ఆ భా 7 2 121 to 7 2 150

వికీసోర్స్ నుండి


- అభిమన్యు దుశ్శాసన సుతు లిరువురుఁ జచ్చుట – సం. 7-48-8

7_2_121 తే. ఇవ్విధంబునఁ గదిసి నరేంద్ర ముఖ్య నీదు మనుమలు సూపరనెమ్మనముల కద్భుతంబును శోకంబు నావహిల్ల లావు వెరవును మెఱయఁ జలంబు నెఱయ.

7_2_122 ఉ. ఒండొరు మీఱు కోపమున నుగ్రతఁ బోరి రుదగ్రులై గదల్ మండఁగ నెత్తురుల్ సెదర మాంసము పిండిగ నెంప నుగ్గు లొం డొండ ధంత్రిపైఁ దొరల నొప్పెడు మేనులు వ్రాల వానిలో నుండక ప్రాణముల్ వెడలె నుబ్బునఁ గ్రాలఁగ దేవకామినున్.

7_2_123 వ. ఇత్తెఱంగున.

7_2_124 చ. వనగజ మంబుజాకర మవారణఁ జొచ్చి కలంచి యాడఁగా మనమునఁ గొంకు లేక కృప మాలినబోయలు ముట్టి చంపు చా డ్పున భవదీయ సేన పొరిపుచ్చఁగఁ జుట్టును ముట్టి పార్థనం దను నలయించి నిర్దయ విధంబునఁ జంపి రనేక సైనికుల్.

7_2_125 వ. అట్టియెడ.

7_2_126 సీ. జగము లన్నియును దేజంబున వెలిఁగించి యపరాద్రి సేరితవను మాడ్కిఁ దఱ చైనకానలు దరికొని నీఱుగాఁ జేసి యాఱినదవశిఖి విధమున గగనంబుతో రాయు కరడులు గల జలం బివురఁ బాఱిన మహార్ణవము కరణి నున్నత గతి సెడి యుర్విపైఁ గడువిన్న నై పడియున్న సుధాంశు భంగి

తే. బీరమునఁ దమవారికిఁ బెం పొనర్చి యరుల సమయించి వస మఱి యనువు దప్పి తెగియుఁ జుడ్కికిఁ జాలవ్రే గగుచుఁ బొలిచె మహితమూర్తి శోభితుఁ డభిమన్యుఁ డధిప.

7_2_127 ఉ. నెత్తుటఁ దోఁగి నేల యెఱనింగి తెఱంగున నుండె నక్కుమా రోత్తముఁ డందుఁ జంద్రుక్రియ నొప్పె సితాయుధ ఖండ భూషణో దాత్త మణి ప్రతానములు తారల చందము నొంది యంద మై యత్తఱి నుల్లసిల్లె వసుధాధిప చూపఱపిండు చూడ్కికిన్.

7_2_128 సీ. కరి కళేబరములు ధరణీ ధరములు దురంగ గాత్రమ్ములు గ్రాహసమితి నర శరీరములు మీనములు గౌక్షేయ కక్షురికాది శస్త్రంబు లురగకులము రుధిరార్ద్ర శరములు రుచిర ప్రవాళముల్ ప్రేవుల ప్రోవులు ఫేన తతులు నెత్తురు వెల్లువ నీళులు భూషణస్తోమా స్థిచయము తుమురు లిసుక

ఆ. గాఁగ నంబురాశి కరణి సంగ్రామ భూ భాగ మొప్పు మిగుల భవ్యయోగ నిద్ర నున్ను విష్ణునికిఁ బాటి యగుచు శో భిల్లె నమ్మురారి యల్లుఁ డందు.

7_2_129 వ. అబ్బాలుండు.

7_2_130 తే. మహిత లావణ్యమును సుకుమార మైన యంగమును బూర్ణచంద్రుని భాననంబుఁ గ్రొత్త పెంపుగ నెంతయుఁ గొమరు మిగిలి చెన్నుఁ దలకట్టు నై పడియున్నఁ జూచి.

7_2_131 క. నీ సైనికు లెంతయుఁ సం తోసిల్లుచు నార్చి రపుడు దుఃఖితు లై కుం తీ సుతుల వారు దీన ద శా సంగతు లైరి బాష్పజలములు దొరఁగన్.

7_2_132 క. నెఱి దప్పంబడి పెల్లుగ నొఱలెడి నరవాజికరుల యులి నభిమన్యుం డఱిముఱిఁ బడుటకు వగ మదిఁ బఱిగొన నిల పెలుచ నఱచు భంగిఁ జెలంగెన్.

7_2_133 వ. ఆ సమయంబున.

7_2_134 క. పెక్కండ్రు గూడి యిట్ల యి నొక్కనిఁ జంపుట యధర మోహో యని న ల్దిక్కులను బెద్ద యెలుఁగు నక్కజముగ భూత సంచయంబులు వలికెన్.

7_2_135 వ. ఇట్లు శౌర్యసార సంపాదిత రౌద్రుం డైన సౌభద్రుండు వడుటయు వారి బలంబులు ఱిచ్చవడి భండనంబు దక్కి తలరిన ధర్మపుత్రుండు ప్రబల యోధవీర లోకంబు నాలోకించి యిట్లనియె.

7_2_136 సీ. మార్బలంబులు సొచ్చి మాతంగములఁ గూల్చి రథరాజిఁ గలఁచి తురంగమములఁ ద్రుంచి పదాతులం దునుమాడి పెక్కండ్రు సైనికు ప్రవరుల సమయఁ జూచి మూఁకల విరియించి వీఁక నాచార్యాది యోధుల నెల్లను నొక్క దెసకు వెలిచి వియచ్చరుల్ వినుతింప నాకంబు చూఱ గొన్నట్టి యర్జున తనూజుఁ

ఆ. జూచి మనకు నేల శోకింప వైరు ల గం డడంచి గెలుపు గంద ముచిత భంగిఁ బ్రొద్దుకొలఁది పరికించి మన సైన్య ముల మరల్త మెలమి దలకొనంగ.

7_2_137 వ. అని పలికి బరవసంబు సేసి సేనలం బురికొల్పికొని యవష్టంభ విజృంభితుండయు నిలిచెఁ బదంబడి యరుణ కిరణుం డపర మహీధరంబు మౌళికి సరసీరుహ శేఖరం బై చెలువారం దదనంతరంబ రిత్తచోట్లును నెత్తుటన్ జొత్తిల్లుచున్నట్లుండెఁ బిండుగట్టి పిశాచ నిశాచరులు నలిరేఁగి రక్తపానంబును మాంస ఖాదనంబునుం జేయుచు మోదంబునం బొందుచు నాడుచుం బాడుచుండు కలకలంబునను గుణపభక్షణవ్యగ్రవిహంగ సముదయతుములంబునను బలలఖాదన సంరంభ శివానివహ కోలాహలంబునను బరమాఖీలం బైన సంధ్యా కాలంబ నిరూపించి నిజ శిబిరంబులకు నుభయ బలంబులుం బోయె నప్పుడు నీ కొడుకు లుబ్బునం గొమర మిగిలి యరిగిరి కౌంతేయులు చిన్నఁ బోయిన యాననంబులతో శోక సంతప్తచిత్తులయి చని రివ్విథంబున ధర్మతనయుండు దన నికేతనంబున కరిగి యచట నిఖిల పరిజనంబులుం దానును సన్నాహంబు లెడరించి శూన్యాకారులై యున్న సమయంబునం దమ్ముని దెస కూరిమి నారం గూరిన వగపెంపున ధైర్యంబు పొంపఱి వివర్ణ వదనుం డగుచు నిట్లనియె.

- అభిమన్యుని మరణమునకు ధర్మరాజు దుఃఖించుట – సం. 7-49-1

7_2_138 మ. గురుశారద్వత ముఖ్య యోధవర సంగుప్తంబు నిర్భేద్య ము ద్ధుర మా సైన్యము దానిఁ జొచ్చి ననుఁ బ్రీతుం జేయఁగాఁ బూని యొ క్కరుఁడును గోవులలోనఁ జొచ్చు బలుసింగం బొక్కొ నా నట్లు సొ చ్చి రయం బార ననేక వీర శిరముల్ చెండాడె నుద్ధండుఁ డై.

7_2_139 క. ఈసులు రోసముఁ గల దు శ్శాసను నొప్పించి పఱపి చతురంగములన్ గాసిలఁ జేయుచు న ట్లు ల్లాసముతో మెలఁగ గాఁ దలంచె యొరులకున్.

7_2_140 తే. కొడుకుఁ బొడగాన కర్జునుఁ డడిగెనేని వానితో నింక నేమను వాఁడ హరికి నతని గారాబు చెలియలి కధిక దుఃఖ మేన చేసితి వగవంగ నేమి గలదు.

7_2_141 క. బాలుఁడు సుకుమారుఁడు పె క్కాలములం జొచ్చి యెఱుఁగఁ డనక మొన సొరం జాలదు చొరు మని పనిచితి నేలా న న్నాస దోస మెఱుఁగఁగ నిచ్చున్.

7_2_142 క. కుడువను గట్ట బూయను దొడువను బోఁ బనిచి తొలుత మొన సొరం గొడుకుం బనుచుట కెవ్వఁడుఁ గడఁగునె నా యట్టి పాప కర్ముఁడు దక్కన్.

7_2_143 తే. వానితోడిద లోక మై యేను బోవ నైతిఁ బోఁ గన్నఁ బుత్ర శోకాతురత్వ మున నితాంత వివర్ణతఁ బొందుచుండఁ జూడ కుండెడివాఁడ నర్జును మొగంబు.

7_2_144 ఉ. వాసవునంత వానికిని వచ్చిన యాపద దీర్చుఁ గాలకే యాసురు లట్టి బల్పగఱ నైనను వ్రేల్మిడిఁ ద్రుంచు నాజి న వ్వాసవియాద్మజుండు పగవరలచే హతుఁ డైన దుర్దశం జేసి యలంతఁ జేడ్పడఁగఁ జేసె విధాతృని నేమి సెప్పుదున్.

7_2_145 చ. కొడుకు వధించి రన్నఁ గురుకోటికి నెట్టన యల్గి రూపు మా పెడును కడంగి పార్థుఁ డెదఁ బేర్చిన శోకము నార్పఁ జాలునే పుడమి ధనంబు నాకము విభూతియుఁ జేరెన యేని నల్ల న వ్వెడు నభిమన్యు నెమ్మొగము వే యగుపాలును జోల నేర్చునే.

7_2_146 వ. అని మఱియు ననేక ప్రరాకంబులం బలవించుచున్న సమయమునం గృష్ణద్వైపాయన మునీంద్రుం డయ్యెడకు విజయం చేయుటయు నవ్విభుండు ప్రత్యుత్థానంబు సేసి దండ ప్రణామం బాచరించి యాసన విన్యాసన ప్రముఖ పూజా విశేషంబుల నారాధించి యమ్మహాత్మునితో నిట్లనియె.

7_2_147 సీ. పరసేన భేదింపఁ బనిచితి నేను సౌభద్రుని వాఁడు నబ్బలము సొచ్చె వెనుక నేమును జొచ్చి చనఁగ సైంధవుఁడు మమ్మాఁగినఁ దోడ్పడ ననువు దప్పె నప్పుడు పెక్కండ్రుం రప్పాడి నవ్వీరుఁ బొదివిన నాఱఁడి బోయె నట్లు సుకుమార మూర్తిఁ బుత్రునకు నొంటిమైఁ బిన్న పాపని నలుఁగుల పాలు పడఁగఁ

ఆ. బనిచి తాను బ్రతుకు పాపాత్ముఁ డెందును గలఁడె విపుల శోక జలధి మునిఁగి పేర్చుతల్లడమున బిమ్మిట కొనియెడుఁ జిత్త మింక నేమి సేయువాఁడ.

7_2_148 వ. అని విని మునీశ్వరుం డమ్మనుజేశ్వరున కిట్లనియె.

7_2_149 చ. పలువురు రాజులం దునిమె బల్లిదుఁ డాతఁడు పిన్నపాపఁ డే యలుఁగుల పాలు సేయ కభియాతులు పువ్వులకోల సాఁతు రే కలఁగుదు రే విపద్దశల కాఱియ నార్యులు సావు లింత విం తలె గరుడోరగ ద్యుచర దానవ కోటుల చావుఁ జూడమే.

7_2_150 క. ఎప్పాట నెవ్వరికి విధి దప్పింప వశంబె ధైర్య ధన ఘనుఁడవు నీ విప్పరుసున నడలుట గడు నొప్పదు శమియింప వలయు నుర్వీనాథా.


http://www.volamsite.com