన రాఁడు భీమసేనుండు గడంగి పొడసూపం డనుచు సింహనాద శంఖరవజ్యా ఘోషంబులు సెలంగం బొంగుచున్న సమయంబున నా కుంభ సంభవుండు సైంధవుం గనుగొని నీవును భూరిశ్రవుండును గర్ణుండును శల్యుండును నశ్వత్థామయు వృషసేనుండును గృపాచార్యుండునుం గూడుకొని యుండుండు మన బలంబులలో మేలేఱి పదునాలుగు వేలేనుంగులను నఱువది వేలు రథంబులు లక్ష గుఱ్ఱంబులను బదిలక్షలు పదాతులను గైకొనుండు నా తీర్చు మోహంబునకు యోజనత్రయ మాత్ర ప్రదేశంబునం బిఱింది దెస బలసి నిలువుం డట్లైన నిన్ను దేవతలకుం దేఱిచూడ రాదు పాండవు లెంతటి వారనిన విని యతండు పెద్దయు నూఱడిల్లి యా రథిక వరులు పరివేష్టంప నరిగె భరాద్వాజూండును ద్వాదశ గవ్యూతిదీర్ఘంబును బంచగవ్యూతి విస్తృతంబును గా శకట వ్యూహంబు సమకట్టి దానికిఁ బశ్చమార్థంబున గర్భవ్యూహంబుగాఁ బద్మవ్యూహంబు వన్నించి తన్మధ్యంబు మొదలుకొని యోలిన సేనాముఖంబు దెసకుం జాలి నిగుడునట్లుగా సూచీ వ్యూహంబు గావించి సూచీముఖంబునం గృవర్మయు నట పిఱుందం గాంభోజ రాజును మఱియుఁ బిఱుసన నాప్తులైన శత సహస్ర యోధుల మున్నిడికొని కురురాజును సూచీమూల స్థానంబునఁ బూర్వోక్త ప్రకారంబున నా జయద్రథుండును నిలుచునట్లుగా నొనర్చిన నమ్మహా వ్యూహంబు వేడుకం జూచి ఖేచరులు మెచ్చి రట్టియెడ.

- ద్రోణుని నాలవనాఁటి యుద్ధము – సం. 7-63-28

7_3_032 క. మొనలోన నిలువ నొల్లక తన చతురంగములతో నుదగ్రుం డై య ర్జును నాఁగుదు నే నొకఁడన యని దుర్మర్షణుఁడు సనియె నార్పులు నిగుడన్.

7_3_033 వ. చని యయ్యొడ్డనంబునకు వేయు నేనూఱు విండ్లపెట్టు దవ్వున ముందటం బన్నె దుశ్శాసన వికర్ణులు సింధురాజ రక్షణ కార్యార్థులై నిజ బలంబులతో నమ్మెయి నచ్చేరువకుం బోయి సన్నద్ధులైరి ద్రోణాచార్యుం డభేద్యం బగు నా శకట వ్యూహంబు ముఖంబున నిలిచి ధవళ వస్త్రంబులు సితోష్ణీషంబును శ్వేతవర్మంబును నరుణాశ్వంబులును వేదికాధ్వజంబును వెలయ నుద్దండ కోదండుం డై దండధరు కై వడిం బొలిచె నట్లు కుంభ సంభవ సంరక్షితంబయిన యా సైన్యంబు సాగర గిరి గహన సహితంబుగా మహియెల్ల మ్రింగ నప్పళించు నట్లున్నం గనుంగొని కౌరవులును గురుపతియును బ్రముదిత హృదయులై రా సమయంబున.

7_3_034 క. చూపులు మిఱుమిట్లు గొనఁగ నేపారిన వానరేంద్రు నెసకంబున ను ద్దీపిత మగుపడగ భయద రూపంబునఁ గ్రాలఁగా నరుఁడు దోతెంచెన్.

7_3_035 సీ. అమ్మహా వీరున కనతి దూరంబున బిరుదు మూఁకల నడపించి ద్రుపద సూతియు నకులుని సుతుఁడు శతానీకుఁడును మొగ్గరం బమర్చిన మృదంగ శంఖభేరీ ధ్వాన సంగమ మేదుర సింహనాదంబులు సెలఁగ నొప్పె నప్పార్థుఁ డొడ్డరయం బెట్టుకొలఁది నబ్బలము ముందటఁ దేరు నిలిపి యొత్తు

తే. దేవదత్తంబు రవముతోఁ దీవ్ర పాంచ జన్యనినదంబు భూరిని స్వనయుతముగ నిగుడు వానర రావంబు మింగిముట్టె నపుడు మన సేనల బెగ్గల మగ్గలించె.

7_3_036 ఆ. మొరప వానపెల్లు గురసె నుల్కాతతి డొల్లెఁ బడియెఁ బిడుగులెల్ల కడల నస్మదీయ బలమునందుఁ బదంపడి యధిప తూర్య నినద మతిశయిల్లె.

7_3_037 వ. అయ్యవసరంబున నీ యోధు లొండొరులం బిలిచికొని పరికొలిపి కొనుచు సింహనాదంబుల తోడం జెలంగి రంత.

7_3_038 క. చెలియకట్ట సముద్రము నిలిపిన క్రియ నేన పార్థు నిలిపెద ననుచుం దల మిగిలి వెడలె మొనకును బలువిడి దుర్మర్షణుండు పార్థివ ముఖ్యా.

7_3_039 క. కని విజయుఁ డలరి హరి కి ట్లను నేనిక గముల తోడ నడరెడుఁ గడఁకన్ మును దుర్మర్షణుఁ డిదె యిం దు నడపు మరదంబు వీఁడు దొలుముద్ద యగున్.

7_3_040 ఆ. అనిన నట్లు చేసె నతఁ డా ధనంజయుఁ డగ్గజేంద్ర రాజి నస్త్రసమితిఁ బొదివెఁ గారుమొగులు భూధర నికరంబు బహుల వృష్టిఁ గప్పు భంగిఁ దోఁప.

7_3_041 క. ఒక్కఁ డని కడఁగి రథికులు పెక్కండ్రు నిశాత విశిఖ భీమాకృతిఁ బే రుక్కునఁ బొదివిరి నరు నతఁ డెక్కుడు మద మొలఁ జేతి యేడ్తెఱ సూపెన్.

7_3_042 వ. అప్పుడు.

7_3_043 క. పలు తలలు ముఖ వికాసము వొలియక పడియున్న సమర భూభాగము పె ల్లలరిన తామర కొలనిం దలఁపించెన్ గగన చర వితతి పులకింపన్.

7_3_044 తే. తొడవు లొప్పార నెత్తుటఁ దోఁగి పెక్కు గజము లొక్కయెడన పడి కరము వొలిచె జంట మెఱుఁగులతో నెఱ సంజ కెంపు గదురఁ జెలువొందు మొగిళు గమియుఁ బోలె.

7_3_045 వ. ఇట్లు గనుపుకొట్టు కవ్వడికి నోహటింపక నీ సైనికులు పైపయిం గ్రమ్మి వివిధాస్త్ర శస్త్రంబు లతనిపైఁ గురియ నతండు హస్తిహస్తంబుల నశ్వశరీరంబుల రథిక సారథి రథావయవంబులఁ బదాతి గాత్ర ఖండంబులం బ్రథనభూమిం గప్పె నట్టియెడ మఱియును.

7_3_046 క. పార్థుఁడు వేఁడీ పొదువుడుఁ బార్థుఁడ యెట వోయె దింకఁ బార్థుఁడ రావే పార్థుఁడ యిక్కడ నెయ్దుము పార్థునిఁ బట్టుఁ డను నులివు బహుళం బయ్యెన్.

7_3_047 వ. ఇవ్విధంబున సంకుల సమరంబుగాఁ బెక్కులట్ట లాడ నమ్మోహరంబు వోక పెనంగిన.

7_3_048 సీ. అలిగిన గాండీవి యమ్ము లొక్కుమ్మడి ముందటిదెసను బిఱింది వలన వలపట దాపట సెలలు పెక్కవిసిన తెఱఁగునఁ గవిసిన విఱుగు విల్లుఁ దునియు ఖడ్గంబును దొరఁగు నెత్తురు మ్రొగ్గ నేనుంగుఁ బడుకాలు మానిసియును డొల్లు గుఱ్ఱంబును ద్రెళ్లు తేరును గూలు రథికుండు నొఱగు సారథియు నైన

తే. మరలె దుర్మర్షణుఁడు దోన తెరలె సేన యపుడు సమ్మెటకోలల నంకుశములఁ జేఱుకోలల వ్రేటుల నీఱతాఱ యదలుపుల వాహనంబులు సెదరి పఱచె.

7_3_049 క. అనుటయు ధృతరాష్ట్రుం డి ట్లను సూత తనూజు తోడ నప్పుడు నరు మా ర్కొన నెవ్వఁడేనిఁ గలిగెనొ చనిరో యందఱును ద్రోణు జంటుకు భీతిన్.

7_3_050 ఉ. నావుడు నాతఁ డమ్మనుజ నాథున కిట్లను నట్టిచోట దం తావళరాజి మున్నుగ నుదాత్తగుణ స్వనఘంటికా మహా రావము లుల్లసిల్ల సమర ప్రియుఁ బాండవసింహుఁ దాఁకి య స్త్రాళిఁ గప్పె దీప్తముఖుఁడై యువరాజు మహాద్భుతంబుగన్.

7_3_051 వ. ఇట్లు దుశ్శాసనుండు దలపడినం గ్రోధావేశంబునం బెలుచ నవ్వి కవ్వడి దేవదత్తం బొత్తి గండీవజ్యా నినాదంబు రోదసీ కుహరంబున మేదురంబుగాఁ జిత్రంబు లగు రథయాతా యాతంబులనుం బటుబాణ పాతంబులను నగ్గజంబులు వెగడుపడు పంక నిమగ్నంబులుం బోలె నిశ్చేష్టితంబులుగాఁ దదారోహకుల తలలు డొల్లు చప్పుళ్లు మహావాత పతితంబు లగు తాళ ఫలంబుల రవంబ ననుకరింప మఱియును గరవాల గదా ధనుస్సాయక సహితంబు లగు బాహువులు బహు విధ మహా నాగంబుల భంగి రణభూమి నభిరామ ఘోరంబుగా ననేక ప్రకార క్రూర శరంబులు దాఁకి తునియు రూపును రుధిరంబు దొరఁగు రూపును నొఱలు రూపును ద్రుళ్లి కెడయురూపును దూఁగు రూపును బడి పొరలు రూపును నెత్తురు గ్రక్రురూపును జిక్కురూపును రూపు సెడు రూపును నై కరి తురగ నర నికరంబులు వికలంబులుగా విజృంభించిన నతిని సంరంభంబు సైరింపం జాలక సబలంబుగా నయ్యువరాజు వాఱిన వెనుకొని యప్పాండవ మధ్యముండు.

7_3_052 చ. నిలు నిలు మెందుఁ బోఁ గలవు నీ విటు వాఱినఁ జావు దప్పునే యలవుఁ జలంబుఁ బో విడిచి యా సభ నించుక శంక లేక నీ పలికిన యన్నియున్ మఱచి భంగపుఁ జచ్చుట దెచ్చికొంటి పె ద్దలు వగఁ బొంద నన్నకును దమ్ములకుం దలవంపుగా నిసీ.

7_3_053 వ. అని పలుకుచు నీ కొడుకు పెడతలయు వెన్నును బదితూపుల నే పారియేసిన నతండు మరలియుం జూడక ద్రోణాచార్యుం జూచుచుం బాఱె బీభత్సుండును సైంధవుని దెసకు మనసు నిగుడ మనమొన పయి నడచి యగ్ర భాగంబున నున్న యగ్గురుం గనుంగొని యనతి దూరంబున నిలిచి నమస్కరించి కృష్ణుం డనుమతి సేయ జేతులు మొగిచి యిట్లనియె.

- అర్జునుఁడు ద్రోణునిచే ననుజ్ఞాతుఁ డై మొగ్గరంబు సొచ్చుట – సం. 7-66-1

7_3_054 ఉ. మేలు దలంపు శోభనము మేకొని చేయుము నాకుఁ బాండు భూ పాలుని ధర్మనందనుని పంకజనాభుని యట్ల కావె మ త్పాలన వృత్తి కావు నినుఁ బ్రార్థన సేసి భవత్ప్రసాద లీ లాలనితుండ నై మొన దలంకఁగఁ జొచ్చెద భూసురోత్తమా

7_3_055 క. నను నశ్వత్థామను నీ వనఘా సంకూర్మిఁ బెనిచి తట్లగుటను ద్రో హిని సైంధవుఁ జంపఁగఁ బూ నిన నాయుచిత ప్రతిజ్ఞ నెఱపుము కరుణన్.

7_3_056 తే. అనుఁడు బిన్నన వ్వొలయఁగ నస్త్రగురుఁడు నరునిపై జూడ్కి నాటించి నన్ను గెలువ కెట్లు సైంధవుఁ జేరెదం చేసె రథ్య ములును హరియును నతఁడు నమ్ముల మునుంగ.

7_3_057 వ. ఇత్తెఱంగున సేయుటయు నని సేయుటకై యమ్మహాత్మునకు విజ్ఞాపనంబు సేసి.

7_3_058 క. అనుమతుఁ డై విజయుం డా తని మీఁద నిశాత విశిఖతతి వఱపి రయం బున నవనారాచము లే సిన నడుమన నఱకె నతఁడు శీఘ్రత మెఱయన్.

7_3_059 తే. నఱికి తోడన హరిమేను నరుని యొడలు నేయ గురువిల్లు విఱుగంగ నేయఁ దలఁచె నక్కిరీటి యాలోనన యతని మౌర్వి వికలముగఁ జేసె నా ధనుర్వేద విదుఁడు.

7_3_060 క. రహిత గుణచాపుఁ డగున య్యహితాంతకుఁ బొదివెఁ గేశవాశ్వ పతాకా సహితంబుగ రుచిరస్మిత మహితుఁ డగుచు నగ్గురుండు మార్గణ వితతిన్.