Jump to content

ఆ భా 7 2 031 to 7 2 060

వికీసోర్స్ నుండి


- దుర్యోధన ప్రభృతి మహా రథికు లందఱు నొక్కుమ్మడి నభిమన్యునిపైఁ గవియుట – సం. 7-36-22

7_2_031 వ. ఇవ్విధంబున నశ్మకుండు వడినఁ దెరలు బలంబులు మరలనీక పురికొల్పుకొని యప్పటి యాచార్య ప్రభృతి యోధులును నీ కొడుకుల లోనఁ గొందఱును గ్రందుగం దఱిమి యనేకాస్త్ర శస్త్ర పరంపరలం బొదివిన నొదవిన కినుకం గిరీటి నందనుం డందఱ మేనులు నానా నిశిత విశిఖ వేగంబున నెత్తుట జొత్తిల్లం జేసి కర్ణుపయిం గవిసి.

7_2_032 తే. కంకటము దూఱి యంగంబు గాఁడి పోవఁ గ్రూరనారాచ మేసిన స్రుక్కె నతఁడు లీల నట్టవ పఱపి భూపాల నీదు సుతుల వెనుకకుఁ బఱపె నుద్ధతి దలిర్ప.

7_2_033 చ. అడరి నరేంద్రకోటి నుఱుమాడఁగ నత్తఱి శల్యుఁ డెంతయున్ వడిఁ దనుఁ దాఁకినన్ మెఱుఁగు వాలికతూపుల మూర్ఛ వుచ్చి క న్వడికొడు కేచి యుద్భట రవంబున నార్చినఁ బెల్లగిల్లి న ల్గడలకుఁ బాఱె నిల్వక బలంబులు ద్రోణు డెలుంగు సూపఁగాన్.

7_2_034 వ. అప్పుడు.

7_2_035 క. సురలును సిద్ధులు విద్యా ధరులుఁ బొగడునులివుఁ జూచు ధరణీశుల భం ధుర నుతి నాదంబులు నం బర ధరణీ మధ్య భాగ భరితము లయ్యెన్.

7_2_036 చ. అన విని యాంబికేయుఁడు మహాద్భుత విక్రమశాలిఁ బార్థు నం దను మఱి యెవ్వ రట్టియెడఁ దాఁకిరో నావుడు సూత పుత్రుఁ డి ట్లను నటు లైన శల్యుఁ గని యాతని తమ్ముఁడు మేను వెంచి మా ర్కొని పది తీవ్ర బాణములు గ్రుచ్చెఁ దదంగములం జెలంగుచున్.

7_2_037 వ. అట్లు బెట్టేసిన వాసవి కొడుకు కోపించి.

7_2_038 చ. హయములఁ జంపి సూతుఁ దెగటార్చి పతాక ధరిత్రిఁ గూల్చి చా పయుతము గాఁగ వాని ఘన బాహులు రెండును ద్రుంచి యెంతయున్ రయమునఁ దేరు చక్కడిచి రాజులు రాజతనూజులుం గడున్ భయమునఁ దూలిపోవఁ బటు భల్లహతిం దల డొల్ల నేసినన్.

7_2_039 వ. ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ బృహద్బల కర్ణ ప్రముఖ యోధవరు లొండొరులఁ బేరవేరం బిలిచి బలంబులం బురికొలిపిన రథనేమి గజ ఘంటా తురంగ కింకిణీ స్వన సింహనాద మేదుర రోదోంతర రౌద్రంబుగా సౌభద్రుం జుట్టుముట్టిన నతం డట్టహాసంబు సేసి లాఘవ లక్ష్యశుద్ధి చిత్రత్వ దృఢత్వంబులు మెఱయఁ గృష్ణార్జునులు గావించు నేర్పు మెఱయం బోరునవసరంబున మండలీకృత కోదండుండును బటు సంధావస్ఫురిత సరనికరుండును నై పరివేష వలయంబులోనం గిరణ స్ఫురణ దుర్నిరీక్ష్యుం డగుతపను ననుకరించుచు గుణఘోష భీషణంబుగా బెడిదంపు నారసంబులు వరగించి యార్చి యూర్జిత గర్జితం బగుచున్ బలు పిడుగులు దొరఁగించు విలయ కాలవలాహకంబు నిడంబించుచు విజృంభించి భల్లాండలిక క్షుర ప్రకూర్మ ఖర ప్రభృతి బాణవేణికానితానంబుల వెగడు పఱిచిన విచ్చిన వాహినుల నిలువరింప నేరక నివ్వెఱపడి యాచార్యుండు సూచుచుండె ననవుడు ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె.

7_2_040 క. మనమున ఖేదము మోదముఁ బెనఁగొనియెడు మద్బలంబుఁ బీడంచెడు నా మనుమఁ డని వినికి నాతని యనిపని యటమీఁద నెట్టు లయ్యెం జెపుమా.

7_2_041 క. అనుటయు సంజయుఁ డి ట్లను వినుము జనాధీశ యిట్లు విఱిగిన సేనం గనుఁగొని పోవఁగ నీ క ర్జున తనయుఁడు దన రథంబు చుట్లం బఱపున్.

7_2_042 వ. కొఱవి ద్రిప్పిన తెఱంగు దోఁపఁ బొదివి పోనీక పీనుంగు పెంటలు సేసిన నప్పు డక్కుమారు నాలోకించి వికాస భాసిత వదనుం డగుచు గురుండు కురుపతి నెఱను దాఁకఁ బలుక వలయు నను తలంపున నతండు వినుచుండు గృపాచార్యునితో నిట్లనియె.

7_2_043 ఉ. తమ్ములు నన్నలుం జెలులుఁ దండ్రులు మామలు భృత్యులుం బ్రమో దమ్మునఁ దోల నిట్లు వడిఁ దాఁకెడునే విజయాత్మజుండు ఘో టమ్ములుఁ గుంజరమ్ములు బడల్పడఁ దేరులు నుగ్గు గాఁగ నా నమ్మిన యోధ వీరులు వినాశము భంగము నొంద నొక్కఁడున్.

7_2_044 ఆ. అనిన వెలుకఁ బాఱి యతిదీన మగు నాన నమున నవ్వుగాని నవ్వు నెఱయ సౌమదత్కి కర్ణ శల్యాదు లగు యోధ జనుల తోడ నిట్టు లనియె విభుఁడు.

7_2_045 చ. పలుకులు వింటిరే ధనువు పట్టెడి వారికి నెల్ల నొజ్జ దో ర్బల విదితుండు గుంభజుఁడు బాలుని నొక్కరుఁ జంచలాత్ము నెం గలిఁ గడుఁ బెద్దఁ జేయుచుఁ బొగడ్తకుఁ జొచ్చె నితండు నొంపఁగాఁ దలఁపడు వీనిఁ బార్థునకుఁ దాఁ గడుఁ గూర్చుట నెంత త్రుళ్ళినన్.

7_2_046 చ. గురుని యుపేక్షఁ జేసి తనకున్ సమరోద్ధతి సెల్ల దాని నీ వెరవిఁడి గాన లేఁడు దన వీరమ కాఁ గొని విఱ్ఱ వీఁగెడుం బొరిగొనుఁ డందఱుం గడఁగి పోవఁగ నీక దృఢాస్త్రశస్త్ర ని ష్ఠుర పరిపాత నోగ్రముగఁ జుట్టును ముట్టి చలం బెలర్పఁగన్.

7_2_047 వ. అనిన విని వారలందఱు నవ్వాసవ పౌత్రుం బొదువం బోవ నవ్వీరుల వారించి దుశ్శాసనుం డిట్లనియె.

7_2_048 చ. ఇనుఁ గబళించు రాహుక్రియ నే నొకరుండన పోయి పార్థ పు త్రునిఁ బరిమార్తు నీతఁడు మృతుం డగు టేర్పడ విన్నఁ గేశవా ర్జునులును బిట్టు సత్తు రతి శోక భరంబునఁ జేసి యంతతో మనపగ దీఱుఁ దీవ్రమగు మద్భుజ దర్పము సొంపు సూడుఁడీ.

- దుశ్శాసనుఁ డభిమన్యు తోడం బోరి పాఱిపోవుట – సం. 7-38-26

7_2_049 వ. అని పలికి యార్చి యమ్ములు నిగిడించుచు ధనంజయు తనయుం దాఁకిన నతండు ష్వింశతి సాయకంబులు దనువునం జొనిపినం గవలి దుశ్శాసనుండు శరాపార ఘోరంబుగాఁ గవిసినం గిరీటి కొడుకును బేర్చి పెనంగ నయ్యిరువుర కర లాఘవ శర లాఘవ ప్రకారంబులు రథ చిత్ర ప్రచారంబులుఁ జూపఱగ్గించి రప్పు డగ్గలిక సొంపున సుభద్రాసూనుండు నీ సుతువిల్లు ద్రుంచి భల్లంబులు మేను సెక్కి స్రుక్కించి యతనితో నిట్లనియె.

7_2_050 చ. అనఖుని ధర్మనందనుని నాసభ నెమ్మెయి నీవు నొవ్వఁ బ ల్కిల ఫల మందఁ జేసెదఁ జలింపక యించుకసేపు నిల్వుమీ నిను లఘుచిత్తుఁ గ్రూరు నవినీతు మదాంధునిఁ ద్రుంచి నన్నుఁ బెం చినగరువంపుఁ దండ్రులకుఁ జిత్త మొలర్ప ఋణంబు దీర్చెదన్.

7_2_051 క. అని యతని జత్రు దేశం బున నొక వాలమ్ము పక్షమునఁ బెక్కును గ్రు చ్చినఁ ద్రెళ్ళి యెన్నడో చ చ్చిన యట్లు రథంబు మీఁదఁ జేడ్పడి యుండెన్.

7_2_052 వ. ఇచ్లు మూర్ఛిల్లిన దుశ్శాసను తేరు సారథి దొలంగఁ దోలుకొని పోయెనంతకు మున్ను కౌంతేయులు సౌభద్రుండు సొచ్చిన పథంబున నా పద్మవ్యూహంబ సేనా సందోహన హితు లై చొచ్చి యెడనెడ నడ్డపడు సైన్యంబులతో సంగరంబు సేయుచు నక్కుమారుం దల లెత్తి చూచుచు నతం డరి బలంబులం గలంచుటసు సంప్రీతు లగుచుఁ దోఁతెంచు వారు ముందట దుశ్శాసనుఁడు భంగపడుట గనుంగొని పొంగి యార్పలు నింగి ముట్టు నయ్యభిమన్యు ననేక భంగులం బ్రశంసించుచుం దఱిమి రట్టియెడ.

7_2_053 సీ. రాధేయుఁ జూచి రారాజు దుశ్శాసనుఁ డభిమన్యుచే నొచ్చె నకట కంటె యనవుడు నతఁడు సేనాన్వితంబుగ నక్కుమారు పై నడర నవ్వీరుఁ డేచి ముందటి మూఁకల మ్రందించి కదిసి డెబ్బది మూఁడు దూపులఁ బటు రయమున నొంచిన రక్తాననుం డయి దివ్యా స్త్రజాలంబు వఱపునాజామదగ్న్య

తే. శిష్యు భుజ వీర్య శౌర్య విశేష భంగి సరకుగొనక యబ్బాలుండు సమద లీలఁ బెనఁగ నయ్యంగరాజు డస్సిన నెఱింగి యతని తమ్ముఁ డయ్యర్జున సుతుని దాఁకి.

7_2_054 చ. హయములమీఁద సూతుపయి నాతని యంగములందు నస్త్ర సం చయ మడరించినం గమల చారు ముఖుంబున నెఱ్ఱ నవ్వు చె న్నయి విలసిల్ల భల్లమున నన్నరసూనుఁడు ద్రుంచె విద్విష ద్భయద విలాస బాహు సముదగ్రత వాని శిరంబు గ్రక్కునన్.

7_2_055 ఉ. ఇమ్మెయిఁ దమ్మునిం దునుమునేపు గనుంగొని యోహటించి శీ ఘ్రమ్మునఁ బెపఱం దొలఁగెఁ గర్ణుండు పెక్కు బలంబు లప్పు డొ క్కుమ్మడిఁ ద్రోచి యుద్ధత మహోదథిఁ బోలఁగ మందరమ్ము చం దమ్మున నొప్పె నుద్భట విధ స్ఫురణుం డగు పార్థ పుత్రుఁడున్.

7_2_056 వ. ఇట్లు మూఁకలం గలంచి.

7_2_057 క. వెస రాధేయుని తొలఁగిన దెసకుం జనుటయు నతండు ధృతి సెడి విఱిగెం బస పొడ వడఁగఁగ బెఱయో ధ సమూహము వాఱె ధరణితల మద్రువంగన్.

7_2_058 వ. ఇవ్విధంబున సేన్యంబులు దారును బఱచు దొరలం జూచి యాచార్యుండు.

7_2_059 చ. నిలు నిలు కర్ణ యోనృపుఁడ నీ విటు లేల కడంక దక్క సౌ బల ధృతి దూల నేమిటికి బాహ్లిక యిత్తఱిఁ గౌరవేంద్ర నీ బలముఁ జలంబుఁ జూపి నిలుపం దగు సేనల నంచుఁ బెక్కు భం గులఁ బరికొల్పి నెవ్వరును గోల్తల సేయర యేమి సెప్పుదున్.

7_2_060 వ. ఇట్లు ప్రళయ సమయ ధారాధర స్ఫీత నిర్ఘాతచ్ఛటాభీలం బగునబ్బాలుని బెడిదంపుటంపఱ సైరింప జాలక నీ బలంబులు వాఱిన నక్కుమార కంఠీరవుండు సింహనాదంబు సేసి శంఖంబు పూరించి గుణంబు సారించి యనికిం దనివి సనక వెనుకం దవిలి వట్టి యడవి ముట్టి యేర్చుకార్చిచ్చు చందంబునం జతురంగ బలంబులం బారి సమరిన దేరులు నలియం ద్రెళ్ళిన శుండాలంబులును గాలు బలంబుల పీనుంగు పెంటల మీఁద నూఁదుకొనం గూలిన ఘోటకంబులును గుఱ్ఱపు టట్టలరాసులు మూసికొని యఱవఱలై యొరగిన యరదంబులును గరటి కళేబరంబులు వొదవినం గాలుగాలం బెనఁచుకొని పడియున్న సుభట సమూహంబులును గంకణాంగద కాంతంబు లైన కర కాండంబుల గములును ముసుంగు వడ డొల్లినసకుండల మస్తకంబులును వీర కంటంకంబులు మెఱయఁ జిక్కువడి యున్న చరణంబులును గ్రిందువడం దొరఁగిన గాత్ర ఖండంబులును దునియలైన ధనురాది హేతి వ్రాతంబులపై బొడవు సెడక బాహువులతోడం బొలుచు కృపాణ ప్రముఖ ప్రహరణంబులును గొడుగుల కుప్పలును జామరంబుల ప్రోవులును సిడంబుల తిట్టలును నయి సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె నప్పుడు గగన మధ్య భాగంబున భాసమానుం డయిన మార్తాండు రెండవ మూర్తియుబోలె నయ్యెకవీరుండు వెలింగె ననవుడు నాంబికేయుండు సంజయున కిట్లనియె.


http://www.volamsite.com