ఆ భా 7 2 091 to 7 2 120

వికీసోర్స్ నుండి


7_2_091 తే. మిడుక మిడుక నిత్తెఱంగునఁ గొడుకుఁ దునిమి యక్కుమారుండు మెఱయుట నడలుఁ గనలుఁ గడలుకొను మదితోడ నీ కొడుకు వీని నొంపుఁ డందఱుఁ బైపడి చంపుఁ డనుడు.

7_2_092 క. కృతవర్మయుఁ గృపుఁడు గురుఁడు నతని సుతుఁడుఁ గర్ణుఁడును బృహద్బలుఁడును భా సిత శరములు గురుయుచు న చ్యుతనల్లునిఁ బొదివి రొక్కయుమ్మడిఁ బెలుచన్.

7_2_093 క. అతఁ డందఱ విశిఖంబులు వితథమ్ములు నేసి వారి వెగడు పఱిచి యు ద్ధతి సైఁధవు పోరెడు నెడ కతిరయమునఁ దేరు నడపు నా సమయమునన్.

7_2_094 వ. నిషాదులు గళింగులు గజ బృందంబులతో నడ్డపడిన నయ్యతిరథసింహుండు దరువాయి గొని తునుమాడ నెప్పటి యోధవీరు లెయిది పెక్కాఁబోతు లొక్కపులిం జుచట్టుముట్టిన చందంబునం బొదివి పెనంగ నా జయద్రథుండును బాండవ బలంబులం ద్రోచి రానీక రభసాతిశయ ఘోరంబుగాఁ బోరు చుండె నక్కుమారుండు గురుం బంచాశద్బాణంబులను గృతవర్మ నశీతిసాయకంబులను గురుతనయు దశ విశిఖంబులను గర్ణు నొక్క బలనారసంబునను స్రుక్కించి కృపుని విరథుం జేసి బృహద్బలుమేన ముప్పది నారసంబులు నాటించి వారలకు బాసట యయి కదిసిన సైనికులం బెక్కుతెఱంగుల తూపులఁ జిక్కు వఱిచి యుక్కునం గ్రోధపుత్ర బృందారకు లను రాజులను రూపడంచె నప్పుడు శారద్వతుండు దే రాయితంబు సేసికొని కడంగి తోడి యేవురం గూడుకొని యా క్రీడి కొడుకు మీఁద మార్గణ పరంపరలు వరగింపం బెరిఁగిన దర్పంబునం గసిమసంగి యతండు నొప్పించిన బెఱవారు బీఱువోవ బృహద్బలుండు బిట్టు గవిని నిశిత శరంబులు నిగిడించిన నన్నర నందనుండు.

7_2_095 ఉ. చాపముఁ గేతువుం దునిమి సారథి నశ్వములన్ వధించుడు గోప మెలర్ప ఖేటకముఁ గ్రూర కృపాణముఁ గొంచుఁ దేరు సా టోపత డిగ్గి వే కవియుడుం బటుభల్లహతిం గృతాంత సే వాసరుఁ జేసె హృత్పుటము వ్రచ్చి బృహద్బలు భూరిదోర్బలున్.

7_2_096 వ. ఇట్లింద్ర పౌత్రుండు గోసలేంద్రునిం దెగఁ జూచినఁ జూచి యేచి తదీయ బంధుభూపతు లొక్కమొగి నురవడించిన నతండు వారలయేపు మాసి కర్ణుండు డాసినం గర్ణోపాంతంబు గర్ణికానారాచంబుల నొప్పించె నయ్యిరువును నొండొరుల మేనులు నెత్తురుల జొత్తిల్లం జేసిన సంధ్యాసమయ సూర్యబింబ ప్రతిబింబంబులుం బోలెఁ బొలిచి రా సమయంబున సూత నందను నాయకు లార్వురు గర్వంబులఁ దన్నుం గదిసినం గవ్వడికొడుకు చిత్రవధ విహారంబు సలుపునప్పుడు కుంభ సంభవ ప్రభృతి రథిక వరుల శరంబులు మగిడించుచు వారిపైఁ దూపులు నిగిడించు చునికి యద్భుతం బయ్యె నట్టియెడ.

7_2_097 తే. మగధపతి సూనుఁ డైన యశ్మంతకుండు బాలుఁ డయ్యును బ్రౌధదోర్బలము మెఱయఁ దాఁకుటయు సూతులయు రథ్యముల తలలు నతని తల తోన యభిమన్యుఁ డవనిఁ గూల్చె.

7_2_098 వ. ఇట్లు పూర్వ వైరంబు దలంచి తలపడిన మాగధ కుమారు నవలీల నేలం గలిపి సింహనాదంబు సేసినం దత్సంరంభంబు సైరింపం జాలక దుశ్శాసన సూనుండు సరభసంబుగాఁ గవిని ఘోటకంబుల నంబక చతుష్టయంబునను సారథి నొక్కనారసంబుననుం దదీయతనువు పదిబాణంబులను బెలుచ నొప్పించినం జంచదరుణ కమల చారు విలోచనుం డగుచు సౌభద్రుం డతనిఁ బ్రదీప్త సప్త నారాచనిపాత పీడితుం జేసి డగ్గఱి.

7_2_099 ఉ. ఇంతకు మున్న నీ జనకుఁ డెంతయు నోటఱి పాఱె నీవె నా పొంతకు వచ్చి తింక నెట వో నగు నం చొక దొడ్డ నారసం బెంతయు బెట్టిదంపు వడి నేయుడు ద్రోణ సుతుండు దాని నిం తింతలు సెక్క లై యిలపయిం దొరఁగన్ వెస నేసె నేసినన్.

7_2_100 తే. అతని దిక్కును జూడక యతఁడు రయము మెఱయ నీ పౌత్రు చాపంబు నఱికి సుతుఁ గూల్చి యాఱమ్ము లురమున గ్రుచ్చుటయును వొండు దేరిపై కబ్బాలుఁ డుఱికె నధిప.

7_2_101 వ. అంత నపరాహ్ణం బయ్యె నా సమయంబున శత్రుంజయుండును జంద్రకేతుండును సువర్చసుండును సూర్యభానుండును మేఘవేగుండును మొత్తబై తాఁకిన ధనంజయ తనయుండు మేటి మగలగు నమ్మహీశుల మేనులు నానాస్త్రంబుల ననేక ఖండంబులు గావించి గాంధారపతి సేరినం గ్రూర నారాచజాలంబుల జర్జరిత శరీరుం జేసి దుర్యోధను దెసకు నడరుటయు నంగపతి యాచార్యున కిట్లనియె.

7_2_102 క. కండగతి వీర రథికులఁ జెండుచు నేతెంచి రాజుఁ జేరెడు సౌభ ధ్రుం డిట్టులు నీ కూరక యుండ నగునె ప్రతి విధాన మొనరింపు తగన్.

7_2_103 క. అని పలికి పతికి నడ్డము సనుటయు గురుఁ డచటి యోధ చయముం గలయం గనుఁగొని యభిమన్యుఁడు నర్జునుఁడును నని నొక్కరూప చుండీ తలఁపన్.

7_2_104 వ. చూడం చిన్నవాఁడు గాని యలంతులం బోయెడి వాఁడు గాఁడు మనమందఱముం గూడికొని యొక్కపెట్ట యక్కుమారుపై నురవడింప వలయునని పురికొలిపి బరవసంబు నేసె నప్పు డప్పాండు పౌత్రుం బాణంబులం బీడితుం డై సూతపుత్రుండు గుంభ సంభవు నాలోకించి నాదెస సూడుము వీఁడు నొప్పించె నిలువం దగునెల వగుట నసము డింపక యీల గఱచుకొని యున్నవాఁడ గండీవిఁ గలనం గలసి యెఱుంగుదును కాదె యతనిచే యింతబెట్టిదంబు గా దని చెప్పిన విని యల్లన నగి యతం డతని కిట్లనియె.

7_2_105 సీ. కవచ ధారణమను ఘన విద్య గవ్వడి కే నెఱింగించితి నితఁడు దాని నేర్చుట నీతని నెట్టన నొప్పింప శక్యంబు గాదు వంచన గుణంబు నఱకంగఁ జాపంబు విఱుగ నేయగ ఘటకములఁ జంపఁగ సూతు సమయఁ జేయ నగుఁ జాలు దేని నీ వట్లు సేయుము జేత ధనువుండ నవ్వీరుఁ జెనయ వశమె

ఆ. దేవతలకు నైనఁ గావున నొక్క మై విల్లు ద్రుంచి తఱిమి విరథుం జేసి చూచికొంద మలవు చొప్పునఁ దెగనె యీ రథిక వరున పటు పరాక్రమమంబు.

- కర్ణుఁడు మొదలగు యోధులు వంచనచే నభిమన్యుని విరథుం జేయుట – సం. 7-47-31

7_2_106 చ. అన విని సూతసూనుఁడు భయం బెదఁ గూరిన వాఁడ పోలె నై వెనుక కొదింగి యా రథిక వీరు పిఱందికిఁ జుట్టి వచ్చి వం చనకు సహాయు లై యచటి సైనికు లన్నరపుత్రు బిట్టు మా ర్కొని పెనఁగంగఁ జేరి యలఘ ప్రదరంబున విల్లు ద్రుంచినన్.

7_2_107 వ. ఆలోన.

7_2_108 క. గురు డశ్వంబులఁ గుల్చెను సరభసముగఁ గృపుఁడు సంపె సారథి నిమ్మై నరసుతుఁ డనాయుధుండును విరథుండును నగుట సూచి వెఱపేదిమనిన్.

7_2_109 క. శకుని కృతవర్మ శల బా హ్లిక గురు సుతు లాదిగా ననేకులు లడరి య స్త్రకలాపంబుల శస్త్ర ప్రకరంబుల నొంచి చిక్కువఱచి యలఁచినన్.

7_2_110 క. వాలును బలకయుఁ గొని య బ్బాలుఁడు రయమార గగన భాగంబున కు న్మీలిత ధృతిసారుం డై లీల నెగసి పోయె మండలీభూతగతిన్.

7_2_111 క. తన విద్య కలిమి వినతా తనయుని భంగిం జరింపఁ దమతమ పైఁ దెం పున నుఱుకు నను తలంపున మన యోధులు భయము గొనిరి మనుజాధీశా.

7_2_112 చ. ఎడగని వాలు భల్లమున నేసె వెసం దునియంగఁ ద్రోణుఁ డ ప్పుడు శకలంబు లై పలక భూమి పయిం దొరఁగంగఁ జేసె నె క్కుడువడిఁ గర్ణుఁ డాశిశు వకుంఠగతిం దన తేరి మీఁద నొ ప్పెడు ఘన చక్రముం గొని యుపేంద్రుని లీల నటించు చాడ్పునన్.

7_2_113 వ. సంరంభ విజృంభితుం డై.

7_2_114 సీ. నెత్తుట జొత్తిల్లి నెఱసిన యలుక నుగ్రం బైన వదనంబు కాంతి పరఁగఁ గౌరవ సైనికోత్కరమున కతిభయదం బగు సింహనాదంబు సెలఁగ నింగికి నిగుడు రథాంగరోచులు మణి కంకణద్యుతులతోఁ గలసి వెలుఁగ సిళ్లు సూపిన గంధ సింధురుం బను రేఖ దలఁపించు పటుగతి చెలువు మెఱయఁ

తే. గుంభసంభవుఁ డున్న దిక్కునకుఁ గవిసి యడ్డపడు సేనఁ జించి చెండాడు నక్కు మారవరు మేని యొప్పును మగతనంబుఁ జలము బలముఁ గీర్తించె నిర్జరగణంబు.

7_2_115 వ. అట్టియెడ.

7_2_116 తే. శకుని కృతవర్మ కృపవర్మ శల్య ముఖ్యు లైన యోధులు పెక్కండ్రు రఖిలదిశలఁ బొదివి యతని కరంబునఁ బొలుచు చక్ర మలతి తునియలుగా నేసి రాగ్రహమున.

7_2_117 వ. ఏసిన నతండు రయంబున.

7_2_118 క. గద గొని యశ్వత్థామం గదియుడు దంభోళికొదమకైవడి మెఱుఁగుల్ వొదిలించుదానిఁ గని కడు బెదరి యతఁడు రథము డగ్గి పిఱిఁదికిఁ జనియెన్.

7_2_119 వ. సుభద్రా తనయుం డతని రథ్యంబులను సారథినిం జదియమోఁది మనజోదులయమ్ముల నేదు వెఱిఁగిన చందంబున సౌబలుని దెసకు నడచి యాతనికి నడ్డపడిన గాంధారుల సప్తవింశతి రథికులం బొరిగొనుటయుం బురికొని తన్ను మార్కొనిన వసాతీయులం బదుండ్ర నేనుంగుల తోడన పీనుంగులఁ గావించి యందంద తఱిమిన కేకయ సప్తకంబు రథ సహితంబుగా నగ్గలిక నుగ్గ సేసి డస్సి తూఁగూడుచుఁ బోరు దొలంగిన యోధుల నుల్లసం బాడుచు నఱిమిన వారి మఱుమాడుచు వీరవ్రతంబు ధీరత్వ నిష్ఠం జలుపుచుండె.

7_2_120 ఉ. ఆ సమయంబునం గడఁగి యాయిత మైన రథంబు తోడ దౌ శ్శాసని రా నతం డడరి సారథిఁ జంపి హయంబులం బడన్ వ్రేసిన నాఁత డల్గి గద వేకొని యుద్ధతిఁ దేరు డిగ్గ ను ద్భాసీత మూర్తులం బొలిచె భ్రాతృ కుమారయుగం బుదాత్త మై.


http://www.volam.com