ఆ భా 7 2 301 to 7 2 330

వికీసోర్స్ నుండి


7_2_301 వ. సర్వసైన్యంబులును దైన్యంబు వాసి కయ్యంబుకడంక నుల్లసిల్ల సైనికోత్తముల సింహనాదంబులు సెలంగె నిత్తెరంగున భవత్తనయు శిబిరంబు సముద్యమసుముఖం బయ్యె నంత నక్కడఁ బాండవాగ్రజుండు పాంచాల మాత్స్య పాండ్య యాదవ కేకయాది రాజలోకంబు శోకంబు దగుమాటల మలుఁగం జేసి విడిదలకుం జన నియమించి యనుజుల నచ్యుతునిం బెట్టికొని యున్న యెడ నగ్గోవిందుండు గాండీవి కిట్లనియె.

7_2_302 క. నాతోఁ దలపోయక రో షాతురతం బ్రతిన వట్టి తవనీనాథ వ్రాతంబు వినఁగ నిట్టులు చేతాఁకున డెప్పరంబు సేసితి కంటే.

7_2_303 క. అస్తమయమునకు మును రిపు మస్తకంబ దునుమవలయు మన కిది సాలన్ దుస్తరము నగు దురస్త వ్యస్తం బగు నేని నాకు వగవు గదిరెడున్.

7_2_304 వ. మనవేగుల వారు వచ్చిరి వారు సెప్పిన తెఱంగు వినుము నీవు ప్రతిజ్ఞ సేసినప్పుడు మ్రోసిన చిందంబుల పెల్లునన్ బెదరి యవ్వీటివారు కొడుకు చావునకుం గవ్వడి కోపించి యిప్పుడ యెత్తివచ్చునని రథ కరి తురంగంబుల నాయితంబు సేయుచుండ సైంధవుఁడు దన చారుల చేత నీ యాడిన మాటలు విని వెఱచఱచి కురురాజు కొలువున్న చోటికిం జని సిగ్గఱి నగ్గించి నీ ప్రతిన యెఱింగించి యతం డలిగిన మీరు గావలేరని పలికి తా నెందేనియుం బోయెద ననిన నమ్మనుజపతి గృరు కృతవర్మ కృపవర్మ కర్ణ శల్యాశ్వత్థామ ప్రభృతులగు మేటి మగలం బేర్కొని వీరు నేనును నా తమ్ములును గలుగ నరునకు నిన్ను జుట్టున వ్రేలనుం జూప వచ్చునే యని భయంబు వాపె భారద్వాజుండును మహోత్సాహుండై దురవగాహ వ్యూహ విధానంబున జయద్రథుం జేరకుండ నిన్ను నిలువరించు వాఁ డయ్యె నది యట్టిద వా రొక్కొక్కరుండ గెలువరాని యట్టి జెట్టిజోదు లందఱు నొక్క పనికిం దలకొని నిలిచిన గెలుచుట యశక్యంబు గాదె యిక్కార్యం బార్యులగు నాస్తజనంబులం గూర్చికొని విచారింప వలయు ననవుడు వివ్వచ్చుండు నవ్వుచు నిట్లనియె.

- అర్జునుఁడు కృష్ణునితోఁ దన ప్రతిజ్ఞా విషయంబు లైన వాక్యంబులు సెప్పుట – సం. 7-53-31

7_2_305 క. వారి నెఱుంగుదు నేనును వారలు నన్నెఱుఁగుదురు భవత్సాహాయ్య స్ఫార బలోద్ధతి గలుగఁగ వారే తప్పింపఁ జాలువా రీపూన్కిన్.

7_2_306 వ. ఏను జయద్రథుం జంపుటకుం దమకించి తఱుము నప్పుడు నాకు నెవ్వరడ్డంబు సొచ్చిరేనియు.

7_2_307 మ. పటు నారాచవరంప రాప్రసరదర్పం బేర్పడం బేర్చి త దభట సంఘంబును ఘోటక వ్రజము శుంభత్స్యంద నౌఘంబు ను ద్భట కుంభి ప్రకరంబునుం బొదివి విధ్వంస్తంబు గావించి నె త్తుట జొత్తిల్లెడునట్లు సేయుదు సమిద్భూభాగ మత్యుగ్రతన్.

7_2_308 క. కౌరవ సైన్యంబులఁ గల వీరల యస్త్రములు నాదు వివిధాస్త్రగతి క్రూర ప్రవాహముల కెదు రే రాజీవాక్ష యాదరింపకు వారిన్.

7_2_309 క. వెఱఁగుపడి కుంభభవుఁడుం బెఱ రథికులుఁ జూచుచుండ బీరము లావున్ మెఱయఁ జలము నెఱయఁగఁ దల దఱిఁగెద సైంధవుని నేల తలఁకెదు కృష్ణా.

7_2_310 క. కురుపతి బలముల యేలా చరాచరము లైన భూతజాలము లెల్లం దరతరమ యడ్డపడినం దెరలచి పడవైతు సింధు దేశాధీశున్.

7_2_311 ఆ. గురుని యలవుఁ జలము వెరవును గలఁచి నీ యాన గాండివంబు నాన దివ్య శరము లాన యెల్లి సైంధవు తల యెల్ల భంగిఁ దునిమి వైతుఁ బగఱు దలఁక.

7_2_312 చ. కనియెదు సైంధవుం గడచి క్రందుగ నాకు నెదుర్చు రాజులం దునుమఁగ భూషణోత్కరముతోఁ బహ హస్త శిరంబు లుర్విపైఁ బెనఁగొని చారు భంగియును భీషణరేఖయుఁ దాల్ప నెత్తురున్ నెనడును గ్రోలి భూతములు నిక్కుచు నీల్గుచుఁ జొక్కుచుండఁగన్.

7_2_313 క. అవ్వలి సైనికు లడలఁగ నవ్వుచు మనవార లార్వ నారాయణ న న్నెవ్వరు మార్కొన లేమికి నొవ్వం గురురాజు నేఁ దునుముదును ద్రోహిన్.

7_2_314 తే. సాధనము గాండివం బటె సమర కర్త యర్జునుం డటె సారథి యబ్జనాభుఁ డటె మరల్పఁగ వచ్చునే యా రథంబు హరున కైనను నెఱుఁగక యంటిగాక.

7_2_315 క. పూనఁగ రాదే నా కె ద్దానిం బూనిను నీవు దలకొని తీర్పం గా నునికి గలుగ నే నీ చే నుండఁగ నిట్టు లేల చెప్పెదు చెపుమా.

7_2_316 క. ఈ ప్రతిన యెట్టి తెఱఁగున నప్రతిహత వృత్తి నెగడునట్టి తెఱఁగు లో క ప్రభువ నీవ చేయ న తి ప్రకట పరాక్రమ దీప్తుఁడ నగుదున్.

7_2_317 క. మమ్ము నరయు భరమున నీ విమ్మెయుఁ దలపోసి తింక నిచ్చట నేలా నెమ్మది నిద్రింపంగాఁ బొమ్ము ప్రభాతమున రథముఁ బూన్పఁగ వలయున్.

7_2_318 వ. అని యివ్విథంబున సల్లాపంబులు సేయుచు నరనారాయణు లత్యంత కుపితాంతఃకరణు లగుచుఁ బాములు రోఁజుపోల్కి నిట్టుర్పులు నిగిడించుచున్న నప్పుడు పురందరాది బృందారకులు భయంబు గొని దీన నేమి పుట్టునో యని చింతాక్రాంతు లైరి వారిధులు సంక్షోభించె సరిత్ప్రవాహంబులు ప్రతి గమన వ్యాకులంబు లయ్యెఁ గాననశైల సహితంబుగా మహి సంచలించె మఱియు మాతంగ తురంగ నర నికరంబుల నాళంబులు దెలుపు నుత్పాతంబు లనేకంబులు దోఁచె విశేషించి కౌరవ స్కంధావారంబున దారుణ వాయువులు విషమ గతులం జరించుటయు నుల్కా నిర్ఘాతంబులు నలుగడలం బడుటయుఁ గరిహరినికరంబులు బహుళంబు లగు బాష్ప జలంబులు విడుచుటయు మొదలుగాఁ బెక్కు దుర్నిమిత్తంబులు పుట్టినం బోటు మగలగు భూపతులు లోనుగా నెల్ల జనంబులుం బుల్లవడి యుండి రనవుడు సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె.

7_2_319 తే. అట్లు దమలోనఁ దగుమాట లాడి యాడి కోప రస వేగమునఁ గుంది కుంది వగలఁ బొంది పొంది పురందనందరనుండు నచ్యుతుండు నా రాత్రి యెట్లైరి చెపుమ.

- శ్రీ కృష్ణుండు పుత్ర శోకాతుల యైన సుభద్ర నూఱడించుట – సం. 7-54-11

7_2_320 వ. అని యడిగిన నా సూతసూనుం డంబికా సూనున కి ట్లను నమ్మురారి చిత్తం బారాధించి యర్జునుం డట మున్న యొక్కనాఁడు శిబిరంబునకు సుభద్రయుం బాంచాలియు నుత్తరయును వచ్చి యచ్చటన యునికిం జేసి యచ్చెలువల శోకానలంబు లుడుగు నట్టి మాటలాడ నతనిం బ్రార్థించి పంచిన.

7_2_321 తే. అమ్ముకుందుండు గ్రొత్త యై యడలు దనదు డెంద మలఁపంగఁ జెలియలి మందిరమున కరిగి పురపురఁ బొక్కెఁడు నా సుభద్రఁ గాంచి యిట్లను నెంతయు గారవమున

7_2_322 క. రాచూలికి నుచితం బగు నాచారము గాదె రణమునం దరులఁ దెగం జూచుచుఁ దిరుగని నడపున నేచి యమర లోకమునకు నేఁగుట తరుణీ.

7_2_323 క. నీ కొడుకు తుచ్ఛ మగు నీ లోకంబు దొరంగి పుణ్య లోకమ్మునకుం బోకకు ని ట్లధికం బగు శోకముఁ బొందంగ నగునె సుదతీ నీకున్.

7_2_324 ఆ. బ్రహ్మచర్యమునఁ దపంబున నుత్తమ దానములను బడయఁ దలఁచునట్టి గతులకంటె సౌఖ్యకారిణి యగుగతిఁ బొందె నీ సుతుండు కుంద నేల.

7_2_325 ఉ. క్షత్రియ కాంత పుత్రకునిఁ గాంచుట వాఁ డతిలోక వీరుఁ డై ధాత్రిఁ బ్రసిద్ధి కెక్కుటకుఁ దా నది గాకయు వీరపత్ని నా నీత్రయి నెందునుం బ్రణుతి కెక్కిన నీవు తనూజు బీరమున్ శత్రు వధోత్సవంబు విని సంతస మందక కుందఁ బాడియే.

7_2_326 వ. అట్లుం గాక.

7_2_327 క. కాలం బైనం బోవక యీ లోకము నందు నిలువ నెవ్వరి వశ మి ట్లేల యనవివేక జనముల పోలిక శోకానలమునఁ బొగులుచు నుండన్.

7_2_328 క. తగు మాటలాడి కోడలి వగ పుడువుము నీవు ధైర్యవతి విట్లడలం దగునె నినుఁ జూచి కాదే మగడుం జిత్తముల వగలు మా కందఱకున్.

7_2_329 ఉ. నీ మగఁ డెల్లి సైంధవు ననిం దెగటార్చి శిరంబు దెచ్చినం గోమలి నీదు పాదములకుం దగు పీఠము సేయు మాతఁ డు ద్ధామ భుజా బలాఢ్యుఁ డది దప్పదు వాని ప్రతిజ్ఞ దప్పినన్ భూమి వడంకదే తరణి పొల్పు దలంకదె వార్థి యింకదే.

7_2_330 క. నా పలుకు నమ్ము మర్జునుఁ డా పాపాత్మకుని నెల్లి యనిఁ జంపి ముదం బాపాదించుం గులమున కీ పెంపున కెలమి వొందుఁ డీవును నతఁడున్.


http://www.volamsite.com