ఆ భా 7 2 211 to 7 2 240

వికీసోర్స్ నుండి


7_2_211 సీ. మిఱ్ఱుఁ బల్లంబు నై మెలఁగంగఁ దన రథ ప్రముఖ వాహనములఁ బఱప ననువు గా కున్న మేదినిఁ గడు సమ సమస్థలి గాఁగ వెరపున నొనరించి విశ్రుతముగఁ దనపంరఁ బృథివి నాఁ జనఁ జేసి గోరూప యైన యవ్వసుమతి నమర గణముఁ బనిచి యోషధులును బహు రత్నములుఁ బిదికించి జగంబుఁ బోషించెఁ బృథుఁడు

తే. నేసె నానాధ్వరము లవి సెప్ప నేల సకర ధాత్రియు బ్రాహ్మణ సమితి కిచ్చె నమ్మహాను భావునకును నతుల యశమ కాక సుస్థిర మయ్యె నే కాయ మనఘ.

7_2_212 సీ. బ్రహ్మ విద్వేషంబు పరికించి కోపించి యవిధేయుఁ డైన సహస్ర బాహుఁ బరిమార్చి నృపతులఁ దర మిడి తునుమాడె నిరువది యొక్క మా ఱెల్ల చోట నందఱ యేలెడు నన్ని భూములుఁ దాన యేల ధర్మోజ్జ్వల పాలనమున రాజయోగ్యములు ధరాసురార్హంబులు నగు నధ్వరములు పెక్కాచరించెఁ

ఆ. గశ్యపునకు నిచ్చి కాశ్యపి యనుపేరఁ జనఁగఁ జేసె నుర్వి జామదగ్న్యు వినమె యమ్మహాత్ముఁడును బరితోష వి భ్రాంతి గలిగెనేని బ్రదుక లేఁడు.

7_2_213 చ. నలుమడి నీకు నమ్మనుజ నాయకు లేమిటఁ జూడ వచ్చినం దలఁప భవత్సుతుండు ననుదాత్తుఁడు వారలకంటె నెందునుం గలయది దీని కేల యధికం బగు నెవ్వగ నింత నొవ్వని త్తెలివి మనంబునం జొనుపు ధీరతసారత గూర్పు నేర్పునన్.

7_2_214 వ. అని నారదుండు.

7_2_215 తే. ఆయువును బుణ్యమును జిరశ్రయుఁ జేయఁ జాలుషోడశ రాజన్య చరిత మిట్లు సెప్ప నేర్పడఁగా విని సృంజయుండు పాండవాగ్రజ యేమియుఁ బలుకకుండె.

7_2_216 చ. పలుకక యున్న యుద్ధరణిపాలుఁ గనుంగొని యమ్మునీంద్రుఁ డేఁ దెలియఁగఁ జెప్పినంతయు నతి స్థిర మై భవదీయ బుద్ధి యం దొలసెనొ బూదిలోనఁ గ్రమ మొందఁగ వేల్చిన నేయి వోలె ని ష్ఫల మయి పోయెనో యనుడుఁ బ్రాంజలి యై తగ నాతఁ డిట్లనున్.

7_2_217 తే. పుత్ర శోకాపహంబును బుణ్య తమము నైన యాఖ్యానమున నాదు మానంబు కలఁక యంతయుఁ బాసె నిష్కల్మషుండ నైతి నీ దయఁ జేసి సంయమి వరేణ్య.

7_2_218 వ. అనిన విని యత్తపోధనుండు ప్రీతుం డై నీ కెద్ది వలయు నడుగు మిచ్చెద ననుటయు సృంజయుండును దేవా నీవు ప్రసన్నుండ వగు నంతకంటె మిక్కిలి వలయు నది యెయ్యది భవత్ప్రసాద భాజనంబు లయిన వారికి దుర్లభంబు లగు వస్తువులు గలవే యనుటయు నమ్ముని వరుండు.

7_2_219 క. మ్రచ్చుల మూఢత్వమునం జచ్చి నరక వాసమునకుఁ జనిన తనయు నేఁ దెచ్చెద మగుడఁగ వే నీ కిచ్చెద వగ పుడుగు మింక నేనియు నధిపా.

7_2_220 వ. అని చెప్పిన.

7_2_221 క. దేవముని యిమ్మెయిం దగు దీవన యిచ్చుటయు నరుగుదెంచె సువర్ణ ష్ఠీవి గడు నద్భుతంబుగ నా విభుడు ప్రమోద సంభృతాత్ముం డయ్యెన్.

7_2_222 వ. ఇవ్విధంబున నత్తపస్వి యిచ్చిన యక్కుమారునకు సృంజయుం డస్త్ర శిక్ష గావించి వివాహం బొనరించి యతండు యాగంబులఁ ద్యాగంబుల భోగంబులం దన మనంబునకుఁ బ్రియంబు సేయుచు సంతాన వంతుం డై నెగడిన నతం డత్యంత సంతోషంబునం బొదలె నిట్లా సువర్ణష్ఠీవి యశిక్షితాస్త్రుండును నకృత వివాహుండును నయాగకర్తయు నత్యాగవిదితుండును నభోగ భాగియు నసంతానవంతుండును నగు సమయంబున సమయుట కారణంబుగా నన్నారదుండు గారుణ్యంబునం గ్రమ్మఱ వానిం గలిగించెనది యట్లుండె నవ్వివేషంబు లన్నియు సంపన్నంబు లయి శౌర్యంబున శత్రు ధైర్యంబు దూలించి మేలిమి వడసి నాక లోక సౌఖ్యంబునం బొందిన వాసవ పౌత్రునకు వగచుట వివేకంబు తెరువు గాదు విను మీ లోకంబు దుఃఖ బహుళం బగుటయుఁ దపో దానాద్యనుష్ఠానంబుల మానవులు సురలోకంబు సాధింపం జూచుట సుప్రసిద్ధంబు గాదె నీ వయ్యర్జనున నందనుం డెట్టి పుణ్యపరులకుం బడయ నరిది యగు పదంబున నునికి దెలియుటకును బావనంబు లైన పలువురు భూపతుల వృత్తాతంబులు వినుటకును ఫలం బయున పరిజ్ఞానంబున సమాధాన సుస్థిరుండ వై యుండుము పోయి వచ్చెద నని పలికి పారాశర్యుం డంతర్థానంబు సేయుటయు ధర్మసూనుం డుపశమిత శోకుండయ్యును వివ్వచ్చుండు వచ్చిన వానితో నే మనువాఁడ నను తలంబు పుట్ట నూరకుండె నని సంజయుండు సెప్పుటయు.

7_2_223 తే. అతనితో ధృతరాష్ట్రుఁ డిట్లనియెఁ గ్రీడి సంగరమున సంశప్తక సమితి నేమి సేసె సుతువార్త యెవ్వరు సెప్పి రాతఁ డట్లు దెగుట యెఱింగె యెట్లయ్యెఁ జెపుమ.

7_2_224 క. అనిన విని సూతసుతుఁ డి ట్లనుఁ బేరడవులు దహించుననలము చందం బున సంశప్తక సేనల ననిమిషపతి సుతుఁడు దీవ్రుఁ డై పొరి పుచ్చెన్.

- అర్జునుఁడు శిబిరంబునకు వచ్చునెడ దుర్నిమిత్తంబులం గని కృష్ణునితోఁ జెప్పుట – సం. 7-50-1

7_2_225 వ. అట్లు మర్దించి మగుడు నప్పుడు మాధవు నాలోకించి.

7_2_226 చ. కలయఁగ దుర్నిమిత్తములు గానఁగ నయ్యె మదీయ చిత్తముం గలఁగెడు మేమ మ్రానుపడఁగాఁ దొడఁగెన్ గురుఁ డారయంగఁ గే వలుఁడె నృపాలుఁ డే దెసకు వచ్చెనో యన్న నతండు రాజుఁ ద మ్ములు సుఖు లొండుమై నశుభముం గల దిప్పు డెఱుంగ నయ్యెడున్.

7_2_227 వ. అని పలికెఁ దదనంతరంబ యద్దామోదర ధనంజయులు సంధ్యా సముచిత కరణీయంబు లాచరించి యరుగుదెంచి నిజ శిబిరంబు సొత్తెంచి రది చిట్లిన చిత్ర రూపంబులు గల కుడ్యంబునుం బోలె వివర్ణాకారు లైన జనుల వలనం బాడఱి యున్నం దత్ప్రకారంబును సంధించి యన్నరుండు నారాయణున కిట్లనియె.

7_2_228 క. సైనికులు నన్నుఁ గనుగొని యాననములు వాంచి తొలఁగి యరిగెద రది యే మో నేఁడు వేణువీణా గాన స్వనములును వీటఁ గలుగవు కృష్ణా.

7_2_229 క. ఈ మేలు ప్రజ కొనర్చిన యా మహిమకు నెలవు గొంతి యగ్రతనయుఁ డో భీముఁ డొకొ తమ్ముఁగుఱ్ఱలో కో మఱి యెవ్వరొకొ తలఁపు గొలఁదికి మీఱెన్.

7_2_230 ఆ. అలరు మొగము తోడ నభిమన్యుఁ డేలకో యెదురు రాఁడు నాకు నెట్టి వార్త చెవులు సోఁకు నొక్కొ చే వెట్టి కలఁచిన భంగిఁ ద్రిప్పుకొనఁ దొడంగె మనము.

7_2_231 క. పలు మాటల కిటు మఱు మా టలు పలుకని కృష్ణుతో నడలు మది మొలవం బలుకుచు ధర్మసుతుని విడి దల కరిగెను మోము వెల్లఁ దనమునఁ గదురన్.

7_2_232 వ. ఇవ్విధంబున నరిగి యన్నరపతి బంధు మిత్త్రులును మాన్య రాజన్యులుం దానును నొక్కయెడ నున్నం దత్ప్రదేశంబునకుం గేశవుండును దోడన చనం జని వారుమ్మలించి యునికియు వారలలోన సుభద్రాసూనుండు లేమియు జూచి సవ్యసాచి యడుగులు దొట్రు పడ నక్కొలువు లోనికిం బోయి కలయం గనుంగొని యెలుంగు రాల్పడ నిట్లనియె.

7_2_233 క. ఆననములు వెలువెల్లం గా నడ లొదవినది మీకుఁ గానఁ దడవ మీ లో నభిమన్యుఁడు లేఁ డే మో నాకుం జెప్పుఁ డేల యూరక యుండన్.

7_2_234 క. ధనురాజార్యుండు దగఁ బ నిన్న పద్మవ్యూహ మొరులు నేరరు చొరు మం చనుమానింప కతనిఁ జొరు మనరు గాదా మీ యుపాయ మాఱడిఁ బోవన్.

7_2_235 ఉ. అమ్మొన సొచ్చుచొప్పు దెలియన్ వినె నంతియ కాని యిమ్ములం గ్రమ్మఱు భంగి వాఁడు విన గానఁడు దీని నెఱుంగకున్నిఁ బా వమ్మునఁ బోలు మీరు సొరఁ బంచిన నుక్కున జొచ్చి యోధ బృం దమ్ముల చేత మ్రగ్గఁడు గదా కురు వీరులు సట్టు ముట్టినన్.

7_2_236 మ. హరి మేనల్లుఁడు గొంతి కూర్చుమనుమం డస్మత్తనూజుండు సం గర కేళీ నిపుణుండు దివ్య శర శిక్షా శాలి యవ్వీరు నె వ్వరొకో నేలకుఁ దెచ్చి రొక్కరునిచే వాఁ డేల చిక్కుం బొరిం బొరిఁ బెక్కండ్రురు విచ్చుచుం బొదువుచుం బోరాట గల్గెం జుమీ.

7_2_237 క. గురువులకు భక్తుఁ డుదారుఁడు గరుణ గలఁడు శౌర్య ధైర్య గాంభీర్య ధురం ధరుఁడు మొగమోడు నా సుర వర పౌత్రుడు లేమి కోర్వవచ్చునె చెపుఁడా.

7_2_238 క. అన్నగు మోమును నత్తెలి గన్నులు నవ్వెడఁదయురముఁ గన్నారంగాఁ గన్నను బ్రదుకుదుఁ గానక యున్నను బ్రాణంబు లెట్టు లుండఁగ నేర్చున్.

7_2_239 సీ. హంగ తూలిక పాన్పు నందుఁ బొందెడు మేను కఠినంపు నేలతోఁ గదిసె నేఁడు గొడుగుల నీడ పై నడరఁ జెన్నగు మోము పొరిఁ బర్వు పెదూళి బ్రుంగె నేఁడు లలనలు లీలమైఁ గొలువ నుండెడు భోగి వఱళులలో నున్న వాఁడు నేఁడు నానా జనములకు నాథుఁ డై శోభిల్లు దొర యనాథత్వంబు బొరసె నేఁడు

ఆ. వినయరతుఁడు హృదయవిదుఁడు సుభద్ర గా రాబుపట్టి మగలరాజు మాన ధనుఁడు దివిజరాజు మనుమఁడు నా చెలి కాఁడు ముద్దులాఁడు లేఁడు నేఁడు.

7_2_240 ఉ. అక్కట మందభాగ్యునకు నట్టి తనూభవరత్న మెవ్విధిన్ డక్కు విధాత నిర్దయుఁ డొడంబడునే కడు మేలి వస్తువుల్ పెక్కుదినంబు లున్కి యరి బృందము పిల్చినఁ బోటు బంట నై యక్కడ కేల పోయితి మహాగుణ భూషణుఁ గోలు పోయితిన్.


http://www.volamsite.com