ఆ భా 7 2 361 to 7 2 383

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


7_2_361 వ. అనిన నచ్యుతుం డది యట్టిద కాదె యని పలికి తదీయ హితార్థి యై యుపాయంబు విచారించి యుపస్పర్శనం బాచరించి తూర్ప మొగం బై యుండి యవ్విజయు వీక్షించి శూలపాణికిం బరమ సాధనం బైన పాశుపతంబు నీకుం బ్రస్ఫుట పరిజ్ఞానం బయిన నీవు జయద్రథ వధం బవశ్యంబును జేయుదువ మ్మహాస్త్రంబు కలిమి సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగాఁ గ్రొత్త సేసికొనుట మేలు తదర్థంబుగా నద్దేవుఁ జిత్తంబున నిలిపి సభక్తిక ధ్యానంబు సేయు మనవుడుఁ గిరీటియుం గృతాచమనుండును భూసమాసీనుండును నై పరమేశ్వర స్మరణ తత్పరత్వంబున నుండి కృష్ణుండును దానును గగనంబున కెగయుటయు నతండు దనవలచేయి వట్టికొని చనుదేరం దా రిరువురు నుత్తరాభిముఖు లై పోవుటయుం గాంచె నవ్విధంబున వారలు చారణ సిద్ధ గంధర్వ సేవితం బైన పథంబున వివిధ విశేషంబు లాలోకించుచుం బోయి కైలాసంబు గని యందు సరిత్సరోవర సుందరంబును బుష్పలతా భూషితంబును రమ్యతరు సంతాన కాంతంబును నయిన కుబెర విహార స్థానంబు సూచుచుం జని చని దాని కనతి దూరంబున మహనీయ మణిమయం బయి తేజరిల్లు మహా మందిరంబు సొచ్చి యచ్చటఁ బ్రమథ గణ పరివృతుండును బార్వతీ సహితుండును బ్రద్యోతన సహస్ర ప్రభావిభా సమానుండును నప్సరో జన సంగీత మంగళ మహితపురోభాగుండును నై పేరోలగంబున నుండి శోభిల్లు శంకరు దర్శించి సప్రణవోచ్ఛారణంబుగా దండ ప్రణామంబు లాచరించి యున్న నన్నరనారాయణుల దెసం బ్రసాద మందస్మిత సుందర విలోకనంబు లొలయ నయ్యిందుధరుండు మధుస్వరంబున నిట్లనియె.

7_2_362 క. స్వాగత మేమీ యిద్ధఱ యాగమనంబునకు హేతు వగి కోర్కి యను ద్వేగంబున నెఱిఁగింపుఁడు వేగమ యొడఁగూర్తు నెల్ల విధముల దానిన్.

7_2_363 వ. అనినం బ్రీతు చేతస్కు లగుచు నుత్థితు లై లలాటంబుల నంజలి పుటంబులు ఘటించి నిలిచి వాసుదేవార్జునులు దమ చిత్తంబులు భక్తి రసంబున జొత్తిల్లు చుండ.

7_2_364 చ. రవి శశి వహ్ని లోచన సుర ప్రతివీర విమర్ద నక్రమా భువన మయాత్మకా భుజగ భూషణ పోషిత భక్త సంయమి స్తవన కథా వధానపర దర్ప కదర్ప హరీ నిరస్త సం భవ మరణాది వైకృత యపార గుణాగుణ దోష వర్జితా.

7_2_365 క. జగములు గలిగింపఁగ నవి దగు వర్ధన మొంద నిలుపఁ దఱితో వానిం దెగఁ జేయ నీవ నేర్పరి వగుట శ్రుతులు సెప్ప నిర్మలాద్భుత మూర్తీ.

7_2_366 క. ప్రకృతి యనఁ బురుషుఁ డనఁగా వికృతు లనం బరగుచున్న వీనికి నెల్లన్ సకలాత్మక నీ విభవమ యకృతి మాధార భూత మై యుండు శివా.

7_2_367 క. అవ్యక్త మప్రమేయము సువ్యక్త మనాది భక్తి సుగమ మగమ్యం బవ్యయము త్రిలోచన నీ దివ్య మహిమ యాగమోపదేశము రుద్రా.

7_2_368 వ. అని మఱియు ననేక ప్రకారంబుల నవాఙ్మనస గోచరుం డగు నప్పరమేశ్వరుం బ్రస్తుతించి రప్పు డచ్యుతుండు పార్థునిం బాశుపతం బర్థింపు మని కఱపిన నతం డవ్వరంబు వేఁడుటకై విశ్వేశ్వరుం దప్పక చూచి తాను మున్ను ముకుందునందు సమర్పించిన నిశాసమయ పూజాద్రవ్యంబు లగు మాల్యాను లేపనంబు లద్దేవుని దివ్య దేహంబునం గాంచి యచ్చెరువంది యమ్మురహర పురహరుల యేకత్వంబు మనంబునం గొనియాడి దేవా భవదీయ దివ్యాస్త్రంబు దయసేయు మని విన్నవించుటయు భక్తవత్సలుం డగు శక్తినాథుండు గృష్ణు లిరువురును దరహాసంబుతో నవలోకించి.

7_2_369 తే. అమృత మయమగు నుల్ల పద్మాకరమున నాదు బాణాసనంబు బాణములు నున్న యవి దృఢ వ్రతులార మీ రచటి కరిగి వానిఁ దెం డిచ్చటికి నని యాన తిచ్చె.

7_2_370 వ. అట్లనుగ్రహించినఁ జిత్తానువర్తన తత్పరులగు తత్పరిసర వర్తులు గొందఱు దోడ్కొని పోవం బోయి పరమ మునులగు నన్నర నారాయణులు త్రిణయన నిర్దష్టం బైన యద్దివ్య సరస్సు నందు.

7_2_371 క. నాలుకలు గ్రోయుచు విష జ్వాలలు నిగుడంగ నుగ్ర సర్పద్వయ మా భీలాకృతి నుండఁగ బి ట్టాలోకించి జనితాద్భుతాత్మకు లగుచున్.

7_2_372 వ. అవ్విధం బద్ధివ్యాస్త్ర విలాసంబుగా నెఱింగి పాద ప్రక్షాళనోప స్పర్శనంబు లాచరించి యమ్మహోరగంబు కుపస్థానంబు సేసి వేద విదులగు నమ్మహాత్ములు నియతాత్ములై శత రుద్రీయంబు జపియించుచు నప్రమేయ ప్రభావుం డగు భవునిం దమ భావంబులలో నిలిపికొని యుండం దదీయాను భావంబునం జేసి యా దందశూకంబులు ముందటి చందంబు విడిచి విల్లును నమ్మును నై యున్నం జూచి యా సవ్యసాచియు శౌరియు సమ్మదంబునం బొదలి వానిం బుచ్చుకొని వచ్చి శంభు సన్నిధిం బెట్టుటయు.

7_2_373 తే. నీల లోహిత వర్ణుండు బాలుఁ డొక్క బ్రహ్మచారి మహాబల భవ్యమూర్తి హరుని పార్శ్వంబునం దుండి యలిగి యా శ రాసనము వుచ్చికొని శర మరి నమర్చి.

7_2_374 వ. తెగ వాపుటయుం దదీయ స్థానకంబును ముష్టి ప్రకారంబును నేకాగ్ర దృష్టిం గనుంగొను గాండివికి మన్మధ మథనుండు మంత్ర స్వరూపం బను గ్రహించినం బరిగ్రహించి.

7_2_375 క. పురహరుఁ డనుమతి సేయఁగ శరము శరాసనము దివ్య సరసిన యిడి య న్నరుఁడు ననుదెంచి యా శం కరు ముఖ కమలంబు తెలివి గాంచి ముదమునన్.

7_2_376 వ. తనకు నరణ్యంబున నయ్యీశానుం డిచ్చిన వరంబును దత్కాల సందర్శన ప్రకారంబును దలంపించిన నెఱింగి యిప్పశుపతి యతనిపైఁ గరుణార్ద్రంబగు కటాక్ష వీక్షణం బొలయ నది యట్ల కాక దానికి నన్యథాత్వంబు గలదే యనియె నప్పుడప్పాశుపతాస్త్రంబుఁ బ్రస్ఫుటంబుగాఁ బడసిన వాఁడై పార్థుండు పుక పటల పరికలిత దేహుం డగుచుం దనయుత్సాహం బప్రతిహతం బయ్యెనని మనంబున నిశ్చయించెఁ దదనంతరంబ.

7_2_377 తే. భవునిచే సాదరానుజ్ఞ వడసి శౌరి ఫల్గునులు పలుమాఱుఁ దత్పద యుగంబు ఫాలములు సోఁకఁ బ్రణమిల్లి బహుల రోమ హర్ష సంభృత గాత్రులై యరుగు దెంచి.

7_2_378 వ. నిజ శిబిరంబు సొత్తెంచి రవ్విధంబున నర్జునుండు గల గాంచెఁ గృష్ణుండు దారుకుతోడం దగుమాట లాడుచుండఁ దెలతెల వేగె నది యా ధనంజయ స్వప్నాంత సమయం బై సంఘటించె నని యిట్లు సంజయుండు సవ్యసాచి యంతర్వర్తనంబు తెఱంగు ధృతారాష్ట్రున కెఱింగించె ననుటయు.

7_2_379 క. మునినాథ దేవకీ సుతుఁ డును సంక్రందన తనూజుఁడు బూనిన యా పని యెమ్మెయిఁ గడతేఱెనో వినవలతుం దేట పఱుపవే పరిపాటిన్.

7_2_380 వ. అని యడుగుటయును.

7_2_381 చ. లలిత చతుర్ద శాఢ్య కమల ప్రసవ ప్రసర త్సరస్వతీ విలసన సౌరభోద్గమ నివిష్ట మహా మహిమాభిరామ కే వల సుఖతాను భూతిమయ వైభవ సార జగజ్జనిస్థితి ప్రళయ విధాన కేళి పరిపాటి వికస్వర నిత్య భాస్వరా.

7_2_382 క. హృదయ సరసిరుహ మధుపా స్పద విహృతి విశేష నిహత పాపోన్మేషా వదన సముత్థిత వేదా మదవద సురహరణ కరణ మంత్ర వినోదా.

7_2_383 మాలిని. ముని సముదయ హృద్యా మూల విద్యా నవద్యా వినమదమృత వృష్టీ విశ్వలోకైక దృష్టీ మనన సుగమ మూర్తీ మంత్రరూప ప్రకీర్తీ జనిమృతి భిషగాత్మా శశ్వదాహ్లాద వర్త్మా.

గద్యము. ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బూధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీ మహా భారతంబున ద్రోణ పర్వంబునందు ద్వితీయాశ్వాసము.


http://www.volamsite.com